కొలను దోపరి కొలుపులో...

  • 526 Views
  • 0Likes
  • Like
  • Article Share

నవరత్నాల ముగ్గులు వేసే గొబ్బియళ్లొ
ఆ ముగ్గుల మీద మొగలిపూలు గొబ్బియళ్లొ

అంటూ సంక్రాంతి వేళ కన్నెపిల్లలు గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ పాడేవే గొబ్బిపాటలు. వీటిలో ప్రతి పాదం చివరా ‘గొబ్బిళ్లో, గొబ్బియాలో...’ (గొబ్బితాళం) అని పాడతారు. ఈ పాటలతో సంక్రాంతికి మరింత శోభవస్తుంది. ఇవి తెలుగువారి జానపద సంపద. గొబ్బి పాటలు తెలుగునేలపై నన్నయకు ముందునుంచే ఉన్నాయి. నాగీ గీతాలు, గౌడు గీతాలు, వెన్నెలలు, చందమామలు, ఏలలు, సువ్వాలలు, లాలిపాటలు, జోలలు, తుమ్మెదలు, నేరేళ్లు మొదలైన పాటల గురించి ప్రస్తావిస్తూ ‘గొబ్బి పాటల’ను కూడా శివకవులు పేర్కొన్నారు. క్రీడాభిరామంలో వినుకొండ వల్లభుడు ‘గోమయ పిండములింటి ముంగిటన్‌’ అని ఓరుగల్లులో గొబ్బెమ్మలు పెడుతున్న దృశ్యాన్ని ప్రస్తావించాడు. 
      గొబ్బెమ్మలను ఆవుపేడతో చేస్తారు. పైన పూలతో అలంకరించి ఇంటిముందు వేసిన ముగ్గు మధ్యలో ఉంచుతారు. గోపి+ అమ్మ- గోపెమ్మ. గోపెమ్మనే గొబ్బెమ్మ అయింది. ఇది కృష్ణ తత్వానికి సంబంధించింది. ఈ గొబ్బి పదాలే పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులకూ వస్తువుగా మారాయి. తన ఆరాధ్యదైవం శ్రీవేంకటేశ్వరుడికి అంకితమిచ్చిన అందమైన గొబ్బిపాట...
కొలను దోపరికి గొబ్బిళ్లో యదుకుల స్వామికి గొబ్బిళ్లో।।
కొండ గొడుగుగా గోవులగాచిన కొండొక శిశువుకు గొబ్బిళ్లో
దుండగంపు దైత్యులకెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్లో।।
పాపవిధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్లో 
యేపున కంసుని యిడుములబెట్టిన గోపబాలునికి గొబ్బిళ్లో।।
దండి వైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్లో
వెండి పైడియగు వేంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్లో ।।

      గోకులంలో గోపికలు కొలనులో స్నానం చేస్తుంటే వస్త్రాలు అపహరిస్తాడు కొంటె కన్నయ్య. ఇదే అన్నమయ్య నోట యాదవకులానికి నాయకుడైన కృష్ణుణ్ని ‘కొలను దోపరి’గా పిలిపించింది. దోపరి అంటే దొంగ, కొల్లకాడు (కొల్లగొట్టేవాడు). అన్నమయ్యది మధుర భక్తి శృంగారం. తాను గోపికగా మారి వేంకటేశ్వరస్వామిని కృష్ణుడిగా భావించుకుంటాడు. గోపికా వస్త్రాపహరణంలో దేహి అంటే ఆత్మ, ఆత్మ నిత్యం; దేహాలు అనిత్యం అనే భావన దాగుంది. 
      కొండ గొడుగుగా గోవుల గాచిన- అంటే గోవర్ధనగిరిని ఎత్తి జడివాన నుంచి గోవులను, గోపాలురను దాన్ని గొడుగుగా పట్టి రక్షించిన శిశువుకు గొబ్బిళ్లో అన్నాడు. ఇక్కడ కొండ, కొండొక అనే పదాల ప్రయోగం ఒకే పాదంలో చేయడం విశేషం. కొండొక అంటే కొంచెం, చిన్న అనే అర్థాలున్నాయి. గోవర్ధన గిరిని ఎత్తినప్పుడు కృష్ణుడు పసిబాలుడు కదా! అందుకే ‘కొండొక శిశువు’ పద ప్రయోగం. దుండగులైన దైత్యులకు (రాక్షసులు) సింహస్వప్నంగా నిలిచిన వాడు విష్ణుమూర్తి. ఒక్కో అవతారంలో ఎందరో అసురులను సంహరించి ధర్మసంస్థాపన చేశాడు. అలాంటి వాడు కనుకనే కృష్ణుడు ‘తల గుండు గండడ’య్యాడు. గండడు అంటే శూరుడు, వీరుడు, యోధుడు. 
      శిశుపాలుడు కృష్ణుడి మేనత్త కొడుకు. ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్న సమయంలో కృష్ణుణ్ని సత్కరిస్తుంటే శిశుపాలుడు తూలనాడతాడు. ఓర్పు వహించిన పరమాత్ముడు శిశుపాలుడు నూరోతప్పు చేయగానే సుదర్శన చక్రంతో అతణ్ని వధిస్తాడు. 
      కంసుడికి మేనల్లుడి చేతిలో చావు తప్పదనే విషయం తెలుసు. దాంతో అతడు కృష్ణుణ్ని చంపేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తాడు. అవేవీ సఫలం కావు. అలాంటి కంసుణ్ని యేపుగా అంటే బలంగా, ఇడుముల అంటే కష్టాల పాలుజేశాడు. చివరికి చంపేశాడు. ఇలా దండివైరులను- అంటే బలవంతులైన శత్రువులను (దేవతలను) తరిమివేసిన దనుజుల (రాక్షసుల) గుండెల్లో దిగులు పుట్టించిన వాడు కృష్ణుడు. ఇతనేే వెండి బంగారాలతో సమానమైన వేంకటగిరిపై ‘కొండలయ్య’గా వెలిశాడు. ఆయనకు గొబ్బిళ్లు అంటాడు పదకవితా పితామహుడు. 
      ఇప్పటికీ మన తెలుగునాట కొండమ్మ, కొండయ్య, కొండలరావు అని పేరు పెట్టుకునేవారెందరో. కృష్ణతత్వంలోంచి పుట్టిన గొబ్బిపాట ద్వారానే కొండలరాయడిపై తనకున్న ప్రేమను ఆవిష్కరించిన అన్నమయ్యకు గొబ్బిళ్లో!


వెనక్కి ...

మీ అభిప్రాయం