పుస్తకాలే పంచప్రాణాలు

  • 245 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పావులూరి శ్రీనివాసరావు

  • గ్రంథాలయాధికారి
  • గుడివాడ
  • 9440492235
పావులూరి శ్రీనివాసరావు

పుస్తకాలే ప్రాణంగా... పుస్తకాలయాలే లోకంగా జీవించిన వ్యక్తి వెలగా వెంకటప్పయ్య. నాటి గ్రంథాలయోద్యమ నిర్మాతలకు సిసలైన వారసుడిగా ఆయన పడిన శ్రమ నిరపేక్షం. 
తెలుగునాట
గ్రంథాలయోద్యమం అనగానే అయ్యంకి వెంకట రమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, వావిలాల గోపాల కృష్ణయ్యలతోపాటు గుర్తొచ్చే మరోవ్యక్తి వెలగా వెంకటప్పయ్య. అరవై ఏళ్లపాటు గ్రంథాలయాలే సర్వస్వంగా జీవించిన ఆయన 1932లో తెనాలిలో జన్మించారు. 1956లో రేపల్లె శాఖా గ్రంథాలయంలో గ్రంథపాలకుడిగా వృత్తిజీవితం ప్రారంభించారు. గ్రంథాలయాధికారిగా ఉంటూనే... బాల సాహిత్యం మీద పరిశోధన చేసి డాక్టరేటు పొందారు. బాలల కోసం 50 పుస్తకాలు రాశారు. 200 గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. బాల సాహిత్యంలో ఆయన కృషిని మెచ్చి బాలల అకాడమీ ‘బాలబంధు’ పురస్కారంతో సత్కరించింది. ఆయన శ్రమకు గుర్తింపుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, మద్రాసు, దిల్లీ నగరాల తెలుగు అకాడమీల పురస్కారాలు లభించాయి. ‘పాతబంగారం’ పేరిట స్వీయసంపాదకత్వంలో వెలువడిన- తెలుగు శతక మంజరి, పొడుపు కథలు, సామెతలు, బాలల గేయాలు, తెలుగు జాతీయాలు వెలగా కృషికి గీటురాళ్లు. శంకరనారాయణ, సి.పి.బ్రౌన్‌ నిఘంటువుల పరిష్కారంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. పిల్లలకోసం మెగా పెద్దబాలశిక్షను రూపొందించారు. న్యాయపతి సుబ్బారావు, అయ్యంకి, కట్టమంచి, నార్ల, చక్రపాణి తదితరుల మీద వచ్చిన సంపూర్ణ గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. 1990లో పదవీ విరమణ చేశారు. ఈ పాతికేళ్లలో తెలుగు ఆంగ్లాల్లో రచనలు, సంపాదకత్వాలు, సంకలనాలు కలిపి 50వేలకుపైగా పుటలు ఆయన చేతులమీదుగా ప్రచురితమయ్యాయి.
గ్రంథాలయ ఉద్యోగిగా ఆ రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. గ్రంథాలయ, సమాచార విజ్ఞానంలో వివిధ విశ్వవిద్యాలయాలకు పాఠ్యగ్రంథాలు రచించారు. గ్రంథాలయ, సమాచార విజ్ఞానశాస్త్రం మీద విజ్ఞానకోశాల సంకలనం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయోద్యమ చరిత్ర, ప్రముఖ గ్రంథాలయాలు, గ్రంథాలయ సేవానిరతులు, తెలుగు ముద్రణ, ప్రచురణలపై సమగ్ర చారిత్రక గ్రంథాలు ప్రచురించారు. ఆయన ఉత్సాహాన్ని చూసిన గ్రంథాలయోద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య వెలగాను తన వారసుడుగా ప్రకటించారు. 
      భారత గ్రంథాలయ సంఘం విజ్ఞప్తి మేరకు ‘పౌర గ్రంథాలయ చట్టా’న్ని తయారు చేశారు వెలగా. ఎన్నో గ్రంథాలయ సదస్సులు నిర్వహించారు. మరెన్నో గ్రంథాలయాల నిర్మాణానికి చేయూత నందించారు. గుంటూరు ‘అన్నమయ్య గ్రంథాలయా’నికి ఏటా 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసేందుకు తితిదేని ఒప్పించడంలో కీలకపాత్ర పోషించారు. అంతేకాదు... ఈ గ్రంథాలయానికి 10వేల గ్రంథాలు, పత్రికా సంపుటాలను బహూకరించారు. గ్రంథాలయ రంగంలో సేవలందించిన వాళ్లను గౌరవించేందుకు జాతీయ స్థాయిలో ఆచార్య కౌలా ధర్మనిధిని 1973 నుంచి నిర్వహించడంతో పాటు, చక్రపాణి- కొలసాని ఫౌండేషన్, రేపల్లెలో పరుచూరు రామకృష్ణ కళాపీఠం, అయ్యంకి- వెలగా... తదితర ధర్మనిధుల ఏర్పాటుకు చేయూతనిచ్చారు. వేటపాలెం, సి.పి.బ్రౌన్, శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషానిలయం లాంటి ప్రసిద్ధ పొత్తపుగుడుల అభివృద్ధిలోనూ పాలుపంచుకున్నారు. ఏటా తన రెండు నెలల పెన్షనుతో రెండు పౌర గ్రంథాలయాలకు, సంక్షేమ కార్యక్రమాలకు సాయపడేవారు. అందుకే ఆయన ‘గ్రంథాలయ గాంధీ’ అయ్యారు.
      వెంకటప్పయ్య తెనాలిలో కాటన్‌ పేరిట అత్యాధునిక పౌర గ్రంథాలయ నిర్మాణాన్ని చేపట్టాలనుకున్నారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న తెనాలి ఆంధ్రరత్న గ్రంథాలయాన్ని పునరుద్ధరించడం, గ్రంథాలయ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేయడం లాంటి కలలు నెరవేరకుండానే 2014 డిసెంబరు 29న తనువు చాలించారు. విదేశాల్లో గ్రంథాలయాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యమే ఎక్కువ. ఆ భావన మన దగ్గరా రావాలని, దాన్ని ప్రేరేపించాలని, ప్రోదిచేయాలనీ అనుక్షణం తపించారాయన. తెలుగునేల మీద గ్రంథాలయాలు ఉన్నన్ని రోజులు వెలగా కూడా ఉంటారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం