వివేకానందుడి మార్గం... వికాసమే లక్ష్యం

  • 587 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కొండవీటి శ్యాంప్రసాద్‌ ముఖర్జీ

  • హైదరాబాదు
  • 8008224099
కొండవీటి శ్యాంప్రసాద్‌ ముఖర్జీ

నేటి విద్యార్థిలో ఆచరణాత్మకమైన తెలివితేటలు మృగ్యం. ఇందుకు అతణ్ని నిందించి ప్రయోజనం లేదు. దీనిలో అతడి వంతు ఏమీ లేదు. శారీరక బలం కన్నా అతడికి అవసరమైనది మానసిక స్థైర్యమే. కళ్లను, చేతులను ఎలా ఉపయోగించుకోవాలో అతడికి తెలియదు. చేతిపనులేమీ అతడికి నేర్పించడం లేదు. నేటి విద్యాభ్యాసం కేవలం సమాచారమయమైనదిగా ఉంది. విద్యార్థికి చింతన చేయడం నేర్పాలి. అతడు సొంతంగా ఆలోచించి, తనకు అవసరమైనది చేసుకోవాలి... రెండవది విద్యార్థుల ఆకలి తీర్చే మార్గం కనుగొనాలి. కించిత్తు కూడా పుష్టిలేని ఆహారం తింటూ అనేకమంది విద్యార్థులు జీవిస్తున్నారు... చిన్నతనంలో పౌష్టికాహారం తింటేనే వ్యక్తి ఆరోగ్యకరమైన మనిషిగా ఎదగగలుగుతాడు. మూడవది శీలం. అది మన నుండి సెలవు పుచ్చుకుపోయింది. మన పిల్లల్లో సభ్యతా సంస్కారాలు లేకుండా పోయాయి. సరళంగా మాట్లాడటం అగౌరవం, పెద్దల పట్ల మర్యాద పాటించడం అగౌరవం;  పెద్దల పట్ల అమర్యాదగా వ్యవహరించడమే స్వేచ్ఛకు చిహ్నంగా మారిపోయింది. అయినప్పటికీ నేను భారత జాతిని చూసి గర్విస్తున్నాను. నాలో నమ్మకం పోలేదు. ఒక మహోన్నతమైన, ఒక అద్భుతమైన భవిష్యత్తును నిత్యం నా మానసిక దృశ్యంలో  చూస్తున్నాను.
- నాటి విద్యావ్యవస్థ మీద వివేకానందుడి అభిప్రాయం ఇప్పటికీ సమకాలీనమే. 
‘అఖండమైన ఉత్సాహం, అపరిమితమైన ధైర్యం, అప్రతిహతమైన శక్తి... అన్నింటినీ మించి పరిపూర్ణమైన విధేయత... ఈ లక్షణాలే ఒక వ్యక్తినిగానీ, దేశాన్నిగానీ పునరుజ్జీవింపచేయగలవు’ అంటూ జాతి వికాసానికి మార్గనిర్దేశం చేసిన మహానుభావుడు వివేకానందుడు. ‘ఒక్క అడుగు వెనక్కు వేయవద్దు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా పోరాడండి. నక్షత్రాలు స్థానభ్రంశం చెందినా... ప్రపంచం మొత్తం మీకు ఎదురు నిలిచినా... పోరాడండి. పిరికివాళ్లై మీరు సాధించేదేమీ ఉండదు. అడుగు వెనక్కివేసి మీరు ఏ విపత్కర పరిస్థితి నుంచీ తప్పించుకోలేరం’టూ జాతిజనుల్లో చైతన్యోత్సాహాలు నింపిన వ్యక్తిత్వ వికాస స్రష్ట స్వామీ వివేకానంద.  ఆయన మాటలు వింటే... గుండె లోతుల్లో నిద్రపోతున్న శక్తి అంతా లావాలా పెల్లుబుకుతుంది. ఆయన సూక్తులు చదివితే... చచ్చిపోయిందనుకున్న అంతఃచైతన్యం తిరిగి ప్రాణం పోసుకుంటుంది. విజయతీరాల వైపు వ్యక్తిని పరుగులు పెట్టిస్తుంది. 
      అదంతా సరే కానీ, వివేకానందుడు తెలుగులో బోధనలు చేయలేదు. రాయలేదు. మరి ఆయన ప్రబోధాలు తెలుగులో... అదీ విస్తృతంగా ఎలా లభ్యమవుతున్నాయి? సుత్తి లేకుండా సూటిగా, స్పష్టంగా సాగే వివేకానందుడి ప్రవచనాలను అదే శైలిలో... సరళమైన వ్యావహారిక తెలుగులో అందిస్తోందెవరు? హైదరాబాదులోని రామకృష్ణ మఠం. ఏడాదికి రూ.2 కోట్ల విలువైన లక్షకు పైగా తెలుగు పుస్తకాలను పాఠకుల చెంతకు చేరుస్తున్న ఘనత ఈ సంస్థ సొంతం. వ్యక్తి పరిపూర్ణ ఎదుగుదలకు ఉపకరించే సాహిత్యాన్ని మన అమ్మభాషలో విస్తృతంగా వ్యాప్తి చేస్తున్న ఈ మఠం కృషి అనన్య సామాన్యం. 
అలనాటి బీజం
‘నువ్వు వేల మందికి నీడనిచ్చి, సేదతీర్చే ఓ మహా వటవృక్షంగా ఎదగాలి. అంతేకానీ, నీ సొంత ఆనందాన్నే కాంక్షించే స్వార్థపరుడవు కారాదు. తోటిమానవునిలో దైవాన్ని దర్శించి, సేవించడమే అత్యున్నత ఆధ్మాత్మిక స్థితి’ అని స్వామి రామకృష్ణ పరమహంస ఓసారి వివేకానందుడితో అన్నారు. గురువు మాటల్లోని విశాల దృక్పథాన్ని గ్రహించారాయన. ‘ఆత్మనో మోక్షార్థం జగత్‌ హితాయచ’ అని భావించారు. సాటిమానవుడికి సేవ చేసి తరిస్తూ, ఆ మార్గంలోనే మోక్షం పొందాలనేది దాని పరమార్థం. భారతీయ సంస్కృతీ వికాసాన్ని ప్రపంచానికి ఎరుకపరిచిన తన చికాగో పర్యటనలో భాగంగా అక్కడి నుంచే మైసూరు మహారాజుకు ఓ లేఖ రాశారు వివేకానందుడు. ‘ఈ జీవితం అత్యల్పం. ఇందులోని మన కీర్తి ప్రతిష్ఠలన్నీ అశాశ్వతం. పరులకోసం జీవించేవారే నిజంగా జీవించినట్లు. ఇతరులంతా జీవన్మృతులతో సమానం’ అని చెప్పారు. ఇదే భావనతో 1897లో రామకృష్ణ సంఘాన్ని స్థాపించారు. సన్యాసాశ్రమ వ్యవస్థ గతిని మారుస్తూ కొత్త ఉరవడికి శ్రీకారం చుట్టారు. మానవసేవే మాధవసేవ అనే లక్ష్యంతో ఏర్పడిన ఈ సంఘం నేడు ప్రపంచవ్యాప్తంగా 170కిపైగా శాఖలతో సేవాపథంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఆ శాఖోపశాఖల్లో ఒకటిగా చిగురుతొడిగిన హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠం లక్షలాది మందికి దిశానిర్దేశం చేస్తోంది.
      1973లో రామకృష్ణ సంఘం (బేలూరు మఠం) అనుబంధ శాఖగా హైదరాబాద్‌ రామకృష్ణ మఠం గుర్తింపు పొందింది. అప్పటి నుంచి ఈ మఠానికి స్వామి రంగనాథానంద మహరాజ్‌ రెండు దశాబ్దాలపాటు సారథ్యం వహించారు. ఆయన నేతృత్వంలోనే హైదరాబాద్‌ దోమలగూడలో మఠం తన కార్యకలాపాలను విస్తృతపరుచుకుంది. 1979లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎనిమిది ఎకరాల స్థలంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత స్వామి అనన్యానందజీ, స్వామి పరమార్థానందజీ అధ్యక్షులుగా వ్యవహరించారు. 2006 ఫిబ్రవరిలో మఠాధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన స్వామి జ్ఞానదానందజీ ప్రస్తుతం మఠం కార్యకలాపాలను నడిపిస్తున్నారు. 
యువతకు దిశానిర్దేశం 
నవతరానికి సనాతన విలువల్ని అందించాలి... ఆత్మన్యూనతతో వెనకడుగు వేస్తున్న యువతలో విశ్వాసం పాదుకొల్పాలి... ప్రశాంతచిత్తత, ఏకాగ్రతను అలవర్చి విజయం దిశగా వారిని పరుగులు పెట్టించాలి.... ఇన్ని బృహత్తర లక్ష్యాలతో మఠం పనిచేస్తోంది.  యోగా, ధ్యాన, వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతుల ద్వారా ఏటా 70 వేల మందికి పైగా ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. 14 ఏళ్లలో 7.5 లక్షల మంది శిక్షణ తీసుకున్నారు. ‘ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకో. దాన్నే జీవితం అనుకో. దాని గురించే ఆలోచించు. దాని గురించే స్వప్నించు. మెదడు, కండరాలు, నరాలు.. నీ శరీరంలోని ప్రతిభాగం ఆ లక్ష్యంతో నిండిపోవాలి. ఇంకే ఆలోచనా వద్దు. ఇదే విజయానికి మార్గం’ అన్నారు వివేకానంద. ఆయన మాటలే స్ఫూర్తిగా ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. యువతే కాదు.. ఐఏఎస్‌లూ, ఐపీఎస్‌లూ తమ సిబ్బంది సహా ఇక్కడికొచ్చి వ్యక్తిత్వ వికాస తరగతులు వింటారు. కార్పొరేట్‌ సంస్థల యాజమాన్యాలు తమ ఉద్యోగులను ఇక్కడికి పంపుతుంటాయి. ఉద్యోగావకాశాల కోసం విదేశీ భాషలు నేర్చుకోవాలనుకునే వాళ్ల కోసం మఠం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. 
గ్రంథాల కొలువు 
వేలకొద్దీ పుస్తకాలతో జ్ఞానసంపదను పంచేందుకు సిద్ధంగా ఉంటుంది మఠంలోని వివేకానంద గ్రంథాలయం. రామకృష్ణ పరమహంస, వివేకానందుల బోధనలతోపాటు ఆధ్యాత్మిక గ్రంథాలు, ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తులు, యోగా, ధ్యాన, మనస్తత్వశాస్త్రం తదితర అంశాలకు సంబంధించిన 25 వేలకు పైగా పుస్తకాలు ఇక్కడ కొలువుదీరాయి. ఆధ్యాత్మిక పత్రికలు, ఆడియో క్యాసెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సభ్యత్వం తీసుకుంటే ఇంటికి తీసుకెళ్లీ చదువుకోవచ్చు. 
జ్ఞానధార 
‘చినిగిన వస్త్రాన్ని వదిలి పారేసినట్లు, ఈ శరీరాన్ని నేను విడిచిపెట్టవచ్చు. కానీ నా ఆత్మ అక్షరాల రూపంలో మీకు అండగానే ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూనే ఉంటుంది’ అంటూ వివేకానందుడు చెప్పిన మాటలు అక్షరసత్యాలు. సుభాష్‌ చంద్రబోస్‌ నుంచి నరేంద్ర మోదీ వరకూ.. టాటా బిర్లాల నుంచి బిల్‌గేట్స్‌ వరకూ కుల, మత, జాతి భేదాలతో నిమిత్తం లేకుండా నరేంద్రుడి బోధనలు ఎందరికో.. ఎందరెందరికో మార్గదర్శనం చేస్తున్నాయి. సామాన్యుడికీ ఆ అమృతవాక్కులు అక్కరకు రావాలన్న తలంపుతో పుస్తకాలు, కరపత్రాల రూపంలో వాటికి విస్తృతప్రచారం కల్పిస్తోంది రామకృష్ణ మఠం. వివేకానందుడి వాక్కులతో పాటు ఇతరాలను ఎక్కువగా మఠంలోని స్వామీజీలే తెలుగులోకి అనువదిస్తారు. మొదట్లో ఈ అనువాదాల్లో గ్రాంథిక ఛాయలు కనిపించేవి. రాను రానూ వ్యావహారిక తెలుగులోనే చెప్పాలని నిర్ణయించుకున్నారు. సామాన్యులకు అర్థమయ్యే భాషలో... ప్రభావవంతమైన శైలిలో పుస్తకాలను తెస్తున్నారు. 
తమిళగడ్డపై మొదలై... 
వ్యక్తి వికాసానికి దారిచూపే సాహిత్యాన్ని, పెద్దల మహితోక్తులను తెలుగులో ప్రచురించి అందించేందుకు ఆరున్నర దశాబ్దాల కిందటే చెన్నైలో ఓ విభాగాన్ని ఏర్పాటు చేసింది మఠం. రామకృష్ణుని ప్రబోధాల్ని, వివేకానందుడి బోధనల్ని, దేశవిదేశాల్లోని ఎందరెందరో మహనీయుల స్ఫూర్తి వచనాలను అక్కడి నుంచే ప్రచురించి అందించేవారు. ఆ విభాగాన్ని, తెలుగు మాసపత్రిక ‘శ్రీ రామకృష్ణ ప్రభ’నూ హైదరాబాద్‌కు తీసుకురావడంలో ప్రస్తుత అధ్యక్షులు స్వామి జ్ఞానదానందజీ కీలకపాత్ర పోషించారు. ఆయన ఆధ్వర్యంలో నిర్మించిన తెలుగు ప్రచురణల విభాగం ‘ప్రకాశన్‌భవన్‌’ 2007 మార్చి 12న ప్రారంభమైంది. ఇప్పటి వరకూ 250 పుస్తకాలను ప్రచురించారు. ఏటా 15 - 20 పొత్తాలను విడుదల చేస్తారు. ప్రతి పుస్తకానికీ... దానిలోని విషయాన్ని బట్టి మూడు వేల నుంచి ముప్ఫై వేల ప్రతుల వరకూ అచ్చు వేస్తారు. స్ఫూర్తిదాయకమైన సాహిత్యం సామాన్యులకు సైతం అందుబాటులోకి రావాలనే సత్సంకల్పంతో ఈ పుస్తకాలను చౌక ధరకే అందిస్తున్నారు. మూడు రూపాయల్లో కూడా అనంతమైన విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను ప్రచురిస్తున్నారు. ఇందుకోసం రామకృష్ణ మఠం ఏటా రూ.2 కోట్ల వరకూ ఖర్చు చేస్తోంది. సాధారణంగా జరిగే పొత్తాల జాతరలు, అన్ని పుస్తక దుకాణాలతో పాటు ప్రసిద్ధ దేవస్థానాల్లో మఠం ఏర్పాటు చేసిన పుస్తక విక్రయశాలల్లో ఈ పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. 
విక్రయాల్లో సంచలనాలు
తెలుగు పుస్తకాల అమ్మకాలు పడిపోతున్నాయి... ముఖ్యంగా యువత మన అమ్మభాషా పొత్తాలకు దూరమవుతోంది... నిత్యం వినిపించే ఈ విమర్శలు రామకృష్ణ మఠం పుస్తకాలకు వర్తించవు. ఎందుకంటే, మఠం ప్రచురించే పుస్తకాలు ఏడాదికి సగటున లక్షకు పైగా అమ్ముడవుతుంటాయి. గత సంవత్సరం వివేకానందుడి 150వ జయంతి సందర్భంగా ఈ అమ్మకాలు అంచనాలను మించాయి. రూ.3 కోట్లకు పైగా విలువైన పొత్తాల కొనుగోళ్లు జరిగాయి. ఈ పుస్తకాలను కొనేవాళ్లలో ఎక్కువ మంది యువతే. ధర తక్కువ ఉండటంతో పాటు సులభంగా వెంట తీసుకెళ్లడానికి అనుగుణంగా ఉండే పరిమాణం వల్లే మఠం పుస్తకాలు వారిని బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పరిమాణం విషయంలో మఠం విస్తృత ప్రయోగాలు చేస్తోంది. జేబులో  పెట్టుకోవడానికి సరిపోయే పుస్తకాల నుంచి అన్ని రకాల పరిమాణాల్లోనూ పొత్తాలను ప్రచురిస్తోంది. విషయ నాణ్యత దగ్గరకి వస్తే... పుస్తకం పెద్దదయినా, చిన్నదయినా దేనికదే సాటి.  
ఏడు దశాబ్దాల పత్రిక
రామకృష్ణ మఠం కార్యకలాపాలను, మూర్తి త్రయ (రామకృష్ణ పరమహంస, శారదామాత, వివేకానందుడు) బోధనలను నేటి తరానికి అందించేందుకు ‘రామకృష్ణ ప్రభ’ తెలుగు మాసపత్రికను మఠం వెలువరిస్తోంది. డెబ్భై ఏళ్ల నుంచి నిర్విరామంగా ప్రచురితమవుతోందీ పత్రిక. వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మిక రచనలతో పాటు ‘సూక్తి సౌరభం’ పేరిట మేలిమి ముత్యాల్లాంటి శతక పద్యాలను చిన్న వ్యాఖ్యానంతో అందిస్తోంది. 
రాత మార్చే గీత చెప్పి...
వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల సారాన్ని తనలో ఇముడ్చుకున్న భగవద్గీతను చదివితే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. జీవించడం ఎలాగో నేర్పుతుంది గీత. కర్తవ్యదీక్షను, వ్యక్తిత్వ వికాసాన్ని నూరిపోస్తుంది. కానీ ఆంగ్ల మాధ్యమ మోజులోపడి తెలుగు పదాలే అర్థం చేసుకోలేని పిల్లలకు గీత గురించి ఏం అర్థమవుతుంది? అర్థమయ్యేలా ఎవరు చెబుతారు? మఠం ఆ బాధ్యత తీసుకుంది. ‘గీతాదర్శనం’ పేరిట ఓ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. కురుక్షేత్ర రథాన్ని తలపించే భవనంలో గీతను పరిచయం చేసే నిలువెత్తు చిత్రాలు కనిపిస్తాయి. పక్కనే ఉన్న మైక్రోఫోనును చెవికి ఆనించుకుంటే ధీర గంభీర స్వరంతో గీతావాణి వినిపిస్తుంది. అర్థం చేసుకోలేనివారికి తెలుగు వ్యాఖ్యానం సాయపడుతుంది. ప్రాచీన గీతను.. మైక్రోఫోన్‌తో కలబోసి నేటితరానికి చేరువ చేయడం విశేషమే. 
      మఠంలో సన్యాసం తీసుకున్నవారు, వివిధ విభాగాల బాధ్యతలు నిర్వహిస్తున్న స్వామీజీలు ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే ఉంటారు. ల్యాప్‌టాప్‌లు, అంతర్జాలం ద్వారా మఠం కార్యకలాపాలు చక్కబెడుతుంటారు. కానీ, కదిలిస్తే స్వచ్ఛమైన తెలుగులో పలకరిస్తారు. 
పేదోడికి చేరువలో వైద్యం  
అనారోగ్యం తలెత్తినా.. ఆస్పత్రి పేరెత్తినా సామాన్యుడు వణికిపోయే పరిస్థితి. వైద్యానికయ్యే ఖర్చు తలచుకుంటే గుండె జారిపోతుంది. అలాంటి వారికి రూ.10 నామమాత్రపు రుసుముతో వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది మఠం. అలోపతి, హోమియో, ఆయుర్వేద విభాగాలున్న ఇక్కడి ఆరోగ్య కేంద్రానికి రోజూ ఏడెనిమిది వందల మంది వస్తుంటారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు,  మందులు అన్నీ తక్కువ ధరకే లభిస్తాయి. 
అన్నార్తులకు అమ్మగా.. 
‘నా దేశం అన్నపూర్ణ.. ఇక్కడ వీధికుక్కలు కూడా ఆకలితో అలమటించడానికి వీల్లేద’ని విస్పష్టంగా చెప్పారు వివేకానందుడు. ఆ వచనాలే స్ఫూర్తిగా అన్నార్తుల ఆకలి తీరుస్తోంది మఠం. వృద్ధులు, అనాథలు, పేదలు మధ్యాహ్నమైతే ఇక్కడ బారులు తీరుతారు. పచ్చడి, కూర, సాంబారు, చిక్కటి మజ్జిగతో వేడివేడి అన్నం కంచంలో పడగానే వారి ప్రాణాలు లేచొస్తాయి.
బాలనారాయణ సేవ
పేదల బిడ్డలే ఇందులో లబ్ధిదారులు. ప్రతి ఉదయం ఈ పిల్లలకు పోషకాహారం అందించే ఉద్దేశంతో బాలనారాయణ సేవను ప్రారంభించారు. ఉదయం ఎనిమిదింటికే మఠంలో బారులుతీరే పేదింటి పిల్లలకు పండో, ఫలహారమో అందిస్తారు. సత్తువనిచ్చేందుకు బోర్నవిటానో.. బూస్టో కలిపిన పాల గ్లాసు చేతికిస్తారు. తద్వారా వివేకానందుడు కోరుకున్న బలమైన, సుదృఢమైన భారతావనికి తమ వంతు చేయూతనిస్తున్నారు. ఆ పిల్లలందరికీ పుస్తకాలు కొనుక్కోవడానికి సాయమందిస్తారు. రాతపుస్తకాలవంటివీ వాళ్లే అందిస్తారు.
నిక్కచ్చిగా... నిజాయతీగా...
ఇంత వ్యవస్థను నడపాలంటే ఎన్ని కోట్ల రూపాయలు కావాలి... అలాగని ప్రతి రూపాయినీ ఆత్రంగా పోగేసుకునే పరిస్థితి ఉండదిక్కడ. గీతాదర్శనం, సంత్‌దర్శనం భవన నిర్మాణానికి విరాళం అడిగితే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొమ్ము మంజూరు చేశారు. దానితో చేయాలనుకున్న పని పూర్తి చేశారు మఠం నిర్వాహకులు. రూ.30 వేల పైచిలుకు మొత్తం మిగిలింది. దాన్ని అణాపైసల్తో సహా తీసుకెళ్లి ముఖ్యమంత్రికే అప్పగించారు. ‘ఇదేంటి... దీన్ని మళ్లీ వెనక్కి ఎలా తీసుకుంటాం... మీరే ఏదైనా కార్యక్రమానికి వినియోగించండ’ని అని ఆయన నచ్చజెప్పి పంపారు!
      ఒక భాష పరిపుష్టం అవ్వాలంటే కాల్పనిక సాహిత్యంతో పాటు అన్ని రంగాలకు సంబంధించిన పుస్తకాలూ ఆ భాషలో వెలువడాలి. ఆ భాషీయులకు నిత్య జీవితంలో ఉపయోగపడే ప్రతి విషయమూ ఆ భాషలో ప్రచురితమవ్వాలి. వివేకానందుడి వంటి వారి స్ఫూర్తిదాయక జీవిత విశేషాలతో పాటు వాళ్ల ఆలోచనలను, అభిప్రాయాలను, చైతన్య ప్రబోధాలను తెలుగులో ప్రచురిస్తున్న రామకృష్ణ మఠం... వ్యక్తిత్వ వికాస సాహిత్య సృష్టిలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నట్లే. మరోవైపు... ప్రచురించే పుస్తకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ, ముఖ్యంగా నవతరంతో తెలుగుని చదివిస్తోంది. అన్ని చోట్లా ఆంగ్లం రాజ్యమేలుతున్న ఈరోజుల్లో ఇంతకు మించి ఇంకేం కావాలి!

***


వెనక్కి ...

మీ అభిప్రాయం