తెలుగే తెరువు

  • 1533 Views
  • 2Likes
  • Like
  • Article Share

అమ్మభాష‌లో చ‌దువుకుని, అమ్మ భాష‌ను ఐచ్ఛికాంశంగా ఎంచుకొని 2019 సివిల్స్ ఫ‌లితాల్లో మెరిశారు కొంద‌రు తెలుగు తేజాలు. 'తెలుగు వెలుగు' వాళ్ల‌ని ప‌ల‌క‌రిస్తే... అమ్మ‌భాష‌లో ఉండే అవ‌గాహ‌న శ‌క్తికి మ‌రేదీ సాటిరాద‌ని, ఇష్టంగా చ‌దివితే తెలుగుతోనే విజ‌యం అందుకోవ‌చ్చ‌ని ఘంటాప‌థంగా చెప్పారు. ఆ విజేత‌ల మ‌నోగ‌తాలు వారి మాట‌ల్లోనే...
అమ్మభాషే అండ - కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ (153వ ర్యాంకు)
మాతృభాష మీద పట్టుంటే  ఏ భాష అయినా తేలిగ్గా నేర్చుకోవచ్చు. నేను ఏడో తరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే చదివాను. తర్వాత ఇంగ్లీషు మీడియంలో చేరినప్పుడు మాతృభాషలో సాధించిన పట్టు నాకు బాగా ఉపయోగపడింది. సివిల్స్‌లో విజయానికి కూడా ఆ అవగాహనే బాటలు వేసింది. మా స్వస్థలం నెల్లూరు జిల్లా మాదన్నగారిపల్లి. ఆత్మకూరులో స్థిరపడ్డాం. నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్, ఎంటెక్‌ చేశాను. తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు మాధ్యమంలో చదివిన వాళ్లు సివిల్స్‌లో గట్టెక్కడం కష్టమని బయట చాలా మంది అంటుంటారు. అది నిజం కాదు. అమ్మభాషలో చదివిన వాళ్లకి అవగాహన శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అందరూ ఇంగ్లీషు మీడియంలో చదువులు అంటున్నారు. కానీ, అమ్మభాషను మాత్రం మర్చిపోకూడదు. అసలు ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం తెలుగు మాధ్యమంలోనే జరగాలి. ఎందుకంటే చిన్నపిల్లల గ్రహణ శక్తి అంతా మాతృభాష మీదే ఆధారపడి ఉంటుంది. నాకు తెలిసి కొందరు ఇంగ్లీషు చక్కగా చదువుతారు. కానీ అందులో ఉన్న విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఈ సమస్య మాతృభాషలో ఉండదు, అలాగే మాతృభాష మీద పూర్తి పట్టున్నా కూడా ఉండదు కదా! పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుతున్నాగానీ అమ్మానాన్నలు వాళ్లచేత తెలుగు కథల పుస్తకాలు చదివించాలి. తెలుగులో కథలు చెప్పాలి. పిల్లల మేధో వికాసానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర ఎక్కువగా చదివేవాణ్ని. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గారి పాటలంటే చాలా ఇష్టం. 


ఇంటర్‌ దాకా తెలుగులోనే..  - కొలిపాక రాజ్‌కుమార్‌ (553వ ర్యాంకు)
తెలుగు
మీడియంలో చదివిన విద్యార్థులు సివిల్స్‌లో విజయం సాధించడం కష్టమన్నది ఒట్టి అపోహే. నేను ఇంటర్‌మీడియట్‌ వరకు తెలుగుమీడియంలోనే చదివాను. అయినా, సివిల్స్‌లో గెలుపందుకున్నాను. నా స్వస్థలం జయశంకర్‌భూపాలపల్లి జిల్లా చల్లగరిగె గ్రామం. వరంగల్‌లో స్థిరపడ్డాం. నాన్న చేనేత కార్మికుడు. ఇంటర్‌ వరకు ప్రభుత్వ పాఠశాల, కళాశాలలోనే చదివాను. బీఎస్సీలో ఇంగ్లీషు మీడియంలోకి మారాను. పాఠాలైతే తెలుగులోనే చెప్పేవాళ్లు, కానీ ఇంగ్లీషులోనే రాయాలి కదా! మొదట్లో కొంత ఇబ్బంది అయినా, మూడేళ్లలో ఇంగ్లీషులో ఫర్వాలేదు అనిపించింది. ఐఐటీ బాంబేకి వెళ్లిన తర్వాత మరికొంత అవగాహన వచ్చింది. ఆ తర్వాత అధ్యాపక వృత్తిలోకి వచ్చాక పిల్లలకు ఇంగ్లీషు మీడియంలోనే బోధించాను. సివిల్స్‌కి సిద్ధమవుతున్న ప్రారంభంలో భౌగోళికశాస్త్రం, అర్థశాస్త్రం, పాలనశాస్త్రం, చరిత్ర లాంటి వాటికి సంబంధించిన ఇంగ్లీషు పదజాలం కొత్తగా అనిపించేవి, ఎందుకంటే వీటన్నింటినీ పాఠశాలలో తెలుగు మాధ్యమంలో చదువుకున్నాను కదా! కానీ, మూడు నాలుగు నెలల్లోనే అన్నింట్లో పట్టుసాధించాను. సివిల్స్‌ పరీక్షలన్నీ ఇంగ్లీషులోనే రాశాను. తెలుగులో శ్రీశ్రీ రచనలంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు యూట్యూబ్‌లో ఆయన కవితలు వింటుంటాను. అవి ఉత్తేజాన్ని, స్ఫూర్తిని ఇస్తాయి. అమ్మభాషలో విద్యా బోధన జరిగితే పిల్లల్లో అవగాహన శక్తి పెరుగుతుంది. చిన్నప్పుడే పిల్లల్ని ఇంగ్లీషు మీడియంలో చేర్పిస్తే ఇంటిదగ్గర ఒక భాష మాట్లాడతారు, పాఠశాలలో మరొకటి నేర్పిస్తారు. దీనివల్ల పిల్లలు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రాథమిక విద్య మొత్తం అమ్మ భాషలోనే జరగాలి. అలాగని మొత్తం తెలుగే కాకుండా ఇంగ్లీషు కూడా ఒక అంశంగా ఉండాలి. 


పోతన ఇష్టం - అనుముల శ్రీకర్‌ (570వ ర్యాంకు)
తెలుగు
ఐచ్ఛికాంశంగా సివిల్స్‌ సాధించలేం, అది కష్టమైన సబ్జెక్టు అనే భ్రమ మన విద్యార్థుల బుర్రల్లో ఎవరు నాటారో గానీ, అది పచ్చి అబద్ధం. ఇష్టపడి ఆత్మవిశ్వాసంతో చదివితే తెలుగు మాధ్యమంలో చదవకపోయినా తెలుగు సాహిత్యాన్ని ఎంచుకుని మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించొచ్చు. దానికి నేనే ఉదాహరణ. నా స్వస్థలం యాదాద్రి భువనగిరి. చిన్నప్పటి నుంచి ఇంగ్లీషు మాధ్యమంలోనే చదువుకున్నాను. కానీ, తెలుగంటే మొదటి నుంచి మక్కువ. దానికి కారణం మా నాన్నగారు. ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయులు. సమాజ సేవకులు, గాయకులు, రచయిత, కవి కూడా. ఆయన నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు అన్నింటిలో  పాల్గొంటూ ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి మా కుటుంబ ఆదాయంలో 15 శాతాన్ని సమాజ సేవకే ఆయన వెచ్చించేవారు. అమెరికాలో ఎంఎస్‌ చేసి రెండేళ్లు ఆపిల్‌ కంపెనీలో ఉద్యోగం చేశాను. దానికి రాజీనామా చేసి సివిల్స్‌ సంసిద్ధత కోసం 2017లో భారత్‌ వచ్చాను. నేను మళ్లీ ఇక్కడికి రావడానికి తెలుగు పట్ల ఉన్న ఇష్టం ఒక కారణం అయితే, దేశ సేవ మరో కారణం. పది వరకు తెలుగును ఒక సబ్జెక్టుగానే చదివాను. ఆ తర్వాత ఇంకెప్పుడూ తెలుగు చదవలేదు. కానీ, అమ్మ భాష మీద ఉన్న మమకారంతో సివిల్స్‌లో ఐచ్ఛికాంశంగా ఎంచుకున్నాను. పాఠశాల, కళాశాల రోజుల్లో తెలుగు చదువుకోవడానికి అవకాశం దక్కలేదు, ఇప్పుడు దొరికింది కదా అని ఇష్టంగా చదివాను. అందుకే ఎలాంటి ఇబ్బందీ అనిపించలేదు. ‘తెలుగును ఐచ్ఛికంగా ఎందుకు తీసుకున్నారు? తెలుగులో మీకు నచ్చిన కవి ఎవరు? ఎందుకు?’ లాంటి ప్రశ్నలు ముఖాముఖిలో నన్ను అడిగారు. భాగవతాన్ని పండిత పామర జనరంజికంగా సృజించిన పోతన నాకు ఇష్టం. ఆయన తన కావ్యాన్ని రాజులకి అంకితం ఇవ్వకుండా దైవాంకితం చేశారు. ఆత్మాభిమానంతో వ్యవసాయం చేసుకుంటూ జీవించారు. అందుకే ఆయన అంటే నాకు అభిమానం అని చెప్పాను. 


నిజానికి చాలా తేలిక  - పొన్న వెంకటేష్‌ (728వ ర్యాంకు)
ఈ ఏడాది
సివిల్స్‌ ఫలితాల్లో నా పేరు ఉందంటే దానికి కారణం తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికాంశంగా ఎంచుకోవడమే. మాది నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట. వ్యవసాయ కుటుంబం. ఏడో తరగతి వరకు స్థానికంగా ఒక చిన్న పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో చదివాను. ఆ తర్వాత పది వరకు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో విద్య కొనసాగింది. ఇంటర్‌ కూడా ఇంగ్లీషు మీడియమే. తర్వాత బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌సైన్స్‌లో బీటెక్‌ చేశాను. ప్రాంగణ నియామకాల్లో ఐబీఎంలో ఉద్యోగం వచ్చింది. కానీ, సివిల్స్‌ మీద ఆసక్తితో ఇటువైపు వచ్చాను. తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికంగా తీసుకుంటే మన భాషాసాహిత్యాల గురించి పూర్తిగా తెలుసు కోవచ్చని అనిపించింది. ఇంకో కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం మాట్లాడుతూ పెరిగిన భాష కాబట్టి దాన్ని సులువుగా అర్థం చేసుకోవచ్చు. సివిల్స్‌కి సిద్ధమవుతున్న ప్రారంభంలో తెలుగు పదజాలం, అక్షరదోషాలతో కొంత ఇబ్బంది పడ్డాను. అయితే ఈనాడు పత్రికలో వచ్చే వ్యాసాలు, ఇతర పత్రికలను చదువుతూ భాషమీద పట్టు పెంచుకున్నాను. రోజూ తెలుగు రాత సాధన చేసేవాణ్ని. నాకు శిక్షణ ఇచ్చిన నాగరాజు గారు ఒక్కటే చెప్పారు, మనం ఒక భాషని సరిగ్గా పలక్కపోతే అక్షరదోషాలు వస్తాయి అని. అందుకే ఉచ్చారణ మీద దృష్టిపెట్టాను. సివిల్స్‌ అభ్యర్థులు చాలా మంది తెలుగు సాహిత్యం మహాసముద్రమని భావిస్తుంటారు. కానీ, ఇష్టంగా చదివితే ఇది చాలా తేలిక. నేను కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థిని. ఒక కంప్యూటర్‌ భాషని నేనెంత బాగా నేర్చుకుంటే ఆ యంత్రంతో అంత సమర్థంగా పనిచేయించొచ్చు. అలాగే, ఒక వ్యక్తికి తన మాతృభాష ఎంత బాగా వస్తే ప్రపంచంలోని ఏ భాషనైనా అంత తేలిగ్గా నేర్చుకోవచ్చు. 


 


వెనక్కి ...

మీ అభిప్రాయం