పద్యానికి గండపెండేరం

  • 874 Views
  • 0Likes
  • Like
  • Article Share

    సూరంపూడి పవన్‌ సంతోష్‌

  • తాడేపల్లిగూడెం
  • 9640656411
సూరంపూడి పవన్‌ సంతోష్‌

పద్యం అంటేనే అమ్మో.. అంటున్నారిప్పుడు. ఓ వందేళ్ల కిందట తెలుగు సాహిత్యంలో వచన కవిత, కథ, నవల తదితర ఆధునిక ప్రక్రియలు మొదలైనా... ఎన్నో పద్యకావ్యాలూ రూపుదిద్దుకున్నాయి. వీటిలో పద్యనాటకాలు చాలా ప్రజాదరణ పొందాయి. పద్యం ప్రస్థానం ఛందోజ్ఞానం లేనివాళ్ల నాలుకల మీదికీ చేరుకున్న రోజులవి. ఏ నోటవిన్నా అలవోకగా ‘బావా ఎప్పుడు వచ్చితివ’నో, ‘అలుగుటయే ఎరుంగని...’ అనో సహజాతి సహజంగా ధారాళంగా పద్యం జాలువారేది. అదే సాహితీ పరిజ్ఞానం ఉన్నవాళ్లయితే ఉత్తరాలు సైతం పద్యాల్లోనే రాసే పరిస్థితి! 
ఉత్తమ కవిత్వం రూపొందేందుకు సాహితీవేత్త మాత్రమే కారణం కాదు. ఆ కవిత్వం పుట్టే స్థలకాలాల్లో కవి చుట్టూ ఉండే సాహిత్య సంస్కృతి కూడా అందులో పాలుపంచుకుంటుంది. సాహిత్యంపట్ల ఆనాటి సమాజంలో ఉండే ఆకర్షణ, అవగాహన, ఆదరణ, అభిమానం రాశి పెరగడానికి, పరోక్షంగా వాసి పెరిగేందుకు ఉపయోగపడతాయి. అలా అనర్ఘరత్నాల్లాంటి పద్యాలు, కావ్యాలు వచ్చేందుకు నేపథ్యంగా అమరిన కాలం గత శతాబ్ది మధ్య వరకూ వెలుగులీనింది. 20వ శతాబ్దం తొలి అర్ధభాగంలో పద్య సాహిత్యానికి దక్కిన మన్నన ఎంతటిదంటే... సాహిత్యంతో సంబంధం లేనివాళ్లు కూడా తమ సంభాషణల్లో పద్యాలను ఉట్టంకించేవాళ్లు.
      కొత్తగా కవిత్వం ప్రారంభించినవాళ్లు కూడా పద్యాల్లో ఉత్తరాలు రాసే రోజులవి. రాస్తున్న ప్రదేశం, తారీఖులతో మొదలుపెట్టి చివర భవదీయుడు అంటూ పేరు రాసేవరకూ అంతా ఆటవెలదులు, కందాలు, ఉత్పలమాలల్లోనే సాగేవి. అదో సరదా వ్యవహారం. ప్రముఖ రచయిత బూదరాజు రాధాకృష్ణ తన తొలినాళ్లప్పటి సాహిత్య వాతావరణం గురించి ఆత్మకథ ‘విన్నంత కన్నంత’లో... ‘బాపట్లలో మలేరియా తీవ్రంగా ఉంటే ఏ పట్ల చావకుండిన బాపట్లకు పంపవలయూ మొదలుగా పద్యాలు చెప్పినవారున్నారు. పేర్లు మరిచాను. గట్టు నడిపి తనకున్న కొద్దిపాటి భూమినీ ఆక్రమించాడని కోపగించిన ఓ సామాన్యుడు- ‘ఆదట నీ యీ భక్తుం...’ అని పద్యం రాసి దారినపోయే వారందరికీ వినిపించి అప్రతిష్ఠ పాలుచేసి తన పొలం తిరిగి సంపాదించగలిగాడు. పేరుసరిగా గుర్తులేదు. ఇలాంటి శాపానుగ్రహ పద్యాలు రాసేవాళ్లూ చాలామంది ఉండేవాళ్లు- విని ఆనందించేవాళ్లున్నందువల్ల’ అని రాశారు. 
      పద్యలేఖల స్థాయి దాటిపోయిన ఆశుకవులు పద్యాల్లోనే మాట్లాడుకునేవారు. ఈ రోజెలా జరిగిందో చెప్పేందుకు ఒకరు సీసపద్యం ఎత్తుకుంటే, నిన్న రాత్రి సరిగా నిద్రపట్టలేదని చెప్పేందుకు అవతలివారు కందం అందుకునే వారన్నమాట. ఇంత ఆశుధోరణిలోనూ వాళ్లకు యతిప్రాసలు తప్పేవికాదంటే ఆ ధోరణిలోని ఉద్ధృతి అర్థమవుతుంది. ఉత్తరాల్లో రాసే పద్యాలూ, పలకరింపునకు చెప్పే పద్యాలూ కవిత్వం కాకపోవచ్చు కానీ పరోక్షంగా ఓ సాహితీ వాతావరణం సృష్టించేవి.
      ఇక అవధానాల ఉద్ధృతి సరేసరి. వచ్చిన సమస్యను వచ్చినట్లే తిప్పికొట్ట డమూ, రామునిమీద పద్యం చెప్పమని ర, మ అక్షరాలే నిషేధించే నిషిద్ధాక్షరులు కూడా ఎదురొడ్డి సాధించే ఆ భాషాక్రీడ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేది. కల్పనాశక్తి, ఏకాగ్రత, ధారణలకు అగ్నిపరీక్ష లాంటి అవధాన ప్రక్రియ పండితుల నుంచి సామాన్యుల వరకు ప్రతివారినీ ఓ ఊపు ఊపింది. ఎనిమిది మందికి సమాధానాలు చెప్పే అష్టావధానం, వంద మందిని సంతృప్తిపరిచే శతావధానం, వెయ్యిమందిని ఎదుర్కొనే సహస్రావధానాల వంటివి ఊరూరా జరిగేవి.
      అటు బరంపురం నుంచి ఇటు బళ్లారి దాక ఎందరో కవుల అవధానాలు ప్రజల్ని పద్యక్రీడ పట్ల అనురక్తుల్ని చేశాయి. ఇది కొందరు అవధానుల నడుమ సంకుల సమరానికి దారితీసింది. ఆ దూషణ పర్వంలోనూ తెలుగు సాహిత్యానికి ఎంతో మేలు చేసే ఉద్గ్రంథాల సృష్టి జరిగింది. తిరుపతి వేంకట కవులు ఏవో స్వల్ప విషయాలతో స్పర్థ వహించిన కొప్పరపు సోదరులు, వేంకట పార్వతీశ్వర కవులకు ఆ స్పర్థ చినికిచినికి గాలివాన కాగా దూషణ, ఖండన గ్రంథాలతో, మరింత జోరుగా అవధానాలతోనే సాహితీయుద్ధం సాగించారు. ఎదుటివ్యక్తి ప్రశ్నకు ఎప్పుడు వీరి మెదడులో సమాధానం ఏర్పడి, పద్యరూపం తీసుకుందోనని ఆశ్చర్యం కలిగించే ఆ అవధానులు తెలుగునేల అంతటా పద్యాలతో విందు చేశారు. ప్రజల్లో అవధానులకూ ఇప్పడు సినీతారలకున్నంత ఆకర్షణ ఉండేది.
      ఛందస్సులో రాసిన ప్రతీది కవితే అనుకునే దృష్టి, పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కవుల వంటివి అనారోగ్యకరమైన పరిణామాలకు దారితీసి ఉండొచ్చు. అయినా కవిత్వాన్ని ఆస్వాదించే రసజ్ఞత పెరిగేందుకు, ఉత్తమ కవిత్వం రూపొందేందుకు అవే తమవంతుగా పనికివచ్చాయి.
      అప్పటి ప్రజల నిత్యజీవితంలోనూ పద్యసాహిత్యం చొచ్చుకుపోయింది. రుక్మిణికి కృష్ణునిలా తనకూ కోరుకున్న సుగుణాలతో భర్త దొరకాలని పెళ్లికాని అమ్మాయిలు పోతన ‘భాగవతం’లోని రుక్మిణీ కల్యాణ ఘట్టం పారాయణ చేసేవారు. పెళ్లిచూపుల్లో అమ్మాయిని ‘రుక్మిణీ కల్యాణం పద్యమొకటి పాడమ’ని అడిగి మరీ పాడించుకునేవాళ్లు.
మాటల ఎత్తుగడలూ పద్యాలే...
‘పాండవోద్యోగ విజయాలు’, ‘గయోపాఖ్యానం’ లాంటి పద్య నాటకాల ప్రదర్శనకు పండితుల కన్నా సామాన్య ప్రజలే ఎక్కువగా హాజరయ్యేవారు. రాత్రి మొదలుపెడితే తెల్లారేవరకూ సాగే నాటకాలను జాగారాలు చేస్తూ చూసేవారు. ఏదైనా పద్యం బాగా పాడితే ‘వన్స్‌మోర్‌’లు కొట్టేవారు. ‘బావా ఎప్పుడు వచ్చితివీవు’ అంటూ బావమరుదులతో పరాచకాలు, ‘జాతి లక్షణం’ అంటూ చిన్నవాళ్ల కోతిచేష్టల్ని వెక్కిరించడం- ఇలా పద్యనాటకాల్లోని పద్యపాదాలు చమత్కారాలుగా చలామణిలో ఉండేవి.
జెండాపై కపిరాజు, ముందు సితవాజి శ్రేణియుం గూర్చి నే
దండంబుంగొని తోలు స్యందనము మీదన్నారి సారించుచుం
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండుచున్నప్పుడొ
క్కండున్‌ నీమొఱ నాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్‌

      అని ఆనాడు రిక్షా లాగుతూ ఓ కార్మికుడు పద్యాన్ని ఊతంగా అందుకుని ఉత్సాహాన్ని పొందినా, ఆరుబయట నులకమంచంపై పడుకుని అలసట మరిచేందుకు ‘అలుగుటయే ఎరుంగని మహామహితాత్మజుడా అజాతశత్రువే అలిగిననాడు’ అంటూ ఆలపించినా అదంతా పద్యనాటకాల మహిమే. అక్షరగంధం అంటని ఆ కష్టజీవుల నోట భావయుక్తమైన పద్యాలాపన వినిపించేది.
      పూలు కోస్తే వాటిని కన్న కొమ్మలు కన్నీరు పెడతాయేమోనని కొందరు పుష్పాలంకరణ ప్రియులైన ఆనాటి స్త్రీలు కూడా పూలను చూసే ఆనందించడం వెనుక కరుణశ్రీ ‘పుష్పవిలాప’ కావ్య ప్రభావం ఉంది. తోటలో పూలు కోయడానికి కవి పూలపై గోరు ఆంచగానే ‘హా! మా ప్రాణములు తీతువా?’ అని ప్రశ్నించిన పూలగాథ రసరమ్యమైన పుష్పవిలాప కావ్యమైంది. ఘంటసాల అమరగళంలో రికార్డుగా వచ్చిన ఆ కావ్యగానం ప్రతి తెలుగు ఇంటా పూవై పూసింది.
      పిల్లలను ఉత్తమాభిరుచి, సమయస్ఫూర్తి, యుక్తాయుక్త విచక్షణ ఉన్న పౌరులుగా తీర్చిదిద్దేందుకు నాడు ఉపయోగించిన సాధనమూ శతక పద్య సాహిత్యమే. శతకాలు చదివి పెద్దవారైన తెలుగువాళ్లు శతక పద్యాల నీతిని సమయానికి తగు రీతిలో వాడేవాళ్లు. ‘అక్కరకు రాని చుట్టము... గ్రక్కున విడువంగ వలయు’, ‘మేడిపండు చూడ మేలిమై యుండు...’, ‘తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు పుట్టనేల వాడు గిట్టనేల’ వంటివి తెలుగు నాలుకలపై నాట్యమాడి సన్మార్గానికి దారిదీపాలై నిలిచేవి. శతక సాహిత్య ప్రభావానికి నిదర్శనంలాంటి పాత్ర ఉప్పల లక్ష్మణరావు ‘అతడు- ఆమె’ నవలలో ఎదరవుతుంది. సీతారాం అనే పాత్ర సందర్భానుసారంగా వేమన సూక్తులు గుప్పిస్తుంటాడు. అదే నవలలో శుభపాత్ర మాటల్లో చెప్పాలంటే ‘సీతారాం వేమన అంటే చెవి కోసుకుంటాడు’. పెళ్లిళ్లలో పంచరత్నాల పేరిట వధూవరుల్ని ఆశీర్వదిస్తూ అయిదు పద్యాలు చదివి వినిపించడం వంటి ఎన్నో అలవాట్లు ఆనాడు ప్రారంభమైనవే.
      సుకవులపై ప్రజల ఆదరణ కూడా చెప్పుకోదగ్గదే. అవధానాలు చేసి, పద్యనాటకాలు రాసి ఎంతో ప్రఖ్యాతినీ, ఎందరో శిష్యుల్నీ సంపాదించిన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి ఓ పాఠశాలలో తెలుగు పండితులు. ఏటా వచ్చి పరీక్షించే జిల్లా విద్యాధికారి శాస్త్రి ఒంగిఒంగి దణ్నాలు పెట్టలేదని కోపగించి, ఆయనను తొలగించ మని రిపోర్టు రాసేవారు. వేంకటశాస్త్రి ప్రముఖ కవి అన్న గౌరవంతో పాఠశాల పాలకమండలి ఆ పనిచేసేది కాదు. ఉన్నతాధికారుల నిర్ణయానికి తిరుగులేని ఆ బ్రిటీష్‌ పాలనా కాలంలో పద్యకవుల మీద ఉండే గౌరవం ఎలాంటిదో చెప్పేందకు ఇంతకన్నా రుజువు ఇంకేం కావాలి.
      గుర్రం జాషువా, తిరుపతి వేంకటకవులు తదితర కవులెందరినో ఏనుగుల మీద ఊరేగించడం, కనకాభిషేకం చేయడం, స్వర్ణకంకణాలు తొడగటం వంటి అపురూప సత్కారాలు జరిగాయి. తిరుపతి వేంకటకవులు ‘ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము’ అని సగర్వంగా చెప్పుకున్నారు. ‘కవిత కల్గిన రాజ్యాధికారమేల?’ అన్నట్లు సుకవితకు నిదర్శనంగా పద్యకవులు రాజవైభవాలు పొందిన వెండి బంగారు రోజులవి. ఇప్పుడదంతా గతం. వర్తమానంలో మంచి పద్యం రాసేవాళ్లు, పద్యసాహిత్యాన్ని చదివేవాళ్లూ అరుదయ్యారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మనది అని చెప్పుకునే పద్యం చరిత్రలో మాత్రమే కనపడుతుంది.

***


వెనక్కి ...

మీ అభిప్రాయం