కొమరు పలుకుల కర్నూలు

  • 654 Views
  • 60Likes
  • Like
  • Article Share

కేతవరం కొండరాళ్లపై ఆదిమానవులు చేసిన ‘చిత్ర’ సంతకాల వయసు ఎనిమిది వేల సంవత్సరాలు... చరిత్ర చిన్నది కాదు! శ్రీశైల మల్లన్న... యాగంటి బసవన్న... అహోబిల నారసింహ... మంత్రాలయ రాఘవేంద్ర... కొలువుదీరిన కోవెలమూర్తులకు కొదువలేదు! జాతీయోద్యమానికి ముందే స్వేచ్ఛ కోసం ఉరికంబమెక్కిన ఉయ్యాలవాడ... గ్రంథాలయోద్యమాన్ని నడిపించిన గాడిచర్ల... ముద్దుబిడ్డలకు మరణం లేదు! కొండారెడ్డి బురుజు సాక్షిగా అది కర్నూలు! రాయలసీమ ముఖద్వారమైన ఆ జిల్లా తెలుగులో వినిపించే సుస్వరాలను ఆలకిద్దాం.
తెలుగు కవిత్వం
ఎక్కడ పుట్టిందీ? అంటే గోదావరీ, కృష్ణా తీరాల్లోనే అనే సమాధానం రావచ్చునేమో కానీ, ఆత్మస్తుతిగా తోచవచ్చు. భాషోచ్చారణ సువ్యవస్థిత రూపంలో పుట్టింది మాత్రం కర్నూలు జిల్లాలోనంటే అతిశయంగానూ కనిపించొచ్చు.
      అసలు కవిత్వం జానపదుల నోటి నుంచే నాగరికుల ఛందోరూపాలకు పరివర్తితమైన మాట సత్యమైతే... తెలుగునాట అన్ని తీరాల్లోనూ అనాది కాలంలోనే కవిత్వం పుట్టింది. కాకపోతే శిలాలిపి, శాసన లిపి, కావ్యభాష అత్యధిక శాతం కృష్ణా గోదావరీ తీరాల్లోనూ, తూర్పు తీర ప్రాంతాల్లోనూ ఓ వెలుగు వెలిగింది. 
      ఇక భాషోచ్చారణలో సువ్యవస్థిత రూపం అంటే పదాన్ని ఉన్నది ఉన్నట్లుగా పలకడం. దీనికి కర్నూలు జిల్లా ప్రజల మాటతీరే ఉదాహరణ. నిజానికి పత్రి కల్లోనూ, చలనచిత్రాలు, దూరదర్శన్లలోనూ వినపడే భాష ఈ జిల్లాదే! కాకపోతే కొన్నికొన్ని క్రియాపదాల స్వరూపాలు మారు తాయి అంతే. అయితే, ఈ జిల్లాలోనూ... నంద్యాల, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల, ఆత్మకూరు, చాగలమర్రి, అవుకు, కొలిమిగుండ్ల, అహోబిలం, శ్రీశైలం ప్రాంతాల్లోనే భాషోచ్చారణలో స్థిరత్వం కనపడుతుంది. 
అక్కడ కాస్త విభిన్నంగా...
కర్నూలుకు తూర్పున కొన్ని గ్రామాలు, కర్నూలు పశ్చిమోత్తర ప్రాంతాలు, నందికొట్కూరు తాలూకాల మాండలికం కాస్త విభిన్నంగా, విచిత్రంగా తోస్తుంది. ఉదాహరణకు ‘రాముడన్నం తిన్నాడు’! దీనికి వ్యతిరేకార్థంలోనయితే ‘రాముడన్నం తినలేదు’ అనేదే సుష్టుస్వరూపం. కానీ కర్నూలు పశ్చిమోత్తరాన, నందికొట్కూరు ప్రాంతాల్లో ‘తినిలేడు’ అంటారు. అలాగే, ‘మీ నాన్న ఉన్నాడా?’ అనడిగితే ‘ఉండిలేడు’ అనే సమాధానం వస్తుంది. క్రియాపదాల పురుష, స్త్రీ లింగ రూపాలిలానే ఉంటాయి. వీటన్నింటినీ ఒకవిధమైన నాన్పుడు, యాస కనపడీ కనపడని దీర్ఘంతో పలుకుతారు.
      ఆదోని, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, కోసిగి, దేవనకొండ ప్రాంతాల ప్రజల పలుకులో కన్నడ భాషోచ్చారణ ప్రభావం ఎక్కువ. బనగానపల్లె తాలూకా లోనూ ఇటు నంద్యాలకు చేరువగా ఉండే నందవరం, నందివర్గం, సంజామల, కొయి టాకు, కానాల తదితర గ్రామాల్లో మాత్రం స్థిరోచ్చారణే కనిపిస్తుంటుంది. నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, అహోబిలం, శ్రీశైలం, రుద్రవరం, చాగలమర్రి, డోన్‌కు తూర్పు దక్షిణ ప్రాంతాల్లో భాష యథార్థస్థితిలో వినిపిస్తుంటుంది. క్రియా పదాల్లో ‘వచ్చి నాడు, తినినాడు, రాసినాడు, వస్తున్నాడు, వస్తున్నది’ లాంటి రూపాలే అధికం.
      అయితే ఈ ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో ‘వచ్చినడు, తినినడు, తిన్నాడు, రాసినడు, రాసిండు, వస్తున్నడు’ అనే పరిణామ క్రియారూపాలూ వినిపిస్తుంటాయి. ఒకప్పుడు కర్నూలు జిల్లాలోనే ఉండి, తర్వాత ప్రకాశం జిల్లాలో కలిసిన ‘దిగువ మెట్ట’ అవతలి గ్రామాలైన కిష్టంశెట్టిపల్లె, యడవల్లి, ముండ్లపాడు, గిద్దలూరు మొదలు మార్కాపురం వరకు గల నివాసజనం మాట్లాడే తీరుతో ప్రభావితమై పరిణమించిన క్రియారూపాలివి. కాకుంటే ‘వచ్చిండు, రాసిండు, తినిండు’ అని ఉచ్చారణలో స్థిరస్వరం తప్ప యాసకానీ, దీర్ఘంకానీ వినపడవు. అదే మెట్ట అవతలి గ్రామాల జనం ‘మరే... రామయ్యే... అప్పుడే వచ్చిం...డయ్యా! రాసిం...డే’ లాంటి దీర్ఘస్వరోచ్చారణం చేస్తారు. 
అవేమీ లేకుండా...
‘వస్తున్నాడు, వ్రాస్తున్నది’ వంటి క్రియా స్వరూపాలిక్కడ ‘వస్తుండాడు, వ్రాస్తున్నాది; వ్రాస్తూండేది’ వంటి పరిణామ రూపాల తోనూ ధ్వనిస్తుంటాయి. పల్లెజనం భాష లోనూ స్వరూపం మారుతుందే తప్ప స్వరం మారదు. వస్తుండాడు, వస్తుండేది... ఇలా! 
      ‘పాప ఇంట్లో ఉన్నదని’ అంటే ఈ మూడు మాటల్లోనూ ఎలాంటి దీర్ఘాలూ, యాసలూ లేకుండా పలుకుతారు. కాకపోతే ‘పాపే ఇంట్లో వున్నదా!’ అంటారు. అలాగే, నెయ్యిని ‘నెయ్య’ అనో... వెయ్యిని ‘వెయ్య’ అనో... చూడకుండాను ‘చూడకండా’ అనో ... ఆయ్‌ ఆయ అనో... ఏ యాసలూ, మిశ్రభాషా స్వరాలూ లేకుండా ఉచ్చరిస్తారు. 
      మొత్తం మీద కర్నూలు జిల్లా తెలుగులో మూడు ప్రధాన మాండలిక భేదాలు కనిపిస్తాయి. అవి... కర్నూలు మధ్య ప్రాంత మాండలికం, తూర్పు ప్రాంత మాండలికం, పశ్చిమోత్తర ప్రాంత మాండలికం. పత్రికల భాషా, కర్నూలు ప్రజల భాషా ఇంచుమించు ఒకటే. అయితే వచ్చేడు, పాడేడు, ఉండేదోయ్‌ వంటి నాగరిక శైలి ఉంటుంది. కానీ, ఇది కృతకంగానో, తెచ్చిపెట్టుకున్న శైలి మాదిరిగానో వినిపించదు. ప్రయాణ సౌకర్యాలు పెరిగిన తరువాత జనం వలసలు... రావటం, పోవటం ప్రారంభమైన సమయంలో ఆయా ప్రాంతాల ప్రజల సంభాషణా ప్రభావం వల్ల కొన్నికొన్ని ఇతర ప్రాంతాలు - అంటే కోస్తా జిల్లాల ‘భాషాశైలి’ ఇక్కడకు వచ్చింది. అదీ కేవలం ‘క్రియా పదోచ్చారణలో మాత్రమే’ ఈ వచ్చేడు (వచ్చాడు), నవ్వేడు (నవ్వాడు) తీరున వినిపిస్తాయి. అయితే, కోస్తా ప్రాంత శైలిని అనుకరిస్తూనే... స్థానికులు తమ సొంత శైలిలో ఈ పదాలను ఉచ్చరిస్తారు. అందుకే కృత్రిమత్వం ధ్వనించదు. 
అచ్చమైన తెలుగు పదాల మూట
కర్నూలు భాషలో వినసొంపైన ఎన్నో తెలుగు మాటలున్నాయి. ఆంగ్ల పదం ‘అడ్వాన్సు’కు సమానార్థకంగా ‘బయానా’ వాడతారు. కర్నూల్లో దానికి మరో మూడు మాటలున్నాయి. అవి... ‘ఆగావు, సంచ(త)కరవు, మునిగా’. ముందు - మున్న - మునుగా - మునిగా - స్వర పరిణామం ‘మునిగుత్త’. అంటే ‘ముందుగానే ఇచ్చే గుత్త’. మామూలుగా ‘గుత్త’ను ‘కాంట్రాక్టు’ అనే అర్థంలోనే వాడుతున్నారు. కానీ, కర్నూలు మాండలికంలో ఈ ‘గుత్త’ను వ్యావసాయిక పదంగా వినియోగిస్తారు. పొలం సొంతదారుడు తానొక్కడే పొలం చేసుకోగలిగిన స్థితిలో లేకపోతే సేద్యం చేయగల మరొకరికి ‘కారు’కింత అని - అంటే పొలం రెండు కార్లో, మూడుకార్లో పండితే (దాళ్వా, ఖరీఫ్‌ - వీటి మధ్యలోని విడత రబీ) కారుకిన్ని బస్తాల ధాన్యం అని మాట్లాడుకుంటాడు. ఇదే ‘గుత్తకివ్వడం’. కారుకిచ్చే బస్తాలే ఇక్కడ ‘గుత్త’.  
      కర్నూలు జిల్లాలో ఉద్దులు అంటే మినుములు. వాస్తవానికి ‘ఉద్ది’ అంటే ‘జత’. అల్పాహారాల తయారీలో మరో దినుసు పిండికి మినప పప్పును జతగా వాడతారు కాబట్టి దాన్ని ‘ఉద్దిపప్పు’ (ఉద్దిబ్యాళ్లు) అంటారు. ‘సమఉజ్జి’లోని  ‘ఉజ్జి’ కూడా ‘సాటి’ అనే అర్థంలో ఇక్కడ వాడుకలో ఉంది. ‘తట్ట’ అంటే కంచం. ఉదారు (గుడ్‌విల్‌), మంటినూనె (కిరోసిన్‌), కణుసు (కల), బోడిగాడు (వ్యర్థవ్యక్తి), జోలెగాడు (బిచ్చగాడు), తెలుపు (తాంబూలంలో వేసుకొనే సున్నం), నూకు (ఊడ్చు, పరుగెత్తు, ఎగవేత, పారిపోవు - ‘ఎగనూకినాడు’ మాదిరి), గుండుగొరుగు (అంతా అయిపోగొట్టడం) లాంటి ఎన్నో పదాలు, జాతీయాలు వినిపిస్తాయి. 
అదే బాధ
కర్నూలు తెలుగు ఎంత సుసంపన్నంగా ఉన్నా ఓ కటిక నిజాన్ని అంగీకరించి తీరాలి. అత్యాధునిక వర్తమాన శతాబ్దంలో వార్తాపత్రికలు, టీవీఛానెళ్లు, ఆకాశవాణి ప్రసార ప్రచార ప్రభావం - ఇతర మాండ లికాలపై కన్నా కర్నూలు జిల్లా ప్రజల మీద చివరకు మారుమూల గ్రామాల ప్రజల మీద కూడా తారస్థాయిలో ఉంది. దాని వల్ల ‘కర్నూలు తెలుగు’ తన సహజ మాండలిక పద స్వరోచ్చారణ స్వరూపాన్ని కోల్పోతోంది. ఎక్కడో, ఎప్పుడో సకృత్తుగా తన సహజ స్వరోచ్చారణనీ, స్వరూపాన్నీ ప్రదర్శిస్తుంటుందే తప్ప, ఇతర జిల్లాల మాండలికాల మాదిరి ఎక్కువశాతం తన నైజాన్ని నిలుపుకోవట్లేదు. 
      దీనికి కారణం... తెలుగు నేలంతటి మీద, ఇతరేతర భాషావేషాదిక స్వరూప స్వభావాది విశేషాలను కావిలించుకునే స్వభావం, గుణం ఈ కర్నూలు జిల్లాకే అధికాధికం! కొందరు అంగీకరించకపోవచ్చు, కానీ, ఇదే ప్రత్యక్షర సత్యం.
      అందులోనూ ‘ఆంగ్లభాషా వ్యామోహ ప్రభావం’ మరీ అధికం!
      ఇదే శోచనీయం!


వెనక్కి ...

మీ అభిప్రాయం