హాస్యరస ఉల్కాపాతం

  • 1049 Views
  • 76Likes
  • Like
  • Article Share

సమకాలీన సమాజాన్ని సునిశిత దృష్టితో అధ్యయనంచేసి, తన రచనలతో తెలుగువాళ్లను ప్రభావితం చేసిన బహుముఖ ప్రతిభాశాలి చిలకమర్తి లక్ష్మీనరసింహం. ఆయన 1867 సెప్టెంబరు 26న పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లిలో వెంకయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించారు. పాఠశాల స్థాయిలోనే పద్యాలు రాయడం అలవాటు చేసుకున్నారు. ఇరవైరెండేళ్ల వయసులో ఆయన రాసిన ‘గయోపాఖ్యానం’ నాటకం లక్ష ప్రతులు అమ్ముడవటం ఆయన పాండిత్య శోభకు శిలాశాసనం. శతకం, కథ, నవల, నాటకం, ప్రహసనం వంటి సాహితీ ప్రక్రియల్లో ఆయనది అందెవేసిన చేయి. కవి, రచయిత, నాటకకర్త, పాత్రికేయుడు, సంస్కర్త ఇలా ఎన్నో కోణాలు ఆయనలో కనిపిస్తాయి. నాటి వ్యవస్థలో దుర్లక్షణాల మదపుటేనుగునెక్కి హాస్యాంకుశంతో జరిపిన నవలాయానం చిలకమర్తివారి ‘గణపతి’...! 
      కథకుణ్ని ఓ మిత్రుడు విందు భోజనానికి ఆహ్వానిస్తే వెళతాడు. విస్తళ్లు వేసేముందు, వేసిన తరువాత, వడ్డన జరుగుతున్న మధ్యలోనూ ఓ నాలుగు కునుకులు తీస్తాడు. ఆ నాలుగు పావుల పూర్ణ నిద్రా స్వప్నంలో ఈ నవలా నాయకుడైన గణపతి తన కథను రాయమనీ, లేకపోతే దెయ్యమై మీ వంశాన్ని పీక్కుతింటానని కథకుణ్ని ఆక్షేపిస్తాడు. ఆ స్వప్న వృత్తాంతమే గణపతి అయిందంటూ ఈ నవలకు ఉపోద్ఘాతమిస్తారు చిలకమర్తి.
      కథంతా ప్రధానపాత్ర గణపతి చుట్టూనే నడిచినా, పూర్వీకుల ప్రస్తావనలో అతని తాత పాపయ్య, తండ్రి గంగాధరాల కథలూ ఉంటాయి. గణపతి తాత పాపయ్య మందపల్లిలో తద్దినాలకూ, ఇతర తంతులకూ భోక్తగా వెళ్తుంటాడు. అడపాదడపా చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు. ఇతనికి డబ్బు యావ. తల్లి చనిపోయాక ఎంతోకొంత సంపాదించి పెళ్లి చేసుకోవాలని పూణె వెళతాడు. శవాలు మోసి మరీ సంపాదించి సకల వ్యసనాలకు బానిసైపోతాడు. పిచ్చమ్మను పెళ్లి చేసుకుని చివరికి మందపల్లిలోనే కాపురం పెడతాడు. గంగాధరం పుట్టిన కొన్నాళ్లకు పాపయ్య చనిపోవడంతో పిచ్చమ్మ ఏనుగు మహలుకు మకాం మార్చుతుంది. ఈ గంగాధరానికి తిండి యావ. ఊళ్లో జనాలను ఆక్షేపిస్తూ కాకినాడ వెళ్లి కావడి పడతాడు. అక్కడ జూదం, స్త్రీ వ్యామోహం వంటి అవలక్షణాలూ తోడవుతాయి. చివరికి ఏదో ముహూర్తాన సింగమ్మని పెళ్లాడి మందపల్లిలోనే కాపురం పెడతాడు. వారి సుపుత్రుడే గణపతి... తాత, తండ్రుల అవలక్షణాలతోపాటూ గుజ్జుతనము, బానపొట్ట, మశూచి మచ్చల ముచ్చు మొహము గణపతికి ఆభరణాలవుతాయి. ఇక్కడనించీ అసలు కథ ప్రారంభమవుతుంది..
      గణపతి పుట్టిన నాలుగేళ్లకు తండ్రి చనిపోవడంతో తన అన్న నాగన్న ఇంట చేరుతుంది సింగమ్మ. ఇక గణపతి అక్షరాభ్యాసం నుంచీ అన్నీ ప్రహసనాలే..
      గణపతిని బడికి పంపడానికి తల్లీ మేనమామా అష్టకష్టాలూ పడతారు. ఉదయాన్నే నలుగురు కుర్రాళ్లతో పంతులుగారు చింత బరికె పట్టుకుని ప్రత్యక్షమయ్యేవారు. గణపతిని కాళ్లూ చేతులూ పట్టుకుని వీధిలోంచి ఈడ్చుకెళ్తుంటే అరుపులూ, తిట్లూ ఒక ఉత్సవంలా భావించి భాగవతంలో జలక్రీడల ఆటల్లా చూసేవారు జనం. తనపాలిట యమకింకరుల్లాంటి ఆ నలుగురు కుర్రాళ్లనూ గున్న ఏనుగులాంటి గణపతి కాళ్లతో తన్ని, గోళ్లతో రక్కి, కొరికి, తలతో కుమ్మి, నానాతిట్లూ తిడుతుంటే చూసేవాళ్ల ఆనందానికి అవధులుండేవికావు. బడి ఎగ్గొట్టడానికి తలనొప్పనీ, కడుపునొప్పనీ, నడుంనొప్పనీ వేషాలేసి శొంఠి రసం, మిరియాల రసం, చిత్రమూల రసాలూ తాగుతాడు. రాత్రి ఇంట్లోంచి పారిపోయి చాకలి గూనలో దాక్కోడం, నూతిలో పడి చచ్చినట్లు నాటకమాడటం, కాలికి మేనమామ బొండ తగిలించడం మొదలైన సన్నివేశాల్లో సంభాషణా చతురత పాఠకుల పొట్టలు చెక్కలు చేస్తుంది.
      పదేళ్లు వచ్చేసరికీ అయిదు పదుల గుణింతాలైనా రావుగానీ, తురుపులాట, దొంగాట, పట్లాటలతోబాటు చీట్లపేకాటలోనూ ప్రవీణుడవుతాడు గణపతి. డబ్బు కోసం మామగారి విభూతి బుట్టమీదా, అత్తగారి ఉప్పు బుట్టమీదా హస్తలాఘవం చూపిస్తుంటాడు. అవలక్షణాలను ఒంటబట్టించుకోవడంలో గణపతి పట్టుదల ఎలాంటిదంటే, అరటి బొరుగు చుట్టలు కాల్చడం అవమానమని పొగాకు చుట్టలు కాల్చాలనుకుంటాడు. పాటియాకు చుట్ట ఘాటెక్కువని లంకాకు కాల్చినా వికారం పోదు. అయినప్పటికీ దానికి విరుగుడుగా పాత చింత పచ్చడో ఉసిరి పచ్చడో నోట్లో వేసుకుంటూ ఎంతో శ్రద్ధగా చుట్టలు అలవాటు చేసుకుంటాడు. పద్నాలుగేళ్లప్పుడు గుర్రమెక్కాలన్న కోర్కె తీరక చాకలికి నాలుగు చుట్టలిచ్చి గాడిదనడగటం, దానిమీద ఊరేగుతూ అభాసుపాలైనపుడు ఆయనది గెద్ద, ఈయనది ఎద్దు అంటూ దేవతల వాహనాలను ఎద్దేవా చేయటంలో విస్మయపూరిత హాస్యం అందిస్తుందీ పాత్ర.
      ఆ తర్వాత మిత్రుడి పెళ్లికి రాజమహేంద్రవరం వెళ్తాడు గణపతి. అక్కడ పట్నవాసులను చూసి, గిరజాలు- ముచ్చెలు- చేతికర్ర- కోటు గౌరవాన్నిస్తాయనీ, ఎలాగైనా అవి సంపాదించాలనీ అనుకుంటాడు. మంగలితో గిరజాలు వేయించుకుంటాడు. ఆముదం దొంగిలించి తలకు రాసుకుని మర్నాడు జుట్టు ఏమాత్రమైనా పెరిగిందా లేదా అని అందరినీ అడుగుతాడు. తన కాళ్లకు మిట్ట ముచ్చెలు (ఎత్తు చెప్పులు) బావుంటాయో లేక చడావులు (కిర్రు చెప్పులు) బావుంటాయో అని తెగ ఆలోచించి చివరికి పెళ్లికి వచ్చిన ఓ పిల్లాడి జరీ అంచు మిట్ట ముచ్చెలు కాజేస్తాడు. తల్లి వాటిని చూసి దొంగతనం చేశాడేమో అని నీలుగుతుంది. గణపతి తనకా ముచ్చెలు అదృష్టంకొద్దీ వీధిలో దొరికాయంటాడు. ఆవుపాలు పితుక్కోవడం, చెట్టు పూలేరుకోవడం, దొరికిన ముచ్చెలు వేసుకోవడం దొంగతనం కానే కాదంటాడు గణపతి. రాజమహేంద్రవరంలో బోలెడు టస్సాలూ, తమాషాలూ నేర్చానని బొంకుతాడు. తనకే గనక ఓ కోటు ఉంటే, ఎర్ర తలపాగా వాళ్లూ నల్ల తలపాగా వాళ్లూ భయపడి తోకలు ముడుస్తారంటాడు. అసలు దేవుడు కోటు జేబులోనే కూర్చుంటాడని చెప్పి ఏదైనా బిందె తాకట్టు పెట్టి తల్లిని డబ్బు తీసుకురమ్మంటాడు. ఈలోగా శ్రాద్ధభోక్తగా ఒకరింటికి వెళ్లి కోటు సంపాదించడం కోసం గణపతి జరిపిన వెర్రిబాగుల తతంగం గంపెడు నవ్వులు పూయిస్తుంది.
      ఈ పిచ్చి పిచ్చి వేషాలకు అంతేలేదని గణపతి మేనమామ తన కూతురిని రాయప్పకిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటాడు. గణపతి ఆ పాపను ఎత్తుకుపోయి గుళ్లో తాళి కట్టేస్తాడు. మేనమామకి చిర్రెత్తుకొచ్చి తల్లీ కొడుకులిద్దరినీ గెంటేస్తాడు.
       అక్కడినించి వానపల్లి వచ్చి పంతులు అవతారంలో గణపతి పంచిన నవ్వులు పాఠకులను మళ్లీ మళ్లీ చదివింపజేస్తాయి. ఒక రోజు ఎవరో కొత్త పిల్లాడు దాశరథీ శతకంలో ‘శ్రీరఘురామ చారుతులసీ దళధామ..’ పద్యం అర్థం చెప్పమని అడుగుతాడు. అపుడు గణపతి కాస్త తమాయించుకుని అటూఇటూ చూసి  ‘శ్రీరఘురామ= శ్రీరాములవారు, చారు= ఒకనాడు పైత్యంగానుండి చారు కాపించుకున్నారు, తులసీదళధామ= ఆ దేశంలో కరివేపాకు లేదు కనుక తులసీ దళములే ఇందులో వేసి పొగిచినారు, శమక్షమాది శృంగార గుణాభిరామ= శ్రమ యావత్తూ పోగొట్టగలిగి బహు శృంగారముగానున్నదట ఆ చారు, త్రిజగన్నుత శౌర్యరమాలలామ= ఆచారు తాగిన తరువాత ఆ రాములవారికి కావలసినంత శౌర్యము కలిగిందట రాక్షసులను చంపుటకు, దుర్వారకబంధ రాక్షసవిరామ= వారికందఱకు కఫము పట్టకుండా పోయినదట, జగజ్జన కల్మషార్జవోత్తరకనామ= ఆచారు తారక మంత్రములాగు త్రాగిన జనులందరకూ గల్మషము కొట్టివేసినది, భద్రగిరి= వారికెంతో భద్రము కలిగినది..’ అంటూ ముగించక ముందే ఆ కుర్రాడు పడీపడీ నవ్వి రాయలవారిప్పుడు లేరే అనడం గణపతి నవలలో ఎంతో మంది కంఠతా పట్టిన సన్నివేశం!
      ఇక గణపతి తిండీ నిద్రల సంగతి ఎంత చెప్పినా కొంత మిగిలే ఉంటుంది. అయిదు కుంచాల బియ్యం తల్లీ కొడుకులకు పది రోజులకు సరి. ఈత పళ్లు, రేగు పళ్లు, నేరేడు పళ్లు, చెఱకు ముక్కలు, మామిడి తాండ్ర, తాటిచాప, కొబ్బరి కురిడీలతో నిత్యం దవడలాడించా ల్సిందే. పిల్లలు దెబ్బలు తప్పించుకోడానికి గణపతికి అరటిపళ్లు తాయిలంగా ఇస్తుంటారు. కొందరు కొంటె పిల్లలు గణపతి నిద్రలో ఉన్నపుడు పాడెమీద వేసి శ్మశానంలోకి తీసుకెళ్లి వదిలేస్తారు. ఖూనీ అనుకుని ఊరంతా చేరి ఉస్సూరుమనే ముందు ఆవలించుకుని లేస్తాడు. ఇలా గణపతి ఆగడాలు భరించలేక పిల్లలు చేసే పనులు కడుపుబ్బా నవ్విస్తాయి. చివరికి కొందరు పాత విద్యార్థులు గణపతిని పెళ్లి చేసుకో మంటారు. తీరా ఓ సంబంధం కుదిరి పెళ్లయ్యాక అదొక దొంగ సంబంధమని తెలుస్తుంది. ఈలోగా పోలీసులు రాగానే మూటాముల్లే సర్దుకుని గణపతి పరారవడంతో కథ ముగుస్తుంది!
      కథంతా గ్రాంథికంగా సాగినా శబ్దాశ్రయ హాస్యంతో కూడిన చిలకమర్తి చమత్కార శైలి మళ్లీ మళ్లీ చదివింపజేస్తుంది. కథలో పాత్రల ఆక్షేపణా ధోరణే నవ్వించటానికి ప్రధాన కారణం. దురాశ, అలసత్వం, తిండియావ, దొంగతనం, పెద్దలంటే గౌరవం లేకపోవటం, తప్పుచేసే పిల్లలను వెనకేసుకు రావటం ఇలాంటి అవలక్షణాలవల్ల మనిషి ఎంత దురవస్థకు గురవుతాడో వినోదాత్మకంగా తెలియజేస్తుంది ఈ నవల.
దాదాపు వందేళ్ల కిందట తెలుగు నవలా సాహిత్య వినీలాకాశంలో జనించిన ఈ హాస్యరస ఉల్కాపాతం చదివిన ప్రతిసారీ పాఠకుల హృదయాలను ఢీకొట్టి నవ్వుల వెలుగులు పంచుతూనే ఉంది!
 


వెనక్కి ...

మీ అభిప్రాయం