పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ

  • 1364 Views
  • 25Likes
  • Like
  • Article Share

    కట్టా నరసింహులు

  • కైఫియ్యత్తు కతల రచయిత
  • తిరుపతి
  • 9441337542
కట్టా నరసింహులు

ఈ నానుడిని చాలకాలం నుంచి వింటూనే ఉన్నాం. అయితే ఈ వాక్యాన్ని పరిశీలిస్తే అందులో ఏదో దోషం ఉందనిపిస్తుంది. గువ్వలను, పిట్టలను చిన్నపాటి రాళ్లతో విసిరికొట్టే చిన్న సాధనాన్ని ‘ఉండేలు’ అని అంటున్నాం. కానీ, ఇలా పిలిచే సాధనం వేరే ఉంది. అంతేకాదు, ఉండేలు దెబ్బ తగిలితే పిల్లకాకి కాదు పెద్దకాకి సైతం నేల మీద పడి చచ్చిపోవాల్సిందే. కాబట్టి ఈ నానుడికి అది అర్థం కాదు. మరి అదెలా ఏర్పడింది? ఎందుకు ఏర్పడింది? కాస్త పరిశీలించి చూస్తే దాని ఒకప్పటి రూపం మారి ఈ రూపానికి వచ్చిందని అర్థమవుతుంది. 
వసంతోత్సవాలు
జరుపుకునే దినాల్లో యువతీ యువకులు రంగు నీళ్లు చల్లుకునే వారు. పూలను కానీ, గుడ్డ ఉండలని కానీ రంగులతో తడిపి ఒకరిపైన ఒకరు విల్లు సాయంతో కొట్టుకునే వారు. ఆ విల్లు ఉండవిల్లు. నిఘంటువులు కూడా ఈ అర్థాన్ని ఇస్తున్నాయి. సాహిత్యంలో కూడా ఈ ఉండవిల్లు కనిపిస్తుంది. అన్నమయ్య కూడా తన పాటల్లో ఉండవిల్లు ప్రసక్తి తెచ్చాడు. యువతి ప్రయోగిస్తే యువకుడికి, యువకుడు ప్రయోగిస్తే యువతికి ఆ ఉండవింటి ప్రభావం ఉంటుంది. కానీ దాన్ని ఓ బాలుడి మీద ప్రయోగిస్తే ప్రయోజనం ఉండదు. వారిలో శృంగార భావం అసలు పొటమరించదు. అందుకే అన్నారు ‘పిల్లకాయకేం తెలుసు ఉండవిల్లు దెబ్బ’ అని! ఇదీ అసలు నానుడి. ‘‘లే జవరాలు చెక్కు గీటిన వసనొల్చుబాలకుడు డెందమునన్‌ కలగంగ నేర్చునే’’ అన్నాడు కదా శ్రీనాథ మహాకవి.
రెడ్డి రాజుల్లో కర్పూర వసంతరాయలు ఒకరు. ఆయన ఏటేటా వసంతోత్సవాలు జరిపేవాడు. ఉండవిల్లులు ధరించి స్త్రీపురుషులు ముఖ్యంగా యువతీ యువకులు సరసాలు ఆడుకునేవారు. ఆ సంబరాలు ఇప్పుడు లేవు. ఉండవిల్లులు ఎలా ఉండేవో కూడా తెలియదు. ఆ విల్లు ఇప్పుడు పూర్తిగా అదృశ్యమైంది. పక్షుల్ని కొట్టే సాధనానికి ఉండేలు అని పేరు వచ్చింది. పిల్లకాయ స్థానంలో పిల్లకాకి వచ్చి చేరింది. ‘పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ’గా నానుడి వికటించి మరో అర్థంలోకి దారితీసింది. మూలాలను వెతికి డా।। తిరుమల రామచంద్ర వెలుగులోకి తెచ్చిన ‘ముందుంది మొసళ్ల (ముసళ్ల) పండగ’ ఇలాంటిదే కదా. ఇలా ఎన్నో నానుడులు కాలాంతరంలో రూపాంతరం చెంది అర్థాంతరాల్ని ప్రసాదిస్తున్నాయి. 


వెనక్కి ...

మీ అభిప్రాయం