‘మందహెచ్చుల’ మణిపూస

  • 225 Views
  • 0Likes
  • Like
  • Article Share

తుది శ్వాస వరకు జీవితాన్ని మందహెచ్చుల కళకు అంకితం చేసిన అరుదైన జానపద కళాకారుడు కడెం సమ్మయ్య. స్వస్థలం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా నారాయణపూర్‌ గ్రామం. పదకొండో ఏటనే కాలికి గజ్జకట్టి వారసత్వంగా వస్తున్న మందహెచ్చుల కళలోకి అడుగుపెట్టారు. అంకితభావం, ఉత్తమ ప్రతిభాపాటవాలతో దేశ వ్యాప్తంగా మందహెచ్చుల కళలో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్నారు. యాదవుల ఆశ్రిత కులమైన మందహెచ్చులు... నకాశీ కళాకారులు రూపొందించిన అరవై చెక్క బొమ్మలను ఉపయోగించి కాటమరాజు కథ చెబుతారు. కథకు అనుగుణంగా చక్కని హావభావాలతో.. సామెతలు విసురుతూ, హాస్యపు జల్లు కురిపిస్తూ ఆద్యంతం ఉత్తేజభరితంగా కథను చెప్పడంలో సమ్మయ్య నేర్పరి. ఆయన కథా గానం, దరువులు విభిన్నంగా ఉండేవి. కాటమరాజు కథల్లోని కలియంల రాజు, బొల్లావు కథల్లో యుద్ధ ఘట్టాలను సమ్మయ్య వీరరసం ఉట్టిపడేలా చెబుతుంటే ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యేవారు. దేశవ్యాప్తంగా మూడు వేలకు పైగా ప్రదర్శనలిచ్చిన సమయ్య.. దూరదర్శన్, ఆకాశవాణిలో కూడా కాటమరాజు కథ వినిపించారు. మందహెచ్చుల కళలో వందల సంఖ్యలో శిష్యులను తీర్చిదిద్దారు. తన ఇద్దరు కుమారులను కూడా ఇందులోకే తెచ్చారు. సమ్మయ్య ప్రతిభను గుర్తించి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2015లో ప్రతిభా పురస్కారంతో సత్కరించింది. 45 ఏళ్లకు పైగా మందహెచ్చుల కళకు అంకితమైన సమ్మయ్య ఈ మేలో ఆ కళను ప్రదర్శిస్తూనే నేలకొరిగిపోయారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం