తడికన్నులనే తుడిచిన నేస్తమా...!

  • 2679 Views
  • 84Likes
  • Like
  • Article Share

    శాంతి జలసూత్రం

  • పెదపాడు, పశ్చిమగోదావరి shanti.rfc@gmail.com
శాంతి జలసూత్రం

‘స్నేహానికన్న మిన్న లోకాన లేదురా’ అన్నారు భువనచంద్ర. నిజమే స్నేహానికి మించింది ప్రపంచంలో ఏదీ లేదు. స్నేహానికి సరిహద్దులు లేవు. కులమతాలు లేవు. చిన్నా-పెద్దా, ధనికా-పేదా తేడాలు లేవు. కల్లాకపటం తెలియనిది, స్వార్థమనేది ఎరగనిది స్నేహం ఒక్కటే. అలాంటి స్నేహాన్ని అందంగా వర్ణిస్తూ తెలుగు సినీకవులు అల్లిన పాటల్లో కొన్నింటి విశేషాలు ‘స్నేహితుల దినోత్సవం’ సందర్భంగా... 
స్నేహమంటే
నమ్మకం. స్నేహితుడుంటే ధైర్యం. స్నేహమనేది ఓ అనిర్వచనీయ అనుభవం. స్నేహ మాధుర్యాన్ని ఆస్వాదిస్తేగానీ దాని పరిమళాన్ని తెలుసుకోలేం. సృష్టిలో ఎవరున్నా లేకపోయినా స్నేహితులు లేనివారు ఉండరేమో! స్నేహితులతో ఉంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఆధునిక పరిశోధనలు నిరూపించాయి కూడా! అందుకేనేమో చెలిమి తోడుంటే చాలు ఇంకేం అక్కర్లేదు అన్నారు సిరివెన్నెల. ‘కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది/ చల్లని జాబిలితో స్నేహం కుదిరింది...’ అంటూ ‘రాజా’ సినిమాలో ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసిన గీతం హృదయాలను కదిలిస్తుంది. 
      ‘కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట/ రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం.. రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట/ ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం...’ అంటూ ‘నీ స్నేహం’ చిత్రంలో స్నేహితుల ఆత్మలు రెండైనా మనసు ఒకటే అని చెప్పారు సీతారామశాస్త్రి. బాల్యం నుంచి వృద్ధాప్యంవరకూ నిత్యం తోడుండే బంధం స్నేహం ఒక్కటే కదా మరి! స్నేహితుడంటే మంచి చెడ్డలను తెలియజేసేవాడు. స్నేహితుడిలోని దుర్లక్షణాలను అదేపనిగా విమర్శించకుండా, వాటిని అతను అధిగమించేలా చేయూతను ఇచ్చేవాడే అసలైన స్నేహితుడు. అలాంటి మిత్రుడు తోడుంటే జీవితం పున్నమి వెన్నెలలా వెల్లివిరుస్తుంది. అందుకే ‘స్నేహమే నా జీవితం.. స్నేహమే రా శాశ్వతం’ అన్నారు ‘నిప్పులాంటి మనిషి’ చిత్రంలో సినారె.  
      ‘గున్నమామిడి కొమ్మమీద గూళ్లు రెండున్నాయి/ ఒక గూటిలోన రామచిలకుంది/ ఒక గూటిలోన కోయిలుంది...’ అంటూ ఇద్దరు స్నేహితులు పాడుకునే ఈ గీతం స్నేహానికి ధనిక పేద భేదాలు లేవని చాటుతుంది. ‘బాలమిత్రుల కథ’లో ఆత్రేయ రాసిన ఈ పాట ఇప్పటికీ ఎక్కడో ఓచోట వినిపిస్తూనే ఉంటుంది. ‘రంగూ రూపూ వేరైనా/ తమ జాతి రీతి ఏదైనా/ చిలకా కోయిల చేసిన చెలిమి/ ముందుతరాలకు తరగని కలిమి..’ ఇలా ఏ వైషమ్యాలూ లేనిదే స్నేహమంటూ ప్రబోధిస్తుంది. 
ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి..
ప్రాణమిత్రులు బాపు రమణలు ‘స్నేహం’ పేరుతోనే ఓ చిత్రం నిర్మించారు. దీనికోసం ఆరుద్ర ఓ పాటరాశారు. ‘ఎగరేసిన గాలిపటాలు/ దొంగాటా దాగుడు మూతలు/ గట్టుమీద పిచ్చుకగూళ్లు/ కాలువలో కాగితం పడవలు...’ అంటూ చిన్నతనంలో స్నేహితులతో కలిసి ఆడుకునే ఆటలను కళ్ల ముందు నిలిపారు. ఈ పాట ప్రతి ఒక్కరి బాల్యస్మృతుల్నీ గుర్తుచేస్తుంది. 
      జీవిత ప్రయాణంలో ఎంతోమందిని కలుస్తూ ఉంటాం. వాళ్లలో కొంతమంది స్నేహితులు అవుతారు. కానీ, కొన్నిసార్లు వాళ్లకు దూరం కావాల్సి వస్తుంది. ముఖ్యంగా కళాశాల స్నేహాలు... మూడు నాలుగేళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన స్నేహితులు, చదువులు పూర్తయ్యాక ఎవరి గమ్యం వారు చూసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఆ మనసులు పడే బాధ వర్ణనాతీతం. ‘స్టూడెంట్‌నం.1’లో చంద్రబోస్‌ రాసిన ‘ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము.. చదువులమ్మ చెట్టునీడలో...’ పాట దానికి అద్దం పడుతుంది. మరోవైపు, ఎవరితో చెప్పుకోలేని విషయాలనూ స్నేహితులతో చెప్పుకుంటాం. అది బాధైనా సంతోషమైనా వాళ్లతోనే పంచుకుంటాం. ఇందులోంచి వచ్చిందే.. ‘పాదమెటు పోతున్నా పయనమెందాకైనా/ అడుగు తడబడుతున్నా తోడురానా/ చిన్ని ఎడబాటైనా కంటతడి పెడుతున్నా/ గుండె ప్రతి లయలోను నేను లేనా’ గీతం. ‘హ్యాపీడేస్‌’ చిత్రంలో వనమాలి రాసిన ఈ పాట మదిమదినీ తాకుతుంది. ‘ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నువ్వే/ తడికన్నులనే తుడిచిన నేస్తమా/ ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా..’ అంటూ సాగే ఈ గీతంలో ఓ మంచి స్నేహితుడుంటే ఎంత భరోసానో చెప్పారు రచయిత. ఇదే చిత్రంలో దారితప్పుతున్న స్నేహితుణ్ని సరైన మార్గంలో పెట్టేందుకు ప్రయత్నించే ఓ నేస్తం స్వచ్ఛమైన మనసు కనిపిస్తుంది. ‘వాడు సెల్ఫిష్‌రా’ అంటే ‘వాడూ మన ఫ్రెండే కదరా’ అనే టైసన్‌ మాటలు స్నేహబంధంలోని లోతును తడుముతాయి. 
ఒకరికి ఒకరు
ఏ బంధంలోనైనా కోపతాపాలనేవి సహజమే. అయితే స్నేహంలో కోపమొచ్చినా మనసులో స్నేహితుడి మీద ప్రేమ అలానే ఉంటుంది. అందుకే అన్నారు సిరివెన్నెల... ‘మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా/ రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా/ కోపమెక్కువే కానీ మనసు మక్కువ’ అని. ‘ఒక్క తల్లి సంతానమైన మనలాగ ఉండగలరా/ ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైన నమ్మగలరా..’ అంటూ ఈ ఒక్కపాటతోనే (‘స్నేహంకోసం’లో) స్నేహితులంటే ఎలా ఉండాలో వివరించారాయన.  
       ఒకసారి విడిపోయిన స్నేహితులు మళ్లీ కలుసుకునే ఆనంద క్షణాలు అపురూపమైనవి. వాటిని పాటలోకి అనువదించి అందించారు సినారె. ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే/ ఇన్నినాళ్లు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే/ ఇంకా తెలవారదేమీ ఈ చీకటి విడిపోదేమీ..’ అంటూ సందర్భానికి తగిన సాహిత్యాన్ని కూర్చారు. ‘మంచి మిత్రులు’లో శోభన్‌బాబు, కృష్ణ చాన్నాళ్లకు కలుసుకునే సందర్భంలో వచ్చే పాట ఇది. 
      స్నేహానికి ఆడ మగా తేడాలుండవు. స్వార్థం లేనిదైతే ఆ స్నేహం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. దీనికి అనుగుణంగా వచ్చిన సినిమాలే ‘ఇద్దరుమిత్రులు, వసంతం, ఓ మై ఫ్రెండ్‌’. గంధపు చెట్టు దగ్గర కాసేపు ఉంటేచాలు ఆ పరిమళం మనకు అంటుకుంటుంది. స్నేహం కూడా అంతే! మంచివారితో స్నేహం చేస్తే నలుగురిలో మనమూ గౌరవాన్ని పొందుతాం. ఆ తరహాలో చాలా సినిమాలు వచ్చాయి. ‘స్నేహమేరా జీవితం, ప్రాణ స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు’ వంటివి వాటికి మచ్చుతునకలు.
ఆ స్నేహం ఆనందగీతం
స్నేహితుడంటే కష్టంలో సైతం నేనున్నానన్న భరోసా ఇచ్చేవాడు. ‘నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా/ అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా’... ‘పెళ్లిపందిరి’ చిత్రంలోని ఈ పాటలో ఆ భరోసానే కనిపిస్తుంది. 
      జీవితంలో ఎంతోమంది స్నేహితులు అవుతారు. కానీ అందరూ ప్రాణస్నేహితులు కాలేరు. కొంతమంది స్నేహితులు కొద్దిరోజుల్లోనే విడిపోతారు. మరికొంతమంది కలకాలం తోడుంటారు. గర్వం, స్వార్థం లేని వ్యక్తుల స్నేహం జీవితాంతం కొనసాగుతుంది. ‘ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం/ ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం’ అంటూ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు వయసుపైబడ్డాక చిన్నప్పటి జ్ఞాపకాలను  నెమరువేసుకుంటూ పాడుకునే పాట స్నేహంలోని మాధుర్యాన్ని చవిచూపిస్తుంది. ‘అనుబంధం’ సినిమాలో ఆత్రేయ రాసిన ఈ పాట అందరి జీవితాల్లోని తీపి జ్ఞాపకాలనూ గుర్తుచేస్తుంది. 
      స్నేహం త్యాగాన్ని కోరుకుంటుంది. అందుకే ‘ప్రాణానికి ప్రాణం పోసే మంత్రంరా స్నేహం/ స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రంరా స్నేహం... దోస్త్‌మేరా దోస్త్‌’ అన్నారు. ‘పెళ్లిపందిరి’ సినిమాలో స్నేహం గొప్పదనాన్ని వివరించే సందర్భంలో వచ్చే ‘సిరివెన్నెల’ పాట ఇది. చిత్రాల్లోనే కాదు పురాణాల్లో కూడా స్నేహితుడి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని వారున్నారు. ఇందుకు కర్ణుడే ఉదాహరణ. ఇంకా కృష్ణుడు- కుచేలుడు, సుగ్రీవుడు- ఆంజనేయుడు కూడా స్నేహబంధంలోని గొప్పదనాన్ని చాటినవారే!. 
త్యాగానికి ప్రతిరూపం
నలుగురు మిత్రులు ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటుంటారు. కథానాయకుడు మిగతా ముగ్గురు మిత్రులను పైకి తీసుకురావడంకోసం శ్రమిస్తాడు. చివరికి వాళ్లు తన మిత్రుణ్ని ప్రపంచానికి గొప్పగా పరిచయం చేస్తారు. కథ మొత్తం స్నేహం మీదనే సాగుతూ, ఆ బంధం విలువను తెలిపే చిత్రం ‘నవవసంతం’. ‘స్నేహం అను నదిలోనా లోతుల్లో మునిగాము.. ఆ చోటే అమ్మానాన్న ప్రేమను చూశాము..’ అంటూ ఆ ముగ్గురు తమ స్నేహితుడి గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఈ మాటలు అనంత శ్రీరామ్‌వి. ‘ప్రతి ఒక్కరికీ లైఫ్‌లో ఫ్రెండ్స్‌ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మా లైఫే మా ఫ్రెండ్‌ వల్ల వచ్చింది’ అంటూ ఈ చిత్రంలో సునీల్‌ తన స్నేహితుడైన తరుణ్‌ను పొగిడే సన్నివేశం ప్రేక్షకుడి గుండెను తడుముతుంది. 
      ఇలాంటిదే మరో చిత్రం ‘స్నేహితుడు’. ‘మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు/ జనమందరిలో తను ఒకడేంకాడు/ మన గుండెల్లోనా ఉన్నవాడు/ కనుపాపలకెందుకు ఎదురై రాడు’ అంటూ ఈ చిత్రంకోసం ‘సిరివెన్నెల’ కలం నుంచి జాలువారిన పాట... చక్కటి భావాల మూట. 
       ‘మేం మంచి స్నేహితులం’ అని చెప్పుకోవడమే కాదు. అవసరమైనప్పుడు స్నేహితులను ఆదుకోవాలి. అండగా నిలవాలి. వాళ్లు ఏదైనా విషయంలో మథనపడుతుంటే, మంచి మాటలతో ఊరటనివ్వాలి. మనవంతుగా చేయగలిగినంత సాయం చేయాలి. అందుకే కష్టకాలంలోనే మిత్రుడెవరో తెలుస్తుంది అన్నారు బాపూజీ. ఇదే విషయాన్ని.. ‘కష్టమొచ్చినా నష్టమొచ్చినా మారిపోనిది ఫ్రెండ్‌ ఒక్కడే’ అని చెప్పారు భువనచంద్ర. ‘ప్రేమదేశం’లోని ‘ముస్తఫా... ముస్తఫా’ పాట మొత్తం స్నేహం చుట్టూనే తిరుగుతుంది. ‘దళపతి’ చిత్రం కోసం రాజశ్రీ రాసిన ‘సింగారాల పైరుల్లోనా..’ మరో ఆణిముత్యం. ఒకరికి ఒకరుగా బతికే ఇద్దరు స్నేహితుల హృదయాలను ఇది ఆవిష్కరిస్తుంది. ‘మనసే ఇచ్చి చెయ్యందించి తోడూ నీడై మిత్రుడు కలిసే/ అతనికంటే చుట్టాలెవరూ నాకే లేరంటా’ అంటూ నిజమైన స్నేహితుడి విలువేంటో చెబుతుంది. ఇలా ఎన్నో పాటలు... అన్నీ స్నేహ సుమగంధాలను పంచేవే. అక్షరాల్లో అనంత భావామృతాలను నింపుతూ... మైత్రిలోని మధురిమను హృద్యంగా ఆవిష్కరించిన ఈ కవులందరూ చిరస్మరణీయులే.


వెనక్కి ...

మీ అభిప్రాయం