తరిగొండ నృసింహ దయాపయోనిధీ!

  • 896 Views
  • 9Likes
  • Like
  • Article Share

    డా।। జంధ్యాల కనకదుర్గ

  • విశ్రాంత ప్రధానాచార్యులు,
  • గుంటూరు.
  • 9491140299
డా।। జంధ్యాల కనకదుర్గ

సామాజిక కట్టుబాట్లను ఛేదించుకుని, తిరుమలలో కొలువైన వేయినామాల వాణ్ని మనసునిండా నింపుకుని భక్తిరసాత్మక, నిగూఢ వేదాంత రచనలు సాగించిన విదుషీమణి తరిగొండ వెంగమాంబ. తనకు ఆ పాండిత్యం అలవడటానికి కారణం తరిగొండ నారసింహుడే అని చెప్పుకుందామె. ఆ దైవానికి భక్తిపూర్వకంగా ఆమె సమర్పించిన 103 వృత్త పద్య పుష్పమాలిక ‘తరిగొండ నృసింహ శతకం’. పేరుకు వేదాంత ప్రధాన రచనే అయినా మానవ జీవితాల్లోని అంధకారాన్ని తొలగించుకునే మార్గాలను ఇందులో తెలియజేసింది వెంగమాంబ.  
తరిగొండ
వెంగమాంబ 1817 వరకు లేదా 1840లలో జీవించిందనే అభిప్రాయాలున్నాయి. మొత్తం మీద పందొమ్మిదో శతాబ్దానికి చెందిన మొదటి మహిళా శతకకర్తగా ఈమెను భావించవచ్చు. చిత్తూరు జిల్లాలోని తరిగొండ గ్రామంలో మంగమాంబ, కృష్ణయామాత్య దంపతులకు వెంగమాంబ జన్మించింది. నృసింహ శతకం ఈమె మొదటి రచన. భాగవతకథ ఆధారంగా నృసింహవిలాసం, బాలకృష్ణ నాటకం, విష్ణుపారిజాతం లాంటి యక్షగానాలు, రాజయోగామృతసారం కావ్యం, ద్విపదలో భాగవతం రచించింది. ‘తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!’ అనే మకుటంతో రాసిన నృసింహ శతకంలోని తన కవిత్వాన్ని వికల్ప కవిత్వమన్న వారికి నచ్చచెప్పి, తన గురుతుగా ధరిత్రి మీద దాన్ని నిల్పమని తరిగొండ నృసింహ స్వామిని వేడుకొందామె. ఇందులో మొదటి 60 పద్యాలలో తాత్విక, ఆత్మబోధక విషయాలు, మిగిలిన 42 పద్యాల్లో లౌకిక అంశాలను వివరించింది.
      ‘‘వేదాంత తత్త్వజ్ఞురాలు తరిగొండ వెంగమాంబ తరిగొండ నృసింహ శతకమంతయు వేదాంతమే’’ అంటూ ఈ శతకాన్ని ప్రశంసించారు నిడుదవోలు వెంకటరావు. శరీరంలోని ఆత్మ శక్తి ఆవిష్కారమైన రాజయోగాన్ని, కుండలినీ విద్యల ద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని, స్థితప్రజ్ఞతను పొందే విధానాన్ని నృసింహ శతకం ద్వారా సామాన్యులకు స్పష్టపరచాలనుకుంది వెంగమాంబ. ఐహిక సుఖాల కోసం తాపత్రయపడుతూ, కోరికల కడలిలో కొట్టుమిట్టాడే మనుషులకు మోక్షం ఎప్పటికీ దక్కదని స్పష్టం చేసింది. ‘స్వాతి వానల కోసం ముత్యపుచిప్పలు, చంద్రుడి కోసం కలువలు, సూర్యుడి కోసం పద్మాల మాదిరిగా, హరి కోసం నా హృదయాంబుజం ఎదురుచూస్తోందనీ, ముక్తిని ప్రసాదించడానికి హరి రావటంలేదు ఎందుకని’ ఆర్తిగా ప్రశ్నించింది. శరీరంలో ఉన్నది కండలు, పేగులు, అస్థికలు, చీము, నెత్తురు, మలమూత్రాలతో ఉన్న కడుపు అని తెలిస్తే శరీర సుఖాలు కోరుకోరంటూ హితబోధ చేసిందీ శతకంలో. అలాగే వేడుక కోసం ఈరోజు అలంకరించుకున్న దేహం మర్నాటికి కాలుణ్ని చేరుతుందని తెలుసుకుంటే అలంకారాలకు ఉన్న విలువ ఏపాటిదో అర్థమవుతుందని అంది. జీవికి దేహకాంక్ష ఉన్నంతవరకు వివేకం కలగదని తేల్చి చెప్పింది. అడవిలో తపస్సు చేయటం కన్నా అష్టమదాలను అణచి ఆత్మను దర్శిస్తే భవాబ్దిని దాటగలరని వెల్లడించింది. ‘‘పుట్టుచు గిట్టుచున్‌ మఱియు బోధ శరీరునిఁ గాన నేరకున్‌/ వట్టి దురాశలన్‌ దగిలి వారిజగంధుల మీది ప్రేమచే/ నెట్టన కాపురంబులును నిక్కమటంచును నమ్మి యాత్మలో/ గుట్టుఁ గనంగలేరు...’’ అంటూ దురాశలు, సంసార మోహంలోపడి అవే నిజమని నమ్మి ఆత్మ గుట్టును తెలుసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇవన్నీ సాధ్యం కావాలంటే గురుబోధ అవసరమని, గురువు సత్త్వరజస్తమో గుణాలను పేని, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలను బిగించి, కోరికలని అణచివేసే శక్తిని అందిస్తాడని పేర్కొంది. గురువు వల్ల రాజముద్రయోగాన్ని, కుండలినీశక్తి ప్రస్తారాన్ని తెలుసుకోవాలని సూచించింది. 
అరయఁగఁ జేతనుండును, గణాధిపుఁడున్, యమరాజ సంఘమున్‌
ఇరవుగ బ్రహ్మ, విష్ణులు మహేశుడు రుద్రుడు సర్వలోకముల్‌
సరసిజ సంభవాండమునఁ జక్కఁగనుండును ఆయజాండమున్‌
గుఱుతుగ నాత్మనుండుఁ; దరిగొండ నృసింహ దయాపయోనిధీ 

      చైతన్య స్వరూపుడైన పరమాత్మతో పాటు మొత్తం బ్రహ్మాండం తనలోనే ఉందన్న గొప్ప వేదాంత సత్యాన్ని ఈ పద్యంలో వివరించింది వెంగమాంబ. అబేధ భావనతో ఉండి బాధలనుభవిస్తున్న తన దేహంలోని భావాల్లోకి తొంగి చూసినప్పుడు జీవి అమృతత్త్వాన్ని పొందుతుందని.. తర్వాత సహస్రారం నుంచి స్రవించే అమృతాన్ని కుండలినీయోగం ద్వారా పానం చేయవచ్చని సూచించింది. 
విప్లవాత్మక భావాలు
నేనూ, నావారు అంటూ భవబంధాల్లో చిక్కుకునే మనుషులకు అసలైన జీవిత సత్యాలను నృసింహ శతకంలో తెలియజెప్పే ప్రయత్నం చేసింది వెంగమాంబ. జీవితంలో అందరూ తమ ఇల్లు, వాకిలి శాశ్వతం అనుకుంటారు గానీ, వృద్ధాప్యం పైబడ్డాక కడుపున పుట్టిన బిడ్డలే ఇంటి వాకిలి దగ్గర కూర్చోబెట్టి కుక్కల్ని తోలే నౌకరుగా వాడుకుంటారన్న చేదు నిజాన్ని ఇలా వెల్లడించింది... 
ఎక్కడి రొక్కయోజనము? లెక్కడి భాగ్యము? లెక్కడింతులున్‌?
లెక్కడి పాఁడిపంటలును? ఎక్కడి బాంధవు? లెల్ల నాఁటికిన్‌
తక్కక వృద్ధరూపమును దాల్చినఁ, బుత్రకు లింటి వాకిటన్‌
కుక్కలఁ దోలుమండ్రు, తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!
      అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యమీద నెపాలు మోపి తిడుతూ, కొడుతూ, ఇతర స్త్రీని చేరదీసి ఆమెతో కూడటం పాపమంది వెంగమాంబ. ‘‘పాటిగ నగ్ని సాక్షిగ వివాహమయైన పతివ్రతామణిన్‌/ నీటున నొల్లకన్‌ మిగుల నేరములెన్నుచుఁ గొట్టి తిట్టుచున్‌/ ధాటిగ నన్యకాంతను ముదంబున రక్షణ చేసి దానితోఁ/ గూటమి పాపహేతు!...’’ అన్నది ఆమె హెచ్చరిక. మూడ్రోజుల ముట్టు పేరిట స్త్రీలను విడిగా ఉంచి, పాపం అంటూ స్నానాలు చేయించే ఆచారాన్నీ విమర్శించింది. మానవజాతికి మూలమైన రుతుకాలం, రుతుస్రావం గురించిన శారీరక ధర్మాలను తెలుసుకోమని చెప్పింది. తను స్త్రీ కాబట్టే స్త్రీలు ఎదుర్కొనే హింస, వారిపై జరిగే అణచివేతను ప్రభావవంతంగా చిత్రించగలిగింది వెంగమాంబ. 
      పురుషుల గురించే కాకుండా కొంతమంది స్త్రీల చిత్త వృత్తులనూ ఈ శతకంలో వెంగమాంబ తేటతెల్లం చేసింది. స్వారస్యం, నీతి, సాహసం, మేలిమితనంతో ఉండే భార్య యవ్వనంలో భర్తను అపురూపంగా చూసుకుంటుంది కానీ, ఆ యవ్వనం ఉడిగిపోయాక ఏమాత్రం లెక్కచేయదంటుంది. కాబట్టి స్త్రీ(భార్య) తనకోసమే ఉన్నదనే భావనను భర్త తగ్గించుకోవాలని సూచించింది. సమాజంలో కనిపించే వింత పోకడలనూ ఈ శతకంలో పలు పద్యాల్లో నిరసించింది వెంగమాంబ. డబ్బున్న వారు అసత్యం మాట్లాడితే నిజమంటారుగానీ, పేదవాళ్లు నిజం మాట్లాడినా అబద్ధం అంటారని, సత్యాసత్యాలను ధనదృష్టితో చూడటం దారుణమని ఆవేదన వ్యక్తంచేసింది. పుట్టిన భూమి మీద త్రిమూర్తులుండగా, వారిని చూడక తీర్థయాత్రలు చేస్తూ అందరూ చూసేట్లుగా నీళ్లలో మునిగి చేతులు ముకుళించి మంత్రాలు చదివితే ముక్తి రాదని చెప్పింది. ఇంకా ‘నువ్వు నేను’ అంటూ  భేదములెంచేవారు, అరిషడ్వర్గాలని వశం చేసుకుంటూ దురభిమానాన్ని ఎలా జయించగలరో చెప్పాలని సవాలు విసిరింది.  
      భావాల పరంగానే కాకుండా, భాష పరంగానూ వెంగమాంబ నృసింహ శతకం ఆధునికంగా కనిపిస్తుంది. అప్పటికే వ్యవహారంలోకి వచ్చిన హంగు, సవాల్‌ వంటి ఉర్దూ పదాలూ ఇందులో కనిపిస్తాయి. అప్పటి కాలంలో మూఢ విశ్వాసాలు, సామాజిక దురన్యాయాల మీద ఒక స్త్రీ గొంతెత్తడానికి ప్రయత్నించడమే విప్లవాత్మకం. అలా గళమెత్తగలిగిన ధైర్యంతో పాటు తన భావాలను సూటిగా స్పష్టంగా ప్రభావవంతంగా చెప్పగలిగిన ప్రతిభ కూడా వెంగమాంబ సొంతం. అందుకే తెలుగు సాహితీచరిత్రలో ఆమెకంటూ కొన్ని పుటలు ప్రత్యేకమయ్యాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం