ఎక్కడ ఉన్నా... ‘తెలుగు’ వాళ్లమే!

  • 782 Views
  • 0Likes
  • Like
  • Article Share

తెలుగు నేలకు సుదూరంగా... దాదాపు తొమ్మిది వేల కిలోమీటర్ల దూరంలో... ఓ ‘తెలుగు మల్లి’ విరిసింది. ఆ ‘మల్లి’కి మొదట పందిరేసిన వ్యక్తి... మల్లికేశ్వరరావు కొంచాడ. 
ఆస్ట్రేలియాలోని మనవారికి ‘తెలుగు మల్లి’ వెబ్‌సైట్‌ ద్వారా అక్షర వారధి నిర్మించారు కొంచాడ. అక్కడ తెలుగుకు ప్రభుత్వ ‘అధికారిక’ గుర్తింపు తేవడానికి కొందరు తెలుగు స్నేహితులతో కలసి శ్రమిస్తున్నారు. ఆస్ట్రేలియా లోని తెలుగు నవతరానికి అమ్మభాషను చేరువ చేసేందుకు పలు కార్యక్రమాలనూ నిర్వహిస్తున్నారు. అక్కడి మనవారికి కావలసిన మద్దతు గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ యంత్రాంగాలతో మాట్లాడేందుకు ఆమధ్య ఆయన హైదరాబాదుకు వచ్చారు. ఆ సమయంలో ‘రామోజీ ఫౌండేషన్‌’ కార్యాలయాన్నీ సందర్శించారు. ఆ సందర్భంగా తన అనుభవాలను, తల్లి వేరు తెగిపోకుండా కాచుకునేందుకు ఆస్ట్రేలియా తెలుగు వారు పడుతున్న తపనను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే...
శ్రీకాకుళం
జిల్లా పాతపట్నం మండలం తిడ్డిమి మా ఊరు. అక్కణ్నుంచి కిలోమీటరు వెళ్తే పర్లాకిమిడి... అంటే ఒడిశా! పదో తరగతి వరకూ స్థానికంగా తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నా. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల తర్వాత డిప్లొమోలో చేరా. దాంట్లోంచి ఇంజినీరింగ్‌లోకి వచ్చి సివిల్‌ ఇంజినీరయ్యా. హైదరాబాద్‌లో పదిహేనేళ్లున్నా. అప్పట్లో సాహితీ కార్యక్రమాలకు వెళ్లే వాణ్ని కానీ, రాసే అలవాటు లేదు.
      1996లో న్యూజిలాండ్‌ వెళ్లా. ఆ సమయంలో ఆ దేశానికి విపరీతమైన వలసల తాకిడి. ఉద్యోగాలు ఎక్కువగా దొరికేవి కావు. దాంతో ఐటీ రంగంలోకి మారా. అందులో కుదురుకుని, ఉద్యోగం సాధించడానికి రెండున్నరేళ్లు పట్టింది. ఆ సంధియుగంలోనే భాషాసాహిత్యాలకు చాలా దగ్గరయ్యా. అప్పుడే చిన్న చిన్న కవితలు రాయడం మొదలెట్టా. స్నేహితుల దగ్గర వాటిని చదివి వినిపిస్తే, బాగున్నాయంటూ ప్రోత్సహించేవాళ్లు. మరోమాట... అప్పట్లో మూడేళ్ల పాటు తెలుగు బడి నడిపా. 2001లో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టా. ఈ పదమూడేళ్ల ప్రయాణంలో మర్చిపోలేని మజిలీలెన్నో!
ఎన్నో సంస్కృతులు
బహుళ సంస్కృతుల సంగమ వేదిక ఆస్ట్రేలియా. అమెరికా మాదిరిగా ఇదీ ఓ వలసరాజ్యం. ప్రపంచంలోని అన్ని దేశాలవాళ్లూ ఇక్కడ ఉంటారు. స్థానిక రాజ్యాంగ పరిమితులకు లోబడి ఏ జాతి వారైనా సరే, తమ భాషాసంస్కృతులను ప్రచారం చేసుకోవచ్చు. అభివృద్ధి పరచుకోవచ్చు. వీటిని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఒక సంఘంలా ఏర్పడి కార్యక్రమాలు నిర్వహించుకుంటామంటే ధనసాయమూ చేస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికలను ఉచితంగా ఇస్తారు. మరోవైపు... ఇక్కడ ఉండేవాళ్లలో చైనీయుల తర్వాత భారతీయులే ఎక్కువ. అందులోనూ పంజాబీలు, గుజరాతీలతో పాటు తెలుగువాళ్లే అధికం. 
      మా విషయానికొచ్చేసరికి, స్నేహితులే తోబుట్టువులు. స్నేహితులే చుట్టాలు. పుట్టినగడ్డకు దూరంగా ఉన్నాం కాబట్టి, ప్రవాసాంధ్రులందరూ కలిసిమెలిసే ఉంటాం. ఎక్కడ ఉన్నా... ‘తెలుగువారి’గా ఉండాలన్న తపన ఎక్కువ అందరిలో. ఆస్ట్రేలియా మొత్తమ్మీద దాదాపు లక్ష మంది వరకూ తెలుగువాళ్లం ఉన్నాం. సిడ్నీలో యాభై వేల మంది, మెల్‌బోర్న్‌లో ముప్ఫై వేల మంది ఉంటున్నారు. బ్రిస్బేన్, కాన్‌బెర్రా, పెర్త్‌ తదితర నగరాల్లోనూ మనవాళ్లున్నారు. మా నివాసం మెల్‌బోర్న్‌లో. ఇరవై ఏళ్ల కిందట ఈ నగరంలో ఓ డజను తెలుగు కుటుంబాలే ఉండేవి. 96 తర్వాత ఎక్కువ మంది వచ్చారు. 
      తెలిసినంతలో ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ మొదటి తెలుగు వ్యక్తి దూర్వాసుల మూర్తి గారు. యాభై ఏళ్ల కిందట వచ్చారాయన. మొదటిసారిగా 92లో మెల్‌బోర్న్‌ తెలుగు సంఘం ఏర్పాటైంది. 93లో సిడ్నీ సంఘం ప్రారంభమైంది. నగరానికొక తెలుగు సంఘం ఇక్కడి ప్రత్యేకత. ఈ సంఘాలన్నీ తెలుగు సాంస్కృతిక రాయబారులే. మెల్‌బోర్న్‌ సంఘం తరఫున నిర్వహించే కార్యక్రమాలకు మిగిలిన భాషల వాళ్లనూ పిలుస్తుంటాం. సాంస్కృతిక వారసత్వ సంపదల వివరాలను ఇచ్చిపుచ్చుకుంటాం. 
స్రవంతితో మొదలు
న్యూజిలాండ్‌ నుంచి ఇక్కడికి వచ్చే సమయానికి... నాకు కవిత్వం చదవాలి, రాయాలి అన్న తపన పెరిగింది. భారత్‌కు వచ్చినప్పుడు వీలైనన్ని పుస్తకాలు పట్టుకెళ్లి చదివేవాణ్ని. మెల్లగా సాహితీ కార్యక్రమాలు ప్రారంభించా. మెల్‌బోర్న్‌ తెలుగు సంఘం న్యూస్‌లెటర్‌ ‘స్రవంతి’. 2006-07 నుంచి దాని ప్రచురణ బాధ్యతను తీసుకున్నా. అంతవరకూ దాంట్లో సంఘం కార్యక్రమాల వివరాలు, అదీ రెండు పుటలు మాత్రమే వచ్చేవి. దాన్ని చిన్నస్థాయి సాహితీ, సమాచార పత్రికగా తేవాలన్న ఉద్దేశంతో వ్యాసాలు రాయడం ప్రారంభించా. నా శ్రీమతి గ్రాఫిక్‌ డిజైనర్‌. నేను రాయడం... ఆవిడ బొమ్మలతో అందంగా తీర్చిదిద్దడం... ఇలా నలభై పేజీలను తయారు చేసేవాళ్లం. ప్రతి రెండు నెలలకు ఓసారి పీడీఎఫ్‌ ప్రతి రూపంలో దాన్ని తెలుగు సంఘం సభ్యులందరికీ పంపేవాళ్లం. అప్పట్లో కంప్యూటర్లో తెలుగుకు ఒక్క ఖతి మాత్రమే ఉండేది. దాంతోనే పని చేసేవాళ్లం. 
      నెమ్మదిగా బయటి నుంచి ‘విషయం’ అందడం మొదలైంది. రాసేవాళ్లు పెరిగారు. అన్నట్టు మా దగ్గర మంచి కవులున్నారు.  కథకులకూ లోటు లేదు. వాళ్లందరినీ బృందంగా తయారు చేసి అయిదేళ్ల పాటు ‘స్రవంతి’ని ఠంచనుగా తెచ్చాం. క్రమంగా దాని మీద సంఘానికి ఆదాయమూ (ప్రకటనల రూపంలో) ప్రారంభమైంది. దీన్ని అచ్చు పత్రికగా తెస్తే బాగుంటుందని సంఘం బాధ్యులకు సూచించాను. కారణాంతరాల వల్ల కుదరలేదు. దాంతో ‘ప్రవాసభారతి’ పత్రికను సొంతంగా ప్రారంభించాం. కొన్నేళ్ల పాటు దాన్ని దిగ్విజయంగా నిర్వహించాం. ప్రచురణ ఖర్చులు పెరగడంతో అంతర్జాలంలోకి వచ్చాం. ‘తెలుగు మల్లి’ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశాం. పూర్వకవులు, తెలుగు భాషా చరిత్రపై చాలా వ్యాసాలు రాశాం. సాహిత్యాంశాలతో పాటు తెలుగు సంఘాల కార్యక్రమాల విశేషాలనూ పొందు పరుస్తున్నాం. ఆస్ట్రేలియా తెలుగు వాళ్లందరికీ ఓ మాధ్యమం ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ వెబ్‌సైట్‌ను నడుపుతున్నాం. 
ఆనాటి పరిచయాలే...
‘తెలుగు మల్లి’కి సమాంతరంగా ‘భువన విజయం’ అనే సాహితీ సాంస్కృతిక వేదికను నిర్వహిస్తున్నాం. పదిహేను మంది ఇందులో క్రియాశీల సభ్యులు. అందరూ ‘స్రవంతి’ సమయంలో పరిచయమయ్యారు. అప్పట్లో అందరం ప్రతి నెలా కలిసేవాళ్లం. తెలుగు గురించి మాట్లాడుకునేవాళ్లం. కవిత... కథ... ఎవరు ఏది చెప్పగలిగితే అది చెప్పేవాళ్లు. ‘భువన విజయం’ సభ్యుల్లో పద్య కవులూ ఉన్నారు. అలా కలిసి మాట్లాడుకునే క్రమంలో పురుడుపోసుకున్న సృజనలన్నీ కలిపి 2010లో ‘కవితాస్త్రాలయ’ సంకలనం తెచ్చాం. ఆస్ట్రేలియా తెలుగువాళ్ల చరిత్రలో ప్రచురితమైన మొదటి పుస్తకమిది. మెల్‌బోర్న్‌లో ఉండే వాళ్లమే దీన్ని ప్రచురించాం. యండమూరి వీరేంద్రనాథ్‌ ఆవిష్కరించారు. ఆగస్టు, 2014లో ‘కవితాస్త్రాలయ’ రెండో సంకలనం ప్రచురించాం. ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో ఉంటున్న వారి రచనలతో వచ్చిన ఈ 320 పుటల పొత్తాన్ని ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ఆవిష్కరించారు. అప్పుడే ఓ సాహిత్య వేదిక ఏర్పాటు చేశాం. జానపద కళలు, భాషాంశాలపైనే ఈ సదస్సును నిర్వహించాం. నన్నయ నుంచి సినారె వరకూ వెయ్యేళ్ల తెలుగు సాహిత్య చరిత్రలో ముఖ్యఘట్టాలతో రూపకాన్ని ప్రదర్శించాం. మా సంకలనాల స్ఫూర్తితో కొందరు వ్యక్తిగతంగానూ పుస్తకాలు వేస్తున్నారు. 
      ఇక్కడి కవులు, కథకుల రచనా వస్తువులు విభిన్నంగా ఉంటాయి. తెలుగు నేలకు సంబంధించిన అంశాలతో పాటు ఆస్ట్రేలియా సంస్కృతి, సమాజం, జీవన విధానంపైనా రచనలు వస్తుంటాయి. ఆస్ట్రేలియా పల్లె జీవితంపై శారద గారు ఓ కథ రాశారు. కొత్తగా ఇక్కడికి వచ్చిన జంటకు ఎదురయ్యే అనుభవాల నేపథ్యంలో నేనూ ఓ కథ రాశా. ఎవరికి వాళ్లు ఎంపిక చేసుకునే ‘వస్తువు’లతో పాటు కొన్నిసార్లు మా సమావేశాల్లో (ఇప్పటికీ నెలకోసారి కలుస్తాం) కొన్ని అంశాలను ఇస్తుంటాం. వాటి మీద రచనలు చేయాలని కోరతాం. అలా కూడా సృజనాత్మక రచనలు ప్రాణం పోసుకుంటున్నాయి. 
పిల్లల్లోనూ ఆ తపన
మొన్నామధ్య ఓ సమావేశంలో మా తెలుగు యువత ఓ పది నిమిషాల స్కిట్‌ను ప్రదర్శించారు. అందరూ 18 - 22 ఏళ్లలోపు వాళ్లు. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్న వాళ్లు. స్క్రిప్ట్‌ సొంతంగా రాసుకుని... సంభాషణలతో సహా... ప్రదర్శించారు.  తెలుగు నేర్చుకోవడానికి వాళ్లు పడుతున్న తపన ఎలాంటిది, ‘నేర్చుకోవడానికి’ ఎలాంటి వాతావరణం ఉండాలి, పిల్లలకు భాష రావాలంటే ఎవరి బాధ్యత ఎంత అన్న విషయాలపై వేశారు. ఈ పిల్లలందరూ ‘యువత’ అనే బృందంగా ఏర్పాటయ్యారు. ‘భువన విజయం’తో కలిసి నడుస్తూ తెలుగుపై పట్టు పెంచుకుంటున్నారు. 
      వాస్తవానికి విదేశీ తెలుగు పిల్లలు రెండు భిన్న సంస్కృతుల మధ్య నలిగిపోతుంటారు. రోజులో ఏడెనిమిది గంటలు గడిపే పాఠశాలల్లో అంతా ఆంగ్లమే. ఇంట్లోకి వచ్చాక తెలుగు. తల్లిదండ్రులు తెలుగులో మాట్లాడితే తెలుగులోనే సమాధానమివ్వడానికి ప్రయత్నిస్తారు. కానీ, అటు ఆంగ్లం, ఇటు తెలుగు మధ్య నలిగిపోయి తెలుగును నిర్లక్ష్యం చేస్తారు. తల్లిదండ్రులు పట్టుదలగా ఉన్న సందర్భాల్లో పిల్లలూ చక్కటి తెలుగును నేర్చుకుంటున్నారు. శ్రావ్యంగా పాటలూ పాడుతున్నారు. మా అబ్బాయికి ఇరవై రెండేళ్లు. తెలుగు చక్కగా చదవడం వచ్చు. మరికొందరికి నేర్పాడు. ప్రస్తుతం స్వచ్ఛంద తెలుగు బడి నిర్వహిస్తున్నాడు.
ఆ గుర్తింపు వస్తే...
ఇక్కడ చైనీస్‌ పిల్లలు కలిస్తే చైనీస్‌లో మాట్లాడుకుంటారు. వారాంతాల్లో చైనీస్‌ పాఠశాలలకు వెళ్తారు. వాళ్ల భాషను నేర్చుకుంటారు. మనకు ఆ సదుపాయాలు లేవు. వ్యక్తిగత ప్రయత్నాలున్నాయి కానీ, వ్యవస్థీకృతంగా బడులు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలో ప్రారంభిస్తాం. 
      హిందీ, పంజాబీ, తమిళం తదితరాలు ఆస్ట్రేలియా ‘సమూహ భాషలు’ (కమ్యూనిటీ లాంగ్వేజి)గా గుర్తింపు పొందాయి. దాని వల్ల స్థానిక పాఠశాలల్లో ఆ భాషలు బోధనాంశాలయ్యాయి. సంబంధిత భాషా బోధనకు ప్రభుత్వమే సాయం చేస్తోంది. మరోవైపు, ఆ భాషీయులెవరైనా ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకుంటే అయిదు ఉచిత పాయింట్లు కలుస్తాయి. అలాగే, పాఠశాలల్లో భాషా బోధన జరుగుతుంది కాబట్టి ఉపాధ్యాయులుగా ఉద్యోగావకాశాలూ ఉంటాయి. అందుకే, గత సంవత్సరం కాన్‌బెర్రా తెలుగు సంఘం అధ్యక్షులు కృష్ణతో కలిసి ఓ విజ్ఞాపనపత్రం తయారు చేశాం. తెలుగు భాషా చరిత్ర, ఔన్నత్యాలను వివరిస్తూ... తెలుగును కూడా ‘సమూహ భాష’గా గుర్తించాలని కోరాం అందులో. దాన్ని అన్ని తెలుగు సంఘాలకూ పంపి... స్థానిక ఎంపీల సంతకాలను సేకరించాం. తర్వాత ఆ విజ్ఞాపనను ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి అందజేశాం. ‘తెలుగును సమూహ భాషగా గుర్తించబోతున్నట్లు’ కొద్దిరోజుల కిందటే సూత్రప్రాయమైన సమాచారం వచ్చింది. రెండు మూడు నెలల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తే... ఆస్ట్రేలియా బడుల్లో తెలుగూ బోధనాంశం అవుతుంది. ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నాం. 
అంతా తెలుగులోనే...
ఆ మధ్య పెద్దబాలశిక్ష నాలుగు వేల ప్రతులు తీసుకెళ్లి ఇక్కడ పంచిపెట్టాం. ఆస్ట్రేలియా, న్యూజిలాండుల్లో ఒక్కో నగరంలో మూడేసి నాలుగేసి పాఠశాలల్లోని చిన్నారులకు అందించాం. అయితే... పెద్దవాళ్లూ పెద్దబాలశిక్ష ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. వాళ్లు నేర్చుకుని చిన్నవాళ్లకు చెబితే దాని ప్రయోజనం అర్థమవుతుంది. సాధారణంగా ఇక్కడ ఓ మంచి కార్యక్రమాన్ని తొంభై శాతం మంది అనుసరిస్తారు. అయిదు శాతం మంది ముందుకు వచ్చి సాయం చేస్తారు. సాహిత్యంపై అభిమానం ఉన్న వాళ్లు... భాషపై మమకారం ఉన్న వాళ్లు పది మంది వచ్చి ప్రోత్సహించినా చాలు... మేం ముందుకెళ్లిపోతుంటాం.
      తెలుగు సంఘాల కార్యక్రమాల్లో వీలైనంత వరకూ అందరూ తెలుగులోనే మాట్లాడతారు. ఎందుకంటే... తెలుగు సభా కార్యక్రమాల్లో ఆంగ్లంలో మాట్లాడితే పిల్లలకు తప్పుడు సందేశం వెళ్తుంది కదా. అయినా మన భాషలో ఒక అర్థానికి ఉన్న పదాన్ని వదిలేసి... వేరే భాషా పదం వాడాల్సిన అవసరమేంటి? దానివల్ల భాషకు నష్టమే జరుగుతుంది. కాలానుగుణంగా కొత్త పదాలను తయారు చేసుకుంటూ ఉండాలి. 
      ఆస్ట్రేలియా ప్రజల్లో చదువరులు ఎక్కువ. రైల్లో వెళ్తుంటే... ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చదువుతూ ఉంటారు. అక్కడ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకూ ఇదమిత్థమైన పాఠ్యప్రణాళిక అంటూ ఏదీ ఉండదు. మనలాగా ‘పుస్తకాల సెట్టు’లుండవు. ప్రతి బడీ వ్యక్తిగతమైన పాఠ్యప్రణాళిక తయారు చేసుకుంటుంది. దానికి అనుగుణంగా పిల్లలే గ్రంథాల యాలకు వెళ్లి పుస్తకాలు తెచ్చుకుంటారు. అలా చదవడం బాగా అబ్బుతుంది.  చదవడమే కాదు... చదివిన వాటిపై స్పందిస్తారు. సమీక్షలు రాస్తారు. పత్రికలకు, బ్లాగులకు పంపిస్తారు. పుస్తకం చదివిన తర్వాత తమకు నచ్చిన, నచ్చని విషయా లను పదిమందితో పంచుకుంటారు. తెలుగు నేల మీద కూడా అలాంటి అందమైన వాతావరణం ఏర్పడాలన్నదే మా ఆశ. (కొంచాడ:raokonchada@hotmail.com)


వెనక్కి ...

మీ అభిప్రాయం