కూచిమంచి తెలుగు పల్లకీ

  • 1265 Views
  • 1Likes
  • Like
  • Article Share

    ల‌గ‌డ‌పాటి భాస్క‌ర్‌

  • శ్రీకాళహ‌స్తి, చిత్తూరు జిల్లా
  • 9885470889
ల‌గ‌డ‌పాటి భాస్క‌ర్‌

తెలుగు మాట మొదలైననాటి నుంచి జన వ్యవహారంలో ఉన్న అచ్చ తెలుగు, కావ్య రచనల్లో వెనకబడిపోయింది. పదకొండు, పన్నెండు శతాబ్దాల తర్వాత తద్భవ పద సాహిత్యాన్ని నెట్టుకుంటూ శివకవియుగంలో జానుతెనుగు గుబాళించింది. శ్రీనాథుడి ప్రాభవంలో తత్సమపద ప్రయోగాల ధాటికి వెలవెలబోయిన అచ్చతెలుగు పదహారో శతాబ్దంలో పొన్నగంటి తెలగన ఘంటంతో తిరిగి కాంతులీనింది. కూచిమంచి తిమ్మన కావ్యంలో కొలువుదీరింది. ముఖ్యంగా కూచిమంచి ‘నీలాసుందరి పరిణయం’ అయితే ఓ అచ్చతెలుగు పదాంబుధి!
ఇప్పుడు
మనం మాట్లాడే తెలుగులో సంస్కృత, ప్రాకృత పదాలను పక్కనపెడితే ‘అచ్చ తెలుగు’ అవుతుంది! ఈ అచ్చతెలుగు పదాలు పల్లెటూళ్లలో ఇప్పటికీ వినిపిస్తుంటాయి. తిరిపం, తిరిపగొట్టు (బిచ్చగాడు) ఓదం (గుంటగా ఉండే భూభాగం- కావ్యాల్లో ఏనుగుల్ని పట్టడానికి తవ్వే గుంటలకి వాడుతుంటారు), తుటుం (గుంపు) లాంటవి ఈ కోవలోవే. 
అచ్చతెలుగు కావ్యాల్లో పొన్నిగంటి తెలగన ‘యయాతి చరిత్ర’, కూచిమంచి తిమ్మకవి ‘నీలా సుందరీ పరిణయం’ ప్రస్తుతం మనకు లభిస్తున్నాయి. సంస్కృత సమాసాలనూ, పదాలనూ అచ్చ తెలుగులో సుందరంగా ఒదిగించి, పద్యాల్లో అనుప్రాసవిన్యాసాలతో అందమైన, అద్భుతమైన, ఆహ్లాదకరమైన వర్ణనలు చేశారీ కవులు. ఇతర ప్రబంధాల్లోలాగే ‘నీలా సుందరీ పరిణయము’లో కూడా వర్ణనలూ, నాయికా నాయకుల శృంగార, విరహ, ఉపాలంభనలూ ఉన్నాయి. .
శివుడి ఆనతి మీద
శ్రీకృషుడి అష్టభార్యల్లో ఒక ఇష్టసఖి నీలాదేవి. ఈమె కృష్ణుడి మేనమామ కూతురే. మిథిల రాజు ధర్మకుడి ఏలుబడిలోని గొల్లదొర కుంభకుడు నీల తండ్రి. ఆమె తల్లి ధర్మద. సోదరుడు సిరిదాముడు. నందుడికి కుంభకుడు బావ. ఒక బ్రాహ్మణ అతిథి ఇంటికి వచ్చినప్పుడు కుమార్తెకు తగిన వరుడి గురించి కుంభకుడు ప్రస్తావిస్తాడు. ఆ విప్రుడు శ్రీకృష్ణుడి గుణగణాలను వర్ణించి అతనే తగిన వరుడని చెబుతాడు. నీల తల్లిదండ్రులు సంతోషించి ఆ పనుల్లో ఉంటారు. అయితే అంతలో కాలనేమి అనే రాక్షసుడి కొడుకులు ఏడుగురు మదమెక్కిన ఏడు ఆబోతులై వచ్చి ప్రజలను హింసించి చంపనారంభిస్తారు. అప్పుడు తప్పనిసరై కుంభకుడు వాటిని నిగ్రహించగలవానికి తన కూతురినిచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు. వాటిని నిర్జించి, తనను చేపట్టాల్సిందిగా శ్రీకృష్ణుడికి సందేశం పంపుతుంది నీల. తర్వాత నల్లనయ్య ఆ ఆబోతులను చంపి, నీలను పెళ్లాడతాడు. ఇదీ స్థూలంగా ‘నీలా సుందరీ పరిణయం’ ఇతివృత్తం. ఈ ప్రబంధంలో కవి అచ్చతెలుగు పదాలను ఎన్నెన్నో కూర్పులతో అలవోకగా హృద్యంగా ప్రయోగించాడు.
      నైమిశారణ్యంలో మునులు విష్ణువు (లచ్చిమగడి) కథ ఒకటి చెప్పాలని పురాణ ప్రవచన ప్రవీణుడైన సూతుణ్ని కోరగా, మిథిలానగర వర్ణనతో ఈ ప్రబంధం మొదలవుతుంది. తిమ్మకవి తనకు కలలో శివుడు కనిపించి, కవితరాయమని ఆనతిచ్చినట్టు చెబుతాడు. కవికి కలలో కనిపించిన శివుని వర్ణన చూడండి... పసిదిండి మెకపురక్కసి తోలు మొలజుట్టి/ కేలముమ్మొన వాలు- కీలుకొలిపి/ చిన్నవెన్నెల ఱేని-సికపువ్వుగా పూని/ పెనుచంక నొకజింక-పిల్లనిఱికి/ జడలలో తెలినీటి- చదలేటి జాల్మాటి/ జానొంద వెలిబూది-మేననలది/ తోరంపు చిల్వరా- తొడవులిమ్ముగ దాల్చి/ ఎదపున్కసరములు- కుదురుపఱచి/ మోముదమ్మిని చిఱునవ్వు- మొలకలెత్త/ గుబ్బలులఱేని గారాపు- కూతు తోడ/ ఉక్కు మిగిలిన బలుగిబ్బ- జక్కినెక్కి/ కొమరు తళుకొత్తమ్రోలక-న్గొనగనయ్యె!
      మొలకు కట్టింది పులితోలట. చేతిలో ముమ్మొనవాలు (త్రిశూలం) ఉందట. సిగలో ‘చంద్రరేఖ’, చంకలో జింకపిల్ల, తలపైని జడల్లో గంగజాలును బంధించి, వళ్లంతా తెల్లని విభూతిని అద్దుకుని, పెద్దపెద్దపాముల్ని వస్త్రాలుగా చుట్టుకుని, వక్షస్థలాన పుర్రెల దండ ధరించి, చిరునవ్వుతో, పర్వత రాజపుత్రి పార్వతితో పాటు, బలమైన నంది వాహనంపై కూర్చుండి చూడచక్కగా కవికి కలలో కనిపించాడట పరమశివుడు! అచ్చతెలుగులో ఎంత చక్కగా వర్ణించాడో కదా. మరో సందర్భంలో ‘‘మున్నుగేస్తుడు (మొదటి గృహస్థుడు) అగ్గియు, మిన్ను, నీరు, ప్రొద్దు, నెల, గాడ్పు లెవ్వని - రూపులయ్యె!’’ అంటూ మహేశ్వరుడి అష్టమూర్తిమత్వాన్ని వర్ణించాడు తిమ్మన. 
అచ్చ తెలుగు అందాలు
వర్ణనలు, అచ్చతెలుగు పద సౌందర్యం పరంగా ‘నీలా సుందరి పరిణయం’ ప్రబంధం ఆద్యంతం పాఠకులను అలౌకికమైన ఆనందంలో ఓలలాడిస్తుంది. కృష్ణుడి అవతారాన్ని గురించి చెబుతూ తిమ్మకవి, నేలచేడియ (భూదేవి) సోకుమూకల మోవలేక (పాపులైన రాక్షసుల మోయలేక) జేజేల(దేవత)తో కూడి చదువుల వేలుపు (బ్రహ్మ) నాయకత్వంలో వెన్నుడి కడకు వెళ్లి మొరపెట్టుకుందట. ఆయన తొగలఅనుగు (చంద్రుడి) కొలమువాడైన వసుదేవుడికి కొమరుడై పుట్టి, కంసుడనే రాకాసుల ఱేని వల్ల ‘సూడు’తో, నందునిల్లు చేరి ‘కుంభకు’ని సోదరి ‘యశోద’ కొడుకుగా పెరుగుతున్నాడట! కంసుడు పంపిన రాక్షసులు అక్కడికి వరుసగా బాలకృష్ణుణ్ని చంపడానికి వచ్చారు. ‘నల్లత్రావుడుపడతి’ (రాక్షస స్త్రీ) విషపు పాలు ఇవ్వబోతే తన ఉసురుగొన్నాడట కన్నయ్య. కొండపోల్కి వచ్చిన ‘బండిపొలసుదిండి’ (శకటాసురుణ్ని) పిండిపిండిగా రెండు కాళ్లతో ‘తాబి’ చంపాడు! బాలకృష్ణుణ్ని పొదువుకుని వేగంగా చదలికిని (ఆకాశానికి) ఎగిరిపోయిన ‘బేరజపుంకరు వలి’ (దుమ్ముతో కూడిన సుడిగాలి- రూపంలోని) తొలుజేజే (పూర్వదేవత- అంటే రాక్షసుడు)ని, గుదెతాల్పు వీటికి (యమలోకానికి) అణచాడట. అలాగే కుంభకుని కోర్కె ప్రకారం బ్రాహ్మణుడు నందునింటికి వెళ్లి ‘నీల’ను నల్లనయ్యకు చేసుకోమని చెబుతాడు. ఆ తర్వాత ప్రత్యేకంగా కృష్ణుణ్ని కలిసి నీల సౌందర్యాన్ని వర్ణించి చెప్పే సందర్భంలోని పద్యం కూడా అచ్చతెలుగు శబ్ద, అర్థ సౌందర్యంతో అలరారుతుంది... కెంపు పెంపు దింపు- సొంపగు వాతెఱ!/ మిన్ను చెన్ను నెన్ను- కన్నె నడుము!/ మీల నేల జాలు- వాలుకన్నుంగవ!/ తేటి దాటు మీటు- బోటికురులు! కెంపుల అందాన్ని తలదన్నే పెదాలూ, ఆకాశంలా శూన్యమనిపించే నడుమూ, మీనాలను పాలించగలిగేలా ఉన్న కళ్లూ, తుమ్మెదల నల్లదనాన్ని మించి మెరుస్తున్న కురులను కలిగిందంటూ నీల సౌందర్యాన్ని వర్ణించాడు కవి. అయితే, సాధారణంగా అందరు కవులూ నాయికను ఇలాగే పోలుస్తారు. కానీ, ‘కెంపు సొంపు దింపు; మిన్ను చెన్ను నెన్ను; మీలనేలజాలు; తేటి దాటి మీటు’ అంటూ శబ్ద సౌందర్యాన్ని సృష్టించిన ‘అచ్చ తెలుగు అందాలు’ కూచిమంచి సొగసైన కూర్పును తెలియజేస్తాయి. అలాగే కమ్మనితెమ్మ తెమ్మెరలు - క్రమ్మగ నిమ్మగు తమ్మిమేడలో/ తుమ్మెద కొమ్మతెమ్మెలను- దూకొనినీటుగ పాటపాడగా/... అంటూ లక్ష్మీదేవిని స్తుతించే పద్యంలోనూ అచ్చ తెలుగు పదలాలిత్యం తొణికిసలాడుతుంది. 
      ‘నీలా సుందరీ పరిణయం’లో ప్రతి వర్ణనా అచ్చతెలుగు పదబంధాలతో మనోజ్ఞంగా ఉంటుంది. బాలకృష్ణుడి అందాన్ని వర్ణించే సందర్భంలో మరుని రేఱేని జేజేల-దొర కొమరుని/ పూపనెలతాల్పు చెలిపట్టి - పోలజాలు! అంటాడు కవి.  అంటే మన్ముథుణ్ని, చంద్రుణ్ని, ఇంద్ర తనయుడు జయంతుణ్ని, పూపనెలతాల్పు (చంద్రశేఖరుడైన శివుడి) చెలిపట్టి (స్నేహితుడైన) కుబేరుడి కుమారుణ్ని (నలకూబరుని) పోలిన అందగాడు కృష్ణుడట. నీల అందాన్ని వర్ణించే మరో సందర్భంలో మగువ మొగమున కెనగాక- మిగుల పొగిలి/ తొగల చెలికాడు పదియాఱు - తునియలయ్యె!/ సిరుల కిరవగు నెత్తమ్మి- విరి తలంకి/ ఒయ్యనొయ్యన వేమారు- వ్రయ్యలయ్యె!... అంటాడు తిమ్మన. సాధారణంగా ‘స్త్రీ’ ముఖాన్ని చంద్ర బింబంతోనో, తామరతోనో పోలుస్తారు. చంద్రబింబం కంటే నీలముఖం అందంగా ఉందనటానికి తిమ్మకవి, ‘ఆ చంద్రుడు ఆమె ముఖంతో సరితూగలేక చాలా బాధపడి, పదారు ముక్కలయ్యాడని చమత్కరించాడు. అలాగే సంపదలకు నిలయమైన ఎఱ్ఱతామర (లక్ష్మీదేవి కూర్చుండే చోటు) నీల ముఖంతో సరిపోలలేదనే దిగులుతో అనేక దళాల రూపంగా వక్కలైపోయిందట! ఈ కావ్యంలో దూషణలు కూడా చమత్కార భరితంగా అనిపిస్తాయి. మదనతాపం భరించలేని ‘నీల’ వలఱేనిని (మన్మథుణ్ని), చంద్రుణ్ని పలు రకాలుగా దూషిస్తుంది. శాపనార్థాలు పెడుతుంది. ‘‘తెరువరులను పూని యేతువె నీ పూన్కి బుగ్గిగాను!’’; ‘‘మరుడా! నీ చేతివిల్లు మంటగలయన్‌’’ అని నీలతో తిట్టించాడు కవి. ఇక చంద్రుణ్నయితే చాలాసార్లు ఆడిపోసుకునేలా చేశాడు. ఒజ్జముద్దియ (తార) సంయోగంతో చంద్రుడికి ‘దోషాకరుడు’ అనే పేరొచ్చింది. అతణ్ని బిడ్డగా కన్నందుకు తమ్మికొమ్మ (తామరపై ఉండే లక్ష్మీ దేవి) ఎల్లప్పుడూ సిగ్గుతో తలవంచుకుంటుందట (‘‘ఒజ్జ ముద్దియ గలసిన దోసకారి వనికాడె నినుంగని తమ్మికొమ్మ నిచ్చలు తలవంచుచుండు!’’). అంతేనా, ‘‘నీ సవురు సన్నముగాను (నీ కాంతి తరిగిపోనూ) అనిపించాడు. అలాగే వసంత దూషణంలో ‘‘నీ చెలువెల్ల చెట్ల పాలుగ’’, ‘‘నీ బ్రతుకు బయల్గాను నాలిపయ్యరకుఱ్ఱా!’’, ‘‘కోయిలా! ఇంక నీ యిల్లు కూలిపోను’’! అంటుంది నీల.  అలాగే నెమలిని నిందిస్తూ... ‘‘నెమ్మి! నీ యాట అడవి కలయ!’’, ‘‘తుమ్మెద! నీ త్రుళ్లు పెద్ద తుప్పలబట్టన్‌’’ అని పెద్దపెట్టున శాపనార్థాలు పెడుతుంది. ఈ దూషణల్లో గ్రామీణ జీవన సౌందర్యం ఎంత సొంపుగా గోచరిస్తుందో! కందం, ఆటవెలది లాంటి చిన్న పద్యాల్లో కూడా విస్తారమైన పూర్వకథావృత్తాంతాన్ని పొందుపరచడం ఈ కావ్యంలో తిమ్మకవి చూపించిన మరో ప్రత్యేకత. 
      మొత్తం మీద ‘నీలా సుందరీ పరిణయం’ ప్రబంధమంతా ఒకవైపు అచ్చతెలుగు పద సొగసులు, మరోవైపు మనసుని రంజింపజేసే భావాలతో పఠితులను ఆనందతరంగాల్లో ఓలలాడిస్తుంది. ఏ భాష వాళ్లయినా సరే, తమ పలుకులో జీవధారను ప్రవహింపజేసినపుడే వారి సంస్కృతికి శాశ్వత వారసులవుతారు. మన సంస్కృతికి, ఘన చరిత్రకి ఆలవాలంగా నిలిచే అచ్చతెలుగు పదాలు కాలక్రమంలో కనుమరుగైపోతున్నాయి. వీటిని కాపాడుకోవడమే అలనాటి అచ్చతెలుగు కవులకు మనమిచ్చే నిజమైన గౌరవం.
 


వెనక్కి ...

మీ అభిప్రాయం