సాహితీ సత్యాన్వేషి

  • 417 Views
  • 0Likes
  • Like
  • Article Share

కాలమొక నదిగాను భావించి చూస్తే
కదలిపోయే అలలు కద బ్రతుకులన్నీ
ఎవరున్నా లేకపోయినా గాని
ఈ నదికి చేఱువగా జీవముంటుంది 

      - ఇంద్రగంటి శ్రీకాంత‌ శర్మ ‘శిలా మురళి’ (1970)నుంచి 
తెలుగు సాహిత్యంలో అనుభూతి కవిత్వానికి సరికొత్త నిర్వచనం చెప్పిన ప్రముఖకవి, రచయిత, ఇంద్రగంటి శ్రీకాంత‌ శర్మ. 1944, మే 29న తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రాపురం గ్రామంలో జన్మించారు. భార్య ఇంద్రగంటి జానకీబాల, కొడుకు ఇంద్రగంటి మోహన కృష్ణ. తండ్రి హనుమచ్ఛాస్త్రి సుప్రసిద్ధ కవి కావడంతో సాహిత్యవాతావరణంలో పుట్టిపెరిగిన శ్రీకాంత శర్మ, విద్యార్థి దశలోనే రచనా వ్యాసంగం చేపట్టారు. అభ్యుదయ కవిగా ప్రసిద్ధులయ్యారు. తెలుగులో ఎంఏ చేశాక కొంతకాలం ఆంధ్రజ్యోతి వార పత్రికలో ఉపసంపాదకుడిగా, 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సహాయ సంపాదకుడిగా పనిచేశారు. అందులో తెలుగు శాఖలో సంస్కృత కార్యక్రమాల నిర్వహణలో ఉషశ్రీకి సహాయకులుగా బాధ్యతలు నిర్వర్తించారు. వివిధ పత్రికలకు గేయాలు, కవితలు, సాహిత్య వ్యాసాలు రాశారు. అనేక రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీతరూపకాలు రచించారు. ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక సంపాదకులుగా కూడా పనిచేశారు. ‘కృష్ణవతారం, నెలవంక, రావు - గోపాలరావు’ చిత్రాలకు గీత రచన చేశారు. పాత్రికేయుడిగా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ రచయితగానే కొనసాగారు. ఆకాశవాణి వార్షిక పోటీల్లో ప్రథమ బహుమతులు గెలుచుకున్నారు. చివరగా కుమారుడు మోహన్‌కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘‘సమ్మోహనం’’ సినిమాకి పాట రాశారు. శ్రీకాంత్‌ శర్మ ఆత్మకథ ‘ఇంటిపేరు ఇంద్రగంటి’ పాఠకాదరణ పొందింది. తెలుగు సాహిత్యంలో గుడిపాటి వెంకటాచలం, కృష్ణశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, శ్రీశ్రీ. బుచ్చిబాబు, బాల గంగాధర్‌ తిలక్, విశ్వనాథశాస్త్రి, అజంతా తనను బాగా ప్రభావితం చేశారని చెప్పుకున్నారాయన. 
      ‘‘ఈ ప్రపంచంలో సర్వవిశ్వాసాలకి, చర్యలకి, వ్యక్తి కేంద్రమని నేను నమ్ముతాను. సెయింట్‌ కావచ్చు, సిన్నర్‌ కావచ్చు. వ్యక్తి సమూహాలను శాసిస్తాడని నా విశ్వాసం అయితే ఏ ఒక్క విశ్వాసమూ పరిపూర్ణ సత్యం కాదు. సాపేక్ష సత్యమే. అందుచేత సాహిత్య పఠనం, రచ‌నా వ్యాసంగంలోకి మనసు పెట్టే వాళ్లు, తమ మనసులకుండే కిటికీలు తెరిచిపెట్టడం అవసరం. పాత విశ్వాసాలు కొట్టుకుపోవాల్సి రావచ్చు. కొత్త విశ్వాసాలు దూసుకురావచ్చు. మనసులోకి వెలుతురుతాకే అవకాశం ముఖ్యం. దాన్ని మూసి పెట్టకూడద’’ని నేటి రచయితలకు నూతన ప్రతిపాదన చేశారు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ. అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ తన దైనశైలిలో రచనలు చేసి పాఠకులకు సరికొత్త దృష్టినీ, సాహిత్య అవగాహనను కలిగించిన ఆయన 25 జులై ఉదయం హైదరాబాదులో స్వర్గస్థులయ్యారు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం