మన కళాఖండం...అఖండం

  • 1137 Views
  • 1Likes
  • Like
  • Article Share

    డా. ద్యావ‌న‌ప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ‌

  • హైద‌రాబాదు
  • 9490957078
డా. ద్యావ‌న‌ప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ‌

అమరావతీ నగర అపురూప శిల్పాల గురించి ప్రపంచమంతటికీ తెలుసు. లండన్‌ మ్యూజియంలోనే అవి కొలువుదీరాయి. ఓరుగల్లు, లేపాక్షి శిల్పాల ఘనతా జగద్విదితమే. తెలుగువారి శిల్పకళ గురించి చెప్పుకునేటప్పుడు ఎక్కువశాతం చర్చలు వీటి మీదే నడుస్తాయి. కానీ, తెలుగునాట ఇంకెంతో శిల్పసంపద ఉంది. ఆ ప్రాచీన వారసత్వ నిధిలోని మణిమాణిక్యాల్లాంటి వాటిని ఓసారి గుర్తుచేసుకుందాం. 
భూమ్మీద
పుట్టిన జీవరాశుల్లో ఒక్క మానవుడు మాత్రమే కళాత్మక జీవితం గడుపుతాడు- ఇనుమడించిన ఆనందం కోసం. కళల్లో లలిత కళలు ముఖ్యమైనవి కాగా వాటిలో శిల్పకళకు ప్రత్యేక స్థానముంది, దాని జీవితకాలం పెద్దది కాబట్టి. మానవుడు స్థిరనివాసం ప్రారంభించిన పదివేల సంవత్సరాల కిందటి కొత్తరాతి యుగం నుంచి కూడా మనకు శిల్పకళా ఖండాలు లభిస్తున్నాయి. ఆనాటికి మానవునికి వేట జంతువులతోపాటు మచ్చిక చేసుకున్న జంతువులు/ పశువులతో కూడా పరిచయముంది కాబట్టి అలాంటి వాటి బొమ్మలు కొత్తరాతి యుగపు స్థావరాల్లో కనిపిస్తుంటాయి. తెలంగాణలో అలాంటి జంతువులు, పశువులను కాల్చిన మట్టిబొమ్మలు అలంపూర్‌ దగ్గరి చిన్నమరూరులో లభించాయి.
      కొత్తరాతి యుగం తర్వాత మానవుడు సుమారు 3000 సంవత్సరాల కిందట బృహత్‌ శిలా యుగంలోకి ప్రవేశించాడు. ఈ యుగంలో ఇనుప లోహం అందుబాటులోకి వచ్చింది. ఆ లోహ పనిముట్లతో పెద్దపెద్ద రాళ్లను చెక్కి తమ సమాధుల చుట్టూ నిలిపేవారు. భూపాలపల్లి జిల్లాలో (పాత ఖమ్మం జిల్లాలో) స్త్రీ పురుష సమాధుల స్మారకంగా నిలువెత్తు స్త్రీ- పురుష శిల్పాలను నిలిపారు. ఈ శిల్పాలు నిజానికి సిలువ ఆకారంలో కనిపిస్తాయి. ఇలాంటి స్మారక నిలువురాళ్లు పోలిచెట్టి చెరువుగడ్డ, గలభ, కాంచనపల్లి, కాటారు, దామరవాయి, ఏటూరు నాగారం మొదలైన ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఇవి క్రీస్తు సిలువ తర్వాత కాలానివి కావు; అంతకు ముందటివి. గత సంవత్సరం సిద్ధిపేట మండలంలోని పుల్లూరుబండ గ్రామ పరిధిలో ఉన్న స్మారక శిల వద్ద జరిపిన తవ్వకాల్లో ఒక మానవాకారపు శిల్పం బయటపడింది. నున్నగా లేని ఆ శిల్పం స్త్రీని సూచిస్తుందని భావిస్తున్నారు. ఏమైనా దీంతో సుమారు రెండున్నర వేల సంవత్సరాల కిందటే శిల్పకళకు పునాది పడిందని చెప్పవచ్చు. 
థేరవాద బౌద్ధ శిల్పం
క్రీ.పూ.నాలుగో శతాబ్దం నాటికి ఆంధ్రులకు (ఆనాటి తెలుగువారు) 30 కోటగోడలుండేవి. ఆనాటి మౌర్య సామ్రాజ్యంలో గ్రీకు రాయబారిగా పనిచేసిన మెగస్తనీస్‌ రాసిందాన్ని బట్టి అలాంటి కోటగోడల్లో జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన కోటలింగాల - ధూళికట్ట, పెద్దబొంకూరు శిథిల నగరాలు కూడా లెక్కలోకి వచ్చేవని రాష్ట్ర పురావస్తు శాఖ నిర్ధరించింది. కోటలింగాల, ధూళికట్ట తవ్వకాల్లో కాల్చిన మట్టి బొమ్మలు- ఎద్దులు, బండ్లు, మాతృమూర్తులు లభించాయి. ధూళికట్టలో లభించిన మాతృమూర్తి (అమ్మతల్లి) తన బిడ్డకు చన్ను కుడుపుతూ ఆర్ద్రతను వెదజల్లేట్లుగా ఉంది. 2016లో నల్గొండ జిల్లాలోని పజ్జూరు (తిప్పర్తి మండలం)లో జరిపిన తవ్వకాల్లో ఒక్క చన్ను గల కాల్చిన మట్టిబొమ్మ వెలుగు చూసింది. క్రీ.శ.200 ప్రాంతానికి చెందిన ఈ బొమ్మ అర్ధనారీశ్వర విగ్రహానికి తొలి రూపమని అర్థమవుతుంది.
      పై స్థలాలలోనే క్రీ.పూ.1వ శతాబ్దం - క్రీ.శ.1వ శతాబ్దం మధ్యలో థేరవాద బౌద్ధమతం వర్ధిల్లింది. బౌద్ధ స్థూపాలకు సంబంధించిన తెల్లరాతి పలకల మీద భక్తులు, నాగులు, సింహాలు, మాలకారుల శిల్పాలను సహజ సుందరంగా మలిచారు. అలాంటి వాటిలో ధూళికట్టలో లభించిన ముచిలింద నాగశిల్పం ప్రత్యేకంగా పేర్కొనదగింది. బుద్ధుడు విగ్రహారాధనను ఖండించాడు కాబట్టి బుద్ధుడికి ప్రతీకగా బోధివృక్షం, ఖాళీకుర్చీ, పాదాలు, రుమాలు, భిక్షపాత్ర శిల్పాలు చెక్కారు. సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్‌లో కూడా కాల్చిన మట్టిబొమ్మలు, తెల్లరాతి శిల్పాలు బయల్పడ్డాయి. పజ్జూరులో ఏనుగు దంతంతో చేసిన చేతి గాజులు, కంఠహారాల ఆనవాళ్లు వెలుగు చూశాయి. కాల్చిన మట్టి పూసలను దారానికి గుచ్చి హారంగా వేసుకునేవారనే ఆధారాలు కూడా పజ్జూరులో బయటపడ్డాయి.
మహాయాన బౌద్ధశిల్పం
క్రీ.శ.రెండో శతాబ్దం నాటికి బుద్ధుడి విగ్రహాన్ని పూజించడం ప్రారంభమైంది. గాంధార శిల్ప ప్రభావం వల్ల బుద్ధుణ్ని అభయముద్ర భంగిమలో శిల్పించారు. బుద్ధుడి జీవితంలోని ప్రధాన ఘట్టాలను, బుద్ధుని పూర్వజన్మకు సంబంధించిన జాతక కథలను బౌద్ధస్థూప సంబంధ ఫలకాల మీద శిల్పించారు. వీటితోపాటు కొన్ని లౌకిక శిల్పాలు కూడా కనిపిస్తాయి. ఇలాంటి శిల్పాల్లో నలగిరి ఏనుగు ధమనం పతకం, కుబేర, మరుగుజ్జులు, మిథున శిల్పాలు ప్రధానమైనవి. తెలుగునాట బౌద్ధమతానికి ప్రధాన కేంద్రంగా వర్ధిల్లిన నాగార్జునకొండ (విజయపురి)లో ఇక్ష్వాకుల కాలంలో (క్రీ.శ.230-340) ఇలాంటి మహాయాన బౌద్ధ శిల్పం ఎక్కువగా మనుగడ సాగించింది. అయితే పల్నాటి రాయిలో చెక్కిన ఇలాంటి శిల్పం అత్యున్నత స్థితికి ఎదిగింది మాత్రం సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరిలో. ఇక్కడి శిల్పాల్లో వెస్సంతర, మాంధాత, ఛాంపేయ తదితర జాతక కథా శిల్పాలు ప్రపంచ స్థాయికి చెందినవిగా కీర్తి గడించాయి. కాబట్టే ఇలాంటి శిల్పాల్లో కొన్ని 2017 నవంబరు 11 నుంచి జరుగుతున్న ‘ఇండియా-వరల్డ్‌’ శిల్పకళా ప్రదర్శనలో చోటు చేసుకోగా, మరికొన్ని శిల్పాలు 2020లో న్యూయార్క్‌లో జరగనున్న ప్రపంచ శిల్పకళా ప్రదర్శనకు ఎంపికయ్యాయి. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మహాస్థూప పరిసరాల్లో కూడా మూడు- నాలుగు అడుగుల ఎత్తయిన బుద్ధ శిల్పాలు, ఒకటి-రెండు అడుగుల ఎత్తయిన కంచు (పంచలోహ) శిల్పాలు వెలుగు చూశాయి. ఏమైనా బౌద్ధశిల్పానికి పరాకాష్ఠగా నిలిచిన ఫణిగిరిలోనే విష్ణుకుండుల కాలంలో (క్రీ.శ.360-570) బ్రాహ్మణ మత శిల్పాలు, శివలింగాలు రూపుదిద్దుకోవడం విడ్డూరంగా కనిపిస్తుంది. అయితే విష్ణుకుండులు పరమత సహనం పాటించారని, అన్ని మతాలను పోషించారని వారి శాసనాలు తెలియజేస్తాయి. అందుకు నిదర్శనంగా వారి రాజధానుల్లో ఒకటైన ఇంద్రపాల నగరం (యాదాద్రి - భువనగిరి జిల్లా)లోని గుహల్లో చెక్కిన బౌద్ధమూర్తుల శిల్పాలు కనిపిస్తాయి. పద్మ/యోగ ఆసనంలో కూర్చున్న ఈ బుద్ధ శిల్పాలు నునుపుగా లేకున్నా సమకాలీన సారనాథ్‌ బుద్ధ శిల్పాలను తలపిస్తాయి.
హిందూ మత శిల్ప ఆరంభ వికాసాలు
క్రీ.శ.మూడో శతాబ్ది ఆరంభంలో నాగార్జునకొండలోనే హిందూమత శిల్పాలు చెక్కడం ప్రారంభమైంది. స్కంధ, కార్తికేయ, మహాసేన, దేవసేన, కుబేర శిల్పాలు ప్రత్యేకంగా వర్ణించదగినవి అక్కడి తవ్వకాల్లో వెలుగు చూశాయి. విష్ణుకుండి కాలానికి చెందిన శిల్పాలు నల్గొండ జిల్లాలోని యేలేశ్వరంలో ఉన్న మొక్కుడు గుడుల్లో దర్శనమిచ్చాయి. అలాంటి వాటిలో ప్రధానంగా కనిపించేవి శివ, ఉమామహేశ్వర, అర్ధనారీశ్వర శిల్పాలు. యేలేశ్వరంలోనే ఎర్ర ఇసుక రాతిలో హిందూ పురాణేతిహాస గాథలు కూడా చిత్రితమయ్యాయి. విష్ణుకుండి రాజుల్లో గొప్పవాడైన రెండో మాధవవర్మ దంత ముఖస్వామి (అనగా గణేశుడు) విగ్రహాన్ని చెక్కించి ప్రతిష్ఠించినట్లుగా ఒక శాసనం లభించింది. అందుకు నిదర్శనంగా విష్ణుకుండుల తొలి రాజధాని అమరాబాదు (నాగర్‌కర్నూలు జిల్లా)లో నాలుగడుగుల ఎత్తయిన నల్లరాతి గణేశ శిల్పం కనిపిస్తుంది. వారి మరో రాజధాని కీసరగుట్ట (హైదరాబాదు దగ్గర)లో రెండో మాధవవర్మ తన ఒక్కో విజయానికి గుర్తుగా ఒక్కొక్కటి చొప్పున సుమారు 100 నల్లరాతి రామలింగాలను ప్రతిష్ఠించాడు. కీసరగుట్టలో శిల్పులకు ఒక కుల/వృత్తి సంఘమే ఉన్నట్లు తెలిపే ‘తొలుచువాండ్లు’ అనే శాసనం లభించింది. ఇలా ఘనత వహించిన శిల్పులు యేలేశ్వరం, అలంపూర్‌ల్లో కూడా ఉండేవారు.
      ఈ ప్రాంతం నుంచి కర్ణాటకలోని బాదామి ప్రాంతానికి వెళ్లి అక్కడి నుంచి సుమారు రెండు శతాబ్దాలు (క్రీ.శ.540-750) దక్కను రాష్ట్రాలను పరిపాలించిన తొలి చాళుక్య రాజులు యేలేశ్వరం నుంచే శిల్పులను తీసుకువెళ్లారని వారి శాసనాలు ప్రస్తావించాయి. బాదామి, ఐహోల్, పట్టడకల్‌ శాసనాలు ప్రస్తావించిన మరికొన్ని శిల్పుల పేర్లు అలంపూర్‌ శిల్పుల పేర్లతో పోలికలు కలవిగా ఉన్నాయి కాబట్టి అలంపూర్‌ శిల్పులను కూడా తొలి చాళుక్యులు పిలిపించుకున్నట్లు భావించవచ్చు. అయితే వారే అలంపూర్‌లో కూడా నవబ్రహ్మ ఆలయాల్లో చాలా వాటిని కట్టించినట్లు వారి శాసనాలు, ఆలయ శైలి తెలియజేస్తున్నాయి. ఏడు, ఎనిమిది శతాబ్దాల్లో నిర్మించిన ఈ ఆలయాల గోడలపై చెక్కిన శిల్పాల్లో ప్రధానంగా మహిషాసుర మర్దిని, ద్వారపాలురు, విష్ణు, లింగోద్భవమూర్తి, పార్వతి, సప్త మాతృకలు, నాగరాజు పతక శిల్పం అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మిథున శిల్పాలు, పంచతంత్ర గాథా శిల్పాలు కూడా రమణీయంగా ఉంటాయి. అలంపూర్‌ క్షేత్ర సంగ్రహాలయంలో (మ్యూజియంలో) ప్రదర్శనకు పెట్టిన 16 చేతుల నటరాజ శిల్పం ప్రత్యేకంగా చెప్పుకోదగింది. చతుర భంగిమలో జీవకళతో అద్భుత నాట్య ప్రదర్శన చేస్తున్న శివుడి చుట్టూ వాద్యకారులు, నాట్యం చేస్తున్న భృంగి, గణేశుడు, పార్వతి శిల్పాలను కూడా ఆకర్షణీయంగా మలిచారు. ఇదే కాలానికి చెందిన కూడలి సంగమేశ్వరాలయం గోడల మీద కూడా అద్భుతమైన శిల్పకళ అలంపూర్‌ శైలిలో కనిపిస్తుంది.
మిశ్ర శిల్పకళా యుగం
రాష్ట్రకూటుల యుగంలో (క్రీ.శ.750-970) గుహాలయాలతోపాటు నిర్మిత ఆలయాలు తాంత్రిక, జైన, హిందూ ఆలయ శైలులను వెలుగులోకి తెచ్చాయి. గద్వాల జిల్లాలోని రూపాల సంగమేశ్వరం, భుజంగేశ్వరాలయాల గోడలపై చెక్కిన గంగ, యమున, శివ-నటరాజ, త్రిపురాంతక, మన్మథ, హరిహర, సదాశివ, దిక్పాలుర శిల్పాలు ప్రతిపాదిత ప్రత్యేక తరహాకు చెందిన శిల్పాలు. రాష్ట్రకూటులే అలంపూర్‌లో నిర్మించిన తోరణానికి గల ‘కుంభ సంభవ లతా పుష్పాల’ శిల్పం తదనంతర ఆలయ ద్వార బంధాలకు మాతృకగా నిలిచింది. వీరి కాలపు మీనాంబరం (జడ్చర్ల దగ్గర) ఆలయంలోని శిల్పం మాత్రం బొరుసుగా ఉంటుంది- వర్ధమాన మహావీరుని శిల్పం తప్ప. సమీపపు గొల్లత్తగుడి గోడలపైనున్న ఇటుకరాతి మహావీర శిల్పాలు కూడా ఆకర్షణీయమైనవే.
రాష్ట్రకూటులకు వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉత్తర తెలంగాణను పాలించారు. వీరి మొదటి రాజధాని బోధన్‌. వీరు తమ సార్వభౌములలాగా జైనమతాన్ని పోషించడంతో వారి రాజధానుల పరిసరాల్లో ఉన్న బోధన్, సారంగాపూర్, వేములవాడ, నాంపల్లి గ్రామాల పరిసరాల్లో లభించిన జైన తీర్థంకరులు పార్శ్వనాథ, మహావీర, గోమఠేశ్వరుల నల్లరాతి శిల్పాలు- నిలువెత్తువి, అంతకంటే ఎత్తయినవి- కొన్నింటిని నిజామాబాదు పురావస్తు సంగ్రహాలయంలో భద్రపరచారు. పదో శతాబ్దానికి చెందిన బొమ్మలగుట్టపైనున్న జైన యక్షిణి చక్రేశ్వరి, ఇతర తీర్థంకర శిల్పాలు గుట్టనే తొలిచి మలిచినవి. ఈ కాలంలో గోదావరి తీరం వెంబడి రామగిరి, అడవి సోమనపల్లి, గౌరీగుండం, శివ్వారం, గాంధారిఖిల్లా పరిసరాల్లో ఉన్న గుహల్లో హిందూ మత సంబంధ శిల్పాలను- ప్రత్యేకించి శివలింగాలను- బండలపైనే చెక్కారు. ఇదే కాలానికి చెందిన తాంత్రిక శాఖకు సంబంధించిన ఆలయమొకటి భూపాలపల్లి జిల్లాలోని జంగాలపల్లి అడవుల్లో ఉంది. ఆ గుడి గోడల్లో రాతి ముక్కలతోనే శిల్పాలు రూపొందించడం కనిపిస్తుంది. కొలనుపాక, జైనాథ్‌ (ఆదిలాబాదు జిల్లా) ఆలయాల్లో తొలి తరపు శిల్పాలు జైనమతానికి చెందినవి కాగా మలితరపు శిల్పాలు వైష్ణవ మతానికి చెందినవి.
చాళుక్య శిల్పకళ
నిజానికి మలి (కల్యాణి) చాళుక్యుల కాలంలోనే (970-1160) తెలంగాణలో వాస్తు శిల్పకళ ఇదమిత్థమైన రూపును సంతరించుకుంది. ఈ కాలపు శిల్పాలు ఎక్కువగా హిందూ మతానికి సంబంధించినవి. వీటిలో ప్రత్యేకంగా పేర్కొనదగింది జడ్చర్ల దగ్గరి ఆవంచ గణేశ శిల్పం. వేయి సంవత్సరాల కిందటి ఈ ఏడు గజాల ఎత్తయిన శిల్పం ప్రపంచంలోనే పెద్దదైన వినాయక శిల్పం. మరొక ఏడడుగుల గణపతి శిల్పం రామగుండం దగ్గరి రామునిగుండాలలో ఉంది. నిర్మల్‌ జిల్లాలోని కదిలె, సిరిచెల్మ, మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లిలో కూడా ఉమామహేశ్వర, వేణుగోపాల, హనుమ తదితర శిల్పాలు కళాత్మకంగా కనిపిస్తాయి. నిర్మల్‌ జిల్లాలోని బ్రహ్మేశ్వరం, గద్వాల జిల్లాలోని సోమేశ్వరం (సోమశిల), మల్లేశ్వరం ఆలయ మంటపాల పైకప్పులకు చెక్కిన పురాణేతిహాసిక శిల్పాలు ప్రత్యేక వర్ణనీయాలు. నిర్మల్‌ జిల్లాలోని బాసర పాతగుళ్లు, రెబ్బెన గుడి, ఆదిలాబాదు జిల్లాలోని జైనాథ్, అంకుశాపురం (అంకోలి), ఆసిఫాబాదు జిల్లాలోని ఈస్‌గాం, వాంకిడి, నిజామాబాదు జిల్లాలోని బిచ్కుంద, త్రిలింగ రామేశ్వరాలయం, మెదక్‌ జిల్లాలోని డాకూరు, నల్గొండ జిల్లాలోని పానగల్, మోత్కూరు, మునుగోడు, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గంగాపూర్‌ ఆలయాల గోడలపై చెక్కిన శిల్పాలూ ముఖ్యమైనవే.  
కాకతీయ శిల్పం
కాకతీయుల కాలంలో (క్రీ.శ.1163-1323) తెలంగాణ శిల్పకళ ఉచ్ఛస్థితికి చేరుకుంది. వీరి కాలంలో నల్లరాతి శిల్పాలను అత్యంత నునుపుగా మెట్ల కిరీటాలతో చెక్కారు. రామప్ప, ఘన్‌పూర్, ఆలయాల్లో చూరును మోస్తున్నట్లు నిలబడిన నాట్యకత్తెలు, సాలభంజికలు, రాయగజకేసరి తదితర నిలువెత్తు శిల్పాలు శిల్పకళా జగత్తుకే శిఖరప్రాయంగా నిలిచాయి. ఇంతటి నైపుణ్యంతో శిల్పించిన మకర తోరణాలు వరంగల్లు కోటలోని స్వయంభూ దేవాలయ శిథిలాల్లో కనిపిస్తాయి. కాకతీయ ఆలయాల గోడలు, స్తంభాలు, కప్పులపై చెక్కిన మత, లౌకిక శిల్పాలు అత్యంత శోభాయమానాలు. సూదిమొన దూరగలిగేంత నిశితమైన శిల్పాలు వేయి స్తంభాల గుడిలో చూడవచ్చు. ఈ కాలపు ఆలయాల్లో ప్రత్యేకంగా నృత్య శిల్పాలు కనిపిస్తాయి. మరో ప్రత్యేక శిల్పం మానిని - మర్కటం... అంటే, నాట్యకత్తె కటి వస్త్రాన్ని విటుడు లాగుతుండటం. అయితే ఇలాంటి శిల్పాలు గుజరాత్‌లోని రాణికీవావ్‌ (బావి) శిల్పాల్లో కనిపిస్తాయి. కటాక్షపూర్‌లో ఒక శిల్పంలో రాణి రుద్రమ తన మనుమడు ప్రతాపరుద్రుణ్ని హంసపై ఊగిస్తున్నట్లున్న చిత్రం ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఒక శాసనంలో కాకతీయ శిల్పులు అతుకులు కనిపించనంత నేర్పుగా శిల్పాలు చేయగల సమర్థులని చెప్పారు. కాకతీయ శిల్పాలను చూస్తే ఇది అక్షరసత్యమని తెలుస్తుంది.
కాకతీయానంతర కాలంలో పద్మనాయక రాజులు తమ రాజధానులు రాచకొండ, దేవరకొండ, ఉమామహేశ్వరం, కందికొండ తదితర క్షేత్రాల్లో నిర్మించిన రామాలయాలు, నరసింహాలయాలు, శివాలయాల్లో గోడలు, స్తంభాలపై కొంత శిల్పం కనిపిస్తుంది కానీ కాకతీయ శిల్ప ప్రభ తగ్గుముఖం పట్టిందని అర్థమవుతుంది- ఒక్క డిచ్‌పల్లి రామాలయంలో తప్ప. క్రీ.శ.1460లో ఒక స్థానిక సామంతుడు నిర్మించిన ఈ ఆలయం విజయనగర వాస్తుశైలిలో నిర్మితమైన మిథున శిల్పాలు, నునుపు స్తంభాలు మాత్రం మాతృకలను తలదన్నేలా ఉంటాయి. గద్వాల జిల్లాలోని కృష్ణా తీరస్థ జటప్రోలు, కొల్లాపూర్, శ్రీరంగాపూర్‌ వైష్ణవాలయ గోపురాలు, మండప స్తంభాలు, ఆలయ పైకప్పుల్లో విజయనగర శిల్పకళ కనిపిస్తుంది.
కళింగ గాంగ - వేంగీ చాళుక్య శిల్పకళ
క్రీ.శ.6-10 శతాబ్దాల మధ్య కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కళింగ గాంగ రాజులు శ్రీముఖలింగం రాజధానిగా పాలించారు. ఇక్కడి మధుకేశ్వరాలయ గోడలపై శివ, అజ, ఏకపాద శివ, ఉమామహేశ్వర, నటరాజు, అంధకాసుర, కల్యాణ సుందరమూర్తి లకులీశ, గణేశ, కార్తికేయ, హరిహర, వరాహ, ఉగ్రనరసింహ, దుర్గ, సూర్య, సప్తమాతృకలు, గ్రహాలు, గణాలు, రుషులు, మిథునాలు, సాలభంజికలు, భక్తులు, గజయానాలు, అశ్వయానాలు తదితర శిల్పాలను చాలా అందంగా కళింగ శైలిలో చెక్కారు. గిరిజనులు చేసుకొనే చెక్క మాస్కుల (ముఖ తొడుగులు) మాదిరిగా కనిపించే ఈ శిల్పాల ముఖాలు చతురస్రాకారంలో ధనురాకారపు కనుబొమ్మలు, మిడిగుడ్లు, కోటేరు ముక్కు, బొద్దు పెదవులు, స్పష్టమైన గడ్డంతో సన్నగా, పొడవుగా అందంగా ఉంటాయి. ఈ తరహా శిల్పాలు ఉత్తరాంధ్రలోని అరసవిల్లి, గలావిల్లి, దీర్ఘాసి, జయతిలో కూడా కనిపిస్తాయి.
      క్రీ.శ.7-11 శతాబ్దాల మధ్యకాలంలో కోస్తాంధ్రలో అధిక భాగాన్ని తూర్పు చాళుక్య రాజులు వేంగీ రాజధానిగా పాలించారు. వీరి కాలపు అమరావతి, విజయవాడ, చేబ్రోలు, భీమవరం, దాక్షారామం, సామర్లకోట ఆలయాల్లోని శిల్పాలపై కళింగ గాంగ శైలీ ప్రభావం కనిపిస్తుంది. దాక్షారామం, సామర్లకోట ఆలయ ప్రాంగణాల్లో కనిపించే మొక్కుడు గుడులు, దాక్షారామంలోని ఆలయ ముఖమంటప స్తంభాలపై కనిపిస్తున్న మహిషాసుర మర్దిని, గజాసుర సంహారమూర్తి, శివభిక్షాటన, దిక్పాలకులు, ద్వార పాలకులు, రుషులు, దుర్గ, గణేశకుమార, వీరభద్ర, నటరాజు తదితర శిల్పాలు ఈ కాలపు శిల్పాలకు మకుటాయమానాలుగా నిలుస్తాయి. దాక్షారామం, సామర్లకోట, బిక్కవోలు ఆలయాల గోడలపై చెక్కిన ఇంద్ర, బ్రహ్మ, నటరాజు, దేవి, కిరాతార్జున, మృగవ్యథ గాథా శిల్పాలు తూర్పు చాళుక్య శిల్పకళకు అద్దం పడతాయి. ఈ శిల్పకళా ప్రభావం తొమ్మిదో శతాబ్దం నుంచి ఇతర తెలుగు ప్రాంతాలపైన కూడా పడిందనిపిస్తుంది.
చోళ - నొలంబ శిల్పకళ
క్రీ.శ.8-10 శతాబ్దాల మధ్య అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రాంతాలను హేమావతి రాజధానిగా నొలంబ వంశ రాజులు పాలించారు. పల్లవ శిల్పకళా ప్రభావంతో వీరు హేమావతి, శివారం, పెలుబండ పట్టణాల్లో ఆలయాలు కట్టించారు. హేమావతిలోని దొడ్డేశ్వరాలయపు కోష్టాల్లో నిలిపిన గంగ, యమున, విష్ణు, బ్రహ్మ, కార్తికేయ శిల్పాలు ఆస్వాదించే అందంతో అలరారుతుంటాయి. ఉమాదేవి నడుము చుట్టూ చేయివేసి వీరాసనంలో కూర్చున్నట్లున్న ఉమామహేశ్వర శిల్పం ఓ అద్భుతం. ఈ కాలపు శిల్పాలు కళింగ-వేంగీ శిల్పాలకు కొంత భిన్నంగా అండాకారపు ముఖాలు, విశాల ఫాలభాగం, కొచ్చెటి చుబుకం, స్థూపాకారపు మొండెం, కురుచ భుజాలతో కనిపిస్తాయి. అయితే యవ్వనంతో మిసమిసలాడే తాజాదనంతో ఈ కాలపు శిల్పాలు పరిగణించదగినన్ని బృహదాకారాల్లో కనిపిస్తాయి.
      క్రీ.శ. 6-10 శతాబ్దాల మధ్యకాలంలో రాయలసీమ ప్రాంతాన్ని పొత్తపి రాజధానిగా పాలించిన రేనాటి చోళుల ఆలయాలు అత్తిరాల, పెదముడియం, ముత్తుకూరు, రామేశ్వరం, చిలమలూరు, పుష్పగిరి తదితర ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఈ కాలపు ఆలయ శిల్పాల్లో నొలంబ, చోళ (దక్షిణాది) శిల్పాకళా ప్రభావం కనిపిస్తుంది. అదనంగా రేనాటి చోళుల ఆలయ కోష్టాలు కీర్తి ముఖం, శంఖనిధి - పద్మనిధి శిల్పాలతో శోభిస్తాయి. ఇలాంటి శిల్పకళతో ఒప్పారే అగస్త్యేశ్వర ఆలయాలు చిలమకూరు, అత్తిరాలలో ఉన్నాయి. చిలమకూరులోని దక్షిణామూర్తి, నటరాజు, మన్మథ విగ్రహాలు, పౌరాణిక గాథా శిల్పాలు ప్రత్యేకంగా చూడదగినవి. అత్తిరాల ఆలయ శిఖరంపైనున్న శివ, దక్షిణామూర్తి, ఉమామహేశ్వరుల శిల్పాలు అత్యంత రమణీయమైనవి. దక్షిణామూర్తి శిల్పంలో అపస్మారుని రూపం ప్రత్యేకంగా గమనించదగినది.
      మొత్తమ్మీద శాతవాహన, ఇక్ష్వాకుల కాలంలో రెండువేల సంవత్సరాల కిందట వారి రాజధానీ నగరాల్లో- కృష్ణా గోదావరీ తీరాల్లో - బౌద్ధశిల్పం పరిఢవిల్లింది. అనంతర కాలపు విష్ణుకుండుల కాలంలో వారి రాజధానీ నగరాల్లో గుహ వాస్తు- శిల్పకలలు హిందూమత అంశాలవైపు పరుగులిడినాయి. తదనంతరం తెలంగాణలో చాళుక్య- కాకతీయ శిల్పకళా రీతులు ఉచ్ఛస్థితికి చేరుకోగా, కోస్తాంధ్రలో కళింగ శిల్పకళ ప్రభావం, రాయలసీమలో పల్లవ-చోళ శిల్పకళా ప్రభావిత శిల్పాలు మనుగడలోకి వచ్చాయి. ఇవన్నీ తెలుగు శిల్పకళా వైభవాన్ని, జాతి ప్రతిష్ఠనూ దశదిశలా చాటేవే!


వెనక్కి ...

మీ అభిప్రాయం