తప్పెటపై తెలుగు దెబ్బ

  • 1252 Views
  • 3Likes
  • Like
  • Article Share

    గణేశ్‌ బెహరా

  • వాటపాగు, శ్రీకాకుళం జిల్లా
  • 7732097027
గణేశ్‌ బెహరా

కాశీపోతగుడ్డ నడుముకి పట్టీ
ఇనుపరేకు తప్పెట ఛాతికి చుట్టీ
అందాల తలపాగా నెత్తికి కట్టీ
ఇతిహాసాలెన్నెన్నో పుక్కిటబెట్టీ
గంగమ్మ తల్లికీ దండంపెట్టీ...
కాలి మువ్వల్లోకి గుండె జారిపోయేలా
ఉరుముల మెరుపుల దరువులు మొదలెడతారు
సందిట కథలను చక్కగా వినిపిస్తారు...
అదే యాదవుల సంస్కృతీ పథం
తెలుగు జాతి గుండెల్లో తప్పెటగుళ్లు జానపదం.
ఆనందంతో
గుండె నిండినప్పుడు చెయ్యి దరువేస్తుంది. కాలు కదులుతుంది. శరీరమంతా ఉద్వేగంతో ఊగిపోతుంది. అదో సందర్భం! ఆక్రోశంతో గుండె మండినప్పుడు కండరాలు ఏకమవుతాయి. నరాలు పొంగుతాయి. కడుపులోని కష్టం.. ఆ కష్టానికి కారణం... ఆ కారణాన్ని కప్పెట్టాలనుకునే కసి... అన్నీ ఒక్క ఉదుటున గొంతులోంచి ఉబికి వస్తాయి. ఉద్రేకంతో వాతావరణమంతా వేడెక్కుతుంది. ఇదో సందర్భం! సందర్భమేదైనా సరే అప్పుడే పాట పుడుతుంది. దానికి ఆట జోడవుతుంది. అలా పాడుతూ ఆడే... ఆడుతూ పాడేవాళ్లందరూ మామూలు మనుషులే. జనం భాషలో చెప్పాలంటే పల్లెటూరోళ్లు! అయితేనేం... ఎన్నో కళారూపాలకు వాళ్లే బెమ్మదేవరలు! ఆ మట్టిమనుషులు సృష్టించిన జానపద కళారూపాలకు తెలుగునాట కొదువలేదు. పల్లెసుద్దుల నుంచి ఒగ్గుకథల వరకూ... ఉరుము నృత్యాల నుంచి యక్షగానాల వరకూ తెలుగువారి సాంస్కృతిక సంపదల జాబితా చిన్నది కాదు. ఆ జాబితాలోని ఓ ఆణిముత్యం... ‘తప్పెటగుళ్లు’. ఉత్తరాంధ్ర గుండెలపై మోగే ఈ తప్పెట దెబ్బలకు ఆద్యులు యాదవులు. 
      వరద గోదావరి ఉద్ధృతిని ఎప్పుడైనా చూశారా? వాయుగుండంలోంచి పుట్టే గాలివాన హోరు విన్నారా? ఆ రెండూ తప్పెటగుళ్లలో కనిపిస్తాయి. నిజానికి ఈ కళారూపానికి ప్రధాన ఆకర్షణ అవే. ఎదుర్రొమ్ములపై తప్పెట కట్టుకుని... రెండు చేతులతో దానిపై దరువేస్తూ... వంగి లేస్తూ... ఎగిరి దుముకుతూ... కేరింతలు కొడుతూ... ఒకరి భుజాల మీదకు మరొకరు ఎక్కుతూ... అక్కడా తప్పెట కొడుతూ ఈ కళాకారులు చేసే నృత్యానికి చూసేవాళ్ల వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. నాట్యం చేస్తూనే దీర్ఘరాగాలతో పాటలందుకుంటూ... వాటి ద్వారానే రామాయణ, భాగవతాలను వివరిస్తూ కళాకారులు పరవశించిపోతారు. ప్రేక్షకులను పరవశింపజేస్తారు. వాళ్ల నాట్యానికి వేగం ఆయువుపట్టు అయితే, వాళ్ల పాటకు ప్రాణం అమ్మపాల వంటి స్వచ్ఛమైన పల్లెపదం! 
ఇలా పుట్టింది...
పంట సంతకెళ్లాక మళ్లీ నాటేసేదాకా పొలం ఖాళీనే. ఆ సమయంలోనే కాస్త దానికి సారమద్దడానికి సహజ ఎరువులేసే వాళ్లు నాటి అన్నదాతలు. ఆ క్రమంలోనే ఖాళీ క్షేత్రాల్లో మేకలు/ గొర్రెల మందను తిప్పమంటూ యాదవులను అడిగేవాళ్లు. పంట లేకపోయినా గడ్డి ఉంటుంది కాబట్టి మేకలు/ గొర్రెలు దాన్ని నములుతూ... అక్కడే విసర్జిస్తుండేవి. అలా పొలానికి ఎరువు దొరికేది. ఇటు యాదవుల ఆస్తికీ కాస్త తావి అబ్బేది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వరిపంట కోతలయ్యాక మళ్లీ తొలకరి వరకూ వేర్వేరు ఊళ్లలో ఉన్న పొలాల్లోనే మందలను మేపుతుండేవాళ్లు. పగలూ రాత్రి దాన్నే కనిపెట్టుకునుండేవాళ్లు. మైదాన ప్రాంతాల్లోనే కాదు కొండప్రాంత గ్రామాలు, అడవులకు దగ్గర్లోని పల్లెలకూ వెళ్లి అక్కడి పొలాలకు తమకు చేతనైనంతలో సారమెక్కించే వాళ్లు. కానీ, రాత్రుళ్లే చిక్కులొచ్చిపడేవి. ఎటు నుంచి ఏ తోడేలొస్తుందో... ఏ నక్క ఏ మేక పీక పట్టుకుంటుందో తెలియదు! వీటికి తోడు దొంగలు! కునుకు తీయకుండా కాచుకోవడమెలా? 
      దానికోసం మందలతో ఉన్న యాదవులందరూ రెండు జట్లుగా మారేవాళ్లు. ఒక్కో జట్టు ఒక్కో జాములో కాపలా కాసేది. కానీ, మెలకువగా ఉండే జట్టును చలి చంపేసేది. దాన్ని ఎదురుదెబ్బ కొట్టాలంటే ఒంట్లో వేడి పుట్టాలి. అంటే ఒళ్లు కదలాలి. అలా చిందు మొదలైంది. అది కొనసాగాలంటే పాట కావాల్సిందే. అదీ ఆశువుగా వచ్చేసింది. దానికి తోడు చిన్నప్పటి నుంచి విన్న పురాణ కథలు ఉండనే ఉన్నాయి. ఇకపోతే దరువు... అది లేకపోతే ఆటపాటల్లో మజా ఉండదు కదా! అయితే యాదవుల చేతుల్లో గడకర్రలు తప్ప ఇంకేముంటాయి! అందుకే గుండెలపైనే కొట్టుకుంటూ సడి పుట్టించేవాళ్లు. కాళ్లకు గజ్జెల్లా జనపకాయలను చుట్టుకునేవాళ్లు. అలా ఆట, పాట, దరువు కలిసి ‘గుండె చప్పుళ్లు’ అనే కళారూపంగా ఆవిష్కృతమయ్యాయి. కాలక్రమంలో టేకు ఆకులను ఎండబెట్టి గుండెపై పెట్టుకుని దరువు వేసేవాళ్లు. తర్వాత గొర్రె, మేక చర్మాలతో తప్పెట్లను తయారుచేసుకున్నారు. అయితే, వీళ్ల వేగానికి అవి చిరిగిపోతుండటంతో చెక్కను ఆశ్రయించారు. అది మరీ ఎక్కువగా మోగకపోవడంతో ఇనుప రేకును గుండ్రంగా కత్తిరించి తప్పెటగుండుగా మలచుకున్నారు. ఆ గుండుకు నాలుగు ఎదురెదురు రంధ్రాలు పెట్టి, తాళ్లతో దాన్ని ఛాతికి కట్టుకుని దరువెయ్యడం మొదలెట్టారు. అప్పటి నుంచి ‘తప్పెట’ దెబ్బలకు తిరుగులేకుండా పోయింది. చిన్నగా పొలాల్లోంచి ‘తప్పెటగుళ్లు’ పల్లెల్లోకి వచ్చాయి.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి తూర్పుగోదావరి జిల్లాను దాటి... అమెరికా, శ్రీలంక, థాయిలాండ్, మలేషియాల్లోనూ మారుమోగాయి. 
గంగమ్మా... నీదే భారం!
కాటమరాజు ఇల్లాలు గంగమ్మ అంటే యాదవులకు భక్తి, గౌరవం. వాళ్ల ఇలవేల్పూ ఆమె. తమ పిల్లాజెల్లా బాగుండాలని, సాదుకునే జీవాలు చక్కగుండాలని, వానలు పడి ఊరంతా పచ్చగా ఉండాలని ఆ తల్లికి ఏటా కొలువులు చేస్తారు. ఆ గంగమ్మ(గావు) ఉత్సవంలో అమ్మకు ప్రతిరూపంగా ఘటాన్ని తలకెత్తుకుని ఊరేగింపుగా వెళ్తారు. 
శోభనమేయమ్మ శోభనమే తల్లి
శోభనమే గంగ శోభనమే గంగ శోభనమే గంగ
మూడు ముళ్ల నరులమే 
మురికి జన్మం మాది మురికి జన్మం మాది
ఎంగిలి కంఠమే మెంచి 
పిలువంగలేము పిలువంగలేము పాచినోరుతోనే 
పాలించలేమోయమ్మ పాలింపలేమోయమ్మ
నీకు వందనమమ్మ లోక మాతవు నీవు 
దబ్బవనములోన దాగుండినావు తల్లీ
నిమ్మవనములోన నిలిచి ఉన్నావు తల్లీ
నీకు వందనమమ్మ లోకమాతవు నీవు....
అని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక్కడ ‘శోభనం’ అంటే సుందరమైన, మంగళకరమైన అని అర్థం! మూడు రోజుల పాటు ఈ ఉత్సవాన్ని జరుపుతూ తప్పెటగుళ్లు ఆడతారు. యదువంశ విభుడైన కిట్టయ్యనూ కొలుస్తారు.  యాదవులు కూడా అప్పట్లో జంధ్యాలు ధరించేవారట. దానికి గుర్తుగా గంగమ్మ ఉత్సవంలో బుట్టలో జంధ్యాన్ని వేసి పూజిస్తారు. 
వేషధారణ అదరహో
తప్పెటగుళ్లు ఆడే ప్రతి బృందానికీ ఓ నాయకుడు ఉంటాడు. సభ్యుల సంఖ్యకు పరిమితి లేదు. సాధారణంగా ఇరవై మందికి లోపే ఉంటారు. అందరూ ఒకేలాంటి దుస్తులేసుకుంటారు. ఒకే రంగు బనియను, ఒకే రంగు నిక్కరు ధరిస్తారు. కాకపోతే ఆ రెండూ రెండు రంగుల్లో ఉంటాయి. నిక్కరుకు ముందూ వెనుకా కాశీపోత పంచె గుడ్డతో మువ్వలతో పట్టీ కుట్టిస్తారు. కాళ్లకు గజ్జెలు కట్టి... చివరగా తలపాగా చుడతారు. ఆకర్షణీయంగా ఉండే ఈ వేషధారణకు అదనంగా గుండెకు తప్పెట. నృత్యం చేసేటప్పుడు బృందనాయకుడిని అనుసరిస్తారు. లయబద్ధంగా అడుగులేస్తారు. కొన్ని కథాంశాల్లో బృంద సభ్యులే ఆయా పాత్రల (రాముడు, సీత, హనుమంతుడు...) రూపాలెత్తుతారు. గేయ, వచనాల్లో నడిపిస్తూ కథ చెబుతూ నాట్యానికి అభినయాన్నీ జోడిస్తారు.  

మాటంటే మాటే
బృందనాయకుడికి పావలా కాసు, బెల్లం ముక్క ఇచ్చి ఒప్పందం కుదుర్చుకుంటే చాలు... చెప్పిన చోట, చెప్పిన సమాయానికి తప్పెటగుళ్లు బృందం ప్రదర్శన ఇస్తుంది. ఈ కళాకారుల్లో చాలామంది వంశపారంపర్యంగా ఆ కళను ఆరాధిస్తున్నవాళ్లే. రామాయణ, భారత, భాగవతం, పురాణాల ఆధారంగా పాటలల్లుకుంటారు. సొంతగా బాణీలు కట్టుకుంటారు. పాటలన్నీ ద్విపదల్లో ఉంటాయి. ద్విపద ప్రత్యేకత ఏంటంటే... దాన్ని పాటగా పాడవచ్చు. పద్యంలా రాగమూ తీయవచ్చు. అయితే, వీళ్లు ఎక్కువగా శ్రీకృష్ణుడి పాటలే పాడతారు. ‘శివ శివమూర్తివి గణనాథా...’ అంటూ ప్రార్థనతో ప్రదర్శన ఆరంభిస్తారు. తర్వాత గంగమ్మ, కాటమరాజు కథ, గొల్ల చదువు, సారంగధర కథ, చెంచులక్ష్మి, తూర్పు భాగవతం, లక్ష్మణమూర్ఛ వంటి పాటలను పాడతారు. రామ, రావణ యుద్ధంలో ‘లక్ష్మణమూర్ఛ’ ఘట్టాన్ని వాళ్లు పాడే తీరు...
తమ్ముడా తమ్ముడా తమ్ముడా లక్ష్మాణా ।।2।।
పగవారి భూమిలో పడిమూర్ఛలైనావు
తమ్ముడేడని తల్లులడిగితే 
ఏమని చెప్పెద తమ్ముడా 
ఇప్పచెక్కల్లా మనతల్లికిద్దరం 
జోడుగుర్రాల్లాగా మన మన్నదమ్ములం
పగవారి భూమిలో పడిమూర్ఛలైనావు
ధరణి తమ్ముడను తొడలపై నేసుకుని 
గోలుగోలుమని ఘోషపెట్టుడు రామ
తమ్ముడా తమ్ముడా తమ్ముడా లక్ష్మాణా ।।2।। ....
 
కృష్ణా వినవేమిరా...
ఆరాధ్యదైవమైన కృష్ణుడి జన్మవృత్తాంతాన్ని వర్ణిస్తూ... కంసుడి క్రూరత్వాన్ని గుర్తుచేసు కుంటూ దేవకీదేవి శోకిస్తున్న తీరును వివరిస్తూ...
దేవకి గర్భమున దేవుడై పుట్టావా
నాయనా నాకొడుకో నా కొడుకోశ్రీకృష్ణ 
అన్యకారి గర్భమున ఏల పుట్టవుకొడుకా
పాపకారి గర్భమున పాడు జన్మాగానూ 
మీ మామ కంసునికత్తి ఆరమవుతావ్‌
నీకన్న పెద్దోడు నీలముని పుట్టాడు
నీలముని అన్నోడ్ని నిలబెట్టి నరికాడు
వాడికన్న పెద్దోడు పాలముని పుట్టాడు
పాలముని అన్నోడ్ని పడదోసినరికాడు 
మీ మామ కంసుండు కానీవాడయ్య 
నాయినా నా కొడుకో నా కొడుకో శ్రీకృష్ణ...
అంటూ పాడతారు. అలాంటి కృష్ణుడు ఆగర్భశత్రువును అంతమొందించి గోపీజన వల్లభుడవుతాడు. ఆ చిలిపి కన్నయ్య లీలలను భరించలేని గోపికలు యశోదతో ఇలా మొర పెట్టుకున్నారని చెబుతారు...
అమ్మా గోపమ్మా నా మనవి వినవమ్మా
యశోద తనయా వెన్నల దొంగ
విన్నావిటూ యశోదమ్మా
చిన్నీ కృష్ణుడు సిన్నీలన్నీ           ।।అమ్మా గోపమ్మా।। 
సందజాము పెరటిలోనా 
స్నానంబు మేము సేయాసుంటి 

వెనకా మారుల వచ్చాడమ్మా 
తన్నీ... పడా...దోశాడమ్మా        ।।అమ్మా గోపమ్మా ।। 
మర్రి చెట్టూ నీడలోనా

మరసి నిద్దర చేయాసుంటి
నిద్దట్లోనూ వచ్చాడమ్మా 
ఇద్దరినీ రమ్మన్నాడమ్మా           ।।అమ్మా గోపమ్మా ।।
కొబరిమాను పెరటీలోనా
కుక్కాటామీ ఆడుచుంటీ
వెనకామారుల వచ్చాడమ్మా
కొబరమానూ ఎక్కడామ్మా 
కొంగూబట్టుకు లాగాడమ్మా 
।।అమ్మా గోపమ్మా।।...
అంటూ ‘సిన్నులు (చేష్టలు), ‘సందజాము’ (సంధ్యాకాలం), ‘వెనకా మారుల (వెనుక నుంచి)’, ‘మరసి(ఆదమరచి)’ వంటి ఉత్తరాంధ్ర మాండలిక పదాలతో మాల కడతారు. 


బతికిస్తోంది వీళ్లే
* శ్రీకాకుళం జిల్లా ఎస్‌.ఎం.పురం (ఎచ్చెర్ల), కిడిసింగి (వజ్రపుకొత్తూరు), పలాస, రేగులపాడు, పెద్దపాడు, రాజాం, పొందూరు, సోంపేట, రణస్థలం, ఇచ్చాపురాల్లో సుమారు 20కి పైగా బృందాలున్నాయి.
* విజయనగరం జిల్లా వీరసాగరం, కిత్తన్నపాలెం (శృంగవరపుకోట), పాండ్రంగి, బియ్యాలపేట, ముద్దాడపేట, దాసరిపేట, మెరకముడిదాం, గజపతినగరం, నెల్లిమర్ల, దత్తిరాజేరు, చీపురుపల్లి, గరివిడి, డెంకాడ తదితర ప్రాంతాల్లో దాదాపు 40 బృందాలున్నాయి. 
* విశాఖపట్నం జిల్లా శివాజీపాలెం, రాట్నాలపాలెం, దిబ్బపాలెం (చీడికాడ), మనబాలిపాలెం (నక్కపల్లి), జాంతలపాలెం (కశింకోట), సబ్బవరం, తూర్పుగోదావరి జిల్లాలో ఏలేశ్వరం, రమణయ్యపేట, పెద్దాపురం, తొండంగి, కట్టమూరు, సామర్లకోట తదితర ప్రాంతాల్లోనూ తప్పెటగుళ్లు కళాకారులున్నారు.
కళా సేవలో...
ఎచ్చెర్లకు చెందిన గొంటి సింహాచలం కొత్త కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు. పాతపట్నానికి చెందిన ముద్ద దుర్యోధన (పాతపట్నం) తప్పెటగుళ్లలో తాళప్రస్థానం, కీర్తనలు పాడుతూ కళకు కొత్త అందాలు అద్దుతున్నారు. విజయనగరం జిల్లా బాడంగి వాసి నీలబోను సత్యం, బొబ్బిలికి చెందిన దేవర రాములు బృందాలూ తాళప్రస్థానంతో తప్పెటగుళ్లకు నగిషీలద్దుతున్నారు. మరోవైపు... సత్యం దాదాపు 800 మందికి ఈ కళను నేర్పిస్తున్నారు. తప్పెటగుళ్లను అనాదిగా యాదవులే ప్రదర్శిస్తున్నా... ఇప్పుడు ఇతరులూ నేర్చుకుంటున్నారు.  అలాంటి వారిలో శ్రీకాకుళం జిల్లా బట్టేరు వాసి పి.రాములు ఒకరు. ఆయన తప్పెటగుళ్లు, తూర్పుభాగవతం, గొల్లభామలు, జాలరిపాటలకు నృత్యం చేస్తారు.
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన కింతాడ సన్యాసిరావు చదివింది అయిదో తరగతి. అయినా... చక్కటి హరికథలు, బుర్రకథలు, పాటలు రాస్తారు. అక్షరసంక్రాంతి, పల్స్‌పోలియో, మలేరియా, ఎయిడ్స్, మధుమేహ నివారణ వంటి కార్యక్రమాలను తప్పెటగుళ్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. మద్యనిషేధంపై ఆయన రాసిన ‘తాగొద్దు మామ తాగొద్దురా/ తాగితే తాళిమీద ఒట్టేనురా.../ ఎన్ని కలలు కన్నానో నిన్ను చేసుకున్నాను/ కన్నీళ్లే నా బతుకు కానలేకపోయాను...’ అనే పాట ప్రఖ్యాతం. ఆంధ్ర, నన్నయ్య, తెలుగు విశ్వవిద్యాలయాల తరఫున అన్ని జిల్లాల నవతరం తప్పెటగుళ్లు కళాకారులకు శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం ఇంటాక్‌ సంస్థ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు దీన్ని నేర్పిస్తున్నారు. వీళ్ల బృందం మన దేశంలోనే కాదు అమెరికా, థాయిలాండ్, మలేషియా ల్లోనూ ప్రదర్శనలిచ్చింది. ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ పాల్గొన్నారు.


అబ్బురపరిచే విన్యాసాలు
ఉత్తరాంధ్రలో వినాయకచవితి, కృష్ణాష్టమి, దేవి నవరాత్రులు, శివరాత్రి, శ్రీరామనవమి, గ్రామదేవతల సంబరాలకు తప్పెటగుళ్ల ప్రదర్శనలు తప్పనిసరి. భక్తిపాటలే కాదు, తప్పెటగుళ్ల కళాకారులు సామాజిక రుగ్మతల మీద గళం విప్పుతారు. వ్యసనాలకు వ్యతిరేకంగా పాటలు కట్టి ప్రదర్శనలిస్తారు. ప్రభుత్వ పథకాల ప్రచారాలూ నిర్వహిస్తారు. ప్రేక్షకుల్ని ఊర్రూతలూగించేందుకు మధ్యమధ్యలో అరుపులు, పల్టీలు వేయడం, కళ్లకు గంతలు కట్టుకుని అవతలి మనిషి ఛాతిపై ఉండే కొబ్బరికాయని కత్తితో నరకడం, పళ్లెం అంచులపై, కుండపై నిల్చుని నృత్యం చేయడం, కోడిగుడ్లపై నిలబడి తప్పెట కొట్టడం తదితరాల విన్యాసాలు చేస్తారు. వలయాకారంలో కదులుతూ బృందసభ్యులందరూ ఒక్కటిగా చేసే నృత్యం చూడముచ్చటగా ఉంటుంది. మగవాళ్లు మాత్రమే ప్రదర్శించే ఈ నృత్యాన్ని విజయనగరం జిల్లాకు చెందిన యలమంచిలి బంగారమ్మ (తొలి తప్పెటగుళ్ల కళాకారిణి), ఆమె చెల్లి చినతల్లి, గంగ తదితర కళాకారిణులూ అందిపుచ్చుకోవడం విశేషం. 
      అయితే, ఒకప్పుడు ఒక్కో జిల్లాలో వందల సంఖ్యలో కళాబృందాల్లో ఎక్కువ శాతం ఇప్పుడు కనుమరుగు అయ్యాయి. జీవన పోరాటంలో భాగంగా వలసలు తప్పనిసరిగా కావడంతో తప్పెటగుళ్లకు కళ తప్పుతోంది. కొందరు కళాకారులు మాత్రం యువతకు దీనిపై శిక్షణిస్తూ ఈ అపురూప జానపదానికి నీరు పోస్తున్నారు. అలాంటి వారి కృషిని అభినందిస్తూ... వారికి తగిన సాయం చేయడం, కళాకారులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం పాలకుల బాధ్యత. దాన్ని వాళ్లు గుర్తెరిగేలా చేయడం తెలుగువాళ్లందరి కనీస కర్తవ్యం.

***


వెనక్కి ...

మీ అభిప్రాయం