ప్రేమ పక్షులు... ప్రణయరాయబారులు

  • 580 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిముషమూ నేను
..
      తన గుండెల్లో నిదురించే చెలి తలపుల జడివానలో తడిసి ముద్దయ్యే ప్రేమికుడి మనసుకు సాంత్వన కలగాలంటే... ప్రియురాలి ముచ్చట్లు తెలియాలి. గుండెను గొంతుకలోకి తెచ్చుకుని ఆమె చెప్పే కబుర్లు ఇతగాడి చెవినపడాలి. ఇప్పుడంటే సెల్‌ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రేమికులు కబుర్లాడేసు కుంటున్నారు. మరి పూర్వం ప్రేమపక్షులు ఎలా కువకువలాడేవి? ‘పక్షుల’ సాయంతోనే! పావురాలా, హంసలా, చిలుకలా అన్నది పక్కన పెడితే, మొత్తానికి ప్రేమికుల మధ్య పక్షి రాయబారాలు నడిపారు మన కవులు. పక్షులే ఎందుకనుకున్నారో ఇంకొంతమంది కవనాగ్రేసరులైతే మేఘుణ్ని, చందమామనూ ప్రణయ రాయబారులుగా మార్చేశారు. ఇక రుక్మిణీ కృష్ణుల మధ్య రాయబారాన్ని నెరపిన అగ్నిద్యోతనుడు సుపరిచితుడే. ‘ఘనుడా భూసురుడేగెనో...’ అని అనుకోనివారుంటారా?
      ప్రేమికులు ఎదురెదురుగా ఉన్నప్పుడు ఎంతగా ప్రేమను పంచుకుంటారో దూరంగా ఉన్నప్పుడు అంతకన్నా ఎక్కువ విరహాన్ని అనుభవిస్తారు. వీళ్ల అనుభూతుల్ని కాళిదాసు, నన్నయ, పింగళిసూరన, పోతన, దీపాల, పుట్టపర్తి వంటి కవులు కావ్యాలుగానూ రూపొందించారు. 
ఓహో మేఘమాల...
కాళిదాసు ‘మేఘదూతం’ దూత కావ్యాల్లో మొదటిది. కుబేరుడి సేవకుడైన ఓ యక్షుడు విధి నిర్వహణలో ఏమరుపాటు వల్ల తప్పిదం చేస్తాడు. కోపించిన కుబేరుడు ఆ యక్షుణ్ని సంవత్సరంపాటు అడవుల్లో నివసించమని శపిస్తాడు. చిత్రకూట పర్వతం, రామగిరి కొండల మీద శిక్షాకాలం గడుపుతున్న సమయంలో ఆషాఢమాసం మొదటి రోజు ఆ కొండను ఆవరించిన ఒక మేఘాన్ని తన సమాచారాన్ని అలకాపురిలో ఉన్న ప్రియురాలికి తెలియజేయమంటాడు. యక్షుడి సందేశాన్ని ప్రియురాలి చెవినవేసి మేఘం వెనుదిరుగుతుంది. విషయం తెలుసుకున్న కుబేరుడూ యక్షుడికి శాప విమోచనం చేస్తాడు. దీనిని తెలుగులో దీపాల పిచ్చయ్యశాస్త్రి అనుసృజన చేశారు. ఇందులో ఒకపరి యాతడట్టెయెదియో తలపోయుచు గూరుచుండు, నింకొకతఱి గన్నులార్పకెదియో తిలకించుచు నట్టె నిల్చునంటూ విరహపీడితుడైన యక్షుని మానసిక స్థితికి అక్షరరూపం ఇచ్చారు. అంతేకాదు, ఉరువయి పేర్చు నుమ్మలిక నుబ్బిన కన్నులు, వేడియూర్పు తీవరమున విన్న నైన నును వాతెఱ యొప్పగ గేల వ్రాలి అంటూ పతిని ఎడబాసిన యక్షపడతి ఆవేదననూ తెలిపారు. మేఘదూతాన్ని ‘మెయిలు రాయబారము’ పేరిట ‘యక్షగానం’ చేశారు త్రిపురాన వేంకటసూర్యప్రసాదరాయకవి.
 ఒక సామాన్యుని జీవిత చిత్రాన్ని ‘మేఘదూతం’ పేరుతో రాశారు పుట్టపర్తి నారాయణాచార్యులు. ఈ కావ్య నాయకుడు ఏ తప్పూ చేయకపోయినా ప్రభుత్వం జైలుశిక్ష విధిస్తుంది. చెరసాలలో ఉన్న అతను గర్భవతిగా ఉన్న తన భార్యను పరిపరి విధాల తలచుకుంటాడు. తన పరిస్థితిని ఆమెకు మేఘం ద్వారా తెలియజేయడమే ఈ కావ్య ఇతివృత్తం. మేఘానికి దారిచూపుతూ చెప్పిన విషయాల్లో నాటి సామాజిక స్థితిని వెల్లడించారు పుట్టపర్తి. ప్రేయసీప్రియులమధ్య దౌత్యం నెరపిన మేఘలావికలు తెలుగు సాహిత్యంలో సుస్థిరమయ్యాయి.
హైలో హైలెస్సా హంస కదా...
ఆంధ్రమహాభారతంలో నలదమయంతుల ప్రణయానికి హంస రాయబారం నడుపుతుంది. రాజా! నువ్వు విదర్భ రాకుమారి దమయంతిని ప్రేమిస్తున్నావు, నీ ప్రేమసందేశాన్ని నేనామెకు తెలుపుతానని’ అంటుంది. తరువాత నలుడి రాయబారిగా దమయంతి అంతఃపురానికి చేరుకుంటుంది. ఆ సమయంలో చెలికత్తెలతో ఉన్న దమయంతి హంసను చూసి పట్టుకోవటానికి ప్రయత్నిస్తుంది. వాళ్ల చేతికి చిక్కిన హంస తను నలుడు పంపగా వచ్చిన ప్రేమ రాయబారినని అంటుంది. నలుడి వైభవాన్నీ, ఉన్నతినీ వివరించి, అతనికి నువ్వు తగినదానివని తెలుపుతుంది. అప్పటికే చెలికత్తెలు నలుడి గురించి చెప్పటంతో దమయంతి నలుడిపై ప్రేమను మరింత పెంచుకుంటుంది. ఇలాంటిదే శ్రీనాథుడి ‘శృంగార నైషధం’లోనూ ఉంది. ఇందులో రాయబారం సందర్భంలో హంస దమయంతితో ఎంతో గడుసుదనాన్ని ప్రదర్శిస్తుంది. 
అడిగితి నొక్కనాడు కమలాసను తేరికి వారువంబనై
నడచుచు నుర్విలో నిషధ నాథునికెవ్వతె యొక్కొ భార్యయ
య్యెడునని, చక్రఘోషమున నించుక యించుక  గాని యంత యే
ర్పడ విననైతి నీవనుచు పల్కిన చందము దోచె మానినీ

నలుడి దూతగా దమయంతి దగ్గరికి వెళ్లిన హంస... ఆమెకు నలుడి మీద ఇష్టాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది. దమయంతితో ‘‘నేను ఓ రోజు బ్రహ్మదేవుడికి వాహనంగా ఉండి... భూమిమీద నిషధ దేశపు రాజు నలుడికి భార్యగా అయ్యే అవకాశం ఎవరికి కలుగుతుంది అని అడిగాను. దానికి ఆయన ఏదో సమాధానం చెప్పాడు. రథచక్రాల చప్పుళ్ల మధ్య అంతగా వినపడలేదు గానీ, నువ్వే అని చెప్పినట్లు గుర్తు’’ అంటుంది. తెలుగు నైషధానికి మూలమైన హర్షుడి ‘నైషధ చరితం’లో బ్రహ్మదేవుడి రథాన్ని ఈ హంసతోపాటు ఇంకా కొన్ని హంసలు నడుపుతున్నాయనీ, వాటి అరుపుల వల్ల వినలేకపోయినట్లు ఉంటుంది. ఇది ఔచిత్యవంతంగా లేదని భావించిన కవిసార్వభౌముడు, ఒకే హంసను ఉంచి, రథచక్ర ఘోషవల్ల 
వినలేకపోయానని చెప్పించాడు.
      వర్ణనలకు పెట్టింది పేరైన ప్రబంధాల్లో కవులు పక్షులకూ ప్రాధాన్యాన్ని కల్పించారు. ‘శుచిముఖి’ అనే హంసను ప్రేమికులకు రాయబారిగా చేసి పింగళిసూరన నడిపిన కథ ఆ కోవలోదే. ఇది ‘ప్రభావతీ ప్రద్యుమ్నం’లోది. బ్రహ్మకు రథసారథి సారంధరుడనే హంస. అతని కుమార్తె అయిన ‘శుచిముఖి’ ప్రభావతీ ప్రద్యుమ్నుల ప్రేమకావ్యానికి సారథి. శ్రీకృష్ణుని కుమారుడు ప్రద్యుమ్నుడు. వజ్రనాభుడనే రాక్షసుని కుమార్తె ప్రభావతి. తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి వజ్రసదృశమైన నగరాన్ని వరంగా పొందుతాడు వజ్రనాభుడు. ఆ నగరంలోకి ఆయన అనుమతిలేకుండా గాలికూడా చొరబడదు. వరగర్వంతో వజ్రనాభుడు దేవతలను బాధిస్తుంటాడు. వాడి బారినుంచి రక్షించమని దేవతలు శ్రీకృష్ణుణ్ని మొరపెట్టుకుంటారు. సమయం ఆసన్నం కానిదే ఏమీచేయలేమంటాడు కృష్ణుడు. వజ్రనగరంలోకి ప్రవేశించి వజ్రనాభుని కదలికలను ఎవరైనా కనిపెడితే బాగుంటుందనుకుంటాడు ఇంద్రుడు. ఆ సమయంలో ఆకాశమార్గాన వెళుతున్న హంసల్ని పిలిచి మీలో ఎవరికైనా వజ్రనాభుని గురించి తెలుసా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శుచిముఖి  వజ్రనాభుని కుమార్తె ప్రభావతి, కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుణ్ని ప్రేమిస్తున్న సంగతి చెబుతుంది. అది విని ఇంద్రుడు వాళ్లిద్దరి మధ్య ప్రణయ రాయబారం నడపమని శుచిముఖిని కోరతాడు. ఆ తరువాత వజ్రనాభుని సంహరించి ప్రద్యుమ్నుడు ప్రభావతిని చేపడతాడు. 
ప్రేమ సందేశాన్ని పంచి జీవితాన్ని సార్థకం చేసుకుంది ఓ చకోరం (మగపక్షి). అదే మోటూరి వెంకటరావు ‘చకోర సందేశం’ కావ్యం. ఇందులో యక్షుడు మేఘునితో సందేశం పంపకముందే యక్షవనిత చకోరంతో యక్షునికి సందేశం పంపాలనుకుంటుంది. తన విరహబాధనంతా వెల్లడిస్తుంది. ఇంతలో మేఘగర్జన వినిపిస్తుంది. అందులో యక్షకాంతకు తన భర్త గొంతువినిపిస్తుంది. మేఘం యక్షుని సమాచారాన్ని వినిపించి కరిగిపోతుంది. యక్షకాంత విరహాన్ని తెలపటానికి చకోరం బయలుదేరుతుంది. ‘కీరసందేశం’లో రుక్మిణీ కృష్ణుల ప్రణయానికి చిలుకను దూతగా చేశారు సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి. 
గాలీ చిరుగాలీ...
తెలుగు కవుల కల్పనా చాతుర్యం అనన్యం. ప్రసిద్ధ పౌరాణిక పాత్రలకు కవన శక్తిని జోడించి రాసిందే ‘సమీర సందేశం’. ఇందులో ప్రణయ సందేశానికి దూత పవనుడు. విశ్వామిత్రుని తపోభంగం చేయమని రంభను ఆజ్ఞాపిస్తాడు దేవేంద్రుడు. దాని నిమిత్తం రంభ వెళ్లిపోయిన సమయంలో నలకూబరుడికి రంభకు సమీరం ప్రేమ రాయబారాన్ని నడుపుతుంది. దీనిని రాసింది సోమంచి వాసుదేవరావు. 
మామా చందమామ...
చంద్రుణ్ని దూతగా చేసి ప్రియురాలిని ప్రసన్నం చేసుకొనే కావ్యం విశ్వనాథ రాసిన ‘శశిదూతం’. వైశాఖమాసం, ఓ వెన్నెల రాత్రి ప్రేయసీ ప్రియలు ఏకశయ్యాగతులై సరస సల్లాపాల్లో తేలియాడతారు. కొంతసేపటికి ప్రియురాలు కోపగిస్తుంది. భర్తకు దూరం జరుగుతుంది. ఆ విరహాన్ని తాళలేక వెన్నెల రేడుతో దౌత్యాన్ని చేయమని వేడుకుంటాడు ప్రియుడు. చంద్ర రాయబారం ఫలిస్తుంది. చంద్రవదన ప్రియుని కౌగిలికి చేరుతుంది. ఇదీ కావ్య ఇతివృత్తం.
      ప్రేమ రెండక్షరాల పదమైనా పవిత్రత అనంతం. అది అనుభవైకవేద్యం. అనంతంగా సాగుతున్న కాలప్రవాహంలో ప్రేమ నిత్యం, సత్యం, దైవం. ప్రేమ ఔన్నత్యాన్ని నిలిపే బాధ్యత ప్రేమికులదే. 


వెనక్కి ...

మీ అభిప్రాయం