సంక్రాంతి కోడి కొక్కొరోకో

  • 648 Views
  • 1Likes
  • Like
  • Article Share

    డా।। జొన్నలగడ్డ మార్కండేయులు

  • హైదరాబాదు, hydjmlu@gmail.com

‘కొక్కొరోకో’ అనే ధ్వనిగా సాహిత్యానికి అందింది కోడి. ప్రత్యేకత గల వాణిగా కోడికూత మాటయింది. అది ప్రజల నాలుకల మీద పలుకుబడిని సాధించిన తెలుగువారి అలారం. జాము అంటే మూడు గంటల కాలం. కోడికూత జాము తెల్లవారు జాముగా జానపదపంచాంగం లెక్కకెక్కింది. వీరులకు ప్రియంగా సాహిత్యానికీ పాకింది. సంక్రాంతి కోడిగా వీర సంబరం దానిది. 
      పెంటతినెడు కాకి పితరుడెట్లాయెరా అన్నాడు వేమన. కాకి సంగతేమో కానీ కోడి మాత్రం కుక్కుటేశ్వరుడయింది. కుక్కుటం అంటే సంస్కృతంలో కోడి. తూర్పుగోదావరి జిల్లా ‘పిఠాపురం’ పాదగయగా ప్రసిద్ధి. ఇక్కడ ఈశ్వరుడు కోడి స్వభావాన్ని ప్రదర్శించాడట. కొక్కొరోకోయని కూసిన కోడిరూప శివలింగ అర్చామూర్తి కనుక ఆయన కుక్కుటేశ్వరుడు. ‘భూనుత విలాస! పీఠికాపుర నివాస!’ అంటూ కూచిమంచి తిమ్మకవి ‘కుక్కుటేశ్వర శతకాన్ని’ రచించాడు. కోడిది కాకికంటే సార్థక జన్మా? అంటే కాదనలేం!
      జానపదంలో కోడీశ్వరుడి పలుకుబడి లేదు. కానీ ‘కోడి, కుంపటి లేకపోతే తెల్లవారదనే’ సామెత కోడికున్న పలుకుబడి. కోడినిద్ర, కోడి కునుకు ఎంత ప్రాచుర్యమో కోడి మేలుకొలుపూ అంతే ప్రఖ్యాతం. జానపద కోడిని  శ్రీనాథుడు ‘పలనాటి వీరచరిత్ర’ కోడిపోరులో వర్ణించాడు. దాచినా దాగలేని ఆశైలి శిష్టజన ప్రియమవడం తెలుగు కోడి నాగరిక పలుకుబడి. సంక్రాంతి సంబరమైన కోడి పోరు సాహిత్యంలో కోడికి అంకితం. జనపథాన నిలిచిన ఈ వినోదం కోడి పంచాంగంగా, కుక్కుటశాస్త్రంగా కోడి కోసం పుట్టిన తెలుగు రచనల ఉనికిని చాటుతుంది.
      పెట్టను ఆకర్షించడంలో కోడి పుంజుల ప్రతాప వైరం కోడిపోరు ప్రియులను సృష్టించింది. రెండు పుంజుల మధ్య ఉండే సహజ దుడుకుతనంలోంచి పందెపు కోళ్లను తయారు చేసిన ఈ జూద మనస్తత్వం రెండువేల ఏళ్ల నుంచి సాగుతున్న నేరం. రాజాదరణ, నిషేధమూ ఉన్న క్రీడగా నిలిచినవి ఈ కోడిపందేలే. ఇవి కుక్కుటశాస్త్ర సమ్మతంగా ప్రణాళికబద్ధంగా జరిగాయి. జూద సిరి యుద్ధాలను సృష్టించాయి. పందేల కోసం డేగ, నెమలి, పింగళి, కోడి... ఇలా కోడి జాతులు నిర్ణయించి జాతకచక్రం వేయిస్తారు. అలా జన్మ, నక్షత్ర, వార, దిశావర్ణ, నిషిద్ధ, అవస్థా భేద, శుక్ల, కృష్ణపక్ష ప్రభావాలు చెప్పడానికి కోడి పంచాంగం, లెక్కలూ తయారయ్యాయి. 9వ శతాబ్దపు దండి ‘దశకుమార చరిత్ర’, తిక్కన శిష్యుడు కేతన ‘దశకుమార చరిత్ర’, పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, అయ్యలరాజు ‘హంసవింశతి’ కోడి పందేలను ప్రస్తావించాయి. 
      పల్నాటి యుద్ధాన్ని తెలుగు భారత యుద్ధంగా మనవాళ్లు భావించారు. బ్రహ్మ నాయుడు - ధర్మరాజు, బాలచంద్రుడు - అభిమన్యుడు, శకుని - నాగమ్మ... ఇలా పోలికలు వెదికారు. నాగమ్మ కోడికి ‘నల్లమిల్లి’ అని పేరు పెట్టి శకుని పాచికలు ప్రాణం పోసుకున్నాయన్నారు. కానీ బ్రహ్మ నాయుడి కోడిది ఉత్తమజన్మట! ఆ కోడి పేరు చిట్టిమల్లుడు. గత జన్మలో కుక్కుటాసురుడు.
      అహల్యను వంచించడానికి ఇంద్రుడు కోడై కూయలేదు. ఈ కుక్కుటాసురుడు కోడిలా కూసి ఇంద్రుడికి సాయపడ్డాడు. అందుకు గౌతముడు నడిజాముల్లో కొక్కొరోకోయని కోడిజన్మగా కూతలు కూస్తావని శాపమిచ్చాడట! చిట్టిమల్లుడిగా వీరమరణం పొంది జన్మ పరంపర నుంచి విముక్తి పొందాడు కుక్కుటాసురుడు.. అతని గుర్తుగానే కోడిజాతి మనకు ‘మేలుకొలుపు’ పాడుతోందన్నది జానపద కథనం. 
      దైనందిన సందడికి ‘కొక్కొరోకో’ ఓ నగారా. అందులోనే చోరులకు, జారులకు, బాటసారులకు హెచ్చరిక ఉందన్నాడు ఓ కవి. ‘ఎరుగ జెప్పుచున్నది యెలుగెత్తి కోడి చోరులకు, జారులకు, బాటసారులకును - మోసికొని పొండు, బెనగుడు, లేచి బరువులెత్తుడు సడలుచున్నది రాత్తిరయిన’... చోరులార దోచింది చాలు మోసుకుపోండి. జారులారా ఎవరూ గుర్తించకముందే వెళ్లిపోండి. బాటసారులారా దూరం పోవాలిగా లేచి బరువు లెత్తండన్నది కవి మాట. రవి ఉదయాన్ని ఇంకా కవి, కోడి కూడా చూడలేని సమయమది. కోడి హృదయాన్ని కవి చదివాడు కాబోలు ‘కొక్కొరోకో’ పలుకులో భోగిమంటంత వెలుగు సంబరం. కానీ, కొక్కొరోకో సంక్రాంతి పండుగాహ్వానం తెలిసీ తెలియని జూదప్రియాహ్లాదం. వీర ప్రతివీర సవాళ్ల యుద్ధ వాతావరణంలో జూదసిరిని పండించే సంక్రాంతి కోడి ప్రాముఖ్యం... వార్తల్లో నిషేధం కాని నిషేధప్రాముఖ్యం. కొక్కొరోకో సంబరం.

***


వెనక్కి ...

మీ అభిప్రాయం