సినిమా సత్తా!

  • 1226 Views
  • 9Likes
  • Like
  • Article Share

బాహుబలి సినిమాతో తెలుగు అనే భాష ఒకటి ఉందనే విషయం ప్రపంచం మొత్తానికీ తెలిసింది. తెలుగువాడి సత్తాను లోకం తెలుసుకుంది. 21వ శతాబ్దంలో సినిమాకి ఉన్న శక్తి అలాంటిది మరి! అత్యంత ప్రభావవంతమైన ఈ మాధ్యమం ద్వారా ఒక ప్రాంతంవారి ప్రతిభ మాత్రమే కాదు, వారు మాట్లాడుకునే భాషను కూడా పరిచయం చేయవచ్చని నిరూపిస్తున్నారు. కొడికడుతున్న ఒక భాషకు కొత్త ఊపిరులూదుతున్నారు. వాళ్లెవరో ఏంటో చూద్దామా!
      హైడా గ్వాలి.. కెనడాలోని ఓ ద్వీపసముదాయం. వీటిలో నివసించే ఆదిమజాతుల పేరు, వారు మాట్లాడుకునే భాష పేరు కూడా హైడానే! 18వ శతాబ్దంలో ఐరోపా వాసులు ఈ ద్వీపాల్లో అడుగుపెట్టే నాటికి సుమారు 15 వేల మంది ఈ భాషను శుభ్రంగా మాట్లాడుకునేవారు. వలసదారులతో వచ్చే ప్రమాదమే వారినీ పలకరించింది. స్థానిక భాషను తొక్కిపట్టి ఆంగ్లం తలెత్తుకు తిరగసాగింది. ఆంగ్లేయులు స్థాపించిన పాఠశాలల్లో హైడా భాషను మాట్లాడటం నేరంగా పరిగణించేవారు. ఆంగ్లం మాట్లాడేవారు సంస్కారవంతులు అన్న భావనను ప్రోదిచేశారు. ఫలితం! తెలిసో, తెలియకో, తప్పకో ఆంగ్లంలోనే సంభాషించడం మొదలుపెట్టారు స్థానికులు. అలా.. అలా.. హైడా పలచబడుతూ వచ్చింది. ప్రస్తుతం ఆ భాషను కేవలం 20 మంది మాత్రమే మాట్లాడగలరు. అందుకే యునెస్కో హైడాను అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్న భాషగా పేర్కొంది.
ప్రయత్నం మొదలైంది
హైడా చాలా భిన్నమైన భాష. ఇందులో వినిపించే శబ్దాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. హల్లులను ఉచ్చరించడానికి గొంతు లోపలి నుంచి స్వరాన్ని పలకాల్సి ఉంటుంది. ఇంత క్లిష్టమైన భాషని ప్రోత్సహించడం ఏమంత తేలిక కాదు. ఇందుకో ఉపాయాన్ని ఆలోచించింది హైడా జాతి సమితి. కెనడా ప్రభుత్వంతో కలిసి ఓ చలనచిత్రాన్ని రూపొందించే యత్నం మొదలుపెట్టింది. 2014లో మొదలైన ఈ ఆలోచన అనేక పరిణామాల తర్వాత కార్యరూపం దాల్చింది. ముందుగా ఆంగ్లంలోనే కథను సిద్ధం చేసుకున్నారు. దానిని హైడా భాష తెలిసినవారితో సదరు భాషలోకి అనువదింపచేశారు. సహాయ దర్శకుడు, ముఖ్య నటులుగా హైడా మాట్లాడగలిగేవారినే తీసుకున్నారు. ఇక చిత్రబృందంలోని మిగతా సభ్యులకు కూడా హైడా భాషలో ప్రావీణ్యం కల్పించారు.
నాలుగేళ్ల సుదీర్ఘ శ్రమ తర్వాత, 2018లో  ఈ సినిమా పూర్తయింది. అలాగని ఇది ఏదో తూతూమంత్రంగా తీసిన చిత్రం కాదు. హైడా ప్రజల జీవనవిధానం నేపథ్యంలో, తప్పు చేసిన మనిషిలో రేగే సంఘర్షణను ప్రతిబింబిస్తూ సాగుతుందీ చిత్రం. అందుకే 2018లో కెనడాలో విడుదలైన పది అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. అన్నింటికీ మించి హైడా అనే ఓ భాష ఉందనీ... ఆ భాషా, దాన్ని మాట్లాడేవారి జీవనవిధానం వైవిధ్యంగా ఉంటా యనీ ప్రపంచానికి పరిచయం చేసిందీ చిత్రం.
      హైడా చిత్రపు విజయయాత్ర ఇంకా ముగిసిపోలేదు. దాని ప్రభావమూ ఇప్పుడప్పుడే ఆగేది కాదు. ఒకదాని తర్వాత ఒకటిగా ఈ చిత్రం, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో పాలు పంచుకుంటోంది. ఇప్పటివరకూ వామనుడిలా తోచిన హైడా భాష విశ్వరూపాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇంతకీ ఈ చిత్రం పేరు ‘స్కాగే కూనా’. అంటే ‘కత్తి వాదర’ అని అర్థం. నిజంగానే ఈ చిత్రం భాషను కాపాడే ఖడ్గంలా మారింది.


వెనక్కి ...

మీ అభిప్రాయం