కొర్రలు.. గుర్రాలు.. ఏర్లు!

  • 1427 Views
  • 12Likes
  • Like
  • Article Share

    వేలమూరి నాగేశ్వరరావు

  • విజయనగరం
  • 8897701833
వేలమూరి నాగేశ్వరరావు

జీవితానుభవాల్లోంచి పుట్టుకొచ్చిన ఆణిముత్యాలు సామెతలు. అలతిపదాల్లో అద్భుత అంతర్థంతో, చక్కని నీతిని బోధిస్తాయివి. ఆయా ప్రాంత ప్రజల జీవనవిధానం, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులకు అనుగుణంగా సామెతలు రూపుదిద్దుకుంటాయి. విశాఖ జిల్లా గిరిజనుల జీవితాల్లో భాగమైన కొన్ని సామెతలు చూద్దాం.. 
కొర్రలు దొంగిలించబోతే కొర్రు గుచ్చుకుంది

గిరిజనుల ప్రధాన ఆహారపంట కొర్రలు. ఒక రైతు తన పొలంలో కొర్రలు జల్లాడు. అవి ఏపుగా పెరిగాయి. ఒక దొంగ రాత్రివేళ ఆ పంటను దొంగిలించి హడావుడిగా వెళుతుంటే ఆ పొలంలోనే అతని కాలికి కొర్రు (సూది కర్ర) గుచ్చుకుంది. లబోదిబోమంటూ దాన్ని పెరికి, రక్తం కారుతున్న కాళ్లతోనే ఇంటికి చేరాడు. తెల్లారి ‘ఎలా జరిగింద’ని అందరూ అడుగుతుంటే నోటికొచ్చిన అబద్ధాలు చెప్పాడు. చేను యజమాని విషయం పసిగట్టి ఈ సామెతతో అతని నిర్వాకం బట్టబయలుచేశాడు. పరుల సొత్తును అపహరించబోయేవారికి ఈ సామెత మంచి హెచ్చరిక కదా! 
గురు సేవ కంటే గుర్రం సేవ కష్టం
గిరిపుత్రులకు చదువుతో పాటు వడ్రంగి పని, వేట, ఆకుపసరు వైద్యం లాంటివి నేర్పే గురువులుంటారు. ఏడాదికోసారి తమ గురువులని ఇళ్లకు ఆహ్వానించి విందు భోజనం ఏర్పాటుచేస్తారు. ఈ సేవ వాళ్లకి ఆనందం కూడా. అయితే గిరిజనులు పంటలు అమ్మేందుకు సంతకి వెళ్తారు. మోత కోసం గాడిదలను ఉపయోగిస్తారు. వాటినే గుర్రాలుగా భావించి దాణాపెట్టడం, మాలిష్‌ చేయడం లాంటివి శ్రద్ధగా చేస్తారు. అలసటగానో, బాధలోనో ఉన్నప్పుడు ఆ ‘గుర్రం’ సేవ చెయ్యలేక పుట్టుకొచ్చిందే ఈ సామెత. 
కుక్క సంతకెళ్లి తక్కెడ దెబ్బలు తింది
గిరిజన గూడెంలో ఉండే ఓ కుక్క, యజమానితో పాటు సంతకెళ్లింది. అక్కడంతా కలియతిరిగింది. ఆ కుక్క ప్రతి దుకాణం దగ్గరికి వెళ్లగానే షావుకారు తక్కెడ పళ్లెంతో కొట్టేవాడు. అది కుయ్యోమొర్రో అనేది. అయినా, మళ్లీమళ్లీ దుకాణాల దగ్గరికెళ్లి దెబ్బలుతినేది! దీన్ని గమనించిన ఓ గిరిజనుడి నోటి నుంచి వచ్చిన సామెతే ఇది. తమకి సంబంధం లేని చర్చల్లో తలదూర్చేవాళ్లకి అక్షరాలా సరిపోతుంది కదూ ఇది!
ఏరు లేని వారికి పేరు లేదు
దుక్కి దున్నడానికి వాడే పశువులను ‘ఏర్లు’ అంటారు. గిరిజన ప్రాంతాల్లో ఆవులను కూడా పొలం దున్నేందుకు ఉపయోగిస్తారు. కాడికి ఓ వైపు ఆవు, మరో వైపు దూడను కట్టి దున్నుతారు. పొలాలు లేని గిరిజనులు కూడా సంతలో ఆవులు, దూడలను కొని వాటిని బాగా మేపి ఏర్లు దున్నడంలో శిక్షణ ఇస్తారు. దుక్కి సమయంలో రైతులకి కూలి కింద వాటిని పంపిస్తారు. తర్వాత ఇవి ఫలానా ముత్యంరాజు ఏర్లు, పోతురాజు ఏర్లు అని లెక్కకట్టుకుంటూ కిరాయి చెల్లిస్తారు. అంటే ఏర్లే జనాలకి పేరుతెస్తున్నాయన్నమాట. అలా ఈ సామెత పుట్టుకొచ్చింది. పాడిపంటలు, సంపదలు ఉంటేనే ఎవరికైనా పేరు అనే అర్థమూ ఇందులో స్ఫురిస్తోంది! 


వెనక్కి ...

మీ అభిప్రాయం