ఫణిగిరి నుంచి న్యూయార్క్‌కు

  • 877 Views
  • 106Likes
  • Like
  • Article Share

    డా. ద్యావ‌న‌ప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ‌

  • హైద‌రాబాదు
  • 9490957078
డా. ద్యావ‌న‌ప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ‌

‘‘పూర్వోక్త కారణములవల్ల భారతీయ దేవమందిర నిర్మాణ కళకు మనకు తెలిసిన ప్రథమోదాహరణము లన్నియు బౌద్ధమునకు సంబంధించినవే. బౌద్ధకళకు బుద్ధుని జీవితమిచ్చిన ప్రోత్సాహమనల్పమైనది. బుద్ధుని జీవితము ఒక్క బౌద్ధమతావలంబులనే కాక శిల్పులను సమానముగ నుత్తేజపరిచిన దివ్యచరితము, ఒక యద్భుతకథ’’ అన్నారు మల్లంపల్లి సోమశేఖరశర్మ. అలా తథాగతుడి ప్రేరణతో మన ఫణిగిరిలో అజ్ఞాతశిల్పులు చెక్కిన మనోహర కళాఖండాలు ఇప్పుడు అంతర్జాతీయ ప్రదర్శనకు వెళ్తున్నాయి. వాటిలోని ఓ అరుదైన అందమైన శిల్ప విశేషాలివి..!
అమెరికాలోని
న్యూయార్క్‌ నగరంలో ఉన్న ‘ది మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌ (ది మెట్‌)’లో దాని 150వ వార్షికోత్సవాలను వచ్చే సంవత్సరం వైభవోపేతంగా జరపడానికి నిశ్చయించారు. ఉత్సవాల్లో భాగంగా ‘వృక్షం- సర్పం’ పేరిట బుద్ధుడి ఇతివృత్తంతో భారీ ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు గానూ మన దేశంలోని కొన్ని శిల్పాలను అందించాలని అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఆ మేరకు దిల్లీలోని నేషనల్‌ మ్యూజియం తెలంగాణకు చెందిన ఫణిగిరి బౌద్ధశిల్పాన్ని ప్రదర్శనకు సూచించింది. వెంటనే ‘ది మెట్‌’ క్యురేటర్‌ జాన్‌గాయ్‌ హైదరాబాదుకు వచ్చి, హెరిటేజ్‌ తెలంగాణ (పురావస్తు శాఖ) సంచాలకులు విశాలాచ్చిని కలిశారు. ప్రదర్శన నిమిత్తం మరో పదమూడు కళాఖండాలను ఎంపిక చేశారు. వీటిలో సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి బౌద్ధక్షేత్రంలో లభించిన కళాఖండాలే ఆరు ఉన్నాయి. వాటిల్లో మకుటాయమానమైంది.. బుద్ధుడి మకుటాన్ని దేవతలు స్వర్గలోకానికి తీసుకెళ్తున్నట్టుండే శిల్పం. 
ఆది నుంచీ ఆకర్షణీయమే
ఈ శిల్పాన్ని మలి శాతవాహనుల కాలంలో.. సుమారు క్రీ.శ. 150 ప్రాంతంలో చెక్కించారని పురావస్తు శాస్త్రజ్ఞులు నిర్ధరించారు. ఈ శిల్ప ఆకర్షణీయతకు భ్రమసి కొందరు దుండగులు 2001లో దీన్ని దొంగిలించారు. సూర్యాపేట మీదుగా లారీలో దాచేపల్లికి తరలించి ఒక డ్రైనేజ్‌ సంపులో దాచారు. ఆ క్రమంలో అది విరిగి ముక్కలైంది. విషయం బయటికి పొక్కడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి శిల్పాన్ని పట్టుకునే ఏర్పాట్లు చేసింది. ఫణిగిరిలో ఇలాంటి శిల్పాలు మరిన్ని ఉన్నాయని గుర్తించి అక్కడ తవ్వకాలు చేపట్టింది. 2002- 2004లో ఎట్టకేలకు శిల్పాన్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని హైదరాబాదులోని పురావస్తు ప్రదర్శనశాలకు చేర్చింది. ముక్కలైన శిల్పానికి పూర్వపు అందం, వైభవాన్ని తేవడానికి ఇటీవలే ముంబయికి పంపించారు. అంతర్జాతీయ స్థాయి నిపుణులతో వెంట్రుకవాసి ఖాళీని కూడా గుర్తుపట్టకుండా అతికించి మరమ్మతులు చేయించారు. 
      ఈ శిల్పంలో మూడు భాగాలు ఉంటాయి. వాటిని రెండు పద్మాల పట్టీలు విభజిస్తాయి. మొదటి శిల్పభాగంలో (కింది భాగంలో) బుద్ధుడి ‘మహాభినిష్క్రమణ’ను చెక్కారు. సిద్ధార్థుడు నాలుగు ఆర్య సూత్రాలను (ప్రపంచం దుఃఖమయం, దుఃఖానికి కారణం ఉంది, అది కోరిక, కోరికలను జయించవచ్చు) తెలుసుకున్నాక తన రాజ్యాన్ని, సుఖాలను/ అంతఃపురాన్ని వదిలి, ఛత్ర చామరధారులు వెంటరాగా గుర్రం మీద బయటికి వెళ్లిపోతుంటాడు. ఇదే మహాభినిష్క్రమణ శిల్పం.
      మొదటిదాని పైన ఉండే రెండో శిల్ప భాగంలో సిద్ధార్థుడు తన రాజ పదవిని వదులుకున్నందుకు నిదర్శనగా తన కిరీటాన్ని, కేశాల్ని వదిలివేయడం ప్రధానం. ఈ త్యాగాన్ని ప్రజలు భరించలేక తమ ముఖాలను చాటేసి, చేతులు జోడించి సిద్ధార్థుణ్ని ఇలా చేయవద్దని వేడుకోవడం కనిపిస్తుంది. ఈ కళాఖండం శిఖరస్థానంలో అతిముఖ్యమైన మూడో భాగముంటుంది. ఇందులో రాజాసనం మీద కుడి ఎడమ లకు నోర్లు తెరుచుకున్న మొసళ్లు, వాటి నోళ్లలోంచి బయటికి హుందాగా చూస్తున్న సింహపు శిరస్సులుంటాయి. ఈ మకర సింహాల పట్టీ మీద దేవతలు ఓ పెద్ద తాంబాలంలో సిద్ధార్థుడి కిరీటాన్ని పెట్టుకుని ఆనందంతో స్వర్గానికి వెళ్తుంటారు. 
      మొత్తంమీద గౌతమ బుద్ధుడి మహాభినిష్క్రమణ ద్వారా రాజపదవిని (కిరీటాన్ని/ సింహాసనాన్ని) త్యజించడంతో తమ అభిమాన యువరాజు సంక్షేమ పాలనను కోల్పోతున్నామని ప్రజలు దుఃఖించడం, దేవతలు ఈ పరిణామం పట్ల హర్షించడాలను ఈ కళాఖండంలో అద్భుత నైపుణ్యంతో చెక్కారు.  
శిల్ప విశిష్టతలు
ఈ మహాభినిష్క్రమణ శిల్పానికి అనేక విశిష్టతలున్నాయి. వాటిలో ఒకటి.. ఇది పల్నాటిరాయి అనే ఒక ప్రత్యేక తరహాకి చెందిన సున్నపురాయితో చెక్కింది. ఈ రాయిలో అత్యంత నునుపుదనంతో కూడిన నగిషీలు చెక్కడం సాధ్యమవుతుంది. కాబట్టే ఈ ఫణిగిరి శిల్పంలోని మూర్తుల్లో జీవకళ తొణికిసలాడుతుంది.
      రెండు.. ఈ శిల్పం, ఇతర ఫణిగిరి శిల్పాల్లో కనిపించే నైపుణ్యాన్ని, అమరావతీ శిల్పకళా నైపుణ్యంతో పోల్చి చూసి డా।। ఈమని శివనాగిరెడ్డి లాంటి నిపుణులు- అమరావతి శిల్పకళ కంటే ఫణిగిరి శిల్పకళే ఉన్నతమైందని, ముందుది కూడా కావచ్చని అభిప్రాయపడ్డారు. ఆనాటికి (క్రీ.శ.150 ప్రాంతం) శాతవాహన రాజులు మహారాష్ట్రలోని పైఠాన్‌ నుంచి తమ రాజధానిని మెదక్‌ జిల్లాలోని కొండాపూర్‌కు.. అక్కడి నుంచి ఈనాటి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి మార్చారు. అప్పటికి మూడు శతాబ్దాల ముందటి నుంచే ఫణిగిరి, అమరావతిల్లో బౌద్ధం విలసిల్లుతోందని తెలిపే ఆధారాలు లభించాయి. బౌద్ధ గ్రంథం సుత్తనిపాత ప్రకారం బుద్ధుడి చివరి మాటల్లో బౌద్ధాన్ని గోదావరి తీరాన్ని దాటించి దక్షిణాదికి తీసుకువెళ్లాలనే సూచనలున్నాయి. కాబట్టి బౌద్ధం తెలంగాణలోని బాదనకుర్తి, కోటి లింగాల, ధూళికట్ట, పెద్దబొంకూరు, ఫణిగిరి- నేలకొండపల్లిల మీదుగానే అభివృద్ధి చెందుతూ అమరావతికి చేరిందని చెప్పవచ్చు.
మూడో విశిష్టత.. 1940 దశకం పూర్వార్ధంలో ఫణిగిరిలో తవ్వకాలు చేపట్టి, నివేదిక రాసిన ఆనాటి పురావస్తుశాఖ సంచాలకులు ఖ్వాజామహమూద్‌ అహ్మద్‌ ఫణిగిరి శిల్పాల మీద గ్రీకు శిల్పకళా ప్రభావముందని తెలిపారు. ఫణిగిరి దగ్గర తవ్వకాల్లో బయల్పడిన అనేక రోమన్‌ నాణేలు ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. పారశీక మృణ్మయ పాత్రల అవశేషాలు వెలుగు చూశాయి. వీటన్నిటిబట్టి చూస్తే, ఆనాడు అంతర్జాతీయ వ్యాపారుల పోషణలో ఫణిగిరి వర్ధిల్లిందని తెలుస్తోంది. ఇంతటి ఘనచరిత్ర కలిగిన ఫణిగిరి శిల్పాలను న్యూయార్క్‌ ప్రదర్శనలో అత్యంత ప్రధానస్థానంలో ప్రదర్శిస్తామని ‘ది మెట్‌’ క్యురేటర్‌ జాన్‌గాయ్‌ చెప్పడం తెలుగువారికి సంతోషదాయకం.. జాతికి గర్వకారణం.


వెనక్కి ...

మీ అభిప్రాయం