శ్రీశైలం... ఘన చరితకు ఆలవాలం

  • 1588 Views
  • 104Likes
  • Like
  • Article Share

    డా।। దువ్వూరి భాస్కరరావు

  • విశ్రాంత ఉపకార్యదర్శి, ఏపీపీఎస్సీ
  • హైదరాబాదు
  • 9440051605
డా।। దువ్వూరి భాస్కరరావు

శ్రీ రమ్యంబుగా శ్రీ గిరియాత్రకు/ కూరిమి సతితో కూడి నడచితిని... పల్లెలు పురములు పట్టణంబులు/ పేటలు దాటితి అడవులు కొండలు అన్నీ దాటితి.... చూచితి నెవ్వరు చూడని లింగం/ చూచితి కేవల సుందర లింగం... అంటూ తెలుగువాళ్లు ఎక్కడికి సకుటుంబంగా తరలివెళ్లి ఏ పురాణ లింగాన్ని చూసి తరించిపోతారో అదే శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం. ఆధ్యాత్మిక కోణంలోనే కాదు, చారిత్రక ప్రాధాన్యంలోనూ శ్రీశైలానిది తరతరాల ఘనత. ఈ క్షేత్రాన్ని ఆ స్థాయిలో తీర్చిదిద్ది, తెలుగు జాతి వారసత్వ సంపదగా నిలబెట్టిన మహానుభావులెవరు?  తెలుగువాళ్లందరూ స్మరించుకోవాల్సిన చరిత్ర ఇది.
దక్షిణ
కైలాసమంటూ పాల్కురికి సోమనాథుడు చేతులెత్తి మొక్కాడు. శివరాత్రి మాహాత్మ్యాన్ని గానం చేసి శ్రీనాథుడు మురిసిపోయాడు. ‘శ్రీశైల వల్లభుని శిఖరంబు బొడగంటి’ అంటూ ఇంకెందరో కవులు తన్మయులయ్యారు. ఇక సామాన్యులైతే సరేసరి. ‘చేదుకో మల్లయ్య చేదుకొమ్మనుచు’ తరతరాలుగా శ్రీశైల యాత్ర చేస్తూనే ఉన్నారు. ఎప్పుడో క్రీ.శ.ఒకటో శతాబ్దం నాటికే నిర్మితమైన ఆలయం ఇప్పటికీ చెక్కుచెదరలేదంటే... మన పెద్దల నిర్మాణ నైపుణ్యానికి అది నిదర్శనం. దివ్యశిలలకు, దివ్యౌషధులకు ఆటపట్టు అయిన ఆ క్షేత్ర ప్రాధాన్యాన్ని గుర్తెరిగి, ఎప్పటికప్పుడు దానికి మెరుగులు దిద్ది, కాపాడిన నాటి ప్రభువుల చైతన్యం... వారసత్వ సంపదకు బూజుపట్టిస్తున్న నేటి పాలకులకు చెంపపెట్టు.
      శ్రీశైలాన్ని అప్పట్లో శ్రీపర్వతంగా పిలిచేవాళ్లు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకేచోట కొలువై ఉన్న పుణ్యక్షేత్రాల్లో ఒకటి కాశీ. మరొకటి శ్రీశైలం. ఈ ప్రాంతాన్ని ఎందరో రాజులు పాలించారు. రాళ్లను జీవం ఉట్టిపడే శిల్పాలుగా మార్చారు. ఆలయాన్ని నయనమనోహరంగా తీర్చిదిద్దారు. భక్తుల కోసం కొండలను కొట్టి రహదారులు నిర్మించారు. అడవులను నివాసయోగ్యాలుగా మలిచారు. పాలకులతోపాటు, ఆర్థిక స్తోమత గల వ్యక్తులూ ఇక్కడ సందర్శకుల కోసం ఎన్నో వసతులను ఏర్పాటు చేశారు. 
వయసు... రెండు వేల ఏళ్లు
క్రీ.శ. ఒకటో శతాబ్దం నాటికే శ్రీశైల క్షేత్రం నిర్మితమైంది. ప్రసిద్ధిలోకీ వచ్చింది. ఉత్తర మహారాష్ట్రలోని నాసిక్‌ గుహలలో చెక్కిన శిలాశాసనాలు దీనికి సాక్ష్యమిస్తున్నాయి. వీటిలో పేర్కొన్న ‘సిరిధాన్‌’(శ్రీస్థానం) అంటే శ్రీశైల/ నల్లమల అన్నది చరిత్రకారుల అభిప్రాయం. ఇక్కడే గౌతమ శాతకర్ణి ప్రసక్తి కూడా కనిపిస్తుంది.
      తెలుగునేలను శాతవాహనులు చాలాకాలం పరిపాలించారు. క్రీ.శ. మూడో శతాబ్దం ప్రారంభం వరకూ వీరి పాలన సాగింది. తర్వాత ఈ ప్రాంతంలో కొంత భాగాన్ని ఇక్ష్వాకులు ఏలారు. శ్రీశైలం వారి రాజ్యంలో అంతర్భాగమే. శ్రీశైలాభివృద్ధి కోసం వీళ్లు కొన్ని ప్రతిపాదనలు చేసుకున్నారు. తదనంతరం ‘వాసిష్ఠీ పుత్ర శ్రీఛాంతమూల’ ఈ ప్రాంతానికి రాజయ్యాడు. శివభక్తుడైన అతని ఏలుబడిలో శ్రీశైలం కొంత మేరకు అభివృద్ధి అయింది. అనంతరం పల్లవుల రాజ్యమొచ్చింది. త్రిలోచన పల్లవరాజు శ్రీశైల ప్రాంతంలోని అడవిలో కొంతభాగాన్ని కొట్టించి నివాస ప్రాంతాలను ఏర్పాటు చేశాడు. పల్లవుల నుంచి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న కరికాలచోళుడు నాలుగో శతాబ్దంలో శ్రీశైల ప్రాంతాభివృద్ధిని కొనసాగించాడు. ఆ తర్వాత శ్రీశైలం వాకాటకుల పాలనలోకి వచ్చింది. ఆ సమయంలో గోదావరి, కృష్ణా నదుల మధ్యభాగమంతా విష్ణుకుండినుల అధికారంలో ఉండేది. శ్రీపర్వతస్వామి అంటే శ్రీశైల మల్లికార్జునస్వామి పాద ధ్యాతలుగా తమను తాము అభివర్ణించుకున్నారీ విష్ణుకుండినులు. వాకాటకులతో వీళ్లు వియ్యమొందారు. ఫలితంగా ఈ రెండు రాజవంశాలూ శ్రీశైలాన్ని అభివృద్ధి చేశాయి.
ప్రతాపరుద్రుడి తులాభారం
ఆరు నుంచి పన్నెండో శతాబ్దాల మధ్య శ్రీశైలం అనేకమంది రాజులను చూసింది. 1162 నాటికి శ్రీశైలం కాకతీయ సామ్రాజ్యానికి దక్షిణ సరిహద్దు అయ్యింది. ఈ మధ్యలో కదంబరాజులు, తెలుగు చోళులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు... ఇలా ఎంతో మంది ఈ ప్రాంతాన్ని పాలించారు. వాళ్లలో కొందరు తమకు తోచిన రీతిలో ఆలయానికి నగిషీలద్దారు. 1313లో రుద్రమదేవి మనుమడు ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యాధిపతి అయ్యాడు. శ్రీశైలం అడవులను కొట్టించి నివాసయోగ్యంగా మార్చాడు. తర్వాత ఈ ప్రాంతాన్ని తన సామంతుడైన ‘పట్టసాహిణి’కి అప్పగించాడు. ప్రతాపరుద్రుడు, అతని భార్య శ్రీశైలంలో తులాభారాలు తూగినట్లు ఆధారాలు ఉన్నాయి. ప్రతాపరుద్రుడి స్థానిక పాలకుడు ‘వీడెము కొమ్మరాజు’. మల్లికార్జునుడి మధ్యాహ్న నివేదన కోసం కొంతభూమిని దానం చేశాడు. మరోవైపు, 1313లోనే ఆలయ ఆస్తులను ఈశ్వర శివాచార్యులనే వ్యక్తికి అప్పగించారు. వాటిని అతను కొంత కాలం సంరక్షించాడు. 
      కాకతీయ సామ్రాజ్య ప్రభ కొడిగట్టిన తర్వాత ప్రోలయ వేమారెడ్డి రాజ్యానికి వచ్చాడు. శ్రీశైల ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఆలయాభివృద్ధికి తన వంతు సాయం చేశాడు. పాతాళగంగకు మార్గం సుగమం చేశాడు. మల్లికార్జున దేవాలయ విమానానికి బంగారు శిఖరాలు ఏర్పాటు చేయించాడు. 1356లో భక్తిరాజనే తెలుగు చోళనాయకుడు శ్రీశైలానికి వచ్చి... విశ్వనాథుడు అనే శైవాచార్యుడికి ‘కడవకొలను’ గ్రామాన్ని దానమిచ్చాడు. 
      రెండో రెడ్డిరాజైన ‘అనపోతారెడ్డి’ కాలంలో అనపోత నాయకుడు, మాదానాయకులనే వెలమ నాయకులు గుంటూరు, కర్నూలు జిల్లాల మీద దండెత్తి గెలిచారు. అప్పుడే శ్రీశైలాన్ని దర్శించుకున్నారు. కొండ ఎక్కడానికి యాత్రికులు పడుతున్న బాధలను గమనించారు. తర్వాత శ్రీశైల కొండకు మెట్లు కట్టించారు. రెడ్డిరాజు ‘అనవేమారెడ్డి’... 1378లో శ్రీశైలానికి వచ్చాడు. మల్లికార్జునస్వామికి ‘వీరశిరో మండపం’ నిర్మించాడు. 
విజయనగర దాతృత్వం
రెండో హరిహరుడు శ్రీశైల మల్లికార్జునుడి భక్తుడు. ముఖమండపం కట్టించాడు. దక్షిణ గోపురం వైశాల్యం పెంచాడు. అతని భార్య విఠలాంబ పాతాళగంగకు మెట్లు కట్టించింది. విఠలేశ్వరుణ్ని ప్రతిష్ఠించింది. 1456లో సాళువ తిరుమలయ్య దేవాలయానికి కానుకలెన్నో సమర్పించాడు. 1457-58లో ప్రౌఢదేవరాయల పరిచారిక కూడా ఆలయానికి ఎన్నో దానాలు చేసింది. సాళువ వంశానికే చెందిన మహామండలేశ పర్వతయ్య 1468లో చాలా భూములు, తోటలు, కట్టడాలను శ్రీశైలస్వామి పరం చేశాడు. సాళువ పెద్ద మల్లప్పరాజు 1485లో ఓ చెరువు తవ్వించాడు. 
      శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ దేవాలయ ఖ్యాతి దిగంతాలకు వ్యాపించింది. రాయలు శ్రీశెలాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరిచాడు. ప్రధాన గోపురాన్ని నిర్మించాడు. గజపతులను జయించి వచ్చేటప్పుడు తన భార్యలతో (తిరుమలదేవి, చిన్నమదేవి) సహా స్వామిని దర్శించుకున్నాడు. ఈ కాలంలోనే ఓ మూఢుడు జైనులను చంపి బలిస్తుండేవాడు. అతని వల్ల శ్రీశైలంలో అశాంతి నెలకొంది. రాయలు తన అనుచరుడైన తిమ్మనాయుడును అక్కడికి పంపి... ఆ ఛాందసుడి పీచమణిచాడు. రాయల పరిచారకుడైన ‘పర్వతనాయకుడు’... 1513లో శ్రీశైల గర్భాలయానికి రాగిరేకును, ముఖమండపానికి బంగారు పూతను పూయించాడు. 1526లో మల్లప్ప అనే రాయల సేవకుడు స్వామికి ఎన్నో కానుకలు అందజేశాడు. 1529లో చంద్రశేఖరుడనే మంత్రి కల్యాణ మండపం, చిన్నగుడి కట్టించాడు. అతడే ‘చాగలమర్రి’ గ్రామాన్ని  నిర్మింపజేశాడు. ఆ కాలంలోనే బసవమాత, స్వామివారి శయ్యామందిరం ముందు భాగంలో మండపం కట్టించింది. అప్పుడే అక్కడ శ్రీకృష్ణ దేవరాయలు, తిమ్మరుసుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. దేవాలయ విమానం చుట్టూ కొంత భాగం బంగారు పూత పూయించారు. శాలకరాజు స్వామికి యజ్ఞశాలా మండపం కట్టించాడు. 1542-43లో తిరుమల రామరాజు ఎన్నో విలువైన కానుకలు సమర్పించాడు. 
సామాన్యులు సైతం
చోళమండల నివాసి ఒకరు 1456లో  బంగారు ధ్వజస్తంభం ప్రతిష్ఠించాడు. లింగయ్య అనే భక్తుడు గుడి చుట్టూ గల ప్రాకారంలో కొంతభాగం కట్టించాడు.  అప్పనయ్యంగార్‌ నందిస్తంభం నుంచి దుర్గాలయం వరకూ మెట్లు కట్టించాడు. 1505లో వీరప్పయ్య, లక్కమ్మ దంపతులు ముఖమండపం దక్షిణ ద్వారపు రాగిరేకుకు బంగారుపూత పూయించారు.  రాజమండ్రికి చెందిన వర్తకుడొకరు భైరవుడు, భృంగి విగ్రహాలను, బలిపీఠాలను సమర్పించాడు. ముఖమండప తూర్పు ద్వారానికి బంగారు పూత పూయించిన వ్యక్తి మల్లినాయకుడు. 
      1565 నుంచి శ్రీశైలానికి మెల్లమెల్లగా పాలనాపర చిక్కులు మొదలయ్యాయి. రాక్షస తంగడి యుద్ధంలో రామరాజు ఓటమి ప్రభావం శ్రీశైలం మీద పడింది. గోల్కొండ, బీజాపూర్‌ సుల్తానులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. 1618 ప్రాంతంలో అబ్దుల్‌ వహాబ్, అబ్దుల్‌ మహ్మద్‌ అనే వ్యక్తులు కర్నూలును చేజిక్కించుకున్నారు. శ్రీశైలంలోని వ్యక్తులకు దానంగా వచ్చిన గ్రామాలను తమ రాజ్యంలో కలుపుకున్నారు. ఫలితంగా దేవాలయంలో అన్ని కార్యక్రమాలు, ఉత్సవాలు ఆగిపోయాయి. మరోవైపు, శివరాత్రి సందర్భంగా శ్రీశైలం దర్శించే భక్తులపై పన్నులు విధించేవాళ్లు. 
కాపాడిన శివాజీ ఖడ్గం
అలా 1674 వరకూ శ్రీశైలం ఇబ్బందులకు గురైంది. ఆ ఏడాదిలో మరాఠా వీరుడు శివాజీ శ్రీశైలానికి వచ్చాడు. మల్లికార్జు నుడు, భ్రమరాంబలకు పూజలు చేశాడు. ప్రాకారం గోడకు ఉత్తరాన గోపురం నిర్మింపజేశాడు. శ్రీశైలం రక్షణ బాధ్యత స్వీకరించి, కొందరు మరాఠాÈ సైనికులను ఇక్కడే నియమించాడు. రోహిల్లాలు గుడిమీద దండెత్తినప్పుడు ఈ మరాఠా సైనికులు వాళ్లను ఎదిరించి నిలిచారు. శివాజీతో అనుబంధమున్న పుణ్యక్షేత్రం కాబట్టే మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అక్కమహాదేవి ప్రభావంతో కన్నడిగులూ శ్రీశైల మల్లన్న భక్తులయ్యారు. 
      కొంతకాలానికి కర్నూలు ఇబ్రహీం ఖాన్‌ పాలనలోకి వచ్చింది. అతను పరమత సహనశీలి. శ్రీశైల ధర్మకర్తల సంస్థలను పునరుద్ధరించాడు. గ్రామాలు, ఆస్తులను తిరిగి ఇచ్చివేశాడు. తర్వాత పరిణామాల్లో శ్రీశైలం హైదరాబాదు సుల్తాన్ల అధీనంలోకి వచ్చింది. 1782 ఏప్రిల్‌లో రెండో అసఫ్‌జా ... ఈ దేవాలయ పరిపాలనా భారాన్ని శ్రీశృంగేరీ జగద్గురువులకు అప్పగించాడు. కొద్దికాలం తర్వాత దత్తమండలాలు ఈస్ట్‌ ఇండియా కంపెనీ పరమయ్యాయి. దాంతో ఆంగ్లేయులు 1840లో దేవాలయ నిర్వహణను కడప జిల్లాలోని పుష్పగిరి పీఠాధిపతులకు ఇచ్చారు. 
చీకటి రోజులు
ఆనాటికి శ్రీశైల దేవస్థానానికి చెప్పుకోదగ్గ ఆస్తులేవీ మిగల్లేదు. ఫలితంగా శ్రీశైల దేవస్థాన అభివృద్ధి, పరిపాలన కుంటుపడింది. ఆరోజుల్లో శ్రీశైలం ఎలా ఉండేదో ఏనుగుల వీరాస్వామయ్య ‘కాశీయాత్ర చరిత్ర’లో కళ్లకు కట్టారు. ‘అక్కడ ముందు గుడికి చుట్టున్ను గొప్ప పట్టణ ముండెను. ఆ పట్టణ మంతయు ఇప్పుడు పాడుబడి పోయెను. ఇంటింటనున్న బావులు శిథిలములయినవి. గోడలుగూడ యిప్పుడు తెలియుచున్నవి. ఏండ్ల నాడు అనవేమారెడ్డికి భగవంతుని కటాక్షము చేత బంగారునుములు పండినవని వాడుక కలిగియున్నది. అతడు స్వామిగర్భగృహమునకున్ను, ముఖమంటప మునకున్ను, పయి నందులకున్ను, విమాన మునకున్ను, ధ్వజ స్తంభాలకున్ను బంగారు మొలాము చేసిన రాగి తగుళ్ళు కొట్టించి నాడు. అవి యిప్పుడు నిండా శిథిలములుగా నున్నవి. గుడిలోపల రెండో ప్రాకారము బొత్తిగా శిథిలమయి యున్నది. మంటప ములు ఆ రీతిగానే యున్నవి. అర్చకులకు మనసు వచ్చినప్పుడు దీపారాధన, నైవేద్య ములు స్వామికి చేయబడుచున్నవి. గాని నిత్యనియమము లేదు. భ్రమరాంబా దేవికి మాత్రము మిరాశీ అర్చకుల తరఫున నొకడు నియమముగా గుడిలో కాపుర ముండి అర్చన చేయుచున్నాడు’!!
మన రాజ్యంలో...
స్వాతంత్య్రం వచ్చాక దేవాలయ బాధ్యతను తాత్కాలికంగా జిల్లా న్యాయస్థానానికి అప్పగించారు. తర్వాత న్యాయవాది పాణ్యం రామయ్య అధ్యక్షతన ఓ బోర్డు ఏర్పాటు చేశారు. 1964 వరకూ ఈ బోర్డే ఆలయ బాధ్యతలను వహించింది. ఆ తరువాత దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆ బాధ్యతను స్వీకరించింది. ప్రస్తుతానికి ఉత్సవాలు, పూజలకు లోటులేదు. కానీ...!
దేన్నయినా నిర్మించడం కష్టం. సంవత్సరాలు పడుతుంది. అదే కూలదోయడం? క్షణాల్లో పని!! అదే పని చేశారు శ్రీశైల దేవస్థానాధికారులు కొందరు. 2013-14లో దేవాలయంలోని సాలుమండపం, పురాతన ప్రాకారంలో కొంతభాగం, ఉపాలయాలను కూలగొట్టించారు! శతాబ్దాల చరితకు సాక్ష్యాలుగా మిగిలిన వాటిని ధ్వంసం చేయడం ఎలాంటి నాగరికత?


వెనక్కి ...

మీ అభిప్రాయం