సరస్వతీ పుత్రుడు... రజనీకాంతుడు

  • 526 Views
  • 0Likes
  • Like
  • Article Share

శ్రీసూర్యనారాయణా! మేలుకో హరి సూర్యనారాయణా!! అంటూ తొలి వెలుగులు రెక్కలు విప్పుకుంటున్న ప్రకృతితో పాటు యావదాంధ్రజాతినీ తన సుస్వరాల సుప్రభాతంతో మేల్కొలిపిన వైతాళికుడాయన. సహజ, స్వతంత్ర సంగీతధారకు సంస్కారవంతమైన సాహితీ మధుధారలను జతచేసి, కొన్ని దశాబ్దాలపాటు లక్షలాది తెలుగు హృదయాల్ని ఉర్రూతలూగించిన వాగ్గేయకారుడు. ఏవో తెలియని సుదూర తీరాలకు మనల్ని తీసుకుపోయే మాట, పాటల సృష్టికర్త ఆయన. వెరసి.. శతవసంతాల సంగీత సాహిత్య సుగంధం మూర్తీభవించిన ‘తెలుగు వెలుగు’ బాలాంత్రపు రజనీకాంతరావు.
కొన్నేళ్ల
కిందట వరకు ఆకాశవాణి భక్తిరంజని వినిపించని తెలుగు లోగిలిలేదంటే అతిశయోక్తి కాదు. ఉదయాన్నే లేలేత సూర్యకిరణాలతో పాటు ఆకాశవాణి మోసుకువచ్చే భక్తిసంగీత తరంగాలు ప్రతి తెలుగు గుండెనీ తట్టిలేపేవి. తరంగాలు, దండకాలు, స్తుతులు, స్తోత్రాలు, అష్టకాలు.. ఒకటేమిటి భక్తిప్రపంచం అంతా ‘గొంతు’కట్టి కళ్లముందు నిలిచేది. ఈ కీర్తి మొత్తం రజనీ (రజనీకాంతరావు ఈ పేరుతో ప్రఖ్యాతి పొందారు) ఖాతాలోకే చేరుతుంది. అంతగా ఆకాశవాణి అంటే రజని, రజని అంటే ఆకాశవాణిగా తన ‘బాణి’కి ఆకాశ ‘వాణి’కి అభేదాన్ని సాధించారాయన.
      మద్రాసు ఆకాశవాణిలో (1941) చేరడం రజనీ జీవితంలో ఓ గొప్ప మలుపు. అప్పటిదాకా పిల్లకాలువగా సాగిపోతున్న రజనీ సంగీతయానం ఉద్ధృతమైన ప్రవాహదశకు చేరుకుంది. ఆయన మొదటి సంగీత నాటకం ‘చండీదాసు’ మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమై, అప్పట్లో పెద్ద సంచలనాన్నే సృష్టించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున అర్ధరాత్రి చాచా నెహ్రూ ప్రసంగం తర్వాత ఆకాశవాణి నుంచి రజనీ స్వరపరచిన ‘మాదీ స్వతంత్ర దేశం’ గీతం ప్రసారమైంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు యావద్దేశాన్ని రజనీ సంగీతం ఎలా ప్రభావితం చేసిందో తెలుసుకోవడానికి. ఆయన స్వరపరచిన ‘కొండ నుంచి కడలి దాకా’ రూపకం ఆకాశవాణి ద్వారా ప్రసారమై అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన ‘అతిథిశాల’కు పర్షియన్‌ బాణీలో రజనీ కూర్చిన స్వరాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. బెంగళూరు ఆకాశవాణిలో పనిచేసే కాలంలో (1981) ‘మేఘసందేశ’ రూపకానికి జాతీయ బహుమతి లభించింది.
సరికొత్త ప్రయోగాలు
విజయవాడ ఆకాశవాణి కేంద్ర సంచాలకుడిగా రజనీ చేసిన ప్రయోగాలు విజయవాడ కేంద్ర దశ, దిశ మార్చివేశాయి. భక్తిరంజని, ఉషశ్రీతో ధర్మసందేహాలు, ఈ మాసపు పాట, సంస్కృత పరిచయం, సంగీతశిక్షణ, వంటి కార్యక్రమాలను ప్రారంభించి తన ప్రయోగాలు, సృజనతో అధ్బుతమైన విస్తృతిని, అనంతమైన ప్రజాదరణను సమకూర్చి, తాను పనిచేసిన కాలాన్ని విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి స్వర్ణయుగంగా తీర్చిదిద్దారు. అన్నమయ్య సంకీర్తనల్లోని మాధుర్యాన్ని సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేలా బాణీలు కూర్చి ఆకాశవాణి ద్వారా వాటిని ప్రజలకు చేరువ చేసిన కీర్తి కూడా రజనీకే దక్కుతుంది.
      నూతన రీతుల క్రియాశీలతకు సంప్రదాయ పరిధులు అడ్డురాకూడదనే విధానం రజనీది. అందుకే ఆయన సంగీత విహంగం రెక్కలు చాపుకుని నాదప్రపంచంలో అందచందాలను వెతుక్కుంటూ హిందుస్థానీ, జానపదం, మధ్యప్రాచ్యం.. ఒకటేమిటీ... సమస్త సంగీతలోకాన్నీ చుట్టివస్తుంది. ఈ ప్రతిభతోనే సంధ్యా దీపకళిక, కల్యాణ శ్రీనివాసం, మేనకావిశ్వామిత్ర, క్షీరసాగర మథనం, గ్రీష్మఋతువు, సుభద్రార్జునీయం, విశ్వవీణ వంటి సంగీత, నృత్య రూపకాలను తీర్చిదిద్దారు.
రజనీ జీవితయానం
జగద్విఖ్యాతి పొందిన వేంకటపార్వతీశ కవుల్లో ఒకరైన బాలాంత్రపు వేంకటరావుకు రజనీకాంతరావు 1920, జనవరి 29వ తేదీన జన్మించారు. తల్లి వేంకటరమణమ్మ గొప్ప సాహితీ సంస్కారం కలిగిన వ్యక్తి. తండ్రి విఖ్యాత సాహితీవేత్త కావడంతో చిన్ననాటి నుంచే రజనీపై ఆ ప్రభావం ఉండేది. పిఠాపురం, కాకినాడల్లో విద్యాభ్యాసం సాగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. చేశారు. 1941లో ఆకాశవాణిలో చేరి, బెంగళూరు, అహ్మదాబాద్, విజయవాడ కేంద్రాల్లో పనిచేసి, 1978లో పదవీ విరమణ చేశారు. 1988 నుంచి 90 వరకు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి పీఠంలో గౌరవాచార్యుడిగా, 1979-82 కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వేంకటేశ్వర కశాపీఠం నిర్దేశకుడిగా, 1982-85 మధ్యకాలంలో ఆకాశవాణి, దూరదర్శన్‌లకు ఎమరిటస్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు.
అక్కడా అదే ముద్ర
చలనచిత్ర రంగంలోనూ రజనీ తనదైన ముద్ర ప్రదర్శించారు. ఆకాశవాణిలో చేరకమునుపే రోహిణి సంస్థలో కొంతకాలం పనిచేశారు. మిత్రుడు నిడుమోలు జగన్నాథ్‌ నిర్మించిన ‘తారుమారు’, ‘భలేపెళ్లి’ (1942) లఘుచిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఓ కార్యక్రమంలో రజనీ పాడిన గేయాన్ని విన్న చలనచిత్ర దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి తాను నిర్మిస్తున్న స్వర్గసీమ (1945) చిత్రానికి ‘ఓహో పావురామా’ పాటను అడిగి చేయించుకున్నారు. ఈ పాట పొందిన ప్రజాదరణ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గృహప్రవేశం (1946), పేరంటాలు (1951) చిత్రాల్లో ఆయన సంగీతం, సాహిత్యం అత్యంత ప్రజాదరణ పొందాయి. వకుశాభరణం, మలయమారుతం వంటి రాగాలను సినీగీతాల ద్వారా ప్రచారంలోకి తెచ్చింది కూడా ఆయనే. ‘ఏమే చిలకా’ (రత్నమాల, 1947); ‘జీవితము దుఃఖపూరితము’ (ద్రోహి, 1948); ‘లే లేలే జవరాలా’ (సౌదామిని, 1951); ‘తాధిమి తకధిమి’ (బంగారు పాప, 1954)... ఇలా రాసుకుంటూ పోతే వందలాది ఆణిముత్యాలు దొరకుతాయి. అయితే వీటన్నిటి మీదా రజనీ పేరు ఉండదు. ఆకాశవాణిలో ప్రభుత్వోద్యోగం చేస్తుండడంతో సోదరుడు నళినీకాంతరావు, బావగారు నాగరాజు పేర్లతో రజనీ సంగీత, సాహిత్య రచనలు చేసేవారు.
      రజనీ రచనల్లో సంస్కృత సమాసాలను అలవోకగా వాడి పండితులచేత ‘అబ్బా’ అనిపించుకున్న పాటలూ ఉన్నాయి. అలతి అలతి పదాలతో పిల్లలకోసం రాసిన పాటలూ ఉన్నాయి. కేవలం గాత్ర సంగీతమే ప్రధానంగా రాసిన పాటలూ ఉన్నాయి. గొంతుకలే లేకుండా కేవలం వాద్యగోష్ఠితో సాగే సంగీత రూపకాలూ ఉన్నాయి. వాటన్నిటినీ కలిపి ‘శతపత్ర సుందరి’ పేరుతో ప్రచురించారు. ఇంకా విశ్వవీణ (ఆకాశవాణి నాటకాల సంకలనం), మువ్వగోపాల పదావళి, త్యాగరాజు, శ్యామశాస్త్రి జీవిత చరిత్రలు, క్షేత్రయ్య పదాలకు ఆంగ్లానువాదం, రజనీ భావతరంగాలు, ప్రాచీన రాగాల మీద పరిశోధనా వ్యాసాలు.. ఇలా ఎన్నో రచనలు రజనీ సాహితీ విరాణ్మూర్తిని మన కళ్లముందుంచుతాయి. ఆయన రాసిన ‘ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము’ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందింది.
సవ్యసాచి
సృజనాత్మక సంగీతంలో రజనీకాంతరావు స్పృశించని విభాగంలేదు. రవీంద్ర సంగీతం, బెంగాలీ కీర్తనలు, మరాఠీ భావ గీతాలు, పర్షియన్, అరేబియన్, స్పానిష్‌ జానపదబాణీలు ఇలా వివిధ సంప్రదాయ, ఆధునిక సంగీతబాణీలు ప్రయోగించడం, స్వయంగా పాడటం ఆయన చేశారు. తానురాయడమే కాక, సందర్భానుసారంగా ఇతరుల చేత మధురమైన సంగీత రూపకాలు రాయించారు. శ్రీశ్రీ చేత, కృష్ణశాస్త్రి చేత పదుల సంఖ్యలో మేలైన రేడియో సంగీత రూపకాలు సంగీత ప్రధాన నాటకాలు రాయించారు. ఓలేటి వెంకటేశ్వర్లు గొంతులో ‘మనసౌనే ఓ రాధా, మరు నిముసము మనదో కాదో, ఆశా నా ప్రాణసఖీ’ వంటి గీతాలు అన్ని హొయలు పోయాయంటే కారణం రజనీ కూర్చిన స్వరాలే.
      సంగీతజ్ఞుడిగానే కాదు.. సాహితీవేత్తగానూ రజనీ ప్రతిభ అనన్యసామాన్యమైంది. జైఆంధ్రా (1970) ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న రోజుల్లో ఆకాశవాణిలో ఏ కార్యక్రమమూ జరగకూడదని ఉద్యమకారులు కేంద్రాన్ని చుట్టుముట్టారు. ఆ సమస్యను గ్రహస్థితికి ముడిపెట్టి రజనీ తయారుచేసిన ‘నవగ్రహస్తుతి’ వినూత్న పంథాలో సాగింది. దివిసీమ తుపాను సందర్భంలో ‘నివాత శూన్య స్తంభం, నిష్పీడన మంథానం, జంఝావాత సంరంభం, హంస విధి విధానం..’ అనే పల్లవితో రజనీ రాసిన గీతం ఆయన సాహితీ పాండిత్యానికి మచ్చుతునక మాత్రమే.
కీర్తికిరీటాలు
పూల సుగంధానికి ప్రశంస అవసరమా? అంటే సమాధానం ఉండదు. అలాగే, ఎల్లలు లేని ప్రతిభామూర్తికి సన్మానాలు, సత్కారాలు అవసరమా? అంటే కూడా అదే సమాధానం వస్తుంది. అయినా.. ఏదో నిర్వికారిలాగా ‘నేను కేవలం నిమిత్త మాత్రుడిని. ఆకాశవాణి కేంద్రం కర్త. అవసరాలు కర్మ. ఇవి క్రియను సాధించాయి’ అంటూ పలికే వినమ్రమూర్తిని వరించి పురస్కారాలు, బిరుదులు తమను తాము సన్మానించుకున్నాయి. కశాప్రపూర్ణ (1981), కశారత్న (ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 2007), కేంద్ర సంగీత అకాడమీ పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, అజో విభో జీవితసాఫల్య పురస్కారం.. ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రజనీకాంతరావును  ‘తెలుగు వెలుగు’ విశిష్ట పురస్కారంతో సన్మానించింది.
సాహితీ శిఖరం
సంగీతంలో ఎంత ఎత్తుకు ఎదిగారో సాహిత్యంలో కూడా అంతే ఎత్తుకు ఎదిగిన మనిషి రజనీ. గేయనాటికలు, సంగీత రూపకాలు, జేజి మావయ్య పేరుతో బాలల కోసం రాసిన గీతాలు... అన్నీ కలిపి కొన్ని వందల రచనలు ఆయన చేశారు. రజనీ అనగానే గుర్తుకువచ్చే ‘శతపత్రసుందరి’లో ఈ గేయం ఆయనలోని సమభావాన్ని ప్రకటిస్తుంది.
సాగునదే సాగునదే
ధర్మచక్రము ధర్మచక్రము
ఏగునదే ఏగునదే
జగతి నలుదెసల నాచంద్రార్కము
పిలుచునదే వినబడదో
శిలలు ద్రవించు కరుణతో
పిలుచునదే యెదయెద
హత్తించు ప్రేమ గళమ్ముతో
రాజు, రౌతు, ప్రభువు, బంటు
యతి, గృహస్థు చనుమార్గము
సర్వసమము, శాంతి కాంతి
పథము వక్రము ధర్మచక్రము
సాగునదే సాగునదే ధర్మచక్రము

      ‘మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటే.. చండాలుండేటి సరిభూమి యొకటే’ అన్న అన్నమయ్య భావం రజనీ గేయంలో కనిపిస్తుంది. సమసమాజ స్థాపన రజనీ సాహిత్యానికి అంతిమ ప్రస్థానం. ఇంతగా అభ్యుదయభావం ప్రకటించిన రజనీ ప్రేయసీ ప్రియుల సరాగాలు, సల్లాపాలు; ఎదురుచూపులు, వేడుకోలు కూడా అంతే స్థాయిలో ప్రకటించారు.
చల్లగాలిలో యమునాతటిపై
శ్యామసుందరుని మురళి!
మురళీ! శ్యామసుందరుని మురళి!
ఉల్లము కొల్లగొనే మధుర గీతులు
మెల్లమెల్ల చెవి సోకునవే
చల్లగాలిలో
తూలివ్రాలు వటపత్రమ్ములపై
తేలి తేలి పడు అడుగులవే
పూలతీవ పొదరిల్లు మాటుగా
పొంచి చూచు శిఖిపింఛమదే
చల్లగాలిలో

      ‘మా నల్లని మనోహర స్వామి’ కనిపించడం లేదని ప్రతి ఇల్లూ పొదరిల్లూ వెదికే గోపికల మనోఛాయలు రజనీ గేయంలోనూ ప్రతిఫలిస్తాయి.
      అనంతమైన ప్రకృతిలో అభ్యుదయ రథంపై సాగిపోయే రజనీ మనసు ఆరేళ్లు దాటిపోలేదు. అందుకనే జేజిమావయ్యగా చంటిపాపలను చంకనెత్తుకుని గోరుముద్దలు తినిపించారు.
కాకి కాకి హాష్‌! కాకి కాకి హాష్‌!
కాకీ కాకీ రాకే రాకే
పాపాయి బువ్వ తింటోంది
కాకి కాకి హాష్‌!
వెండిగిన్నెలో పప్పూ బువ్వ
గుంజు గుంజు గుంజు గుంజు
గోరు గోరు గోరు గోరు
కంచం అంచున రాసి
గోరు గుజ్జు తీసి
గుజ్జు నోటికి పూసి
బుజ్జి నోట ఆం..!    అత్త ముద్ద ఆం..!
అమ్మ ముద్ద ఆం..!    నాన్న ముద్ద ఆం..!
కాకి కాకి రావే     
బుజ్జిముద్ద తినిపోవే

      చిన్నపిల్లల్నే కాదు పెద్దల్నీ చంకనేసుకుని చందమామను చూపిస్తూ గోరు గుజ్జు తినిపిస్తారు రజనీ.
ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చానే!
తియ్య తియ్య తాయిలమేదో తీసి పెట్టమ్మా! ।।2।।
పిల్లి పిల్ల కళ్లుమూసి పీట ఎక్కింది
కుక్కపిల్ల తోకాడిస్తూ గుమ్మమెక్కింది ।।2।।
కడుపులోనే కాకి పిల్ల గంతులేసింది
తియ్య తియ్య తాయిలమేదో తీసి పెట్టమ్మా!! ।।ఆట।।
గూటిలోనా బెల్లం ముక్క కొంచెం పెట్టమ్మా!
చేటలోని కొబ్బరి కోరు జారెడు ఇవ్వమ్మా!
అటకమీద అటుకుల కుండా అమ్మా! దించమ్మా!
తియ్య తియ్య తాయిలమేదో తీసిపెట్టమ్మా!

      రజనీ సాహితీ తాయిలాలు పిన్నలే కాదు.. పెద్దలకీ ఎంతో ఇష్టం. కాల మహిమో, ప్రగతి ప్రభావమో తెలియదు కానీ చేటలో అటుకులు, అటుకుల కుండ, గూటిలో బెల్లం ముక్క ఇప్పుడు కని(విని)పించవు. భవిష్యత్తును ఊహించారేమో.. రజనీ ముందుగానే అవన్నీ తన కలం(గళం)లో దాచిపెట్టారు.
      ఇలా చెప్పుకుంటూ పోతే రజనీ సంగీత సాహిత్యాల విన్యాసాలు వెల్లువగా వస్తూనే ఉంటాయి. రజనీ సంగీత సాహిత్యాల్లో దేనికదే ప్రత్యేకం. దానికదే సాటి. అందుకనే ఆ నూరేళ్ల బాలుడి ‘తెలుగు వెలుగు’ కలకాలం 
వెలగాలని ఆకాంక్షిద్దాం.


వెనక్కి ...

మీ అభిప్రాయం