రాఖీ... బంధం

  • 1328 Views
  • 196Likes
  • Like
  • Article Share

    శాంతి జలసూత్రం

  • పెదపాడు, పశ్చిమగోదావరి shanti.rfc@gmail.com
శాంతి జలసూత్రం

అన్నయ్యా రాఖీ కడతాను చెయ్యి పట్టు... అంటూ పరుగున వచ్చింది లీల. నాకొద్దు చెల్లీ నా స్నేహితులంతా ఏంటా తాళ్లని నవ్వుతారు అంటూ చెయ్యి దాచేసుకున్నాడు రాము. అదేంట్రా రామూ చెల్లి అంత ప్రేమగా రాఖీ తెస్తే కట్టించుకోవేం. అసలు రాఖీ విలువ తెలిస్తే నువ్వలా వద్దనవు తెలుసా! అంటూ వాళ్ల తాతయ్య వచ్చారు. ఏంటది తాతయ్య అని ఇద్దరూ ఆసక్తిగా అడిగేసరికి, చెప్తా వినండి... అంటూ తాతయ్య ఇలా మొదలుపెట్టారు...
రాఖీ విశిష్టత

హిందీలో రాఖీని రక్షాబంధన్‌ అంటారు. రక్ష అంటే రక్షించడం. బంధన్‌ అంటే బంధం కలిగి ఉండటమన్నమాట. అన్నకుగానీ తమ్ముడికి గానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టేదే ఈ రక్షాబంధన్‌. దీన్ని కడితే సోదరికి జీవితాంతం ఆ సోదరుడు అండగా, రక్షణగా ఉంటాడనేది కట్టే వాళ్ల నమ్మకం. 
పండగ పలు విధాలు
దేశ వ్యాప్తంగా ఈ పండగను శ్రావణమాసం(ఆగస్టు)లో వచ్చే పౌర్ణమినాడు జరుపుకుంటారు. తెలుగువారమంతా ఆగస్టు నెలలో రాఖీ పౌర్ణమి జరుపుతున్నాం కదా! కానీ మిగతా రాష్ట్రాల్లో ఒక్కో పేరుతో ఒక్కో రకంగా జరుపుతారు. మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో రాఖీ పండగను నారియల్‌ పూర్ణిమ అంటారు. వర్షాలు బాగా పడాలని ఆ రోజున వరుణ దేవుణ్ని పూజిస్తారు. ఉత్తరాఖండ్‌లోనైతే జన్యోపున్యు పేరుతో ఈ పండగను చేసుకుంటారు. ఆరోజున పాత జంధ్యాన్ని తీసి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. ఒడిశా లోనేమో గమ్హ పూర్ణిమ పేరుతో పండగ జరుపుకుని ఆవులకు, ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి, అలంకరణలు చేసి, ఇరుగుపొరుగు వారికి మిఠాయిలు పంచుతారు. అలా చేస్తే మంచి జరుగుతుందని వారి నమ్మకం. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, బిహార్‌లలో కజరి పూర్ణిమ జరుపుతారు. ఆరోజున పంటలు బాగా పండాలని భూమికి పూజచేసి, నాట్లు వేయడం మొదలుపెడతారు. మరి అందరూ ఇదే రోజున ఎందుకు చేస్తున్నారూ! అనడిగాడు రాము. ‘అదా! దాని వెనుక బోలెడు కథలున్నాయర్రా. అందులో నాకు తెలిసినవి చెప్తా వినండి’ అంటూ వాటి గురించి చెప్పడం మొదలుపెట్టారు తాతయ్య.
కథలెన్నో....
రాఖీ పౌర్ణమి జరపడం వెనుక చరిత్రలు, పురాణకథలు కోకొల్లలు. మనకు తెలిసి అన్నకు చెల్లెలు, తమ్ముడికి అక్క రాఖీలు కడతారు కదా! కానీ మొదట ఈ రాఖీని ఓ భార్య భర్తకు కట్టిందట. ఇదేం విడ్డూరం అనుకుంటున్నారా! కానీ దీనికి సంబంధించిన ఓ పురాణ కథ ఉంది. అదేంటంటే.. పూర్వం దేవతలకు, రాక్షసులకు యుద్ధం జరిగింది. అప్పుడు దేవతల అధిపతి అయిన దేవేంద్రుడు వృత్తాసురుడనే ఓ రాక్షసరాజు చేతిలో ఓడిపోయాడు. దాంతో ఇంద్రుడు చేసేదేమీలేక పరివారంతో సహా అమరావతి వెళ్లిపోతాడు. అయినా రాక్షస రాజు పట్టు వదలకుండా అమరావతిని ముట్టడించబోతాడు. ఆ విషయం ఇంద్రుని భార్య శచీదేవి గ్రహిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో శివపార్వతులను, లక్ష్మీనారాయణులను పూజించి ఆ పూజలో పవిత్రమైన దారాన్ని ఉంచుతుంది. అది తీసుకెళ్లి ఆపదలో ఉన్న తన భర్త ఇంద్రునికి కట్టి ధైర్యంగా యుద్ధానికి వెళ్లమని చెప్తుంది. ఇది చూసిన దేవతలందరూ ఇంద్రుడు విజయం సాధించాలని వారు కూడా రక్షలు తెచ్చి ఇంద్రునికి కట్టి యుద్ధానికి పంపుతారు. యుద్ధంలో ఇంద్రుడు విజయం సాధిస్తాడు. ఇదంతా శచీదేవి కట్టిన రక్ష వల్లే జరిగిందని నాటి నుంచి రక్షాబంధనోత్సవం పేరుతో శ్రావణ పూర్ణిమను జరుపుతూ వస్తున్నారు. కాలక్రమేణా అది రాఖీ పౌర్ణమి అయ్యింది. ‘మరి అన్నా చెల్లెళ్లు ఎందుకు జరుపుకుంటున్నారు తాతయ్యా?’ అంటూ ప్రశ్నించింది లీల. 
దానికీ ఓ కథుంది..
రాక్షస రాజైన బలి చక్రవర్తి ప్రజలను భయపెడుతుంటాడు. మరోవైపు తన భక్తితో విష్ణువును తన దగ్గరే బంధించేసుకుంటాడు. అది తెలుసుకున్న లక్ష్మీదేవి శ్రావణ పౌర్ణమి రోజున సామాన్య స్త్రీ రూపంలో బలి దగ్గరికి వెళ్లి రాఖీ కట్టి నేను నీ సోదరినంటుంది. అయితే నీకేం కావాలో కోరుకో అంటాడు బలి. వెంటనే ఆమె విష్ణువును విడుదల చేయమంటుంది. లక్ష్మీదేవి కోరిక మేరకు విష్ణువును ఆమెతో పంపిస్తాడు. ఆ రోజు నుంచి శ్రావణపౌర్ణమి రోజున రక్ష కట్టడం వల్లే రక్షాబంధన్‌ మొదలైందని చెబుతుంటారు.
‘అయితే దేవుళ్ల వల్లే ఈ పండుగ వచ్చిందా తాతయ్యా?’ అనడిగాడు రాము. అలాగనేం కాదు దీనికి సంబంధించిన కథలు కూడా ఉన్నాయర్రా. 
అలెగ్జాండర్‌ తెలుసు కదా! ఆయన క్రీ.పూ.4వ శతాబ్దంలో మన దేశం మీదికి దండెత్తి వచ్చాడు. అ సమయంలో రుక్సానా అనే భారతీయ మహిళను వివాహం చేసుకున్నాడు. ఓసారి పురుషోత్తముడు అనే భారతీయ రాజుతో యుద్ధానికి సిద్ధమయ్యాడు అలెగ్జాండర్‌. కానీ పురుషోత్తముడి శక్తి సామర్థ్యాల గురించి ముందే తెలుసున్న రుక్సానా తన భర్తను ఏమీ చేయొద్దని పురుషోత్తముడికి లేఖ రాసి, దానితో పాటు రాఖీని పంపింది. తనను చెల్లెలిగా భావించి ఆ రాఖీని కట్టుకోమని కోరింది. యుద్ధ సమయంలో అలెగ్జాండర్‌ మీద కత్తి ఎత్తిన పురుషోత్తముడు తన చేతికున్న రాఖీని చూసి అతన్ని చంపకుండా వదిలేశాడు. ఇక అప్పట్నుంచి ఈ పండగను నమ్మకంగా జరుపుకుంటున్నారని చెబుతుంటారు. చూశారా రాఖీకెంత చరిత్ర ఉందో! అవును తాతయ్యా నాకు తెలియక వద్దన్నాను అంటూ లీలతో చక్కగా రాఖీ కట్టించుకున్నాడు రాము. 


వెనక్కి ...

మీ అభిప్రాయం