జానపద కళలు.. తెలుగు రవికిరణాలు

  • 5043 Views
  • 31Likes
  • Like
  • Article Share

    ఆచార్య జ‌య‌ధీర్ తిరుమ‌ల‌రావు

  • క‌వి, ప‌రిశోధ‌కుడు
  • హైద‌రాబాదు
  • 9951942242
ఆచార్య జ‌య‌ధీర్ తిరుమ‌ల‌రావు

భారతీయ జానపద కళా రూపాల్లో తెలుగువారి కళలకి ప్రత్యేకస్థానం ఉంది. ఇక్కడ అనాది నుంచి ఈనాటి వరకు జీవించి ఉన్న అతిపెద్ద కొయ్యబొమ్మలు, పన్నెండు రకాల పటం కథలు, వివిధ ప్రజావీరుల కథలు లాంటి వాటి విలక్షణత ఈ విషయాన్ని రుజువు చేస్తాయి. ఇప్పటిదాకా నిలిచి ఉన్న ప్రజా సాంస్కృతికోద్యమ కళలు, సంప్రదాయ కళా పునాదుల బలం పైనే నిలిచి ఉన్నాయి. సుంకర, సుద్దాల హనుమంతు, వయ్యరాజారాం, నాజర్, పాణిగ్రాహి, గద్దర్, వంగపండు, విమలక్క వంటి వారికి ఈ ప్రాచీన కళలే ప్రేరణ.
తెలుగువారి
జానపద కళలు అనగానే మనకు ఈ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న 34 తెగల ఆదివాసీల కళారూపాలు, సంగీతం గుర్తుకొస్తాయి. శిష్టకళలకి ఇవే మూలరూపాలు. ఐతే వీటికి రావాల్సిన కీర్తి ప్రతిష్ఠలు రాలేదు. వాటిని వాడుకుని వదిలివేశాం. మన మూలాలను, సాంస్కృతిక ఘనతలను గుర్తించలేకపోయాం. వీటిని ప్రయత్నపూర్వకంగా వెలికి తీసి ప్రచారం చేయలేకపోయాం. ఓ గోండి గుసాడి నృత్యాలను, కోయల బైసన్‌ నృత్యాన్ని, సవరల ధింసా నృత్యాన్ని మాత్రమే మనకు అనువుగా మార్చుకున్న రూపాన్ని మాత్రమే గుర్తించాం. వారి అసలు సంగీత ఝరీ జలపాతాలను చూడలేకపోయాం. గిరిజనుల ప్రదర్శన రీతులును, పాఠ్య భాగాలను సేకరించలేదు. స్వదేశీయులకన్నా విదేశీయులే ఎక్కువ గిరిజన తెగలపై పని చేశారు.
      గ్రామీణ కళా సంప్రదాయాలను సైతం పరిశోధకులు తమ పట్టాల కోసం పరిశోధనాంశాలను చేశారు. అందువల్ల అవి ఒక కళారూపంగా ప్రపంచానికి పరిచయం కాలేదు. కిన్నెర తంత్రీవాద్యం, ఈ కోవకే చెందిన కడ్డీ తంత్రీ వాద్యం, దళిత నాగస్వరం, దుబ్బులవారి చర్మవాద్యం, విల్లు వాద్యం వంటివి తెలుగువారి ప్రత్యేక వాద్యాలుగా పేర్కొనవచ్చు. వీటిని నాలుగైదు రోజుల కథని చెప్పే సాధనాలుగా, ఆ కథలు తెలుగువారి వీరోచిత గాధల చక్రాలుగా లోకానికి చెప్పుకోలేకపోయాం.
      అయినప్పటికీ ఇంకా ప్రజాదరణ పొందిన అనేక కళారూపాలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ఊదే వాద్యాలు, చర్మవాద్యాలు, తంత్రీవాద్యాలు, మోగించే వాద్యాలు ఉపయోగించే కళాప్రదర్శనలు విలక్షణమైనవి. మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురంలో మాదాసి కురవలు అనేవారు ప్రదర్శించే గొరవయ్యల నృత్య ప్రదర్శన అద్భుత కళారూపం. ఒక చేత్తో పిల్లంగోవి వాయిస్తూ, మరో చేత్తో జగ్గు లేదా ఢమరుకం వాయిస్తూ మధ్యమధ్యలో ‘వచనాలు’ పాడుతూ సామూహిక నృత్యం చేస్తారు. దీనిని ఆదిమ గిరిజన జానపద కళల సమ్మిశ్రణ కళగా భావించవచ్చు. పైగా వీరు పెట్టుకునే టోపీ ఖండాంతరాల కావల గల ఆదివాసీ పురా సంప్రదాయ నమూనా కలిగి ఉంటుంది. ఇది వీరశైవ మతాచార కళారూపంగా మారింది. కాని దీని మొదటి రూపం అతి ప్రాచీన కాలానికి చెందినది. ఈ కళారూపం కన్నడ ప్రాంతంలో కూడా కనిపిస్తుంది. వీరు రెండు భాషల్లో వచనాలు పాడి అదరగొట్టేస్తారు. నిజానికి ఒగ్గుకథ, మందహెచ్చు కథ ఈ కోవలోకే వస్తాయి.
పటం కథలు విన్నారా! 
భాగోతం లేదా యక్షగానంగా పేరు పొందిన చిందు భాగోతం తెలంగాణాలో అమితంగా ప్రచారంలో ఉంది. చిందు ఎల్లమ్మ ఈ కళకి విశిష్టమైన ఖ్యాతి తీసుకువచ్చింది. ఒగ్గు కథకు మిద్దెరాములు, మొన్ననే మరణించిన చుక్క సత్తయ్య కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. దేశవ్యాప్తంగా ఆ కళారూపాన్ని ప్రదర్శించి మన్ననలను పొందారు.
      కళింగ ప్రాంతం కళారూపాల్లో పేరెన్నదగిన తప్పెటగుళ్లు, జముకుల కథ, జాలరి నృత్య ప్రదర్శనలు ఎన్నో ఉన్నాయి. వీటిని ఆధారంగా చేసుకుని ప్రజాకళాకారుడు వంగపండు ప్రసాదరావు జనం కథల పేరుతో వాటిని తిరిగి ప్రజలకు కొత్తరూపంలో అందించారు. రాయలసీమలో వీరణాల ప్రదర్శన, గంగమ్మ జాతరలు, కుప్పం వీధినాటకాలు, ఊరూరా పండగలా సాగే భారత కథల సంబరాలు ప్రత్యేకించి పేర్కొనదగిన కళలు.
      తెలంగాణలో పటం కథలు ప్రత్యేకమైనవి. ఇవి కుల పరాణ గాన ప్రదర్శనలు. పన్నెండు రకాల కథలను ఆయా సామాజిక వర్గాల వారికి ప్రత్యేకంగా ప్రదర్శించడం రివాజు. వీటిని సమాంతర పౌరాణిక కథలుగా పేర్కొనవచ్చు. గత సమాజపు కట్టుబాట్లు, నీతి నియమాలు, ఆచారాలు వీటిలో వ్యక్తమవుతాయి. ఎన్నో రకాల సామాజిక స్థితిగతులు కూడా ప్రదర్శిస్తారు. వివిధ రకాల దరువులతో, గేయ రీతులతో, ప్రదర్శనా విధానాలతో అలరారుతాయి. బతుకమ్మ నృత్యం, బోనాల ఆట, చుట్ట కాముడు నృత్యం స్త్రీల ప్రత్యేకం. సంగీత వాద్యం లేకుండానే కేవలం చప్పట్లతో నృత్యం ప్రదర్శించడం వీటి ప్రత్యేకత.
ఆ ప్రాంతాల్లోనూ తెలుగు కళలు
వేలాది ఏళ్ల నుంచి ప్రచారంలో ఉన్న కళారూపాల ప్రదర్శనలపై ఎవరూ ఎక్కువగా దృష్టి పెట్టలేదు. కేవలం వాటిలోని ‘పాఠ్యం’ పైనే ఆసక్తి కనబరిచారు. ఆయా కళారూపాల చరిత్ర, వాటికి ప్రేక్షకులకి గల సంబంధ బాంధవ్యాల చర్చ జరగలేదు. ఆయా కాలాల్లో ఎవరి ప్రచారానికి, అవసరానికి తగినట్లుగా వాటిని వాడుకున్నారు. లోగడ మతం, కులం, ఆలయ వ్యవస్థ, గ్రామీణ జన వినోదం కోసం వీటిని మార్చుకోవడం జరిగింది. భూస్వామ్య రాచరిక వర్గాలే వీటిని మార్చుకున్నారు. అందుకే వీటిలో ఎక్కువగా మతం ప్రభావం ఉంటుంది. మతానికి సంకేతాలుగా దైవాలను, వారి గుర్తులను, ఆ దైవాల అద్భుతాలను ఈ కళారూపాలు గానం చేస్తాయి. మరోవైపు చారిత్రక గాథల్ని ప్రదర్శించే కళారూపాలు ఉన్నాయి. పలనాటి వీరచరిత్ర, బొబ్బిలి యుద్ధం, కాటమరాజు కథా ప్రదర్శన, సర్వాయి పాపన్న, పండగ సాయన్న లాంటి చారిత్రక, అస్పష్ట చారిత్రక గాన ప్రదర్శనలు తెలుగువారి చరిత్రకు అదనపు జోడింపులు. ఈ కోవలో ప్రతి ప్రాంతంలో స్థానిక వీరులపై గాథలు అనేకం ఉన్నాయి.
      తెలుగు నేల మీదే కాకుండా సరిహద్దుల కావల ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ లాంటి రాష్ట్రాల్లో తెలుగు కళారూపాలు అనేకం సజీవంగా ఉన్నాయి. కొన్ని ఇక్కడ ప్రచారంలో కనిపించేవిధంగా అక్కడ ఉన్నాయి. మరికొన్ని ఇక్కడ లేనివి అక్కడ ఉన్నాయి. ముఖ్యంగా యక్షగాన రీతిలో సాగే పౌరాణిక నాటకాలు చాలా ప్రత్యేకమైనవని సుప్రసిద్ధ పరిశోధకుడు ఆరుద్ర అభిప్రాయం. సుమారు దశాబ్దం కిందట హోసూరులో జరిగిన తెలుగు కళల వరసలో ఎన్నో కళారూపాలను ప్రదర్శించారు. వీటిలో స్త్రీల కళలు, పురుషుల కళలు, వీధి కళలు, గ్రామ కళలు అని ప్రత్యేకంగా ఉన్నాయి. బొమ్మలు చూపుతూ, ఆడిస్తూ పాడే కళారూపాలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
కళాదాహార్థిని తీర్చలేరా?
ఈ కళారూపాల వల్ల తెలుగునేల కాని తెలుగు ప్రాంతంలో తెలుగు భాష నిలుస్తోంది. కేవలం అక్షరాలు నేర్పితేనే తెలుగు బతుకదు. అందుకే ఈ కళారూపాలకు ప్రోత్సాహం కలిగించడం ముఖ్యం. పాడేవారు, వినే వేలాది శ్రోతలు ఒక భాషాకుటుంబంగా మసలడం జానపద కళల వల్లే సాధ్యం. మహారాష్ట్రలో వందల ఏళ్లుగా నాలుగైదు జిల్లాలు హైదరాబాదు సంస్థానంలో భాగం. అంతేకాదు. ఆ జిల్లాల్లో తెలుగువారి సంఖ్య అధికం. భివాండి, ముంబయి, సూరత్‌ వంటి ప్రదేశాల్లో లక్షలాది మంది ప్రజలు తెలుగు భాషీయులే. అందుకే అక్కడ తెలుగు జానపద కళారూపాలు ఎన్నో సజీవంగా కనుపిస్తాయి. డక్కలి జాంబపురాణం, యాదవ కథల ప్రదర్శనలు, పాండవ కథలను వినోదం కోసం, క్రతుకర్మకాండల సందర్భాల్లో ప్రదర్శించడం సంప్రదాయం.
      ప్రస్తుతం తెలుగు నేలమీద నడయాడే జానపద కళల చరిత్ర సమగ్రంగా పరిశోధించుకోవాల్సిన సందర్భం. ఆయా కళారూపాలను శాస్త్రీయంగా నమోదు చేయాల్సి ఉంది. కళారూపాలు బతకందే ‘కళ’ నిలబడదు. కళాకారులు అంతమొందితే కళారూపం చరిత్ర, ప్రదర్శన శైలి సైతం చెరిగిపోతుంది. ఐతే వీటిని కాపాడుకునే పథకం ఇప్పటిదాకా ప్రభుత్వాలకి లేకపోవడం శోచనీయం. ఇందుకోసం సరిపడ బడ్జెట్‌ కేటాయించలేకపోవడం బాధాకరం. మంచినీళ్లలా నీటి ప్రాజెక్టులకు డబ్బు ఖర్చు చేయడమే కాదు, ప్రజల కళాదాహార్థి తీర్చడం కూడా ముఖ్యమే. జానపద కళా సముద్రం నుంచి కాలువలు తవ్వి ప్రజల ముంగిళ్లలోకి ప్రవహింపచేయడం నేటి అవసరం. ముఖ్యంగా కళల్ని బతికించడం చాలా ముఖ్యం.


వెనక్కి ...

మీ అభిప్రాయం