చిత్ర‌ల‌హ‌రి, మ‌జిలీ - వెండితెర వెన్నెల

  • 415 Views
  • 0Likes
  • Like
  • Article Share

కారుమబ్బులు వీడిపోతున్నాయి. చలనచిత్రాలు తిరిగి ‘తెలుగు బాట’ పడుతున్నాయి. మన పలుకుల తియ్యందనాన్ని పంచుతున్నాయి. ఇటీవల వచ్చిన చిత్రాల్లో పరచుకున్న తెలుగు వెన్నెల ఇది...!
భావోద్వేగాల ‘చిత్రలహరి’

‘‘ఓడిపోవడమంటే ఆగిపోవడం కాదు..మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే’’ అంటూ పాటల రచయిత చంద్రబోస్‌ మాటలు అడుగడుగునా కథానాయకుడిని ప్రోత్సహిస్తుంటాయ్‌. ‘‘నా ఆటేదో నేనే ఆడతాను ఓటమైనా గెలుపైనా నాదే కావాలి!’’ ఓటమి ఎదురైన ప్రతిసారి కిశోర్‌ తిరుమల రాసిన సంభాషణలు ఆలోచింపజేస్తాయి. కథలో సంఘర్షణ ఉంది. అదే స్థాయిలో ప్రతి భావోద్వేగాన్నీ ప్రేక్షకుడి మనసుకు హత్తుకునేలా చెప్పే సంభాషణలున్నాయి. చిత్రలహరి విజయం కోసం పరితపించే దురదృష్టవంతుడిని గెలిపించే కథ. ప్రేమలోకంలో విహరించే సమయంలో ‘‘ప్రేమంటే చెప్పడం కాదు..చెప్పలేకపోవడం’’ అని ఒక్కమాటలో నిర్వచనమిస్తాడు. మరోసారి ‘‘నేను వెళ్తాను’’ అన్న ప్రేయసితో ‘‘నువ్వు వెళ్లిపోయి చాలాసేపయింది’’ అంటూ మనసులోని బాధను మాటల్లో చెప్పేస్తాడు. సహజమైన సంభాషణలు అంతే సహజమైన పాటలు తెలుగుదనాన్ని గుర్తుచేస్తూ మన పక్కింటి కథేనని గుర్తుచేస్తుంటాయి. ప్రేమలో మునిగిన కథానాయకుడు ‘‘రాయలోరి నగలలోంచి మాయమైన మణులిలా..మారిపోయెనేమో నీ రెండు కళ్లలా’’ అంటూ శ్రీమణి రాసిన పాట చక్కగా అమరింది. పాటల్లోని సాహిత్యం సహజంగా మెరుస్తూనే గుర్తొచ్చినప్పుడల్లా మురిపిస్తుంది. ‘‘ఒక సమస్య వస్తే వదిలేయమనడం పరిష్కారమెలా అవుతుంది?’’ అంటూ అడుగడుగునా కొడుకుని విజయపథంవైపు నడిపే తండ్రిని చూసి మెచ్చుకోని వారుండరు. నిరంతరం గెలుపుకోసం పరితపించే కథానాయకుడి విజయానికి కలిసికట్టుగా కృషి చేసిన పాత్రల చిత్రణ తెరపై చక్కగా ఆవిష్కృతమైంది.


మనసు పొరలను స్పృశించే ఆలోచనల ‘మజిలీ’
పూర్ణ అంటే నీకెందుకంత భయం అని పన్నెండేళ్లు కూడా నిండని చిన్నారి అడిగిన ప్రశ్నకు ‘‘మనం ఎవరిని ఎక్కువగా ఇష్టపడతామో వాళ్లకే ఎక్కువ భయపడతాం’’ తనవైపు కన్నెత్తైనా చూడని భర్తపై శ్రావణి చూపించే ప్రేమ కంటతడి పెట్టిస్తుంది. తొలిప్రేమ చేసిన గాయం నుంచి కోలుకోలేక నరకయాతన అనుభవించే కథానాయకుడు. ‘‘మనం లవ్‌లెటర్‌ మీద రాసుకున్న అమ్మాయి పేరు వెడ్డింగ్‌ కార్డు మీద ఉండదు రా!’’ అంటూ వాస్తవాన్ని తెలియజెప్పే స్నేహితుడు. వాస్తవాన్ని ప్రతిబింబించే  భావోద్వేగాల సమాహారం ‘మజిలీ’. ఈ చిత్రం ప్రేమతోపాటు దాంపత్య బంధంలోని మాధూర్యాన్ని ప్రేక్షకుల మనసు తెరలపై ఆవిష్కరించింది. ‘‘చిన్నప్పుడు నీకు నడక రాక పడిపోతుంటే పట్టుకున్నాను. ముప్ఫైఏళ్లకు తాగొచ్చి నడవలేక పడిపోతుంటే పట్టుకున్నాను. తండ్రిని కదా నువ్వు పడిపోతున్నప్పుడల్లా పట్టుకుంటూనే ఉంటాను’’ గుండెల్లో గూడుకట్టుకున్న బాధను కొడుకుతో చెప్పే తండ్రిని చూసి కళ్లు చెమర్చుతాయ్‌. తొలిప్రేమ చేసిన గాయాన్ని ‘‘బతికున్న తల్లిదండ్రులని తేలిగ్గా తీసుకుని..చనిపోయాక, వాళ్లకోసం ఏమి చేయలేకపోయామనే బాధ భరించలేంరా పూర్ణా’’ అంటూ బాధ్యతను గుర్తుచేసే స్నేహితుడు మనకూ ఉంటే బావుండనిపిస్తుంది. ప్రేమ విఫలమై బాధ్యతపట్టక తిరుగుతున్న వ్యక్తిని కూడా చిరునవ్వుతో భాగస్వామిని చేసుకునే శ్రావణి ‘‘ఇష్టమైన సఖుడా..ఇష్టమైన సఖుడా..ఒక్కసారి చూడరా..పిల్లడా’’ అంటూ పూర్ణ ప్రేమ కోసం ఎదురుచూసే శ్రావణి మనసులోని భావాలను అక్షరాలుగా మార్చాడు పాటల చైతన్యప్రసాద్‌. ‘‘మీరు తను మందు మానేస్తే బాగుంటుందనుకుంటున్నారు. కాని నేను తన మనసుకి తగిలిన దెబ్బ మానిపోతే బాగుండు అనుకుంటున్నాను’’ అంటూ భర్త కోలుకోవాలని ఓపిగ్గా నిరీక్షించే కథానాయిక ప్రేమ మనసుకు హత్తుకుంటుంది. ‘‘నువ్వు నా రూం లోపలికి రాగలవేమో కాని, నా మనసులోకి ఎప్పటికీ రాలేవు’’ అంటూ శ్రావణిని దూరం పెట్టిన పూర్ణలో మార్పు వచ్చిందా? అన్నదే ఈ చిత్రం.
పూర్ణ - శ్రావణిల మాటల్లో వినాలనుకునేలా ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తాడు దర్శకుడు శివ నిర్వాణ.


వెనక్కి ...

మీ అభిప్రాయం