జెర్సీ, మహర్షి - వెండితెర వెన్నెల

  • 540 Views
  • 54Likes
  • Like
  • Article Share

కారుమబ్బులు వీడిపోతున్నాయి. చలనచిత్రాలు తిరిగి ‘తెలుగు బాట’ పడుతున్నాయి. మన పలుకుల తియ్యందనాన్ని పంచుతున్నాయి. ఇటీవల వచ్చిన చిత్రాల్లో పరచుకున్న తెలుగు వెన్నెల ఇది...!
మెరిసే జెర్సీ..

గెలిచినవాళ్ల కథలు వినటం అలవాటైపోయిన చిత్రప్రేమికులకు కొత్త రుచి ఈ జెర్సీ చిత్రం. ఓటమిలోనూ ప్రయత్నాన్ని ఆపకూడదన్న గొప్ప సందేశాన్ని భావోద్వేగాలు పండిస్తూ అందించారు. అందుకు గౌతమ్‌ తిన్నసూరి పదునైన సంభాషణలు మూలస్తంభాలై నిలిచాయి.
      ‘ఇంత పెద్ద ప్రపంచంలో నన్ను జడ్జ్‌ చెయ్యనివాడు నా కొడుకు ఒక్కడే. వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను..’ అనే తండ్రి వ్యథ కథను ప్రధానంగా నడిపిస్తుంది. నాయకుడి పాత్ర అర్జున్‌ తన క్రీడాజీవితాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వదిలేస్తాడు. తిరిగి రావడానికి చేసే ప్రయత్నాల్లో అతని ఆత్మస్థైర్యాన్ని వ్యక్తీకరించేందుకు పదునైన సంభాషణలు ఊతమిచ్చాయి. ‘ఏం చెయ్యమన్నా చేస్తా సార్‌.. కానీ, మళ్లీ తలదించుకోలేను..’ అంటాడు. మరోవైపు ‘ఆపేసి ఓడిపోయినోడు ఉన్నాడు కానీ, ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు..’ అన్న మాటకు కట్టుబడి ఉంటాడు. మరో వైపు ఇంట్లో భార్య వ్యాకులతను ఒక్క మాటలో చెబుతారు.. ‘నీకు అవసరానికి మించి ఆశలున్న కొడుకు ఉన్నా, సంపాదించే పెళ్లాం లేదు..’ అంటూ. కుటుంబాల్లో అన్యోన్యత గురించి చెబుతూ ‘నిజంగా నీ తప్పేమీ లేదు.. అయినా సరే.. దగ్గరుండి గొడవపడు. దూరంగా వెళ్లకు..’ అని చెప్పడం హృదయాలను తాకుతుంది. చిత్రం ఆఖరులో మా నాన్న ప్రయత్నిస్తూ చనిపోలేదు.. చనిపోతాడని తెలిసినా ప్రయత్నించారు..’ అని రాసిన మాటలు చిత్రానికి గట్టి పట్టును ఇచ్చి ప్రేక్షకుల మెప్పుపొందాయి.


మహర్షి.. హలమూ కలమూ..
‘ఆడబిడ్డ ఏడిస్తే ఇంటికి మంచిది కాదు అంటారు. అదే ఒక రైతు ఏడిస్తే దేశానికే మంచిది కాదు..’ అన్న మాటే మహర్షి చిత్ర కథకు మూలం. వ్యవసాయం నేపథ్యాన్ని ముడివేసుకుని అంతర్లీనంగా బంధాలకు ప్రాధాన్యమిచ్చింది మహర్షి. 
      గెలుపును కోరుకునేవాడు మనిషి, గెలుపును పంచేవాడు మహర్షి.. అంటూ కథానాయకుడి వ్యక్తిత్వాన్ని చెబుతారీ చిత్రంలో. జీవితంలో ఎదగాలనుకోవడం గురించి స్పష్టతనిచ్చే సందర్భంలో గెలుపు అంటే గమ్యం కాదు.. గెలుపు ఓ ప్రయాణం అని చెప్పడం బాగుంది. అలాగే.. విజయానికి నిర్వచనాలంటూ ఉండవని.. మనం విజేతలమైతే.. మనమే నిర్వచనంగా మారిపోతాం అనే మాటలు ఆకట్టుకుంటాయి. జీవితంలో అన్నింటా ప్రథముడిగానే ఉండాలనుకోవడం కథానాయకుడి స్వభావం. అంత అవసరమా అని ప్రశ్నిస్తే, ‘వేగంగా పరిగెట్టేవాడిని మాత్రమే గుర్తుపెట్టుకునే ఈ ప్రపంచంలో నేను ఇంకోలా. రెండో స్థానంలో వచ్చేవాడిలా ఎలా బతుకుతాను.. అని జవాబిస్తాడు.
      జయాపజయాలను ప్రస్తావిస్తూ, ‘చాలామంది ఫెయిల్యూర్స్‌గా మిగిలిపోయి ఎందుకు వెనకబడిపోతున్నారో తెలుసా.. వాళ్ల బలం ఏంటో తెలుసుకోక.. పక్కోడి బలం చూసి భయపడుతుంటారు..’ అంటాడు. ‘ఊరంటే కొన్ని ప్రాణాలు.. ఇల్లంటే కొన్ని జ్ఞాపకాలు’ వంటి సంభాషణలు గుండెలను తడతాయి. రైతులకు ఆలంబనగా నిలిచే ప్రయత్నంలో కథానాయకుడితో మంచి మాటలు పలికించారు. ‘అప్పట్లో రైతే రాజు అన్నారు. ఇప్పుడు అదే రైతు కూలీగా కూడా పనికి రావట్లేదు..’, ‘ఈ భూమ్మీద బతికే ప్రతి ఒక్కడికీ వ్యవసాయంతో సంబంధం ఉంది..’అంటూ కంటతడి పెట్టే సన్నివేశాలు చిత్రానికి కొండంత బలాన్ని ఇచ్చాయి. ‘మనకి రెండు సంవత్సరాలకి ఓసారి జీతం పెంచకపోతే రోడ్లెక్కి స్ట్రైకులు చేస్తాం. కానీ రైతు మాత్రం సంవత్సరాలపాటు తాను నమ్ముకున్న పంట మీద లాభం వచ్చినా రాకపోయినా మళ్లీ మళ్లీ పంట పండించాలన్న ఆశతో తను వేసిన ప్రతి విత్తనంలో తన జీవితాన్ని వెతుక్కుంటూ ఉంటాడు..’ అంటూ ఒక దేశం గుండెచప్పుడు రైతే అని నినదిస్తారీ చిత్రంలో. పాటల్లో ప్రత్యేంగా రైతుగుండెను మొలకెత్తించే శ్రీమణి రచన ‘పదర పదరా..’ పచ్చి పల్లె పదాలతో ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోయింది. 


వెనక్కి ...

మీ అభిప్రాయం