ఉగాది జ్ఞాప‌కాలు...

  • 1660 Views
  • 19Likes
  • Like
  • Article Share

వికారి నామ సంవ‌త్స‌ర ఉగాది, శ్రీరామ‌న‌వ‌మి శుభాకాంక్ష‌లు. సుఖ‌దుఃఖాల క‌ల‌నేత అయిన జీవిత ప్ర‌యాణంలో మ‌రోమ‌జిలీగా ఈ న‌వ వ‌సంతాన్ని ఆహ్వానిస్తూ మ‌న చ‌ల‌న‌చిత్ర గీత‌, మాట‌ల ర‌చ‌యిత‌ల్లో కొంద‌రు పంచుకున్న ఉగాది మ‌ధుర జ్ఞాప‌కాలు ఇవి.
ఆ లోటు ఎప్పటికి తీరేనో..!

వచ్చేది వికారి నామ సంవత్సరం. తెలుగు సంవత్సరాల పేర్లు జాగ్రత్తగా గమనిస్తే మనకొక విషయం అర్థమవుతుంది. కొన్ని పేర్లు శుభసూచకంగానూ, కొన్ని అశుభమైనవిగానూ, కొన్ని తటస్థంగానూ అనిపిస్తాయి. మనిషి జీవితం ఈ మూడింటి మిశ్రమం. ఆరు రుచుల ఉగాది పచ్చడిలోనే కాదు, అరవై తెలుగు సంవత్సరాల పేర్లలో కూడా జీవితాన్ని మంచి చెడుల సంగమంగా స్వీకరించే అవగాహనని కల్పించారు మన పూర్వీకులు. నిజానికి ఈ రోజున పంచాంగశ్రవణం మాదిరిగా వ్యక్తిత్వవికాస పాఠాల బోధనలూ జరగాలేమో. మనిషిని మానసికంగా బలంగా తయారుచేసి స్థితప్రజ్ఞత దిశగా అడుగులేయించడమే ఉగాది ఆంతర్యం. తెలుగువారికి ఎంతో ముఖ్యమైన ఈ ఉగాది మీద ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో చెప్పుకోదగ్గ పాట ఒక్కటీ లేకపోవడం విచిత్రం. ఆ లోటు ఎప్పుడు తీరుతుందో. ఇక పద్యాల్లో అయితే ఉగాది మీద అనేకం ఉన్నాయి. అయితే పాటగా పాడుకోదగ్గ ఛందస్సుల్లో ‘లయగ్రాహి’ అనే వృత్తం ఒకటి. ప్రతి పాదంలోనూ నాలుగు యతిస్థానాలు ఉండటం దీని ప్రత్యేకత. పదాలు సరిగ్గా విడగొట్టుకుని రాసుకుంటే పాడుకోవడానికి చాలా బాగుంటుంది. ఆ ఛందస్సులో ఉగాది మీద నేను రాసుకున్న ఓ రెండు పద్యాలివి..  అచ్చమగు వేడుకగ పచ్చనగు వేదికగ 
వెచ్చనగు వీచికగ వచ్చెను ఉగాదీ
మెచ్చగనె కోకిలలు హెచ్చగనె రాగములు 
విచ్చగనె ఉల్లములు వచ్చెను ఉగాదీ
పచ్చివగు మామిడులు గిచ్చగనె నాలుకలు 
గుచ్చగనె కోరికలు వచ్చెను ఉగాదీ
చిచ్చుగల భాస్కరుడు యిచ్చెనుగ దీవెనలు 
తెచ్చెనుగ చైత్రమును వచ్చెను ఉగాదీ
ఉండునని సంపదలు పండగనె పుణ్యములు 
మెండుగనె చాటునది పండుగ ఉగాదీ
దండలుగ బంధములు దండిగనె గంథములు 
గుండెలలొ నింపుకొను పండుగ ఉగాదీ
భాండమున వంటలను వండగనె ఇంపుగనె 
నిండుగనె వచ్చునది పండుగ ఉగాదీ
అండయగు దైవముకు దండములు పెట్టగనె 
కుండలలొ పచ్చడుల పండుగ ఉగాదీ      
- సిరాశ్రీ 


ఉగాది పచ్చడిలో షడ్రుచులు మిళితమైనట్టే.. మనిషి జీవితంలో కూడా తీపి, చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. వాటిని సమంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలి. ఉగాది అంటే కొత్త సంవత్సరాది. నూతన సంవత్సరంలో చేసే ఆలోచనలు, పనులు విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందరి జీవితాలు ఆనందంగా ఉండాలని ఆశిస్తారు. నేనూ అంతే. ఉగాది పండగ రాగానే ఏదో తెలియని భావన కలుగుతుంది. గతేడాది లాగే ఇప్పుడూ కాలం సాఫీగా సాగిపోవాలని ఆశపడుతుంటాను.    - అనిల్‌ రావిపూడి 


పంచాంగ శ్రవణం ఇష్టం
వేదాలను దొంగిలించిన సోమకాసురుడనే రాక్షసుణ్ని విష్ణుమూర్తి సంహరించి, ఆ వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభ తరుణమే ఉగాది. అప్పటి నుంచి ఈ పండగను జరుపుకుంటున్నామనేది పురాణాల కథనం. ఉగాది రోజు సృష్టి మొదలైందన్నది మరో గాథ. జడంగా ఉన్న ఈ జగత్తులో చైతన్యాన్ని రగిలించి మానవాళికి కొత్త ఆశలను, ఆశయాలను రేకెత్తించే రోజుగా ఉగాదిని పేర్కొనవచ్చు. అందుకే మన తెలుగువాళ్లకు ఇది తొలి పండగ అయ్యింది. ఉగాది రోజు షడ్రుచుల పచ్చడి, భక్ష్యాలతోపాటు సాయంత్రం జరిగే పంచాంగ శ్రవణం అంటే నాకు చాలా ఇష్టం. పూజారికి నా పేరూ వివరాలు చెప్పి ఈ సంవత్సరం ఆదాయమెంత? ఖర్చెంత? అవమానం ఎంత? రాజపూజ్యం ఎంత? అని అడుగుతాను. ఈ నాలుగింటి ద్వారా నేను తెలుసుకునేది ఏంటంటే.. ఆదాయంలోంచి ఖర్చును తీసేస్తే మిగిలేది నికరమైన పొదుపు. అలాగే రాజపూజ్యం నుంచి అవమానాలు తీసేస్తే వచ్చేది నిజమైన పేరు. ఈ రెండూ కచ్చితంగా ప్రతి మనిషికి వస్తాయనేది సత్యం. కాబట్టి దాన్ని గ్రహించాలి, గమనించాలి. నిజమైన పేరు, నికరమైన ఆదాయం రావాలంటే మనిషి ప్రవర్తన, నడవడిక, పద్ధతి, వ్యవహార శైలి ఎలా ఉండాలన్నది తెలుసుకోవాలి. తెలుసుకున్న మంచి విషయాలను ఆచరణలోకి తీసుకురావాలి. ఒక సంవత్సరం ఇది అలవాటు చేసుకుంటే ఆపై ప్రతి ఏటా మనం సంతోషంగా జీవిస్తామనేది ఉగాది పండగ నుంచి నేను గ్రహించింది. తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాదికి సంబంధించి ఇదే నా అభిప్రాయం, అనుభవం కూడా.    - చంద్రబోస్‌ 


ఉగాది మారలేదు కానీ..!
కొత్తదనాన్ని పరిచయం చేసే పండగ ఉగాది. చిన్నప్పుడు పండగ అనగానే ఒక రకమైన ఆనందం వచ్చేది. నాన్నగారు ఇంట్లో ఉంటారు. కొత్త చిగుళ్ల మామిడాకులు, తోరణాలు కడతారు. బంతిపూల అలంకారం, వాకిట్లో ముగ్గులు, గుమ్మాలకి పసుపు కుంకుమలు అలంకరించడం, తలకి నూనె మర్దన చేస్తూ.. అమ్మ కడుపు చల్లన, అత్త కడుపు చల్లన అంటూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండమని చెప్పి వేడినీళ్లతో, కుంకుడు రసంతో అమ్మ తలంటుపోయడం, కుంకుడురసం కళ్లల్లోకి వెళ్లి కళ్లుమండితే కొంగు ముడిచుట్టి నోటి ఆవిరితో వేడి చేసి కన్ను మీద పెట్టడం, తిలకం బొట్టు, దేవుడి దగ్గర పెట్టిన బట్టలకు పసుపు కుంకుమ రాసి మాతో ఆ కొత్త బట్టలను తొడిగించడం, అక్షతలు చేతికిచ్చి దణ్నం పెట్టించడం, అన్ని రుచులు కలిసిన ఉగాది పచ్చడిని ప్రసాదంగా అరచేతిలో పెట్టడం.. ఇవన్నీ మధుర జ్ఞాపకాలు. ఉగాదికి సంబంధించిన పౌరాణిక గాథలను చెప్పి, అరవై తెలుగు సంవత్సరాల పేర్లను మాతో చెప్పించేవారు. రేడియోలో చెప్పే పంచాంగాన్ని వినిపించేవారు. కాలం మారింది కానీ ఉగాది మారలేదు. కాకపోతే పెద్ద వాళ్లకి ఇది పండగ అని గుర్తుంటోంది. చిన్నవాళ్లకు మాత్రం ఇదో సెలవు రోజంతే! అందరూ ఆంగ్ల మాధ్యమమే కదా! ఇదేమో అచ్చమైన తెలుగు పండగ. అందుకే ‘న్యూ ఇయర్‌’కి రెచ్చిపోయే యువతరం.. మన ఉగాదికి స్తబ్ధుగా ఉంటోంది. నష్టం పండక్కి కాదు.. మన సంస్కృతికే.. తెలుగువారి ఉనికికే!    - అబ్బూరి రవి 


నా జీవితంలో భాగం
నా సినిమా ప్రయాణానికి మొదటి అడుగు ఉగాది రోజే వేశాను. పాటలు రాయడానికి హైదరాబాదు రావాలని నేను నిర్ణయించుకుంది ఉగాది నాడే. ఆ రోజు చీరాలలోని మా అమ్మమ్మగారింట్లో ఉగాది పండగను జరుపుకున్నాం.. ఓ కొత్త పాట రాసి అప్పుడే గేయ రచయితగా నా ప్రయాణాన్ని మొదలుపెట్టా. అమ్మమ్మ చేసే ఉగాది పచ్చడంటే చాలా ఇష్టం. ఆవిడ చెబుతుండేది జీవితమంటే ఉగాది పచ్చడి లాంటిదని. అదే నేను నేర్చుకున్న మొదటి పాఠం. ఎప్పుడు కష్టమొచ్చినా కుంగిపోకూడదని, మళ్లీ జీవితాన్ని మొదలుపెట్టాలని చెప్పేది. ఈ పండగ రోజు ప్రారంభించిన ఏ పనిలోనూ నేను వెనకడుగు వేయలేదు. ఉగాది నా జీవితంలో ఒక భాగం. ఉగాది పంచాంగ శ్రవణం మొదట్లో అర్థమయ్యేది కాదు. కానీ నేను రచయితగా ఎదిగిన తర్వాత అది బోధపడింది. కొత్త ఆశయాల సాధనలో అక్కరకొచ్చే కొత్త మెట్టుగా సంవత్సరాదిని భావిస్తుంటా. అలా ఇది ఎన్నో కలలకు ఆది.    - శ్రీమణి


ఉగాది చలవతోనే కవినయ్యా!
ఉగాది అంటే కవుల పండగ అనే తెలుసు. ఎందుకంటే చిన్నతనంలో మా ఊళ్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో కవి సమ్మేళనాలు జరుగుతుండేవి. వాటిని దూరంగా నిలబడి చూడటం ఇష్టంగా అనిపించేది. పత్రికల్లో కవి సమ్మేళనం జరుగుతుందనే ప్రకటనను కత్తిరించి దాచిపెట్టుకునేవాణ్ని. రాజమండ్రి గౌతమీ గ్రంథాలయం, సీతంపేట గ్రంథాలయం చుట్టుపక్కల కవి సమ్మేళనాలు ఎక్కడ జరిగినా జనాల గుంపులో నిల్చొని ఆసాంతం వినేవాణ్ని. ఎప్పుడూ లేనంత మంది కవులు, ఎప్పుడు జరగని కవిసమ్మేళనాలు ఉగాదికి జరుగుతాయి. చిన్నప్పటి నుంచి నా ఆలోచనంతా అటువైపుగానే ఉండిపోయింది. హైదరాబాదుకు వచ్చే వరకు ప్రతి సంవత్సరం కవి సమ్మేళనానికి హాజరయ్యేవాణ్ని. అలా సమ్మేళనాలను చూస్తూ చూస్తూ.. చాలామంది కవుల కవితలు వింటూ వింటూ పెరిగాను. చివరకు కవి సమ్మేళనంలో నేను కూడా పాల్గొనే అవకాశం తెచ్చుకున్నా. ఉగాది అనగానే రెండు మూడు నెలల ముందు కవితలు రాసి పెట్టుకునేవాణ్ని. తెలిసీ తెలియని వయసులో రాసిన ఆ కవితలు.. అసలు కవిత్వం కాదని తర్వాత తెలిసింది! మెల్లిమెల్లిగా పరిణతి వచ్చాక కవి సమ్మేళనంలో పాల్గొన్నా. అలా నన్ను కవిని చేసింది ఉగాది పండగే. రాజమండ్రి, కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా కవి సమ్మేళనాల్లో పాల్గొన్నా. రాజమండ్రిలో ఒక ఉగాదికి శతాధిక కవి సమ్మేళనం జరిగింది. అందులో నేను పాల్గొనడం ఓ తీపిగుర్తు. ఆ కవి సమ్మేళనం కరపత్రం ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది. ఉగాది పండగ నాకు చాలా మంది కవులను, వారి కవిత్వాలను పరిచయం చేసింది.  నేను పాటల రచయితగా నిలబడటానికీ ఉగాదే కారణం. ఈ పండగ నుంచే ప్రకృతిలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ‘‘చినుకు తడి తగలగానే గడ్డి మొక్క గర్వంగా తలెత్తుకుంది... తెలుగు భాష తలకట్టు లాగా’’ అని రాశా. జీవితంలో చిగురించడం అనేది చాలా ముఖ్యం కదా. అవి చెట్లు కావచ్చు, ఆకులు కావచ్చూ ఏవైనా సరే. ఆ అధ్యాయంలో వచ్చే పండగ కాబట్టి ఉగాదంటే నాకు చాలా ఇష్టం.    - భాస్కరభట్ల 


మనోవికారాలు తొలిగిపోవాలి
ఉగాది రోజు కుటుంబ సభ్యులందరం ఒకచోట కలుస్తాం. ఉగాది పచ్చడిని ఒకరికొకరం పంచుకుంటూ సేవిస్తాం. ఇందులో నిగూఢమైన అర్థం ఏంటంటే.. కాలంతో పాటు ముందుకు సాగే జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఎదురవుతుంటాయి. వాటన్నింటిలోనూ ఎవరూ ఒంటరి కాదు, ఏ ఒక్కరూ ఏకాకి కాదు- నీకు నేనున్నాను నాకు నువ్వున్నావు అంటూ ఒకరికొకరం భరోసా ఇచ్చుకోవడం! దానికి ప్రతీకగా ఉగాది పచ్చడిని పంచుకోవడం! ఈ వికారినామ సంవత్సరంలో మన మనసుల్లోని మనోవికారాలు ధ్వంసమై.. అంటే బంధాలను పలుచన చేసుకోవడం ఒకరినొకరం ద్వేషించడం, అసూయతో రగలిపోవడం లాంటివి తొలగిపోవాలని కోరుకుంటున్నా. మనుషుల మధ్య పరస్పర ప్రేమానురాగాలు వృద్ధిచెంది, సుఖసంతోషాలతో సుభిక్షంగా ఒక అందమైన జీవితాన్ని అందరు కలిసి పంచుకుంటూ ముందుకెళ్లాలని ఆశిస్తున్నా.    - శ్రేష్ఠ 


అదే కదా కావాల్సింది!
ఉగాది అంటే.. మనిషి జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో పెట్టే పండగ. ప్రకృతితో బంధాన్ని, అనుబంధాన్ని పెనవేసే పండగ. ఉగాది వేళ ప్రకృతంతా పచ్చగా కనిపిస్తూ ఒక ఆశావాహ దృక్పథాన్ని కలిగిస్తుంది. ఆకురాలి మోడుగా మారిన చెట్లన్నీ మళ్లీ ఎలా పచ్చదనాన్ని సంతరించుకుంటాయో అలా మనిషి జీవితంలోనూ కొత్త వసంతం వస్తుందనే ఆశలను రేకెత్తిస్తుంది. ఉగాది పంచాంగ శ్రవణం కూడా నాకు చాలా ప్రత్యేకంగా తోస్తుంది. మంచి చెడులను గుర్తించి జీవితాన్ని క్రమబద్ధంగా తీర్చిదిద్దుకునేందుకు పునాది అవుతుంది. అలాగే, జీవితంలో అన్ని కోణాలనూ ఆస్వాదించాలనేది ఉగాది పచ్చడి సారాంశం. అయితే తెలుగువాళ్లు ఘనంగా జరుపుకునే ఈ పండగ ప్రభ రాన్రానూ తగ్గింది. మళ్లీ ఈ మధ్య కాలంలో మనిషి మూలాలను వెతుక్కుంటూ పండగల విశిష్టతను తెలుసుకుంటూ తనను తాను ఆవిష్కరించుకుంటున్నాడు. అదే కదా మనకు కావల్సింది! ఉగాది రోజు శివుణ్ని, గోమాతను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయన్నది నా విశ్వాసం. ఉగాది పండగ విశిష్టత మీద నేను రాసిన పాటలు మంచి ఆదరణ పొందడం మరచిపోలేని జ్ఞాపకం.      - డా।। కందికొండ


ఉగాది కోయిలనై..!
మామిడాకు వేపపువ్వు తెంపుకొచ్చిన జ్ఞాపకాలు
పసుపుదారం పచ్చనాకు కలిపికట్టే కంకణాలు
చుక్కనీరు ముట్టకుండా నోటనేది పెట్టకుండా
పచ్చడున్నా మట్టికుండా షట్‌రుచులు మరవకుండా  
గుర్తులున్నాయి గుండెనిండా చేదుచేదని గునుగుతూనే
పరుగుపరుగున తాగుతూనే ఎండకాలం వచ్చే వర్షం
రాకతోనే తెచ్చే హర్షం కోకిలమ్మకు ఎందుకిష్టం చైత్రమాసపు వాసనంటే
మావికొమ్మకు ఎందుకిష్టం కొమ్మనిండుగా కాసేనంటే  
నాకు కూడా అందుకిష్టం ఈ ఉగాది పండగంటే 
నాకు కూడా అందుకిష్టం ఈ ఉగాది పండగంటే    - కృష్ణకాంత్‌ (కె.కె) 


 


వెనక్కి ...

మీ అభిప్రాయం