రాధ... మాధవుడు... మధ్యలో ఇళ

  • 2313 Views
  • 12Likes
  • Like
  • Article Share

సావిరహే తవ దీనా రాధ... గొంతెత్తి పాడుతున్నాడు జయదేవుడు! రాధనురా... నీ రాధనురా... ఎంతో తెలిసిన వేదాంతులకే అంతు దొరకని గాథనురా... మధురానగరి మర్మమెరిగిన మాధవ నీకె సుబోధనురా... తన గొంతును రాధకు అరువిచ్చి ఆర్ద్రంగా ఆలపిస్తున్నారు పింగళి!! ఎవరు ఇలా పాడినా, రాధామాధవులంటే కవిలోకానికి వల్లమాలిన ప్రేమ. అందుకేనేమో, వందల ఏళ్లుగా వాళ్లు భారతీయ ప్రణయ జగత్తును నిరాటంకంగా ఏలుతున్నారు. ప్రేమమయమైన ఆ జంటపక్షుల స్వేచ్ఛా విహారాన్ని ముద్దుముద్దుగా వర్ణించిన కవయిత్రి ముద్దుపళని. తెలుగు సాహితీపటంపై ఆమె గడుసైన సంతకమే ‘రాధకాసాంత్వనము’. 
పిల్లనగోవిని
పట్టుకున్న నల్లనయ్య... అతడి ఎడమ భుజంపై తలపెట్టుకుని నిల్చున్న రాధమ్మ... ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే చిత్రం. కొత్త కాపురం పెడుతున్న చిలకాగోరింకలకు ఏదైనా బహుమతి ఇవ్వాలంటే మొదట గుర్తొచ్చే ప్రతిమా అదే. అందులోని రాధాకృష్ణుల కళ్లలో అంతుచిక్కని ఆనందం. ఆ మోముల్లో సంపూర్ణ ప్రశాంతత. ఆ తనువుల మధ్య అలౌకికమైన అవిచ్ఛిన్నత. ఎలా సాధ్యం? ఏమోగానీ, ప్రేమను ప్రేమించడంలో మాత్రం కన్నయ్యకెవరూ సాటిరారు! ఆ ప్రేమను పంచివ్వడంలో రాధకెవరితోనూ పోలిక లేదు! ఆమె ఇస్తుంది. ఆయన తీసుకుంటాడు. అంతకంతా తిరిగిస్తాడు. ఆమె గుండె నిండుగా స్వీకరిస్తుంది. ఆ చక్రం ఆగదు. దాని పరుగులు చూసి ముచ్చటపడి జయదేవుడు ‘గీతగోవిందం’ చెప్పాడు. ‘పచ్చకప్పురపు వాసనల తాంబూలపు మోవి రాధ మోవిపయి మోపి’ అంటూ ‘భీమఖండం’లో అల్లుకుపోయాడు శ్రీనాథుడు. ముద్దుపళని కూడా వాళ్ల బాటలోనే నడిచింది. కాకపోతే సరససల్లాపాల తాలింపు కాస్త ఘాటుగా పెట్టింది.  
      తెలుగులో శృంగార ప్రధాన కావ్యాల పరంపర శ్రీనాథుని ‘శృంగార నైషధం’తో ప్రారంభమవుతుంది. పినవీరభద్రుని ‘శృంగార శాకుంతలం’ నుంచి రాయల కాలపు ప్రబంధాలకు వచ్చేసరికి అదే ప్రధాన రసమైంది. అన్నమయ్య పాటల్లో, క్షేత్రయ్య పదాల్లోనూ ఆ రసం కనిపిస్తుంది. కానీ, అక్కడ అది మోక్షానికి దోవ చూపిస్తుంది. అయితే ఆ కావ్యకర్తలందరూ పురుషులు. అందుకే వాళ్ల సృజనలకు ‘హద్దులుండవు’. అయితే, మూడు వందల ఏళ్ల కిందట... అప్పటి పురుషాధిక్య సమాజంలో ఓ మహిళ శృంగార రస ప్రధానమైన రచనకు ఉపక్రమించడమే ఓ సాహసం. దృఢచిత్తంతో ఆ పనిని చేపట్టడమే కాదు, పామరులకు నచ్చేలా... పండితులు మెచ్చేలా కావ్య రచన చేయడం ఆ కవయిత్రి నైపుణ్యానికి నిదర్శనం. అలా ముద్దుపళని తనకంటూ సృష్టించుకున్న ఆనవాలు ‘రాధికాసాంత్వనము’. రాధాకృష్ణులే అందులో నాయికానాయకులు. 
      బ్రౌనుదొర అనుచరుడైన వెంకటనరుసు తొలిసారిగా 1887లో ఈ కావ్యాన్ని ప్రచురించాడు. కానీ, మూలప్రతిలోని ముఖ్యమైన భాగాలు, పద్యాలను ఉద్దేశపూర్వకంగా పరిహరించాడు. అయినా సరే, అప్పటి పెద్దలు కొందరు ఈ కావ్యాన్ని తీవ్రంగా విమర్శించారు. కందుకూరి వీరేశలింగం పంతులైతే దీనిని వారకవిత్వంగా లెక్కగట్టారు. ముద్దుపళనిని అసలు కవయిత్రిగానే పరిగణించలేదు. వెంకటనరుసు కావ్యంలో లోపాలు, ముద్దుపళనిపై కందుకూరి విమర్శల గురించి విన్న బెంగళూరు నాగరత్నమ్మ... పూర్తి కావ్యాన్ని వెలుగులోకి తేవడానికి దీక్షాబద్ధులయ్యారు. విస్తృత అధ్యయనం చేసి, అలనాటి రాతప్రతులతో సరి చూసి, తన ముందుమాటతో ‘రాధికా సాంత్వనము’ పూర్తి ప్రతిని తయారు చేశారు. వీరేశలింగం వాదనను ‘ముందుమాట’లో తిప్పికొడుతూ, ‘‘... ఆయనే తప్పులు సరిదిద్ది, ముద్రించిన ‘వైజయంతీ విలాసం’, స్వయంగా ఆయనే రాసిన ‘రసికజన మనోరంజనం’లో ఇంతకంటే పచ్చిబూతులు ఉన్నాయ’’న్నారు. 1910లో ‘వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్‌ సన్స్‌’ సంస్థ ఆ పుస్తకాన్ని ప్రచురించింది. అయితే, ఓ రెండు డజన్ల పద్యాల్లో వర్ణన హద్దులు మీరిందన్న కారణంతో 1911లో బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధించింది.
      స్వాతంత్య్రం వచ్చాక ఆ నిషేధాన్ని తొలగిస్తూ అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు చేసిన వ్యాఖ్య ‘రాధికాసాంత్వనము’ ప్రత్యేకతను పట్టి చూపుతుంది. ఇంతకూ ఆయనేమన్నారంటే... ‘జాతి నగలోంచి జారిపోయిన ముత్యాలను తిరిగి చేర్చగలిగాం’! మరోవైపు... తెలుగు కావ్యాలు ఇతర భాషల్లోకి- ముఖ్యంగా ఆంగ్లంలోకి అనువాదమవడం అరుదు. అలాంటిది రాధికాసాంత్వనం ‘appeasement of radhika’ పేరుతో ఆ భాషలోకి వెళ్లింది. సంధ్యా మూల్చందాని చేసిన ఈ అనువాద సృజనను ప్రముఖ ప్రచురణ సంస్థ ‘పెంగ్విన్‌’ ప్రచురించింది.
ఎవరీ ముద్దుపళని?
ఒక్కమాటలో చెప్పాలంటే దేవదాసి. కానీ, ఆమె ‘సాహిత్య విద్యా విశారద శారద’. అంతేనా ‘లలిత కళా విభవంబులు/ వల నొప్పగ మేటి ముద్దుపళని వధూటి’ అని చెప్పుకున్న విదుషీమణి. ఈ భూమ్మీద ఏ స్త్రీ తనలా కావ్యాలను అంకితం పొందిందో చెప్పండని ప్రశ్నించిన వ్యక్తి. రంగాజమ్మ, మధురవాణి, తరిగొండ వెంగమాంబ లాంటి కవయిత్రులు మెరసిన కాలం పదిహేడో శతాబ్దపు దక్షిణాంధ్ర సాహిత్యయుగం. ముద్దుపళని కూడా ఆ యుగపు మేలిమిరత్నమే. 
      ముద్దుపళని నాయనమ్మ తంజనాయకి. నాన్న ముత్యాలు. అమ్మ పోటిబోటి. సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం ‘పళని’ మీదుగా తమ బిడ్డకు ‘ముద్దుపళని’ అని పేరుపెట్టారు. 1739- 1763 మధ్యలో తంజావూరును ఏలిన మరాఠా రాజు ప్రతాపసింహుడు ప్రాజ్ఞుడు. కవి పండిత పోషకుడు, సంగీత కళాభిమాని. ముద్దుపళనిని ఆయన ఆదరించాడు. 
      చిన్ని కృష్ణుడు తన కలలో కనిపించి తనకు అంకితంగా ఓ కావ్యాన్ని రాయమని అడిగినట్లు ‘రాధికాసాంత్వనము’ అవతారికలో చెప్పుకుంది ముద్దుపళని. తన గురువు, తిరుమల తాతాచార్యుల శిష్యుడైన వీర రాఘవదేశికుడు, ఇతర పండితులకు తన స్వప్నాన్ని విన్నవించి, వాళ్ల అనుమతితో ‘రాధికాసాంత్వనము’ రచన ప్రారంభించింది. 584 పద్య గద్యాలతో ఉన్న నాలుగు ఆశ్వాసాల ఈ శృంగార కావ్యాన్ని శుక మహర్షి ముఖతా జనకునికి చెప్పించింది.
సొమ్ములీయ వచ్చు... 
ముద్దుపళని రాత మేరకు రాధ శ్రీకృష్ణుడి మేనత్త. తనంటే మాధవుడికి మహాప్రేమ. రాధకు అప్పటికే పెళ్లవుతుంది. కానీ, భర్త మాత్రం కనిపించడు. కొంటె కన్నయ్యతోనే రాధకు సరిపోతుంది. వాళ్లిద్దరి మధ్యలో వచ్చే ముగ్ధ ‘ఇళ’. యశోదమ్మ సోదరుడు కుంభకుని కూతురు. ఇళకు చిన్ననాటనే కృష్ణుడితో పెళ్లవుతుంది. విచిత్రం ఏంటంటే... ఆ ఇళ రాధ ‘సంరక్షణ’లోనే ఉంటుంది.   రాధాకృష్ణుల చేష్టలను గమనిస్తూనే ఉంటుంది. కానీ, తన అయిష్టతను బయటపెట్టదు. కాలం తరుముకు రావడంతో కృష్ణుడు భార్యతో కలిసి అత్తవారింటికి వెళ్తాడు. రాధ ఒంటరిదవుతుంది. సొమ్ములియ్యవచ్చు సమ్మందమియ్యవచ్చు... తనదు విభుని వేఱు తరుణి చేతికి నిచ్చి... ఇతరులకు ఏదైనా ఇవ్వొచ్చు... చివరికి ప్రాణాలు కూడా! కానీ ప్రాణప్రదమైన ప్రియుణ్ని మరో మహిళకు అప్పగించి తట్టుకోవడమెలా అని విరహంతో బాధపడుతుంటుంది. అప్పటి ఆమె మానసిక స్థితిని ఎంతో సున్నితంగా, కోమలంగా చిత్రించింది ముద్దుపళని. 
      ‘నిన్న మొన్నటి వరకు నాతోనే గడిపిన కృష్ణుడికి ఇప్పుడు ఆ ఇళ ఎక్కువైందా?’ అంటూ రాచిలుక దగ్గర గోడు వెళ్లబోసు కుంటుంది రాధ. ప్రాణేశుడి ఎడబాటును ఓర్వలేక చివరికి ఓ రోజు ‘నా కృష్ణదేవుని, నా ముద్దుసామిని, నా చక్కనయ్యను, నాదు హరిని, నా నోము పంటను, నా రాజతిల కుని...’ అంటూ తన ప్రాణానికి ప్రాణమైన మాధవుణ్ని వేగంగా రమ్మని చెప్పమంటూ ‘చిలుక రాయబారం’ పంపుతుంది. అంతేనా ‘ఆ జగన్మోహనుని మాయలో పడి మునులే ఈ లోకాన్ని మరచిపోయారు. ఇక మనమెంత! కృష్ణుడి మైకంలో పడి నువ్వు నా విషయాన్ని మరచిపోకు’ అని చిలుకకు సుద్దులు చెబుతుంది.
      అక్కడ ఇళ, ఇతర గోపికలతో సరసాలాడుతుంటాడు నల్లనయ్య. సరిగ్గా సమయం చూసుకుని తన మనసులోని కోరికను స్వామి ముందుంచుతుంది ఇళ. ‘రాధికామణిన్‌ దొరగు మటంచు’ (రాధను మర్చిపోమని) వేడుకుంటుంది. ఏ లోకంలో ఉన్నాడో ఏమో కానీ, కృష్ణుడు ‘సరే’ అంటాడు. ఈ సన్నివేశాన్నంతా చెట్టుపై నక్కిన ‘రాయబారి’ చిలుక చూస్తుంది. తానేదో రహస్యంగా వచ్చి కృష్ణుడి గుట్టును తెలుసుకున్నట్లు అనుకుంటూ... దాన్ని రాధ దగ్గర రట్టు చేయడానికి బయల్దేరుతుంది! 
      ఏడేడు లోకాలనూ తనలోనే ఇముడ్చుకున్న కృష్ణయ్య... ఆ చిన్న చిలుక రాకను తెలుసుకోలేడా! అది రావడం... పోవడం అంతా చూస్తాడు. మరోవైపు... ఇళకు మాటైతే ఇచ్చాడు కానీ, తన మనసులో మాత్రం రాధే ఉంది. ఇప్పుడు ఈ చిలుక వెళ్లి ఏం కొంప ముంచుతుందో అని ఉన్నపళంగా రాధ దగ్గరికి పయనమవుతాడు. కానీ, అప్పటికే చిలుక మాటలతో రాధకు కృష్ణుడి మీద కోపం నషాళానికి అంటుతుంది. ఎంత యత్నించినా మాధవుణ్ని దరికి రానీయదు.
మలకల మాటలిందు, బహుమానము లచ్చట, గచ్చులిచ్చటన్‌
దలపులు దానిపైని, బలు తప్పులు నాపయి, నేస్తమాడ; బే
రలుక మఱీడ, కూర్మి వగలక్కడ, నిక్కడ దక్కులద్దిరా!
తెలియగ వచ్చె నీ నడత తెల్లముగా విటలోక నాయకా!

      నా దగ్గరేమో వంకర మాటలు మాట్లాడ తావు, ఇళకేమో బహుమానాలిస్తావు! ఇక్కడ ఒట్టి బడాయిలకు పోతావు... ఆలోచనలన్నీ దానిమీదే ఉంటాయి! నాకేమో తప్పులు అంటగడితే, అక్కడ స్నేహం చేస్తావు! నీ అలకలు ఇక్కడ చూపిస్తూ... ఇళ దగ్గర వగలు పోతావు! ఇక్కడేమో హెచ్చు తగ్గులు చూపుతావు... కృష్ణా నీ ప్రవర్తనంతా నాకు స్పష్టంగా అర్థమైందంటూ నల్లనయ్యకు తలంటు పోస్తుంది రాధ. తనకు మాత్రమే సొంతమనుకున్న వాడు మరో స్త్రీని ఆరాధిస్తున్నట్లు తెలిసినప్పుడు సగటు మహిళ ఎలా స్పందిస్తుందో రాధా అలాగే చేసింది. కృష్ణుడు దక్షిణ నాయకుడు. అందుకే ఇక్కడ ‘విటలోక నాయకా’ అన్న ప్రయోగం. ఏమైతేనేం చివరికి కృష్ణుడు రాధను అనునయించి... తిరిగి ఆమె మనసును గెలుచుకోవడంతో కథ ముగుస్తుంది. ఇందులో మరో ప్రధాన పాత్ర ఇళ పేరుమీదుగా ఈ కావ్యం ‘ఇళాదేవీయం’గా ప్రసిద్ధి చెందింది. 
వెన్నెలకుప్పల్లో ఇళ
దక్షిణాంధ్ర యుగ సాహిత్యంలో కనిపించే అతివేల శృంగారం ఈ కావ్యంలో ప్రధానం. ఆ కాలపు భోగలాలసత, ఆచారాలు, రకరకాల పుష్పాలు, అలంకరణలు, గోవా నుంచి తెప్పించి పూతగా ఉపయోగించిన జవ్వాజి, గొజ్జంగి మొదలైన సుగంధాల వినియోగం నాటి సమాజంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇళాదేవి పరిచయంలో పేర్కొన్న దాగిలిమూతలు, గుజగుజరేకులు, వెన్నెలకుప్పలు, గుజ్జనగూళ్లు లాంటివి ఆనాటి అమ్మాయిల ఆటలు. ఇళ ఈడుకు వచ్చిన విషయాన్ని తెలిపేందుకు చుట్టపక్కాలకు శుభలేఖలు రాసి పంపడం, మంత్రతంత్రాల ప్రస్తావన, రాధ కృష్ణుడి కోసం వేచిచూస్తున్న సందర్భంలో చెలికత్తెలు దక్షిణపు గౌళి (దక్షిణం నుంచి బల్లి పలకడం) పలుకును ఉదాహరించడం, ఇళను ఆమె తండ్రి కుంభకుడు ఇంటికి తీసుకెళ్లడం లాంటివి ఆనాటి తెలుగు ఆచార వ్యవహారాలు, నమ్మకాలను కళ్లకు కడతాయి.
చక్కటి పాండిత్యం
ప్రబంధాల పోకడలో ఉన్నా... తేట తెలుగులో, సులభంగా అర్థమయ్యే శైలిలో సాగుతుంది ‘రాధికాసాంత్వనము’. ఇక కావ్యమంతటా కనిపించే సామెతలు, పలుకుబళ్లయితే లెక్కేలేవు. మనిషి కాటుకు మందులేదు; కొన్న అంగడి లోపలే మారుబేరంపెట్టడం; గట్టు చేరాక పుట్టివానికి బొమ్మగట్టడం; మగవారి చనవు చెడ్డది సుమ్మి; బాగా విందుపెట్టి పగను మీదికి తెచ్చుకోవడం; ఇనుముతో ఉన్నందుకు అగ్నికీ దెబ్బలు తగలడం లాంటివి కోకొల్లలు. ఎల్లవారికి శకునంబు లెల్ల బలికి/ బల్లి తాబోయి తొట్టిలో బడిన రీతి/ నొకరి నననేల? మోసపోతికననేల?/ వెనుక జింతించు టెల్లను వెఱ్ఱితనము... పద్యమంతా సామెతలతో సాగుతుంది. 
రమ్మా! మరువపు రెమ్మా!/ గుమ్మా వెలలేని సొమ్మ! గొజ్జగి తెమ్మా! గమ్మాను కొన్న సంపగి/ కొమ్మా! దయచేసి మనవి కొమ్మా కొమ్మా!... అంటూ కృష్ణుడు రాధను వేడుకునే సందర్భం, తమ్ములు శౌరి శ్రీపా/ దమ్ములు మోదమ్ములొదవు దమ్ముల నెల్లన్‌...; విష కంధరు నెచ్చెలివై/ విషకుచ చనుబాలు... లాంటి పద్యాల్లో పోతన శైలి కనిపిస్తుంది. సీస పద్యాలు శ్రీనాథుణ్ని స్మరణకు తెస్తాయి. పద్యాల్లో అందగించిన సంగీతం రామరాజ భూషణుడిని గుర్తు చేస్తుంది. ముక్తపదగ్రస్తంలో సాగే... కావిగాదది విడి కెంపు దీవిగాని/ దీవిగాదది యమృతంపు బావిగాని/ బావి గాదది కపురంపు దావిగాని/ తావిగాదది శౌరి కెమ్మోవిగాని లాంటి పద్యాలు పళని ఛందో పరిజ్ఞానానికి నిదర్శనాలు. కారుబారు (అధికారం), జులుము, బేజుమాల్‌ (పదును తగ్గించడం) లాంటి అన్యదేశ్యాలు, సంగ్యాలు (రాయలసీమ వ్యావహారికం), పగడకన్ను (ఎరుపెక్కిన కళ్లు), గలిబిలి చేయడం లాంటి పదాలూ కనిపిస్తాయి. మామూలుగా అయితే కన్నీరు కాల్వలైంది అంటాం. కానీ తంజావూరు నివాసి అయిన ముద్దుపళని, కన్నీటిని ఆ పట్నంగుండా ప్రవహించే కావేరి నీటితో పోల్చుతుంది. ‘కావేటి కాల్వలై కడుబాఱు కన్నీరు’ అంటుంది. మరోమాట ... బహుభాషా కోవిదురాలైన ముద్దుపళని ఆండాళ్‌ తిరుప్పావైను తెలుగులోకి తెచ్చింది. 
అలతి అలతి పదాలు, సామెతలు, పలుకుబడులతో మృదు మధుర వర్ణనలతో సాగే ఈ కావ్యంలోని ‘అశ్లీలత’ పరిహరించ దగిందే. ‘ఆంధ్ర కవయిత్రులు’లో ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ఈ కావ్యం గురించి చెబుతూ ... ‘వర్ణనలు, హాస్యం విశిష్టంగా ఉన్నా, కేవలం బాహ్యంగా వర్ణించిన శృంగార వర్ణనలు వెగటుగా ఉన్నాయి. అది ఆనాటి కాలస్వభావం అనుకోవాలి’ అంటారు. మొత్తమ్మీద ఈ కావ్యంపై ఎన్ని విమర్శలైనా ఉండవచ్చు. కానీ, ‘నీ కృతిని సత్కవులు లెక్కలోకి తీసుకుంటారా’ అని తనను తాను ప్రశ్నించుకుని ‘భళి! కయికొంద రెట్లనిన’ అంటూ ‘పద్మాలలోని మకరందాన్ని ఆస్వాదించిన తుమ్మెదలు, ఇతర పుష్పాలలోని తేనెను తాగవా? అంటే తాగుతాయ’న్న ముద్దుపళని మాటల్లో నిజముంది. ఎందుకంటే, ఆమె రచనలో అంత మాధుర్యం ఉంది!


వెనక్కి ...

మీ అభిప్రాయం