పల్లెకు పోదాం

  • 547 Views
  • 2Likes
  • Like
  • Article Share

పల్లె అనగానే పచ్చటి పొలాలు, పొలాలకు నీరందించే బావులు, కాలువలు, చెరువులు, పక్షుల కిలకిలలు, ఆవుల అంబారావాలు, దూడల గెంతులు, చిత్రకారుడు కాన్వాస్‌పై గీసిన కొండలపై అలా అలా ఉదయిస్తున్న లేదా కొండల కిందకు దిగుతున్న సూర్యుడు గుర్తొస్తాయి కదూ!
ఇంతేనా పల్లె అంటే ...?
‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్‌’ అన్నారు గురజాడ. పల్లె అంటే... 
      ఆరుగాలం చెమట చిందించి పంటలు పండించే రైతులు.
చుట్టూరా కళకళలాడుతున్న పైర్లతో పచ్చటి చీర కట్టుకొన్న సస్యలక్ష్మి. పెద్దమనుషులు నిష్పక్షపాతంగా తీర్పు చెప్పేందుకు కూర్చున్న రచ్చబండ. పిల్లలతో అ, ఆలు దిద్దించే వీధిబడి.
వివిధ చేతి వృత్తుల పనివాళ్ల కలబోతతో కూడిన సహకార వ్యవస్థ. అందరి కోసం ఒక్కరు ఒక్కరి కోసం అందరు అనుకొని ఆప్యాయంగా ఉండే జనం.
      ఇదీ భారతదేశపు పల్లె అంటే. తరతరాలుగా ఇదే వ్యవస్థ. 
      పల్లెలు భారతదేశానికి వెన్నెముకలు. మనదేశపు ఆత్మ. ఏ పల్లెకు ఆ పల్లె ప్రత్యేక దేశంగా మనుగడ సాగించిన ప్రత్యేకత మనది. పల్లెల సౌభాగ్యానికి ఆశ్చర్యపోయిన పరదేశీయులే వీటిని చిన్న స్వరాజ్యాలని పేర్కొన్నారు. గాంధీ మహాత్ముడు గ్రామ స్వరాజ్యం అన్నది ఈ విషయాన్నే. పల్లెలు స్వయం సమృద్ధిగా ఉండాలన్నది మహాత్ముడి కోరిక. 
ఆంగ్లేయుల పాలన...
అధికారాలన్నీ ప్రభుత్వం చేతిలో కేంద్రీకృతమయ్యాయి. రచ్చబండల స్థానంలో పంచాయతీలు, కోర్టులు, చట్టాలు వచ్చాయి. ఆధునిక విద్య రావడంతో సంప్రదాయ వీధిబడులు మాయమయ్యాయి. పరిశ్రమలలో తయారైన నాజూకు వస్తువుల వినియోగం పెరగడంతో చేతి వృత్తుల చేతులు విరిగిపోయాయి. డబ్బు ప్రాధాన్యత పెరగడంతో సహకారం, సత్యనిష్ఠ అన్నీ అంతరించి పల్లెల్లో కూడా పోటీ వాతావరణం అలుముకుంది. ఇంకేముంది, పల్లె పునాదులు కదలడం మొదలైంది. దాన్నే పద్యంలో హృద్యంగా మలచారు కర్షకకవి, కవికోకిల దువ్వూరి రామిరెడ్డి. ఈ పద్యం ‘కృషీవలుడు’ కావ్యంలోనిది. 
పంచాయతీ సభా భవనంబులౌ రచ్చ
        కొట్టంబులు లొకమూల గూలిపోయె
వీధిబడుల జెప్పు విజ్ఞానధుర్యులు
        నొజ్జలు దాస్యంబు నూతగొనిరి
గ్రామ పరిశ్రమ గలుగు నన్యోన్యమౌ
        సహకార వృత్తంబు సమసిపోయె
సత్యజీవనము, విశ్వాసమ్ము, భక్తియు
        నైకమత్యము మున్నె యంతరించె
బూటకములు, కుయుక్తులు, మోసగతులు,
కోర్టు వ్యాజ్యాలు, ఫోర్జరీల్, కూటమైత్రి,
స్వార్థపరత, మౌఢ్యంబు, గర్వ ప్రవృత్తి-
నేర్పు విద్యాలయంబులు నేటియూళ్లు

      ప్రతీ ఊళ్లోనూ ఆ ఊరి మధ్యలో ఎత్తుగా దట్టంగా పెరిగిన చెట్టు కింద వృత్తాకారంలో నిర్మించిన రచ్చకట్ట ఉండేది. గ్రామంలో ఏ ముఖ్య నిర్ణయం తీసుకోవాలన్నా సమావేశమయ్యేది అక్కడే. ప్రజలందరినీ చాటింపు వేయించి మరీ పిలిచేవారు. గ్రామ వ్యవహారాలపై అందరి మనోభావాలనూ తెలుసుకునేందుకు అది వేదిక. ఎక్కువ మంది ఆమోదిస్తేనే పనైనా, మరేదైనా మొదలుపెట్టేది. తగాదాలన్నీ తీర్చేది అక్కడే. కోర్టులూ, వ్యాజ్యాలూ, తారుమార్లు లేవు. ఈ వ్యవస్థ ఇప్పటిది కాదు... వేదాలనాటిది. అసలు ఇక్కణ్నుంచే ప్రజాస్వామ్య భావనలు మొదలయ్యాయేమో అన్నంత పాతది.
      చోళుల కాలంలోనైతే రహదారులు, వ్యవసాయం, చెరువులు, దేవాలయం బాధ్యతలు చూసుకునేందుకు వివిధ సంఘాలు ఉండేవని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇలా ఎన్నో ఏళ్లుగా ప్రజల గొంతు వినిపించింది రచ్చబండ. ఇప్పుడది ప్రచారార్భాటానికి పదబంధంగా మిగిలిపోయింది. పరిపాలనకు భవనాలు రావడంతో రహస్యాలు పెరిగిపోయాయి. రచ్చబండలు మాయమయ్యాయి. ఉన్నా ప్రాధాన్యత కోల్పోయాయి. దీనికి బీజాలు ఆంగ్లేయుల కాలంలో పడ్డాయి. ఇప్పుడైతే ఊళ్లో ప్రజలంతా సంఘీభావంతో సంఘటితంగా చేసుకోవాల్సిన చిన్నా పెద్దా ప్రతీ పనికీ ప్రభుత్వమే దిగి రావాలి. ఈ విషయాన్నే ‘రచ్చకొట్టంబులు ఒకమూల కూలిపోయె’ అంటున్నారు దువ్వూరి.
1950ల వరకూ పాఠశాలలు ఇప్పుడున్నన్ని లేవు. కనీస బతుకుతెరువుకు సరిపోయేంత విద్యకు మూలంగా వీధిబడి ఉండేది. వీధిబడిలో చదువుకొని అత్యున్నత స్థానాల్ని ఆక్రమించిన వాళ్లు మనదేశ చరిత్రలో చాలామందే ఉన్నారు. అదో వైభవోజ్జ్వల శకం. ఇప్పుడు చదువులో పల్లెలకూ, పట్నాలకు చాలా అంతరం. ఆధునిక విద్యావ్యవస్థ వీధిబళ్లను చాలా వరకూ మింగేసింది. అయితే దువ్వూరి రామిరెడ్డి కాలానికే ఇవి తగ్గుముఖం పట్టినట్లున్నాయి. అప్పట్లో వీధిబడి నడిపేవాళ్లు మంచి పండితులు. ఎన్నో విషయాల్లో వారికి ప్రవేశముండేది. అలాంటి వాళ్లు కొత్త వ్యవస్థలో (ఆంగ్ల ప్రభుత్వం) ప్రభుత్వానికి జీతగాళ్లయ్యారంటున్నారు. ఇప్పుడైతే వీధిబళ్లు ఎంత వెతికినా కనిపించవు. 
      గ్రామం అంటే కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చేనేత ఇలా చేతివృత్తులు, కుటీర పరిశ్రమలే గుర్తుకొస్తాయి. ఏ ఊరి సరకు ఆ ఊళ్లోనే సరిపోయేది. మిగిలితే సమీప గ్రామాలకు అంగడికి పోయేది. దాదాపుగా వస్తు మారకపు వ్యవస్థ ఉండేది. రైతులు కుండలు తీసుకున్నప్పుడు వారి సేవకు సరిపోయినంత ధాన్యాన్ని ఇచ్చేవారు. ఇలాగే ఇతర వృత్తులవారు కూడా. ఇలా పరస్పర సహకారంతో సంతృప్తిగా సాగిపోయేది గ్రామీణుల జీవితం. ఆంగ్లేయుల పాలనలో కుటీర పరిశ్రమలు కుదేలయ్యాయి. పారిశ్రామిక విప్లవం రావడంతో విదేశీ సరకులు దేశీయ అంగళ్లను ముంచెత్తాయి. అందుకే చేతివృత్తుల వారి సహకారం సమసిపోయిందన్న ప్రయోగం. స్వరాజ్యం సంపాదించుకున్నా మళ్లీ ఆనాటి వైభవం రాలేదు.  
      గ్రామాలు అంటే ఆధునికత అంతగా సోకని ప్రశాంతసీమలు. పల్లెజనం సత్యనిష్ఠ కలిగినవారు. విశ్వాసం ఎక్కువ. భక్తిపరులు. సాధారణంగా ఊళ్లో ఏదైనా వేడుక జరిగితే తలా ఓ చెయ్యి వేసి నిర్వహిస్తారు. ఐకమత్యంగా మెలగుతారు. ఊరి పెద్దలను, అతిథుల్ని గౌరవిస్తారు. ఎవరికైనా కష్టం వస్తే అంతా కలిసి ఆదుకుంటారు. కానీ, చాలా పల్లెల్లో ఈ లక్షణాలన్నీ కనుమరుగయ్యాయి. 
మరి వీటి స్థానంలో ఏమున్నాయంటే?
ఆధునిక రాజకీయ వ్యవస్థ గ్రామాల్లోనూ వేళ్లూనుకోవడం, డబ్బు ప్రాధాన్యత- వస్తు వ్యామోహం పెరగడంతో గ్రామీణ జీవితం కలుషితమైపోయింది. చక్కని ఏర్పాటుతో మంచి మనసున్న మనుషులతో ఉన్న గ్రామాల్లో ఇప్పుడు... ఎన్నికల్లో గెలిచేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడటం, ఎత్తులు పై ఎత్తులతో కూడిన కుయుక్తులు, మోసాలు సాధారణమైపోయాయి. చిన్నా చితకా వివాదాలకు, కొండొకచో పెద్ద వివాదాలకూ రచ్చబండ నిర్ణయమే చివరిదిగా ఉండేది ఒకప్పుడు. ఆంగ్లేయుల పాలనలో మనదేశంలో ప్రభుత్వం నిర్వహించే కోర్టులు ఏర్పాటు చేశారు. దాంతో కోర్టుల్లో కేసులు వేస్తున్నారు పల్లెజనం. కేసుల్లో గెలిచేందుకు దొంగసంతకాలు పెట్టేందుకూ వెనకాడటం లేదు. రాజకీయాల ప్రవేశం కావొచ్చు, ఇంకో కారణమేదైనా కావచ్చు ముఠాతత్వం ప్రబలిపోయింది పల్లెల్లో. మంచితనం స్థానాన్ని డబ్బు ఆక్రమించడంతో పల్లెలు స్వార్థచింతన, మూఢత్వం, గర్వం మొదలైనవాటికి విద్యాలయాలుగా మారాయి అని తన ఆవేదన వెళ్లగక్కారు దువ్వూరి రామిరెడ్డి. 
      ఇది ఓ డెబ్భై ఏళ్ల కిందటి పద్యమైనా ఇప్పటికీ సరిపోయేదే.


వెనక్కి ...

మీ అభిప్రాయం