కన్నడసీమలో తెలుగు ‘శాసనం’

  • 1261 Views
  • 3Likes
  • Like
  • Article Share

    డా॥ నాగోలు కృష్ణారెడ్డి

  • ప్రాచీన భార‌తీయ చ‌రిత్ర‌, సంస్కృతి, పురావ‌స్తు శాస్త్ర విభాగాధిప‌తి,
  • తిరుప‌తి
  • 9441112636
డా॥ నాగోలు కృష్ణారెడ్డి

‘‘ప్రాచీన శాసనాలను లోతుగా అధ్యయనం చేసినకొద్దీ కొత్త కోణాలు బయటపడతాయి. భాషా సంస్కృతులకు సంబంధించిన నూతన కోణాలు వెలికివస్తుంటాయి’’ అంటారు ప్రఖ్యాత శాసన పరిశోధకులు పి.వి.పరబ్రహ్మశాస్త్రి. ఇటీవల వెలుగులోకి వచ్చిన కన్నడ నేల మీది తెలుగు శాసనాలు ఈ విషయాన్ని నిర్ధరిస్తున్నాయి. తెలుగుజాతి చరిత్ర, సామాజిక పరిణామాలకు సంబంధించి ఇలా సరికొత్త సమాచారం అందుబాటులోకి రావడం విశేషమే కదా!  
ఇతర
రాష్ట్రాల్లో దాదాపు వెయ్యి వరకూ తెలుగు భాషా శాసనాలు ఉన్నాయని అంచనా. వాటిలో సగానికంటే ఎక్కువ కర్ణాటక, తమిళనాడుల్లో ఉన్నాయి. మిగతావి ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో లభించాయి. ఈ శాసనాలను అధ్యయనం చేస్తే ఇతర ప్రాంతాల వాళ్లతో తెలుగువారికి ఉన్న సాంస్కృతిక సంబంధాలు తెలుస్తాయి. అయితే ఇంతవరకు వీటి మీద సమగ్ర అధ్యయనం జరగలేదు. మొదటిసారిగా డా।। శివలంక శ్రీరామచంద్రమూర్తి ఈ దిశగా కొంత కృషి చేసి ఇతర పరిశోధకులకు దారి చూపించారు.
      తెలుగు, కన్నడ ప్రాంతాలు మొదట్లో మౌర్య సామ్రాజ్య అంతర్భాగాలు. తర్వాత వీటిని శాతవాహనులు పాలించారు. బళ్లారి జిల్లా మ్యాకదొని దగ్గర శాతవాహన పులుమావి శాసనం లభించింది. పల్లవ శివస్కంధవర్మ హిరహదగళ్లి తామ్రశాసనంలోని ‘సాతాహని హార, సాతాహని రట్ట’ ప్రాంతాలు నేటి బళ్లారి, కర్నూలు జిల్లాల పరిధిలోకి వస్తాయి. బాదామి చాళుక్య రెండో పులకేశి (క్రీ.శ.609-642) కాలం నుంచి ఈ రెండు ప్రాంతాల మధ్య రాజకీయ, సాంస్కృతిక సంబంధాలు పెరిగాయి. రెండో పులకేశి ఆంధ్రలోని వేంగిని జయించి, తన తమ్ముడైన కుబ్జవిష్ణువర్ధనుణ్ని ఆ ప్రాంతానికి రాజును చేశాడు. అతనితో ప్రారంభమైన వేంగీ చాళుక్య వంశం క్రీ.శ.1061 వరకు దాదాపు నాలుగున్నర శతాబ్దాల పాటు ఆంధ్రదేశాన్ని పాలించి.. తెలుగు భాషా, సంస్కృతులకు ఎనలేని సేవ చేసింది. బాదామి, వేంగీ చాళుక్యుల మధ్య పటిష్టమైన బంధం ఉండేది. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు బాదామి చాళుక్యుల పాలనలో ఉండేవి. వారి తెలుగు, కన్నడ శాసనాలు ఈ ప్రాంతాల్లో లభించాయి. కోస్తాంధ్రను వేంగీ చాళుక్యులు పాలించారు. అక్కడ వారి తెలుగు, సంస్కృత శాసనాలు లభించాయి. తర్వాత బాదామి చాళుక్యుల పాలన అంతమై కర్ణాటకలో రాష్ట్రకూటులు అధికారంలోకి వచ్చారు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలూ రాష్ట్రకూటుల వశమయ్యాయి.  
      కన్నడ ఆదికావ్యం విక్రమార్జున విజయాన్ని రాసిన పంప కవి వేంగీ నుంచి కర్ణాటకకు వెళ్లాడు. అతడు వేములవాడ చాళుక్య రాజైన రెండో అరికేసరి ఆస్థాన కవి. మహాభారతానువాదంలో నన్నయకు సహకరించిన నారాయణభట్టు కర్ణాటక నుంచి ఆంధ్రదేశానికి వలసవచ్చాడు. దాక్షారామంలో లభించిన శాసనాన్ని బట్టి అతడు కళ్యాణి చాళుక్య రాజైన త్రైలోక్యమల్లదేవుడి దగ్గర మంత్రిగా ఉండేవాడు. రాష్ట్రకూటుల తర్వాత రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో కళ్యాణి చాళుక్యుల పాలన ప్రారంభమైంది. కాకతీయులు మొదట్లో కళ్యాణి చాళుక్యుల సామంతులు. తెలంగాణలో లభించిన కాకతీయుల మొదటి శాసనాలు కన్నడంలో ఉన్నాయి. కాకతీయుల తర్వాత కన్నడ, తెలుగు ప్రాంతాలతోపాటు మొత్తం దక్షిణ భారతదేశమంతా విజయనగర రాజుల పాలనలోకి వచ్చింది. క్రీ.శ.4వ శతాబ్ది నుంచి విజయనగర పాలనా కాలం వరకు కన్నడ, తెలుగు ప్రజలకు ఒకే లిపి వాడుకలో ఉండేది. దీన్నే ‘తెలుగు- కన్నడ లిపి’గా పిలిచేవారు. విజయనగర యుగం తర్వాత అది వేర్వేరు లిపులుగా విడిపోయింది. ఇలా కర్ణాటక, తెలుగునాడుల మధ్య సన్నిహిత రాజకీయ, సాంస్కృతిక సంబంధాలు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. 
గోన గన్నారెడ్డి... నాచన సోమన
కర్ణాటకలోని కోలారు, తమకూరు, బళ్లారి, మైసూరు, మండ్య, బెంగళూరు, చిత్రదుర్గ, హసన్‌ జిల్లాల్లో దాదాపు 357 తెలుగు శాసనాలు లభించాయని డా।। శివలంక శ్రీరామచంద్రమూర్తి లెక్కతేల్చారు. అయితే, ఎక్కువ భాగం కోలారు జిల్లాకు చెందినవే. పాలకులతో పాటు ఇతర వ్యక్తులూ ఈ శాసనాలను వేయించారు. వీటిలో కాకతీయుల కాలం నాటి రాయచూరు శాసనం మొదటిది. అక్కడి కోట గోడ మీద దీన్ని చెక్కారు. క్రీ.శ.1294 నాటి ఈ శాసనం గోన వంశీయుడైన గోన గన్నారెడ్డి, రుద్రమదేవి సామంతుడుగా, వర్ధమానపురం రాజధానిగా పరిపాలిస్తున్నట్లు స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ శాసనం గోన గన్నారెడ్డిని ‘కాకతీయ కటక సన్నాహుడ’ని, ‘కోసగిమైల తలగొండు గండడ’నీ (కోసగి మైలుడనే వాడి శిరస్సును ఛేదించిన వీరుడు), ‘ఏరువతొండ గోధూమఘరట్టమ’నీ (ఏరువ తొండడు అనే గోధుమలకు తిరగలి లాంటివాడు), ‘దక్షిణ భుజాదండ’మనీ వర్ణిస్తుంది. ఈ గోన గన్నారెడ్డికి సామంతుడైన విఠల భూనాథుడు ఆదలూని, తుంబళం (కర్నూలు జిల్లా) మొదలైన కోటలను జయించిన తర్వాత రాయచూరు కోటను కట్టించాడన్నది ఈ శాసన ప్రధాన విషయం.
      విజయనగర సామ్రాజ్య స్థాపన తర్వాత తెలుగు, కన్నడ నేల మధ్య సంబంధాలు ఇంకా సన్నిహితమయ్యాయి. కర్ణాటకలో లభించిన ఎక్కువ తెలుగు శాసనాలు ఈ కాలానికి చెందినవే. క్రీ.శ.1344 నాటి మొదటి బుక్కరాయలకు చెందిన రెండు తామ్రశాసనాల్లో ‘ఉత్తరహరివంశం, వసంతవిలాసం’ కావ్యాలు రాసిన ప్రసిద్ధ తెలుగుకవి నాచన సోమన ప్రసక్తి ఉంది. ఈ రెండు శాసనాలూ కోలారు జిల్లాలో లభించాయి. ఇందులో నాచన సోమన అష్టాదశ పురాణాలను అధ్యయనం చేశాడని, అష్టభాషల్లో మంచి కవిత్వం చెప్పగలిగేవాడనీ ఉంది. గుత్తి రాజ్యంలోని కోడూరు సీమలో భాగమైన పెన్నమాగాణిలో, పెన్నా నది ఒడ్డున ఉన్న పంచుకాలదిన్నె అనే గ్రామాన్ని నాచన సోమన దానంగా పొందాడన్నది శాసన సారాంశం. కడప జిల్లాలోని తుడుముల దిన్నెలో లభించిన మరో రెండు శాసనాల్లోనూ ఈ కవి ప్రసక్తి కనిపిస్తుంది. వీటి కాలాన్ని బట్టి చూస్తే, నాచన సోముడు చాలా కాలం జీవించినట్లు తెలుస్తుంది.
భార్య అనుమతితో కొనుగోలు
అచ్యుత దేవరాయలకు చెందిన ఓ తామ్రశాసనాన్ని బట్టి- అతడు కందిరికంటి దుర్గం, చలమకోట గ్రామం, చెన్నకేశవ దేవాలయాలను నిర్మించాడు. ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు జరగడానికి, ఉభయవేదాంత అధ్యయనాల కోసం గ్రామ నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ శాసన రచయిత చలంకోట గ్రామానికి చెందిన ‘కులకరణి’. ఇప్పుడు కర్ణాటకలో కనిపించే ‘కులకర్ణి’ అనే పేరు ఈ కులకరణి నుంచి వచ్చిందే. కులకరణి అంటే లెక్కలు రాసేవాడు (ఎకౌంటెంట్‌) అని అర్థం. 
      క్రీ.శ.1532 నాటి బళ్లారి జిల్లా పాపినాయనహళ్లి శాసనంలో ‘ఆరుగోందల అంకాళమ్మ’ అనే గ్రామదేవత ప్రసక్తి ఉంది. తలారి తిమ్మినాయకుడి కొడుకులు ఈ అంకాళమ్మ అమృతపడి సేవలకు నిడిగల్లు లేదా అపినాయకపురమనే గ్రామంలో కొంత భూమిని కొని, దానంగా ఇచ్చినట్లు ఈ శాసనం చెబుతోంది. తెలుగునాడులోని ఆరుగొందల నుంచి బళ్లారి జిల్లాలోని నాయకనహళ్లి గ్రామానికి వలసవెళ్లిన వారు అక్కడ ఆ గ్రామంలో తాము పూజించే అంకాళమ్మను ప్రతిష్ఠించి ఉండొచ్చు. అందుకే ఆ దేవత ‘ఆరుగొందల అంకాళమ్మ’ అయ్యింది!
      అనంతపురం జిల్లా లేపాక్షిలోని వీరేశ్వర దేవాలయం విజయనగర కాలంలో చాలా ప్రసిద్ధి చెందింది. అచ్యుత దేవరాయల కాలంలో ఈ దేవాలయానికి కోలారు జిల్లాలోని ఓ గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు ఒక శాసనం పేర్కొంటోంది. క్రీ.శ.1537 నాటి ఈ శాసనం ప్రకారం నంది చెరువు లేదా విరూపాక్షపురమనే గ్రామాన్ని ఒక వ్యక్తి, తన భార్య, కొడుకులు, దాయాదులు, జ్ఞాతులు, బంధువులు మరికొంతమంది వ్యక్తుల అనుమతితో అన్ని హక్కులతో కొని, దానంగా ఇచ్చాడు. మధ్యయుగంనాటి అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన విషయాలు, కొనడానికి భార్య అనుమతి కూడా తీసుకోవడం తదితరాలు ఈ శాసనంలో పరిశీలించదగినవి. పెనుగొండకు తూర్పున ఉన్న గుయ్యలూరి సీమలోని మారగానకుంట గ్రామాన్ని.. అక్కడి కాల్వలు, చెరువులతో సహా స్థానిక తిరువెంగళనాథ స్వామికి దానం చేసినట్టు మరో శాసనం చెబుతోంది. క్రీ.శ.1539 నాటి ఈ శాసనం ప్రస్తుత కోలారు జిల్లా మారగాని కుంటలో లభించింది. 
వాణిజ్యసంస్థల ప్రాభవం
కోలారు జిల్లాలోనిదే అయిన కైవార గ్రామంలో దొరికిన ఓ శాసనం వాణిజ్య సంస్థలకు సంబంధించిన విశేషాలను అందిస్తుంది. ఈ సంస్థలు అతి ప్రాచీన కాలం నుంచీ చాలా పలుకుబడి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండేవి. వీటి పెద్దలకు విశేష అధికారాలు ఉండేవి. పాలకులు కూడా వీళ్ల నిర్ణయాల్లో జోక్యం చేసుకునేవారు కారు. కొన్ని పన్నులు విధించడానికి, రద్దు చేయడానికి, తమ సొంత నాణేలు ముద్రించుకోవడానికి ఈ వాణిజ్య సంస్థలకు అధికారం ఉండేది. వీటికి ప్రత్యేక లాంఛనాలూ ఉండేవి. ఈ కైవార శాసనం క్రీ.శ.1361 నాటిది. ‘మహామండలేశ్వర’, ‘పూర్వపశ్చిమ సముద్రాధిపతి’ బిరుదులు కలిగిన వీరబుక్కన్న ఒడయల కుమారుడు కంపణ్ణ ఒడయల్ని ఈ శాసనం పరిపాలకుడిగా పేర్కొంది. దీని ప్రకారం... కైవారనాడుకు చెందిన ప్రజలు, ఉభయ నానాదేశిపెక్కండ్రు, పద్దెనిమిది సమయాల (సంఘాలు) సభ్యులూ కలిసి ఓ సంతను కట్టించారు (అంటే సంత జరుపుకోవడానికి ఒక కట్టడాన్ని నిర్మించడం). ఆ సంతకు మారప్పశెట్టి సోదరుడు పెరియనాయనను ‘పట్టణస్వామి’గా నియమించారు. అతనికి కొంత భూమిని సర్వమాన్యంగా ఇచ్చారు. ‘పట్టణస్వామి’ అంటే వాణిజ్యసంస్థకు అధ్యక్షుడి లాంటివాడు.
అలాగే మధ్యయుగం నాటి ప్రసిద్ధ ‘స్వదేశ, పరదేశ, ఉభయ నానాదేశ సాలుమూల సమస్త పెక్కండ్రు’ లాంటి వాణిజ్య సంస్థలు పదిహేడో శతాబ్దిలో కూడా చాలా చురుకుగా ఉండేవని మరికొన్ని శాసనాలు నిర్ధరిస్తాయి. ‘‘విజయనగర రెండో రామదేవుడి సామంతుడూ, యలహంకప్రభువూ అయిన మొదటి కెంపెగౌడ కుమారుడు ఇమ్మడి కెంపెగౌడ అనుమతితో అయ్యావళి ముఖ్యులైన స్వదేశ పరదేశ ఉభయ నానాదేశ సాలుమూల సమస్త పెక్కండ్రు రంగనాథ స్వామి పూజలకు, నిత్య నైవేద్యాలకు దానాలు చేశా’’రన్నది బెంగళూరులోని బల్లాపురద పేట రంగనాథ] దేవాలయ శాసన (క్రీ.శ.1627) కథనం. మొదటి కెంపెగౌడ బెంగళూరు నగర నిర్మాతనీ, ‘గంగాగౌరీ విలాస’మనే తెలుగు యక్షగాన గ్రంథాన్ని రచించి, దాన్ని దెల్సూరు (ఇప్పటి బెంగళూరు నగరంలో ఓ భాగం) సోమేశ్వరస్వామికి అంకితమిచ్చాడని పండితుల అభిప్రాయం. ఈ వాణిజ్యసంస్థల్లోని సభ్యులు తెలుగునాడులోని పెనుగొండ, చంద్రగిరిలకు, కర్ణాటకలోని బెంగళూరు, శ్రీరంగపట్నం, బేలూరులకు చెందినవారు. అలాగే క్రీ.శ.1698 నాటి ఓ తామ్ర శాసనంలో ఈ వాణిజ్య సంస్థల సభ్యులు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడుల్లోని 54 గ్రామాలకు చెందినవాళ్లన్న వివరాలున్నాయి. దీన్ని బట్టి ఇలాంటి సంస్థల పరిధి ఎంత విస్తృతమైందో అర్థం చేసుకోవచ్చు. 
హంపీలో తెలుగు శోభ
విజయనగర కాలానికి చెందిన మరొక శాసనం అప్పటి నీటిపారుదల సౌకర్యాల గురించి తెలియజేస్తోంది. క్రీ.శ.1396 నాటిదైన ఆ శాసనం కోలారు జిల్లా తిరుమణి గ్రామంలోని చెరువు దగ్గర లభించింది. ‘‘మహామండలేశ్వరులైన మొదటి బుక్కరాయల మనుమరాలూ, విరూపాదేవి కుమార్తె అయిన జొమ్మాదేవి ఆజ్ఞానుసారం పెనుగొండ రాజ్యంలో ఉన్న తిరుమణి గ్రామంలోని చెరువు నుంచి ఓ కాలువ తవ్వార’’ని ఈ శాసనం తెలుపుతోంది. తమకూరు జిల్లాలోని శిర, పావగడ తాలూకాలు, కోలారు జిల్లాలోని బాగేపల్లి తాలూకాతో సహా అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఆనాటి పెనుగొండ రాజ్యంలో భాగాలు. ఈ రాజ్యంలో ‘రొద్దనాడు’ ఓ ప్రాంతీయ విభాగమని తమకూరు జిల్లాలోని అరళికంటె గ్రామశాసనం (క్రీ.శ.1512) వల్ల తెలుస్తుంది. ‘‘పెనుగొండలోని రామచంద్రదేవుని ఆలయంలో త్రికాల సమారాధన నిర్వహణకు గానూ కృష్ణదేవరాయల రాయసం (ఓ అధికారి) కొండమరుసు పెనుగొండ రాజ్యంలోని రొద్దనాడులో అయోధ్యాపురమనే మరో పేరు గల రాయకుంట గ్రామాన్ని దానంగా ఇచ్చాడ’’న్నది ఈ శాసన సారాంశం. ఈ కొండమరుసు తండ్రి తిమ్మయ. ఈయన ఎవరో కాదు, ‘కృష్ణదేవారాయల శిరః ప్రధాని’గా చేజర్ల శాసనం పేర్కొన్న సాళువ తిమ్మరుసే! బుక్కపట్నం, విజయవాడ, చేజర్ల, భైర సముద్రం శాసనాల్లో కూడా ఈ కొండమరుసు ప్రశంస కనిపిస్తుంది.
అవీ మన సీమలే..!
బుక్కరాయపురమనే పేరు కలిగిన మురపతి గ్రామం నుంచి అక్రమంగా వసూలు చేసిన పన్నులను, ఇతర రాబడులను మహామండలేశ్వర రామరాజు విఠలరాజు తిరుమలయ్య దేవ మహారాజు స్థానిక దేవాలయానికి దానం చేశాడని చిత్రదుర్గ జిల్లా మురడి గ్రామంలో లభించిన క్రీ.శ.1556 నాటి శాసనం చెబుతోంది. ఇదే జిల్లాలోని కరడిహళ్లి గ్రామ శాసనంలో ఈ మహామండలేశ్వరుడే రాయదుర్గం సీమలో హరిహర రాయపురమనే మరో పేరు కలిగిన కరడిపల్లెలో అన్యాయంగా వసూలు చేసిన ధనాన్ని, అందుకుగాను విధించిన అపరాధ రుసుమును స్థానిక దేవాలయాలు, చెరువుల మరమ్మతులకు వినియోగించాలని పేర్కొనడం చూడవచ్చు. ఈ మురడి, కరడిపల్లె గ్రామాలు శాసనాలు లభించిన మురడి, కరడిహళ్లి గ్రామాలే. వీటికున్న హరిహరరాయపురం, బుక్కరాయపురమనే పేర్లు విజయనగర పాలకులైన హరిహర, బుక్కరాయల వల్ల వచ్చినవే. కరడిపల్లె గ్రామం రాయదుర్గం సీమలో ఉందనడం బట్టి చూస్తే... అప్పట్లో ఈ సీమ కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా వరకు విస్తరించి ఉండేది కాబోలు!
      కోలారు జిల్లా ఆవని గ్రామంలో లభించిన శాసనం, కుందురిపి వీరేశ్వరుని కూతురు వీరమ్మ మహాదేవునికి రెండు రాతి నంది విగ్రహాలను దానం చేసినట్లు చెబుతోంది. వీరేశ్వరుణ్ని ఈ శాసనం ‘బొమ్మలాట మోహనకవి పుణ్యశ్రీ వీరేశ్వరుడ’ని వర్ణించింది. అంటే, అతను బొమ్మలాట ఆడించడంలోను, కవిత్వం రాయడంలోను సిద్ధహస్తుడు కావచ్చు. ఇదే జిల్లాలోని ఉప్పుగుంటహళ్లి శాసనంలో కూడా, ‘‘పారువాటి పురాణం వీరప కొడుకు బొమ్మలాట కృష్ణప్పకు గంగరాయదేవ మహారాజు ఒప్పుగుంటపల్లి గ్రామాన్ని మాన్యంగా ఇచ్చి’’నట్లుంది. ఈ బొమ్మలాట, పారువాటి పరిణయం పదాలు సంబంధిత వ్యక్తుల ప్రజ్ఞకు అద్దంపడతాయి.  
      కర్ణాటకలో లభించిన తెలుగు శాసనాల్లో అత్యధికం విజయనగర సామ్రాజ్యం నాటివైతే, మళ్లీ వాటిలో ఎక్కువ భాగం సదాశివరాయల కాలానివే. ఇతనొక్కడివే దాదాపు 32 తెలుగు శాసనాలు (క్రీ.శ.1543- 70 మధ్యలోవి) లభించాయి. వీటిలో హంపీలో లభ్యమైన క్రీ.శ.1545 నాటి శాసనం విశిష్టమైంది. ‘‘జంబలదిన్నె పరిపాలకుడూ, కందనవోలి (ఇప్పటి కర్నూలు) కందాళ శ్రీరంగాచార్యుల శిష్యుడూ, మహామండలేశ్వరుడూ అయిన చిక్కరాజు, గంగావతీ సీమలో అచ్యుతరాయ సముద్రమనే మరో పేరున్న కరహళ్లి గ్రామంలోని 150 గణసంఖ్య వృత్తుల భూమిలో రెండు వృత్తుల భూమిని 75 ఘట్టి వరహాలకు కొని, దాన్ని విఠలేశ్వరాలయంలోని లక్ష్మీ నారాయణ పెరుమాళ్లకు నిత్యపూజా నిర్వహణకుగాను సమర్పించి’’నట్లు ఈ శాసనం తెలియజేస్తోంది. విజయనగర రాజ లాంఛనమైన వరాహ ముద్రిత నాణేలే కాలక్రమాన ‘వరహా’గా మారాయి. అయితే మామూలు వరహా కన్నా ‘ఘట్టివరహా’ తూకం, విలువ ఎక్కువ. ఇక ‘సముద్రం’ ఆ ఊరిలోని పెద్ద చెరువును సూచిస్తుంది. కాకతీయులు, విజయనగర రాజులు పెద్ద పెద్ద చెరువులు తవ్వించి, వాటిని సముద్రాలుగా పేర్కొన్న విషయం తెలిసిందే.
      కర్ణాటకలోని తెలుగు శాసనాలను అధ్యయనం చేస్తే తెలుగు భాష మీద కన్నడ ప్రభావం, కన్నడం మీద తెలుగు ప్రభావం, చారిత్రక భౌగోళికాంశాలు ఇంకా అనేక సాంస్కృతిక విశేషాలూ వెలుగులోకి వస్తాయి. కర్ణాటకలో తెలుగు శాసనాలున్నట్లే, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో కన్నడ శాసనాలు లభించాయి. వాటి మీద అక్కడి పండితులు అధ్యయనం చేశారు. తెలుగు రాష్ట్రాలకు బయటా అక్కడి తెలుగు శాసనాలపైన మాత్రం పూర్తిస్థాయి అధ్యయనం జరగలేదు. ఇప్పటికైనా మన పరిశోధకులు ఆ దిశగా దృష్టి సారించాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం