తెలుగులెంక

  • 880 Views
  • 0Likes
  • Like
  • Article Share

    బి.హెచ్‌.దేవీప్రకాశ్‌

  • విశ్రాంత తెలుగు ఉపాధ్యాయిని
  • విజయనగరం.
  • 8922226001
బి.హెచ్‌.దేవీప్రకాశ్‌

‘‘ఏ పుణ్య లేశమ్ము నాపాలిదాయెనో
నా పూజ కేలోక నాథుండు పొంగెనో
నీ పావనోదరశ్రీ పరంపరలో నేనొక్కడనైతి’’ 
అని అన్న, అనుకొన్న మహాకవి తుమ్మల సీతారామమూర్తి చౌదరి.

మహాత్మకవి, అభినవ తిక్కనగా ప్రసిద్ధిగాంచిన తుమ్మల సీతారామమూర్తి 1901లో గుంటూరు జిల్లా కావూరులో రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన గాంధేయవాది. సబర్మతి ఆశ్రమంలో కొంతకాలం గాంధీజీ శిష్యరికం చేసి, మహాత్ముని జీవిత చరిత్రను ‘మహాత్మ కథ’గా రాశారు. ‘ఆత్మార్పణ’, ‘ధర్మజ్యోతి’, ‘శబల’, ‘గీతాదర్శనం’, ‘సర్వోదయగానం’, ‘ఉదయగానం’, ‘నేను’, ‘తెనుగునీతి’, ‘సమదర్శి’, ‘పైరపంట’, ‘పరిగపంట’, ‘రాష్ట్రగానం’ మొదలైన గ్రంథాలు ఆయన కలంనుంచి జాలువారాయి. వీటిలో ‘రాష్ట్రగానం’ బాగా ప్రసిద్ధి పొందింది. ‘‘నీ పదార్చకులలో నేనొక్కడనైతి’’, ‘‘తెలుగు తల్లీ నీకు జోహారు’’ అంటూ ‘తెలుగు లెంక’ అనిపించుకోవడమే తనకు ఇష్టం అంటారు తుమ్మల.
తెలుగునేల పౌరుషాగ్నులు
‘రాష్ట్రగానం’ కావ్యంలో తెలుగు రాజుల వీరనారీమణుల, వివిధ రంగాల్లో తెలుగు వారి వైభవ ప్రాభవాలని ఎలుగెత్తి చాటిన ప్రతిభాశాలి ఆయన. ఆంధ్ర సామ్రాజ్య స్థాపకుడు శ్రీకాకుశాంధ్ర మహావిష్ణువు, శ్రీముఖుడు, హాలుడు, గౌతమీపుత్ర శాతకర్ణి మొదలైన తెలుగు రాజుల గాథలను నెమరువేసుకొని నాటి పౌరుషాన్ని నిలబెట్టమంటారు. 
      అంతేకాదు...
కలము ఖడ్గము పట్ట గల నేర్పు వడసిన రెడ్డినాగమ్మ నీ బిడ్డయటవె;
జగమగంటిమి నాంధ్ర జగతి పాలించ గరిత రుద్రమ్మ నీ కన్నెయటవె
గండికోటను మల్కదండుపై దూకిన గోవింద మాంబ నీ కూతురటవె
మానంబుకై నిజప్రాణంబు బలియిచ్చు మల్లాంబ నీదు కుమార్తెయటవె
వీగివచ్చిన హృదయేశు వెక్కిరించి
పోరుకంపిన చాన నీ పుత్రి యటవె
ఎంత తేజస్వినివి తల్లి! ఎరుకలేక
నీ మహత్వంబు తెలియంగలేము గాని!

నాగమ్మ... అనగానే గుర్తుకొచ్చేది పల్నాటి యుద్ధమే. కానీ ఆమె గొప్ప శివభక్తురాలు. శివతత్వాన్ని రాసిన కవయిత్రి. దురదృష్టవశాత్తు ఆమె రచనలు లభించడం లేదు. ఆమె మంత్రాంగాన్ని నెరపగల మహిళ. ఖడ్గచాలనంలో నేర్పు గల నారీమణి. 
      ఒక స్త్రీ రాజ్యమేలడం అవమానంగా భావించి... అహంకారంతో ఇంట దాయాదులు, బయట యాదవరాజు మహాదేవుడు చుట్టుముట్టగా, తన భుజబలంతో శత్రువులను తరిమికొట్టిన రుద్రమదేవి పరాక్రమం మరువలేనిది. ఇక గండికోటను పాలించిన గోవిందమాంబ అక్బర్‌ చక్రవర్తిని ఎదిరించి నిలిచిన మూర్తి. అభిమానాన్ని కాపాడుకునేందుకు ప్రాణత్యాగం చేసిన మహిళ మల్లమాంబ వీరబొబ్బిలి రాణి. యుద్ధరంగం నుంచి వెనుదిరిగి వచ్చిన తన భర్త ఖడ్గతిక్కనను పరిహసించి, యుద్ధోన్ముఖుని చేసిన వీరవనిత చానమ్మ.
దిద్దుకోవమ్మ తెలుగుతల్లి...
      పరిపాలనా దక్షతలోనే కాదు ఇతర రంగాల్లోనూ తెలుగువాళ్లు ఖ్యాతి గడించారు. యజుర్వేద విహితకర్మలను సూత్రీకరించిన ఆపస్తంబ రుషి తెలుగువాడు. ప్రపంచానికి బౌద్ధమతాన్ని గురించి చెప్పిన సిద్ధుడు నాగార్జునాచార్యుడు మనవాడే. మోక్షసాధనకు చిత్తశుద్ధి ప్రధానమని చాటి చెప్పినవాడు యోగి వేమన. రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న బొందితో పరలోకానికేగిన భక్త శిఖామణి. బానిసత్వంలో చిక్కుకొని (నాడు రాజకీయంగా, నేడు మానసికంగా) తన గొప్పదనాన్ని తెలుసుకోలేకపోతున్నాడు తెలుగువాడు. దానికి కారణం, నాడు ‘రాష్ట్రగానం’లో తుమ్మల ఆయన చెప్పిందే... 
పరవేషభాషాసపర్యతారకమౌట
    ఆంధ్రత్వమే సగంబడగిపోయె
పరఖడ్గములకు లోబడి జోహారులు పెట్ట
    స్వాతంత్య్రసముపేక్ష జారిపోయె
కులతత్వములు చుట్టుకొని ఈర్ష్యలకు నీడ్వ 
    యైకమత్యము సర్వమణగిపోయె
అసమర్థతాపంకమందుబ్రుంగుటచేసి
    మెట్టవేదాంతముల్‌ మీరిపోయె
నలగిపోయిన యీనాటి తెలుగుబిడ్డ
కేమిసందేశమిత్తు తల్లీ! తమస్సు
విడుచుచున్నది యిపుడిపుడె రవంత
ఉద్ధరింపుము వీని సద్బుద్ధులొసగి!
‘దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి’ 

అని కరుణశ్రీ అన్నట్లుగ ‘ఉద్ధరింపుము వీని సద్బుద్ధులొసగి’ అంటారు తుమ్మల. దేశంలో ఎక్కడా లేనంతగా పరభాషాభిమానం మనకుంది. ఒప్పుకోక తప్పదు. ఈ పద్యం రాసి అర్ధ శతాబ్ది పైబడినా మాతృభాషాభిమానం పెంచుకోవటానికి బదులు తెలుగు మాట్లాడటమే తప్పు అనుకునే స్థాయికి దిగజారాం. తెలుగులో మాట్లాడితే మెడలో పలకలు వేలాడదీసి శిక్షించే స్థితికి చేరుకున్నాం. తెలుగుతనం సగం కాదు మూడొంతుల ముప్పాతికా అణగిపోలేదా? ఇంకా కులతత్వాలు చెలరేగి ఐకమత్యాన్ని చెడగొడుతున్నాయి. అలాగే లక్ష్యశుద్ధిలో ప్రగతి సాధించాలి. కానీ అసమర్థత అనే బురదలో కూరుకుపోయి మెట్టవేదాంతం వల్లించకూడదు. నిన్నటి సంఘటనలు నేటి చరిత్ర.. గతంలోని పొరపాట్లను సరిదిద్దుకునేందుకైనా చరిత్ర చదవాలి.
      తెలుగువారంటే గుండెలో నుంచి అభిమానం పొంగుకొస్తుంది తెలుగులెంకకు. అందుకే... అన్నమభట్టు, భాస్కరమంత్రి, మహామంత్రి తిమ్మరుసు, నాదబ్రహ్మ త్యాగరాజు తన వాళ్లు అని విశ్వరంగం మీద రొమ్ము విరుచుకుని నిలబడే అవకాశం తెలుగువాడిగా పుట్టిన తనకు లభించిందని, తన జన్మ ధన్యమైందని మురిసిపోయారు. 
రావమ్మా సంక్రాంతి లక్ష్మి
అచ్చమైన తెలుగు రైతుగా, తెనుగు కవిగా ఆయన కవితా మాధుర్యాన్ని చవిచూడాలంటే, సీతారామమూర్తి రాసిన ‘పరిగపంట’ని చదవాల్సిందే. అందులో ‘మకర సంక్రాంతి’ వర్ణన కనిపిస్తుంది. ఇందులో ‘ఛాందసభావాలన్నీ ఛందస్సుల బంధించి, ఊర్వశి అందాలు చెప్పి ఊరించి ఉడికించి’ అంటూ తెలుగు వాచకాలని వేశాకోళం చేస్తారు. ప్రస్తుత యాంత్రిక యుగంలో మనిషి హృదయస్పందనని మరచి మర మనిషిగా మారిపోతున్నాడు. పెళ్లిళ్లు, పేరంటాలు, నోములు-వ్రతాలు, పండుగలు-   పబ్బాలు అన్నీ వచ్చామా, చూశామా, తిన్నామా, వెశ్లామా అన్నట్టుగా యాంత్రికంగా సాగుతున్నాయి. మనసు ఆనందపరవశమై, మధురమైన ఊహలతో జీవ చైతన్యాన్ని పొందాలంటే సాహిత్యాన్ని తప్పక ఆస్వాదించాలి. పచ్చని పల్లెసీమల్లో విహరించిన తెలుగులెంకకు సంక్రాంతి లక్ష్మి దర్శనం ఎలా అయిందో...
కొసరి నూరిన పచ్చని పసుపు బూతమొగాన
గుమ్మడి పూదుమారమ్మునద్ది .............
కదలివచ్చెను భాగ్యాల కడలిబోలె
మకరసంక్రాంతి లక్ష్మి హేమంత వీథి!

      పచ్చగా పసుపు రాసుకున్న ముఖానికి గుమ్మడిపూల పుప్పొడిలేపనంగా అద్దుకొని, మిరపపండు బొట్టుపెట్టుకుందిట సంక్రాంతి లక్ష్మి. పొగమంచు వంటి చీర కట్టుకుని, బంతులు చేమంతులు కలిపికట్టిన దండను సిగలో తురిమిందిట. అలాంటి మాల ధరించిన ఆమె కొప్పు ఎంత గొప్పదో మరి! పంట కళ్లాలు జయజయ ధ్వానాలు చేస్తుండగా తెల్లమబ్బు గొడుగు నీడన బయల్దేరిన సంక్రాంతి లక్ష్మి సంపదలు తెచ్చింది. రైతులకు పంట ఇంటికి చేరేది సంక్రాంతికే కదా!
      ఆ సంక్రాంతి సంబరాలు ఇంటింటా ఎలా ఉంటాయో దీనిలో వర్ణిస్తారు. అసలే చలికాలం. ఆపై మకర సంక్రాంతి. మకరధ్వజుని లీలా విలాసం. 
నెలదప్పినట్టి కోడలి చేత నొకయత్త
    బోగిపొంగలి పూజ పూర్తి చేసి
పుట్టినింటికి వచ్చినట్టి కూతు గులాబి
    చెక్కిళ్ళనొకతల్లి చెనకి పుణికె
మారు వడ్డించెడి మరదలి కెంగేలు
    పిసికి వల్దనెనొక్క పెంకి బావ
వంగి ముగ్గులదిద్దు వధువుపై నీర్చల్లె 
    గదివీడి చనునొక్క గడుసు మగడు
అపుడె వచ్చిన ప్రియుని సోయగము గనుచు
దలుపుచాటున నొక్కపైదలి చమర్చె
మధురమధురానురాగ సామ్రాజ్య పీఠి
జగముకొలువుండె మకరధ్వజంబునెత్తి!

 వంశాభివృద్ధి జరగాలని నెలతప్పిన కోడలిచేత భోగి పొంగలి వండించి, పూజ చేయించిందట ఓ అత్త. పెరట్లో సూర్యునికి ఎదురుగా పిడకల దాలి పేర్చి, కొత్తకుండలో పెసరపప్పు, బియ్యం, కొత్త బెల్లంలో పొంగలి వండించి నైవేద్యం పెడతారు. గరిటెకు బదులు చెరకు కాడతో ఆ పొంగలి కలియబెడతారు.
తొలి పండుగకని పుట్టింటికి వచ్చిన కూతురిని ‘ఏమైనా విశేషమా?’ అని అడిగి, సిగ్గుతో ఆమె బుగ్గలు గులాబీలు పూయగా చెక్కిలి నిమిరిందట ఓ తల్లి. బావా మరదళ్లనగానే ఒకరినొకరు అల్లరి చేసి ఏడిపించే హక్కు, అధికారం ఉంటుంది. అందుకే చెయ్యినొక్కి మరీ మారు వద్దని చెప్పాడట ఓ కొంటె బావ. ఉదయాన్నే ముగ్గులు పెడుతూ కూర్చున్న కొత్త పెశ్లాం మీద చల్లని నీళ్లు చల్లాడట ఓ గడుసు మగడు. పండుగ సమయానికి వచ్చిన వరుణ్ని తలుపుచాటు నుంచి చూసి పరవశించిందట ఓ కొత్త పెళ్లి కూతురు. ఎంత మధురిమ నిండిన వాతావరణమది. ఆ జీవన మాధుర్యాన్ని ఎంత కోల్పోతున్నాం మనం.
అంతేకాక తుమ్మల సంక్రాంతి విందు భోజనం కూడా రుచి చూపిస్తారు.
లేగటి పాలలోగ్రాగి మాగిన తీయ
    తీయ కప్పురభోగిపాయసంబు
చవులూరు కరివేప చివురాకుతో గమ
    గమలాడు పైర వంకాయ కూర
తరుణ కుస్తుంబరీదళమైత్రిమై నాల్క
    త్రుప్పడుల్చెడు నక్కదోస బజ్జి
క్రొత్త బెల్లపు తోడికోడలై మరగిన
    మదురు గుమ్మడిపండు ముదురుపులుసు
జిడ్డుదేరిన వెన్నల గడ్డపెరుగు
గరగరికజారు ముంగారు చెరకు రసము
సంతరించితి విందు భోజనము సేయ
రండు రండని పిలిచె సంక్రమణలక్ష్మి!

కప్పురభోగి పాయసాన్ని, పైరవంకాయకూరని వండిందట సంక్రమణలక్ష్మి. తెలుగువారి కి ఎంతో ఇష్టమైంది వంకాయకూర. ‘గుత్తివంకాయ కూరోయి బావా’ పాటని పాడకుండా బందా కనకలింగేశ్వరరావుని వేదిక దిగనిచ్చేవారు కారట ప్రేక్షకులు! గుత్తివంకాయ కూర పాటలు చలనచిత్రాల్లో అనేకం చోటు చేసుకున్నాయి. ఇక్కడ కరివేప చివురాకుతో ఘుమఘుమలాడే పైర వంకాయకూర తయారు చేసింది సంక్రాంతి లక్ష్మి. అంతే కాదు నాలుక తుప్పు వదిలించేలా లేత కొత్తిమీరతో నక్కదోసబజ్జి కూడా చేసింది. బజ్జి అంటే అరటికాయ, శనగపిండితో చేసే బజ్జీ కాదు. పులుసు పచ్చడిని బజ్జి అంటారు. సంక్రాంతికి గుమ్మడికాయని బద్దలు కొట్టి కూర తియ్యపులుసు చేసుకునే అలవాటు తెలుగువారిది. దీనికి తోడు గడ్డపెరుగు. సంక్రమణలక్ష్మి అప్పుడే తీసిన చెరకుపానకం అందిస్తోంది. ఈ విందు భోజనం వర్ణనతో మనకూ నోరూరిస్తారు సీతారామమూర్తి.
      తెలుగుతల్లికి అక్షర హారతులిచ్చారు కాబట్టే ‘తెలుగు లెంక’ అయ్యారిలా...
ఆంధ్ర పౌరుషరుషనాజ్యంబు వోసిన
తెలుగు తేజముగద తెలుగు లెంక
కమ్మదనము లొలుకు కర్షకమిత్రుండు
తేనెచిలుకుకైత తెలుగ లెంక!


వెనక్కి ...

మీ అభిప్రాయం