ఆయనొక అద్భుతం!

  • 233 Views
  • 24Likes
  • Like
  • Article Share

    తనికెళ్ల భరణి

  • హైదరాబాదు
తనికెళ్ల భరణి

సహజ నటనతో, అద్భుత వాచకంతో అటు రంగస్థలం మీదా, ఇటు వెండితెర పైనా తనకు తనే సాటి అనిపించుకున్నారు రాళ్లపల్లి. పాత్ర ఏదైనా అందులోకి పరకాయప్రవేశం చేసే ఆయన తెలుగు ప్రేక్షకులను దశాబ్దాలపాటు రంజింపజేశారు. మంచి రచయిత కూడా అయిన రాళ్లపల్లి.. వ్యక్తిత్వంలో మేరు సమానులు.   
రాళ్లపల్లి
లాంటి వ్యక్తిత్వం చాలా అరుదు. మానవత్వం మూర్తిభవించిన మనిషి. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి హైదరాబాదులో బీఎస్సీ చదివి, సరైన ఉద్యోగం రాక అప్పట్లో రైల్వేలో బంట్రోతుగా చేరారు. ఎప్పుడూ జోకులు వేస్తూ, పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ సరదాగా ఉండేవారు. అక్కడ పాటలు, నాటక విభాగం ఒకటుండేది. అందులో చేరి ఊరూరా ప్రభుత్వ పథకాలు ప్రచారం చేస్తుండేవారు. నేను బీకాం పాసవ్వగానే నాటకాల పట్ల ఆకర్షితుణ్నయ్యాను. అప్పుడే రాళ్లపల్లితో పరిచయమైంది. నాకు తెలిసీ అప్పటికి ఆయనకి పెళ్లై ఇంకా పదహారు రోజుల పండగ కూడా అవ్వలేదు. ఆయన జీవితంలోకి వాళ్లావిడ నేను ఇంచుమించు ఒకేసారి ప్రవేశించాం. అలా నాకు వాళ్లు తల్లిదండ్రుల సమానులయ్యారు. 
      నాటకరంగంలో రాళ్లపల్లి ఒక అద్భుతం. ఎన్ని పేజీల డైలాగునైనా అవలీలగా ధారణచేసి చెప్పేసేవారు. మధ్యతరగతి కుటుంబం బాధల్ని హాస్యస్ఫోరకంగా, వ్యంగ్యంగా చూపిస్తూ ‘ముగింపులేని కథ’ అనే నాటకం రాశారాయన. దాన్ని దేశ వ్యాప్తంగా వందల సార్లు ప్రదర్శించాం. ఆ నాటకం వేస్తే ఉత్తమ ప్రదర్శన, రచన, నటన, దర్శకత్వం అన్ని విభాగాల్లో బహుమతులు మాకే వచ్చేవి. అంతకుముందు ‘మారని సంసారం’ అని ఒక నాటకం రాశారు. కానీ, ‘ముగింపులేని కథ’ రాళ్లపల్లి రాసిన ఒక జీవనాటకం. అది ఆయనకి ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది. అప్పటిదాకా నాటకరంగంలో సంభాషణలు, నటన, అలంకరణ అన్నింటిలో ఒక నాటకీయత ఉండేది. ‘ముగింపులేని కథ’ రంగస్థలం మీదకి ఒక సహజత్వాన్ని తీసుకొచ్చింది. మద్రాసులో దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆ నాటకం చూసి ‘ముగింపులేని కథ నాటకం కాదు కిటీకీలోంచి చూస్తున్న ఒక జీవితంలా ఉంది’ అని ప్రశంసించారు. ఆ నాటకంలో నేను రాళ్లపల్లి 70 ఏళ్ల మామ పాత్ర పోషించేవాణ్ని. నాకు తెలిసి దాదాపు 150 సార్లు నేను ఆ పాత్ర వేసుంటాను. అందులో రాళ్లపల్లి పోషించే ప్రధాన పాత్రను ఒకసారి వేసి ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాను. దాన్ని ఆయనకి గురుదక్షిణగా ఇచ్చాను. అదో మర్చిపోలేని జ్ఞాపకం. కన్యాశుల్కం, వరవిక్రయం లాంటి 15 నాటకాల్లో వందల సార్లు మేం కలిసి నటించాం. అహ్మదాబాద్, దిల్లీ, కేరళ ఇలా దేశంలో అన్ని పరిషత్తులకీ వెళ్లి నాటకాలు వేశాం. దాదాపు 18 ఏళ్లు మా నాటక ప్రస్థానం కలిసి సాగింది. తర్వాత సినిమాలవైపు వచ్చాను. గతేడాది కూడా ఆయన ఒక నాటకంలో నటించారు. రాళ్లపల్లి ఆగస్టు 15న జన్మించారు. అందుకని దాదాపు పదిహేనేళ్ల నుంచి ఏటా ఆగస్టు 15న ఒక పేద నాటక కళాకారుడిని సత్కరించి, రూ.50 వేలు అందిస్తున్నారు.
ఆ కోరిక తీరలేదు
‘వంశీమురళి కళానిలయం’ అనే నాటక సంస్థను రాళ్లపల్లి స్థాపించారు. దీని తరఫున ఎన్నో నాటకాలు ప్రదర్శించాం. నాటక ప్రదర్శనలో ఆయన ఏమాత్రం రాజీపడేవారు కాదు. వేయబోయే నాటకం వైభవంగా ఉండాలని అనుకునేవారు. అందుకే మాకు రూ.వెయ్యి వస్తే, రూ.మూడు వేలు ఖర్చు ఉండేది. మా సంస్థలో స్త్రీ పాత్రలు పోషించే ఆడవారిని తోబుట్టువులుగా భావించేవాళ్లం. అంత సంస్కారవంతమైన వాతావరణం ఉండేది. ఇప్పటికీ ఈ సంస్థ పనిచేస్తోంది. రాళ్లపల్లికి భక్తిభావం కూడా ఎక్కువే. నాకు తెలిసి ఆయన 30 సార్లకు పైగా శబరిమల వెళ్లొచ్చారు. 
      రాళ్లపల్లి మంచి చదువరి. పద్యాలు, ప్రాచీన కావ్యాలంటే ఆయనకి చాలా ఇష్టం. చక్కని గొంతుతో పద్యాలను హృద్యంగా పాడేవారు. మా మధ్య ఎప్పుడూ సాహితీ చర్చలు సాగుతుండేవి. ఆయన కొన్ని కథలు, పాటలు కూడా రాశారు. అయితే, అవి అచ్చువరకు వెళ్లలేదు. ‘ముగింపు లేని కథ’ని సినిమాగా తీయాలని బలంగా అనుకునేవారు. ఆ కోరిక నెరవేరలేదు. ఆయన అల్పసంతోషి. చిన్నచిన్న విషయాలకు కూడా ఎక్కువ ఆనందపడిపోయేవారు. నా జీవితంలో ఎక్కువ భాగం వాళ్ల ఇంట్లోనే గడిచింది. ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు. అందుకే నా మీద పుత్ర వాత్సల్యం చూపేవారు. చాలా క్రమశిక్షణ కలిగిన మనిషి. కంపెనీ కారు మన ఇంటి ముందు అయిదు నిమిషాలకు మించి ఆగకూడదన్నది ఆయన పెట్టుకున్న నిబంధన. ఏడింటికి కారొస్తుందంటే, ఆరున్నరకే తయారై కూర్చునేవారు. రాళ్లపల్లి కన్నా గొప్ప నటులు చాలామంది ఉండవచ్చు. కానీ, అలాంటి మనిషి మాత్రం చాలా అరుదు. ఆయన గురించి చిత్ర పరిశ్రమలో చెడుగా ఒక్క మాట కూడా వినలేదు. ఆయనకున్న అతిపెద్ద బలహీనత దానగుణం. అడిగితే చాలు లేదనకుండా ఇచ్చేవారు. తన దగ్గర లేనప్పుడు అప్పుచేసైనా ఇచ్చేవారు. దానివల్ల జీవితంలో చాలా కష్టాలు పడ్డారు. ఆయన జీవితంలో అత్యంత విషాద సందర్భం.. కుమార్తె మరణం. వైద్య విద్య కోసం రష్యా బయల్దేరిన అమ్మాయి, అనారోగ్యంతో మార్గం మధ్యలో మరణించడంతో చాలా కుంగిపోయారాయన. చివరి వరకూ ఆ శోకాన్ని భరిస్తూనే, నలుగురికీ సాయం చేస్తూ వచ్చారు. ‘బాధను నీ లోపలే దాచుకో.. ఆనందాన్ని మాత్రం పది మందికీ పంచు’ అనే సూత్రాన్ని బలంగా నమ్మిన ఆయన, జీవితాంతం దానికే కట్టుబడ్డారు. విలక్షణ నటన.. సలక్షణ వ్యక్తిత్వానికి మారుపేరు అయిన రాళ్లపల్లి భౌతికంగా దూరమైనా, తెలుగుజాతి గుండెల్లో ఆయనెప్పటికీ చిరంజీవే.


వెనక్కి ...

మీ అభిప్రాయం