వెండితెరపై ప్రపంచ యాత్ర

  • 927 Views
  • 5Likes
  • Like
  • Article Share

    పి.వి.రవికుమార్‌

  • తిరుపతి
  • 9440495151
పి.వి.రవికుమార్‌

సినీ గీతం.. నిరాశతో నిండిన మనసుకు సాంత్వననిస్తుంది. లాలిస్తుంది. బుజ్జగిస్తుంది. హుషారెత్తిస్తుంది. హృదయాలను ద్రవింపజేస్తుంది. ఇంకా.. అభ్యుదయ బావుటా ఎగరేస్తుంది. విప్లవ శంఖం నలుదిశలా పూరిస్తుంది. సమాజాన్ని మార్పు దిశగా నడిపిస్తుంది. అంతేనా.. ప్రపంచ యాత్ర కూడా చేయిస్తుంది. ఎన్నో ప్రదేశాల గొప్పదనాన్ని, ప్రత్యేకతను కళ్లకు కడుతుంది.
ప్రేమ,
విరహ, స్నేహ, విషాద, హుషారు, విప్లవ గీతాలు.. ఇలా సినిమా పాటలు ఎన్నో రకాలు. అదే విధంగా పర్యటక గీతాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందరో తెలుగు సినీ గేయ రచయితలు తెలుగునాడుతో పాటు దేశ విదేశాల్లోని దర్శనీయ ప్రదేశాలు, ప్రముఖ నగరాల విశేషాలను పాటల రూపంలో ప్రేక్షకుల కళ్లకుకట్టారు. కేవలం విశేషాలకే పరిమితం కాకుండా, వాటి చరిత్ర, అక్కడి ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు లాంటి అంశాలెన్నింటినో తమ గీతాల్లో వివరించే ప్రయత్నం చేశారు.
      భారతదేశంలో ఘనచరిత్ర కలిగిన నగరాల్లో హైదరాబాదు ఒకటి. దీని గొప్పతనాన్ని వివరిస్తూ 1957లోనే ‘ఎంఎల్‌ఏ’ చిత్రం కోసం ఆరుద్ర ఒక గీతం రాశారు. ‘‘ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము...’’ అంటూ సాగే ఈ పాటలో ‘‘పాలించెను గోలుకొండ కులీకుతుబ్‌ షాహి/ భాగమతి అతని యొక్క ముద్దుల దేవి/ ప్రేయసికై కట్టినాడు పెద్ద ఊరు/ ఈ ఊరే ఈనాడు హైదరబాదు..’’ అంటూ ఈ నగరం చరిత్రను వివరించారు. అలాగే ‘‘అలనాడు వచ్చెనిట మహమ్మారి/ అల్లా దయవల్ల ఆ పీడ పోయినాది/ ఆ గండం తప్పిందని గుర్తు నిలిపినారు/ ఆ గుర్తే అందమైన చార్మినారు..’’ అంటూ ఆ కట్టడం నిర్మాణ గాథను తెలియజెప్పారు. ఇంకా గోలుకొండ కోట చరిత్రను, విశేషాలనూ వివరించారు. ‘‘వింత వస్తుశాలలు విశాలమగు వీధులు/ విద్యాలయ భవనాలు.. ఉద్యానవనాలు/ కనులకింపు చేసే కమ్మని నగరం’’ అంటూ ‘‘భరతమాత జడలోనే పసిడి నాగరం’’గా హైదరాబాదును అభివర్ణించారు. తెలుగు సినిమాల్లో భాగ్యనగర చరిత్రను పరిచయం చేసిన తొలిపాట ఇదే. ఈ పాట వచ్చిన పద్నాలుగేళ్ల తర్వాత ప్రసిద్ధ కవి సి.నారాయణరెడ్డి ‘‘రింజిం రింజిం హైదరబాద్‌’’ (మట్టిలో మాణిక్యం, 1971) పాటలో మరోసారి అప్పటి ఆధునిక నగరం గురించి తనదైన శైలిలో వివరించారు. ‘‘ఒక తలపై రూమీ టోపీ.. ఒక తలపై గాంధీ టోపీ/ క్యా భాయి అంటాడొకడూ.. ఏమోయీ అని అంటాడొకడూ/ మతాలు భాషలు వేరైనా... మనమంతా భాయిభాయి’’ అని ఇక్కడి భిన్నత్వంలో ఏకత్వాన్ని వివరించారు. నగర పరిచయంతో పాటు ‘‘ఉన్నవాడికి తింటే అరగదు.. లేని వాడికి తిండే దొరకదు/ పరుపులున్నా పట్టదు నిదుర.. కరుకు నేలను గురకలు వినరా/ హెచ్చుతగ్గులు తొలిగే రోజు.. ఎపుడొస్తుందో ఏమో’’ అంటూ ఆర్థిక అసమానతలనూ వివరించారీ పాటలో.
      ‘‘వేదంలా ఘోషించే గోదావరి.. అమరధామంలా నినదించే రాజమహేంద్రి’’ (ఆంధ్రకేసరి, 1982) పాటలో రాజమహేంద్రవరం విశేషాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంత విశిష్టతనూ వివరించారు ఆరుద్ర. ‘‘రాజరాజ నరేంద్రుడు.. కాకతీయులు/ తేజమున్న మేటి దొరలు రెడ్డిరాజులు/ గజపతులు.. నరపతులు.. ఏలిన ఊరు/ ఆ కథలన్నీ నినదించెను గౌతమి హోరు..’’ అంటూ ఈ ప్రాంత చరిత్రను గుర్తుచేశారు.  అలాగే ‘‘ఆది కవిత నన్నయ్యా రాసెనిచ్చటా/ శ్రీనాథ కవి నివాసమూ పెద్ద ముచ్చటా/ కవిసార్వ భౌములకిది ఆలవాలము/ నవ కవితలు వికసించె నందనవనము..’’ అని కొనియాడారు. ‘‘దిట్టమైన శిల్పాల దేవళాలు/ కట్టుకథల చిత్రాంగి కనకమేడలు/ కొట్టుకొని పోయె కొన్ని కోటిలింగాలు/ వీరేశలింగమొకడు మిగిలెను చాలు’’ అంటూ ముక్తాయించారు. రమేశ్‌ నాయుడు సంగీతంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతు నుంచి ఈ పాట వింటుంటే మనస్సు అలౌకిక ఆనందంతో నిండిపోతుంది.
      ‘‘యమహా నగరి, కలకత్తా పురి.. నమహో హుగీలీ హౌరా వారధి...’’ (చూడాలని ఉంది, 1998) పాటలో దేశంలోని పురాతన నగరాల్లో ఒకటైన కోల్‌కతా విశేషాలను వివరించారు వేటూరి సుందరరామమూర్తి. గీతాంజలి, వందేమాతరం ఇక్కడే పుట్టాయని చెప్పారు. ‘‘బెంగాలీ కోకిల బాల తెలుగింటి కోడలు పిల్ల మానినీ సరోజినీ’’ అంటూ సరోజినీనాయుడికి నమస్కరిస్తారు. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, శరత్, సత్యజిత్‌రే, ఎస్‌డీ బర్మన్, మదర్‌ థెరిసా లాంటి వారికీ జోతలుపడతారు. పనిలోపనిగా ఆ నగరంలోని గజిబిజి ఉరుకుల పరుగుల జీవితాన్నీ కళ్లకుకడతారు వేటూరి.  
ప్రసిద్ధ క్షేత్రాలు
పుణ్యక్షేత్ర దర్శనం మానసికోల్లాసకరం. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో ఎన్నో ప్రసిద్ధ యాత్రా స్థలాలున్నాయి. తెలుగు సినీ గీత రచయితలు తమ పాటల్లో వీటి ప్రాశస్త్యాన్నీ హృద్యంగా వర్ణించారు. ‘మంచిమనసులు’ చిత్రం(1962)లో కథా నాయకుడు నాగేశ్వరరావు, అంధురాలి పాత్రలో నటించిన షావుకారు జానకికి హంపీలోని విజయనగర శిల్పసౌందర్యాన్ని వివరించే సన్నివేశంలో.. ‘‘శిలలపై శిల్పాలు చెక్కినారు.. మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు’’ పాట రాశారు ఆత్రేయ. ‘‘ఏకశిలరథముపై లోకేశు ఒడిలోన ఓరచూపుల దేవి ఊరేగిరాగా...’’ అంటూ సాగే ఆ పాటను కళ్లు మూసుకుని వింటుంటే ఆ శిల్ప సౌందర్యం మన మనోనేత్రం ముందు సాక్షాత్కరిస్తుంది! ‘‘రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి/ సరిగమా పదనిసా స్వరములే పాడగా..’’ అంటూ అప్పటి శిల్పుల నైపుణ్యాన్ని వివరించారు ఆత్రేయ. రాజులు పోయినా, రాజ్యాలు కూలినా, కాలాలు మారినా, మనుషులు రాక్షసుల్లాగా నాశనం చేసినా శిల్పసంపద చెక్కుచెదరలేదంటూ.. అలాగే, ‘‘నీవు నా హృదయంలో నిత్యమై, సత్యమై నిలిచి ఉందువు చెలీ’’ అని కథానాయకుడితో చెప్పించి అతని గొప్ప హృదయాన్ని ఆవిష్కరించారు. 
      అలాగే, ‘‘మహాబలిపురం భారతీయ కళాజగతికిది గొప్ప గోపురం’’ (బాలరాజు కథ, 1970) పాటలో ఆ ప్రాచీన పట్టణ ప్రత్యేకతలను గుదిగుచ్చారు ఆరుద్ర. ‘‘సంద్రంలో కలసినవి కలసిపోయెను/ ఒంటరిగా ఈ కోవెల మిగిలిపోయెను/ దేవుని పాదాలను కెరటాలు కడుగును నిత్యం/ మనుషుల పాపాలు ఇవి కూడా తొలగును సత్యం సత్యం’’ అంటూ ఆ ప్రాంత పవిత్రతను తెలియజెప్పారు. సుశీల గొంతునుంచి ఉత్సాహంగా ఉరకలెత్తే ఈ పాటను విన్న ప్రతివారిలో తప్పకుండా నూతనోత్తేజం నిండుతుంది.
      ‘‘ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగో రా బదరి/ వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి..’’ (బద్రీనాథ్, 2011) గీతం బదరీనాథ్‌ పుణ్యక్షేత్ర ప్రాశస్త్యాన్ని వివరిస్తుంది. దీని రచయిత వేటూరి.  ‘‘ఈ కొండపై మాకండగా ఆ విష్ణు పాదమే వెలసింది/ వేదాలనే విరచించిన శ్రీ వ్యాస పీఠమై నిలిచింది..’’ అంటూ స్థలపురాణాన్ని చెబుతారు. ‘‘అలకనంద జల సంగీతం శ్రీహరి నామం/ ఉష్ణకుండ జల ధారలలో హరి భక్తుల స్నానం/... హరి పాదం అడుగున గంగ కలి పాపం తను కడుగంగా/ కనులే కనలేని విరజానది ఇలా దిగి రాగ/ కలలా కనిపించే జలధార సరస్వతి పొంగి/ సుడులు తిరిగి వాడిగా ఉరుకులెత్తగా’’ అంటూ అక్కడి ప్రకృతి రమణీయతను హృద్యంగా వర్ణిస్తారు. విరజా అనేది వైకుంఠంలోని ఒక నది. ప్రజల పాపాలు కడగడానికి స్వయంగా ఆ నదే భూలోకానికి దిగి వచ్చిందంటారు వేటూరి. బదరీక్షేత్రం వెళ్లిన వారు అక్కడి ‘బ్రహ్మకపాలం’ అనే ప్రదేశంలో పితృకార్యాలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ నిర్వహిస్తే నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందని విశ్వాసం. అందుకే ఈ పాటలో ‘‘కర్మలకే బ్రహ్మకపాలం జన్మలకే పాప వినాశం’’ అన్నారు.  
      ‘‘మహాకనక దుర్గా విజయకనకదుర్గా’’ (దేవుళ్లు, 2000) పాటలో బెజవాడ చరిత్రను, అమ్మవారి ప్రాశస్త్యాన్ని వివరించారు రచయిత జొన్నవిత్తుల. ‘‘ఓంకార రావాల అలల కృష్ణాతీరంలో/ ఇంద్రకీల గిరిపైన వెలసెను కృతయుగములోన..’’ అంటూ కృష్ణాతీరం పవిత్రతను, ఇంద్రకీలాద్రిపై అమ్మవారు వెలసిన వృత్తాంతాన్ని తెలియజేస్తారు. ‘‘మేలిమి బంగరు ముద్దపసుపు.. కలగలిసిన వెన్నెలమోము/ కోటికోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ/ అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక/ ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గరూపం’’ పంక్తుల్లో అమ్మవారి స్వరూపాన్ని వర్ణిస్తారు. 
తెలుగునేల గొప్పదనం
రష్యా నుంచి వచ్చిన ప్రియురాలికి ప్రియుడు తెలుగు నేలను పరిచయం చేసే సన్నివేశంలో.. ‘‘ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధారలై జీవకళలొల్కు గోదావరి తరంగాల..’’, ‘‘కృష్ణవేణీ తరంగిణి జాలిగుండెయే సాగరమ్మై రూపు సవరించుకొనుచోట’’, ‘‘నాటి రాయల పేరు నేటికిని తలపోయు తుంగభద్రానదీ తోయమాలికలందు..’’ అంటూ తెలుగునాడును పావనం చేసే నదుల్ని పరిచయం చేశారు సినారె. ‘విచిత్ర కటుంబం’ చిత్రం కోసం 1969లో ఈ గీతం రాశారాయన. ‘అమెరికా అమ్మాయి’ సినిమా (1976)లో మరో అడుగు ముందుకేసి ‘‘త్యాగయ, క్షేత్రయ, రామదాసులు తనివితీరా వినిపించిన తేట తెలుగుపాట’’ను వినిపించమంటారా అని తెలుగింటికి కోడలుగా వచ్చిన అమెరికా అమ్మాయితో పలికించారు దేవులపల్లి.
      సినిమాల కారణంగా రాయలసీమ ప్రాంతం ముఠాకక్షలకు నెలవుగా అపకీర్తిని మూటగట్టుకుంది. అయితే, గేయ రచయితలు మాత్రం ఆ ప్రాంత గొప్పదనాన్ని కళ్లకుకట్టారు. గోరటి వెంకన్న ‘‘ననుగన్న నాతల్లి రాయలసీమ రతనాలసీమ’’ (శ్రీరాములయ్య, 1999) పాటలో సీమ చరిత్రతో పాటు ఆ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానం.. ఇలా అన్నింటినీ వివరించారు.  ‘‘కలియుగమ్మున నరులు ఓర్వలేరని తెలిసి నల్లరాయయి వెలసి ఎల్లలోకములేలు/ వెంకటాచలము భూవైకుంఠస్థలమో.../ దర్శించిన జన్మ ధన్యమవుతాదో’’ అంటూ తిరుమల విశేషాలను అందించారు.  ‘‘పాపాలు కడిగేటి పాతాళ గంగమ్మ ఆది గురువుల తపము నాచరించిన నిలము/ హఠకేశ్వరాశిఖర అవని కైలాసం.../ తనకు తానెలసిన శివలింగమమ్మో శ్రీశైలమమ్మో’’ అంటూ ఆ క్షేత్ర చరిత్రను, అక్కడి ప్రసిద్ధ ప్రదేశాలను తెలియజెప్పారు. ‘‘వీరబ్రహ్మం మఠం సీమకే మకుటం’’ అంటూ బైరాగి తత్వాలు సీమలో ఊరూరా మారుమోగుతాయంటారు. ‘‘ఎత్తు బండరాళ్లు ఎర్రాని తుప్పలు పలుకురాళ్ల గట్లు పైటి కంద పొదలు/ నెర్రెలు వాలిన నల్లరేగళ్లు’’ అంటూ సీమ భౌగోళిక చిత్రాన్ని కళ్లకుకడతారు వెంకన్న. ఇంత క్లిష్టమైన పరిస్థితులున్నా.. ‘‘ఆరు తడిపితే పెరిగే వేరుసెనగమ్మా’’ అంటారు. ముఖ్యంగా పాట ప్రారంభంలో ‘‘వానగాలికి సీమ స్నానం ఆడినపుడు వజ్రాలు ఈ నేల ఒంటిపై తేలాడు/ పొరలు నిమిరితే పుష్యరాగాలు దొర్లు/ బంగారు ఘనులున్న బంగరు తల్లి పొంగిపోదమ్మ’’ అనడం అద్భుతం. ‘‘ఇదిగొ రాయలసీమ గడ్డ’’ పాటలో సినారె ఇక్కడి ప్రసిద్ధ ప్రాంతాలతో పాటు స్థానిక ప్రముఖులనూ స్మరిస్తారు. ‘‘పతిత పావనుడు తిరుపతి వేంకటేశ్వరుడు/ సర్వరక్షకుడు శ్రీశైల మల్లేశ్వరుడు కొలువున్నది ఈ సీమలోనే/ రంకెలిడు లేపాక్షి బసవన్న శిల్పం రణభేరి వినవింపు/ చంద్రగిరి దుర్గం నెలకొన్నదీనేలలోనే..’’ అంటారు. భక్త కన్నప్ప, శ్రీకృష్ణదేవరాయలు, అన్నమయ్య, వీరబ్రహ్మేంద్రస్వామి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కడప కోటిరెడ్డి, గాడిచర్ల, కల్లూరి సదాశివం, అబ్బూరి హంపన్న, లింగన్న, షేక్‌ బీర్‌ లబియానిలు... ఇలా ‘‘ఒక్కరా ఇద్దరా పదుగురా నూర్గురా ఎందరెందరో త్యాగమూర్తులకు జన్మనిచ్చిన జనని ఇది’’ అంటూ ఈ గడ్డకు ప్రణమిల్లుతారు. ఇక రామదాసు, సింహాచలక్షేత్ర మహిమ లాంటి పౌరాణిక, జానపద, భక్తిరస చిత్రాల్లో ఆయా క్షేత్రాలను పరిధులకు తగినవిధంగా తమ గీతాల ద్వారా పరిచయం చేసిన రచయితలెందరో!
అమెరికానీ..
రాష్ట్రాన్ని, దేశాన్ని దాటి తెలుగు సినీ గీత రచయితలు భూలోక స్వప్నంగా భావించే అమెరికా విశేషాలనూ తమ పాటల్లో అక్షరబద్ధం చేశారు. ‘‘జీవితం సప్తసాగర గీతం/ వెలుగు నీడల వేదం, సాగనీ పయనం/..’’ (చిన్నికృష్ణుడు, 1988) పాటలో వేటూరి- ‘‘ఏది భువనం, ఏది గగనం, తారా తోరణం/ ఈ చికాగో, సియర్స్‌ టవరె స్వర్గసోపానమూ/ ఏది సత్యం, ఏది స్వప్నం డిస్నీ జగతిలో/ ఏది నిజమో, ఏది మాయో తెలియని లోకమూ’’ అంటూ అక్షరాలకు ఆశ్చర్యాన్ని అద్దుతారు. అలాగే అక్కడి లిబర్టీ విగ్రహ స్వేచ్ఛా జ్యోతులు, ఐక్యరాజ్య సమితిలో కలిసే జాతులు, ఆకసాన సాగిపోయే విమానాలు/ హెలికాప్టర్లు, అక్కడి మియామి బీచ్‌.. అమెరికా సృష్టికే అందమని, దృష్టికందని దృశ్యమని, కవులు రాయని కావ్యమని శ్లాఘిస్తారు. ముఖ్యంగా విమానాలు/హెలికాప్టర్లను ‘అంత రిక్షాలు’ అనడం ఆయనకే సాధ్యమైన పద చమత్కారం! అలాగే పరిశ్రమ, ఆనందం (కృషీ, ఖుషీ) సంగమించే చోటుగా అమెరికాను వర్ణించడం ఆ దేశ అభివృద్ధికి, అక్కడి ప్రజల ఆనందకర జీవనానికి పట్టంకట్టడమే! ఈ సినిమా వచ్చిన పదేళ్ల తర్వాత ‘పరదేశి’ (1998) చిత్రంకోసం అమెరికా మీద మరో పాట రాశారు చంద్రబోస్‌.
      పర్యటక ప్రాంతాల విశేషాలను, చరిత్రని చిన్నచిన్న పదాల్లో విపులంగా వివరించడం ఈ పాటల గొప్పదనం. గానయోగ్యమవడంతో ఆయా అంశాలు శ్రోతల మస్తిష్కంలో చిరకాలం గుర్తుండిపోతాయి. తలచుకున్న ప్రతిసారీ ఆనందాల చెలమను ఊరిస్తాయి. దాంతో వీలున్నప్పుడు వీటిని దర్శించాలని మనసు ఉబలాటపడుతుంది. ఈ తృష్ణే పర్యటక రంగానికి ఆయువుగా నిలుస్తుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం