గురువే మిన్న

  • 1662 Views
  • 102Likes
  • Like
  • Article Share

    డా।। దువ్వూరి భాస్కరరావు

  • విశ్రాంత ఉపకార్యదర్శి, ఏపీపీఎస్సీ
  • హైదరాబాదు
  • 9440051605
డా।। దువ్వూరి భాస్కరరావు

ఓసారి కబీరుదాసును ఒక భక్తుడు ‘మీకు గురువు, శ్రీమన్నారాయణుడు ఒకేసారి ప్రత్యక్షమైతే ముందుగా ఎవరికి నమస్కరిస్తారు’ అని ప్రశ్నించాడు. దానికి కబీరు ‘గురువుకే నమస్కరిస్తా. ఎందుకంటే, గురువు ద్వారానే శ్రీమన్నారాయణుణ్ని తెలుసుకున్నా కాబట్టి’ అన్నాడు. దీన్నిబట్టి మన జీవితాల్లో గురువు పాత్ర ఎంత ప్రధానమైందో అర్థమవుతోంది. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః అంటూ గురువుకు త్రిమూర్తులతో సమానంగా పీటవేసింది భారతీయ సంస్కృతి. అలాంటి గురువుకూ ఓ పర్వదినం ఉంది. అదే గురుపూర్ణిమ. అదే వ్యాసపూర్ణిమ. పండ‌గ సంద‌ర్భంగా ఈ వ్యాసం...
వ్యాస మహర్షిని గురురూపంగా తలుస్తూ, ఆషాఢ పౌర్ణమిని గురుపూర్ణిమగా జరుపుకుంటున్నాం. ప్రతీ నెలలో ఏదో ఒక పండుగ దైవాన్ని స్మరించేందుకు వచ్చినా, గురువును ఉద్దేశించి జరుపుకునే పండుగ ఇది ఒక్కటే. నిత్య జీవితంలోనూ ఆధ్యాత్మికంగానూ అభివృద్ధి సాధించాలనుకునే వారికి ఎంతో ముఖ్యమైన, పవిత్రమైన పండుగ ఇది. జనమంతా గురువులను స్మరించే పర్వదినమిది. ఇక్కడ గురువు అంటే పాఠశాలలో విద్య బోధించేవారో, దేవాలయాల్లో అర్చన చేసే వారో, ప్రవచనాలు చెప్పేవారో కాదు. వీళ్లు సిద్ధ పురుషులు. అందుకే వాళ్లను సమర్థ సద్గురువని సంబోధిస్తారు. దేవతల గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రుడు, మానవులకు ఆది గురువు దత్తాత్రేయుడు. ప్రతీ సద్గురునిలోనూ అంతర్లీనంగా దత్తాత్రేయుని అంశ తప్పనిసరిగా ఉండి తీరుతుంది. గురు పూర్ణిమనాడు పొందే గురు దర్శనం, ఆశీస్సుల బలం సంవత్సరంపాటు సాధకునిలో ఉంటుంది. అదే శిష్యులకు, భక్తులకు కొండంత అండ. వారికి శుభప్రదం, శ్రేయస్కరం, శోభస్కరం. మనలో ఉండే గురు స్వరూపమే ‘అంతర్యామి’.
గంగా పాపం శశీతాపం దైన్య కల్ప తరుస్తధా
పాపం తాపంచ దైన్యంచ గురుర్హరతి దర్శనాత్‌

      గంగా స్నానం వల్ల పాపం, చంద్రుని వల్ల తాపం, కల్పతరువు వల్ల దారిద్య్ర దైన్యాలు నాశనం అవుతాయి. కానీ గురుదర్శనం వీటనింటినుంచి విముక్తి కలిగిస్తుంది.
వ్యాసుడి పేరు మీదనే...
కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలకు విభిన్నమైన ధర్మాలు ఉపదేశించేందుకు, వేదశాఖా ప్రవర్తకులు, స్మృతి సమాచార ప్రవర్తకులైన మహర్షులెందరో జన్మించారు. వాటిలో కృతయుగ ధర్మ ప్రతిపాదనకు మనువు, త్రేతాయుగ ధర్మ బోధనకు గౌతమ మహర్షి, ద్వాపరయుగ ధర్మ ప్రబోధానికి శంఖ లిఖితులు, కలియుగ ధర్మ గుణగణాలను తెలియపరచేందుకు పరాశర మహర్షి నియమితులయ్యారు. వశిష్ఠ మహర్షి కుమారుల్లో శక్తి మహాముని ప్రముఖుడు. ఆయన కుమారుడే పరాశరుడు. ఇక విష్ణ్వాంశ సంభూతుడైన వ్యాసుడు పరాశరుడి కుమారుడు. వ్యాసుని పేరిట వెలిసిందే వ్యాసపూర్ణిమ.
      వ్యాసుడు వేదాలను వర్గీకరించిన మహానుభావుడు. మహాభారత గ్రంథకర్త. వేదాలను విభజించినందువల్ల వేదవ్యాసుడని పేరుగాంచాడు. అష్టాదశ పురాణాలు చెప్పిన ఘనుడు. మహాభారతంలో ప్రముఖ పాత్ర పోషించడంతో వ్యాసుడి జీవితంలో ఆధ్యాత్మిక, భౌతిక కోణాలు రెండూ దర్శనమిస్తాయి. మహాభారతాన్ని వ్యాసుడు చెబుతుంటే గణపతి రాశాడు. ఆ మహాభారతం వ్యాసుణ్ని మనకు నిత్య స్మరణీయుణ్ని చేసింది. వ్యాసుడి అసలు పేరు ‘కృష్ణ’. కృష్ణ ద్వైపాయనుడని కూడా పిలుస్తారు. తల్లి సత్యవతి కోరిక మేరకు కురువంశాన్ని పునరుజ్జీవింపజేశాడు. భారతీయ సంస్కృతికి మూలమైన వేదాల విభజన, భారత ఇతిహాసం, పురాణాలు చెప్పినందువల్ల వ్యాసుడి జన్మదినం ఆషాఢ పూర్ణిమను వ్యాసపూర్ణిమగా నిర్ణయించారు మహర్షులు. ఇదే గురుపూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. 
      ఈ పండుగ ఇంతగా విశిష్టత సంతరించుకోవడానికి అసలు కారణం భారత భూమిపై ఎంతో మంది అవధూతలు అవతరించి గురురూపంలో ప్రబోధనలు చేస్తూ, జన బాహుళ్యాన్ని విశేషంగా ప్రభావితులను చేయడమే. దీనికి ఆద్యుడు దత్తాత్రేయుడు. అతడే ఆది గురువు. గురు, దైవ స్వరూపాల మేలు కలయిక దత్తాత్రేయుడిది. ఈ త్రిమూర్తి స్వరూపుడి అవతారాలు పరంపరగా గురురూపంలో ఒకదాని వెంట మరొకటి భూమిపైకి వచ్చాయి. శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి, స్వామి సమర్థ (అక్కల్‌కోట్‌కర్‌ మహారాజు), మాణిక్య ప్రభువు, శిరిడీ సాయిబాబాలను దత్తుడి అవతారాలుగా చెబుతారు. గురుపూర్ణిమ రోజున గురు అంశ కలిగిన అన్ని దేవాలయాల్లో భక్తులు విశేష పూజలతో గురువులను ఆరాధిస్తారు. ఈ మధ్యకాలంలో శిరిడీ సాయిబాబా భక్తితత్త్వంవల్ల గురుపూర్ణిమ వేడుకలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ పండుగ అన్ని దత్తక్షేత్రాల్లో కన్నుల పండుగగా జరుగుతుంది.
సాధూనాం దర్శనం పుణ్యం - స్పర్శనం పాప నాశనం
సంభాషణం కోటి ఫలం - వందనం మోక్ష సాధనమ్‌

      సాధువుల దర్శనం పుణ్యప్రదం. వాళ్లని స్పృశించడం పాపాలను నశింపచేస్తుంది. ఇక వారితో సంభాషిస్తే కోటి జన్మల ఫలం, వాళ్లకు నమస్కరిస్తే మోక్షప్రాప్తి కలుగుతాయి అని పెద్దలమాట. అయితే కాషాయ వస్త్రం ధరించిన ప్రతి సన్యాసీ సాధువు కాదు. సాధువు అంటే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే సిద్ధ గురువు.
      గురువు జ్ఞాననిధి. ఎంతమందికి ఎంత పంచిపెట్టినా తరగనిది ఆ నిధి. తనంతట తాను సత్యాన్ని తెలుసుకోగలిగిన వాడు జ్ఞాని. అతడే గురువు. అతనివల్ల కాని పని అంటూ ఏదీ ఉండదు. పరబ్రహ్మను తెలుసుకోవడానికి, పరబ్రహ్మను చేరడానికి ఉన్న ఒకే ఒక ఉపాధి గురువు. సర్వ జగత్తుకు సంక్షిప్తరూపం గురువు. పరబ్రహ్మ రూపం నామ, క్రియారహితం. కాబట్టి, ఆ పరబ్రహ్మకు ప్రతినిధి అయిన గురుదేవుని ద్వారా మాత్రమే పరమాత్మను ఆరాధించాలి. అందుకే మన సంప్రదాయంలో గురువుకు అత్యంత విశిష్టమైన స్థానం ఇచ్చాం.
అందరూ ఆరాధించిన వారే
రాముడంతటివాడే గురువు వసిష్ఠుని పాదతీర్థం సేవించి, తలపై జల్లుకుని భక్తితో ఆత్మజ్ఞానామృతాన్ని విన్నాడు. ఆ దివ్యబోధే ‘యోగవాసిష్ఠం’. శ్రీకృష్ణుడు తన గురువైన సాందీప మహామునికి ఎంతో శుశ్రూష చేసి, విద్యనభ్యసించాడు. శిరిడీ సాయిబాబా అలుపెరుగక తన గురువును 12 సంవత్సరాలు రాత్రింబగళ్లు సేవించినట్లు బాబా జీవిత చరిత్రనుంచి తెలుస్తోంది. సాయిబాబా తన భక్తుల్ని గురుతత్త్వాన్ని తెలిపే సమర్థ రామదాసు రచించిన ‘దాసబోధ’ చదవమని ఆదేశించేవారు. గురువు ప్రాధాన్యత ఎంతటిదంటే... మహాభక్తురాలు మీరాబాయికి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమైనప్పుడు, ఆమె తనను శ్రీకృష్ణుడిలో ఐక్యం చేసుకోమని కోరింది. దానికి కృష్ణుడు సద్గురువును ఆశ్రయించమంటాడు. దాంతో ఆమె రైదాసును ఆశ్రయించి ఆత్మజ్ఞానాన్ని పొంది కైవల్యాన్ని చేరింది. 
      ఓసారి పార్వతీదేవి పరమేశ్వరుణ్ని తనకు గురుదీక్ష ప్రసాదించమని కోరిందట! అప్పుడు శంకరుడు జగన్మాతకు గురుశిష్య వ్యవస్థను కూలంకషంగా తెలిపే ‘గురుగీత’ను ప్రబోధించాడు. సిద్ధగురువు ఎక్కడ ఉంటాడో అదే కాశీక్షేత్రమని, ఆ గురుపాద తీర్థమే గంగానది అని తెలిపాడు. గురువులలో ఏడు రకాల గురువులుంటారని చెప్పాడు శంకరుడు. వారు ఎవరంటే... లౌకిక శాస్త్రాలు బోధించే గురువు సూచక గురువు. విభిన్న జాతుల, ఆశ్రమాల ధర్మాధర్మాలను చెప్పే గురువు వాచక గురువు. మంత్రాన్ని ఉపదేశించే వ్యక్తి బోధక గురువు. క్షుద్ర మంత్రాలు ఉపదేశిస్తే నిషిద్ధ గురువు. పరబ్రహ్మమే సత్యమని, నిత్యమని శిష్యులకు వైరాగ్యాన్ని కలిగిస్తూ, వారిని ధ్యాన సాధకులుగా తయారు చేసే వ్యక్తి విహిత గురువు. జనన మరణాల అజ్ఞానాన్ని తొలగించే వాడు కారణ గురువు. శిష్యుల సంశయాలు తీర్చి బ్రహ్మజ్ఞానం బోధించే మహనీయుడు పరమ గురువు లేదా సిద్ధ గురువు. వీళ్లందరిలో పరమ గురువు శ్రేష్ఠమైనవాడు. దత్తాంశతో వచ్చిన గురువులందరూ పరమ గురువులే. గురుపూర్ణిమ వారిని ఉద్దేశించి జరుపుకునేదే. 
      గురుపూర్ణిమ వేడుకలు 13వ శతాబ్దం నుంచి జరుగుతున్నట్లు ఆధారాలు ఉన్నాయి. 13వ శతాబ్దంలో శ్రీపాద శ్రీవల్లభునికి కృష్ణానదీ తీరాన గల కురువపురంలో గురుపూర్ణిమ రోజున శ్రీపాదుల శిష్యులు వైభవంగా ఈ ఉత్సవాన్ని జరిపారు. శిరిడీలో 1908 తర్వాత ఉత్సవాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. సాయిబాబా గురుభక్తికి ప్రతీకగా శిరిడీలోనూ ఈ ఉత్సవాలు జరపాలని నిర్ణయించి, తొలుత తన భక్తుడైన వినాయక్‌ సాథేకు, అతని మామ దామోదర్‌ కేల్కర్‌కు ఆదేశాలిచ్చారు. సాయిబాబానే సద్గురువుగా కొలిచే సాథే... గురుపూర్ణిమనాడు శిరిడీలోని మసీదులో బాబాకే తొలుత ఈ ఉత్సవాన్ని ఘనంగా జరిపాడు. ఆపై సంవత్సరంనుంచి శిరిడీలో ఈ వేడుకలను భక్తులు వైభవంగా జరుపుకుంటున్నారు. దాంతో దేశంలోని అన్ని దత్త క్షేత్రాల్లోనూ గురుపూర్ణిమ వేడుకలు వ్యాప్తి చెందాయి.
      అయితే, సన్యాసులందర్నీ గురువులని నమ్మి, మోసపోవద్దని గురుగీతలో పరమేశ్వరుడు హెచ్చరించాడు. రామకృష్ణ పరమహంస ఆరు నెలలపాటు గురువు వేష భాషలు, ప్రవర్తనల్ని క్షుణ్నంగా పరిశీలించి విచక్షణతో వారి సాంగత్యం ప్రారంభించాలని తెలిపారు. కనుక తస్మాత్‌ జాగ్రత్త!

 

 


వెనక్కి ...

మీ అభిప్రాయం