మన ప్రాభవగీతి అమరావతి

  • 1359 Views
  • 184Likes
  • Like
  • Article Share

    వావిలాల సుబ్బారావు

  • విశ్రాంత అధ్యాపకులు
  • అమరావతి.
  • 9866402973
వావిలాల సుబ్బారావు

కృష్ణలో తలతడుపుకుని, అమరలింగేశ్వరుడికి దణ్ణం పెట్టుకుంటే... అదో తృప్తి! 
స్తూపాన్ని చూసి, బౌద్ధాన్ని గుర్తుచేసుకుంటే... ఏదో స్ఫూర్తి!
వైజయంతీ భవనానికి వెళ్లి, వేంకటాద్రి నాయుణ్ని తలచుకుంటే... మరేదో అనుభూతి!
      అసలెక్కడికీ వెళ్లకుండానే... వేటినీ చూడకుండానే... అరక్షణం పాటు ‘అమరావతి’ అని స్మరించుకుంటే చాలు... కాలరేఖపై వైభవోపేతంగా నడిచివచ్చిన తెలుగుజాతి చరిత్ర అంతా సప్తవర్ణాల్లో సాక్షాత్కరిస్తుంది. అజంత భాషంతటి మనోహరమైన అలనాటి రాచనగరి ఇప్పుడు మళ్లీ రాజధాని అయ్యింది. దీనికి మునుపే కేంద్ర ప్రభుత్వ హృదయ్‌ పథకం కింద వారసత్వ నగరంగా ఎంపికైన ఖ్యాతి వహించింది.
అమరావతికి
ఇప్పుడు మూడోసారి రాజధాని గౌరవం దక్కుతోంది. ‘ధాన్యకటకం’ పేరుతో శాతవాహనుల కాలంలో మొదటిసారి కీర్తి పీఠం ఎక్కింది. రాజావాసిరెడ్డి వేంకటాద్రి నాయుడి జమీందారీ రాజధానిగా రెండోసారి వాసికెక్కింది. నవ్యాంధ్ర రాజధానిగా ఇప్పుడు మూడోసారి శాశ్వతంగా స్థిరపడింది. అన్ని వర్గాల ఆంధ్రులూ ముక్తకంఠంతో స్వరభేదం లేకుండా ఆమోదించిన తమ రాజధాని పేరు ‘అమరావతి’. ఈ ఏకగ్రీవ గౌరవం అందమైన పేరు కోసం కాదు. రెండు వేల సంవత్సరాలుగా ఇక్కడ వికసించిన తెలుగు జాతి వారసత్వ వైభవ పునరుజ్జీవనం కోసం!
      శాతవాహన రాజులకు రాజధాని కాకముందే, గొప్ప వాణిజ్య కేంద్రంగా అమరావతి రాణించింది. మతధార్మిక కేంద్రంగా, ఒక నగరంగా అశోకుడి కాలం కన్నా ముందే ప్రసిద్ధిలో ఉంది. ప్రజల మతంగా బౌద్ధం ఇక్కడ ఆదరణ పొందింది. స్తూపం కూడా ఉండేది. అశోకుడి కాలంలో ధాతుగర్భచైత్యంగా పరిణమించి ఉండవచ్చు.
      దేశం గ్రామీణ సంస్కృతి నుంచి నగర సంస్కృతికి పరిణమిస్తున్న దశకు అమరావతి ఓ సంకేతం. అందుకు ఒక కారణం కృష్ణానదీ తీరం కావటం. అమరావతి ఆనాటి ప్రధాన రహదారి మార్గంలో ఉంది. వెడల్పు ఎక్కువ, లోతు తక్కువగా ఉన్న చోటు కావడంతో... నది మీద ఉత్తర దక్షిణాలకు ఇదే రహదారి. వాణిజ్య వ్యాపారాలు వృద్ధి చెందటానికి అనువైన తావు. ఇక్కడి నుంచి పడవల మీద విదేశీ వాణిజ్యం జరిగేది. తూర్పు దేశాలతోనే కాదు పశ్చిమ రాజ్యాలతోనూ అమరావతికి వ్యాపార సంబంధాలు ఉండేవి. ఇక్కడ దొరికిన రోమన్‌ నాణేలు, శాతవాహన నాణేలమీద ఉన్న పడవ గుర్తులే దీనికి తార్కాణాలు.
      విస్తారమైన శాతవాహన సామ్రాజ్యానికి అమరావతి తూర్పు రాజధాని. ఇదే ధాన్యకటకం. ఆంధ్రుల ప్రధాన రాజధానిగా కనీసం 225 సంవత్సరాలు వెలిగింది. అశోకుడి కాలం నుంచి శాతవాహనుల తుదివరకు దాదాపు 450 సంవత్సరాలు ఉన్నత స్థితిని అనుభవించిన తెలుగు నగరం అమరావతి. పాటలీపుత్రాన్ని పరిపాలించే కాణ్వాయన వంశాన్ని కూలదోసి పదేళ్లపాటు ఆంధ్ర పతాకాన్ని ఉత్తరభారతాన రెపరెపలాడించిన శాతవాహనుల పట్టణమిది. మరే దక్షిణ దేశ రాజులూ సాధించని విజయాన్ని వాళ్లు సుసాధ్యం చేశారు. తమ రథాశ్వాలు మూడు సముద్రాలలో నీళ్లు  తాగుతాయని ధాన్యకటక ప్రభువులు గౌతమీపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణులు సగర్వంగా చెప్పుకున్నారు.
బుద్ధం శరణం గచ్ఛామి
అమరావతి పేరు వినగానేె ముందుగా గుర్తుకు వచ్చేవి బౌద్ధం, స్తూపం, శిల్పాలు. సిద్ధాంత భేదాలతో బౌద్ధం అనేక శాఖలుగా వేరవుతున్న సందర్భంలో ఆచార్య నాగార్జునుడు వాటిని సమన్వయపరిచాడు. మాధ్యమిక వాదాన్ని స్థాపించి రెండో బుద్ధుడిగా ప్రసిద్ధుడయ్యాడు. మహాయాన బౌద్ధశాఖకు ప్రధాన ప్రవక్త నాగార్జునుడే. రెండో శతాబ్దంలో గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి ఆదరణలో ఇక్కడ కొంతకాలం ఉన్నాడు. ఆచార్యుడి పర్యవేక్షణలోనే మహాచైత్యానికి ప్రాకార నిర్మాణం జరిగింది. ఆయన ప్రతిపాదించిన శూన్యవాద సిద్ధాంతాన్ని అధ్యయనం చేయటానికి అప్పట్లో దేశదేశాల నుంచి బౌద్ధ విద్యార్థులు వచ్చేవారు. విశ్వవిద్యాలయ తుల్యంగా ఇక్కడ తత్త్వశాస్త్ర అధ్యయన అధ్యాపనాలు జరిగేవి. ఈ నేపథ్యాన్ని వర్ణిస్తూనే రాయప్రోలు సుబ్బారావు... ‘అమరావతీ పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు’ అని ఆంధ్రుల మహితాభిమాన దీక్షాస్ఫూర్తిని గానం చేశారు.
      నాగార్జునుడి తర్వాత కూడా ఆర్యదేవుడు, ధర్మకీర్తి వంటి చాలామంది తత్త్వవేత్తలు ఇక్కడ బోధనలు చేసేవారు. ప్రఖ్యాత చైనా యాత్రికుడు హ్యుయన్‌సాంగ్‌ క్రీ.శ.650లో ఇక్కడ కొంతకాలం ఉండి ‘అభిధమ్మ’ అధ్యయనం చేశాడు. అప్పటికే ధాన్యకటకం క్షీణదశలో ఉందని, అయినా కొన్ని వందల ఆరామాల్లో వేలమంది భిక్షువులు ఉన్నారని హ్యుయన్‌సాంగ్‌ వర్ణించాడు. అంటే... ధాన్యకటకానికి ఉన్న రాజ్యప్రశస్తి కన్నా, విద్యా సంస్కృతీ ప్రశస్తి ఘనమైనదన్న మాట.
అమరావతీ నగర అపురూప శిల్పాలు
మథుర, గాంధార, అమరావతి అన్నవి ప్రధాన భారతీయ శిల్ప రీతులు. అమరావతి శిల్పశైలిలో నాజూకుతనం, లావణ్యం, చలనగుణం ముఖ్యమైన లక్షణాలు. స్థిరస్థితిని శిల్పించటం కన్నా, చలనస్థితిని కదలని రాతిలో రూపొందించటం కష్టం. దానిని సాధించిన హస్త నైపుణ్యం అమరావతి శిల్పులది! దక్కకుండా పోయిన శిల్పాలు పోగా మిగిలిన వాటిని గురించి కూడా ఎంతైనా చెప్పుకోవచ్చు.
      బుద్ధుడైన సిద్ధార్థుడు కపిలవస్తుకు వచ్చినప్పుడు... తండ్రి శుద్ధోదనుడు, భార్య యశోధర, పుత్రుడు రాహులుడు, ప్రజలు, అందరూ చూడవచ్చిన సన్నివేశాన్ని చిత్రించిన ఫలకం చూస్తే ప్రేక్షకుల మనసులో ధర్మవీర స్ఫూర్తి కలుగుతుంది. బుద్ధుని భిక్షాపాత్రను పెద్దపళ్లెంలో పెట్టుకుని గంధర్వ, కిన్నెర, కింపురుషులు మోసుకొని స్వర్గానికి తీసుకెడుతున్న ఘట్టం జన సమూహపు తొక్కిసలాటతో చైతన్యస్రవంతిలా కనిపిస్తుంది. మదపుటేనుగు నగరంలో సృష్టించిన బీభత్సాన్ని రాతి ఫలకం మీద చూస్తున్నా సరే భయం పుట్టిస్తుంది.
      ఈ అపూర్వ శిల్పనైపుణ్యానికి అచ్చెరువొందిన కవి ‘మైనపుముద్దగా శిలను మారిచి తీరిచిదిద్దినాడవయ్యా’ అని కీర్తించాడు. ప్రేక్షకుడు ‘... సిద్ధనాగార్జును శిల్ప సంపద నొక్క ప్రతిమగా నున్నట్లు’ భ్రాంతి పొందుతాడు. ఇంతటి శిల్పకీర్తికి అమరావతి పుట్టిల్లు. వీటిపై మోహపడి కల్నల్‌ మెకంజీ, స్మిత్, స్యూయల్, బర్జెస్, అలెగ్జాండర్‌ లీ తదితరులు తడవలు తడవలుగా శిల్పాలను తరలించుకుని పోయారు. అవి ఇప్పుడు ప్రపంచం నలుమూలలా ప్రసిద్ధ ప్రదర్శనశాలలను అలంకరించాయి. అక్కడికి వెళ్లిన ప్రతి తెలుగువాణ్నీ ఆత్మబంధువుల్లా పలకరిస్తుంటాయి. మన తెలుగుదనాన్ని మనలో సగర్వంగా నిలబెడతాయి.
      సమైక్య రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రలో అమరావతి శిల్ప చిహ్నాలు కనిపిస్తాయి. పూర్ణ కుంభం, పద్మాలంకరణ అమరావతి శిల్పాల్లోంచే వచ్చాయి. పూర్ణకుంభ శిల్ప ఫలకాలు అమరావతి శిల్పాలలో ప్రధాన చిత్రణలు. సర్వసమృద్ధికి, పరిపూర్ణమైన ఆహ్వానానికి అవి సంప్రదాయ చిహ్నాలు.
శాంతమే మతం
అమరావతి మతసామరస్యాన్ని నిలిపిన ధర్మక్షేత్రం. గతంలో దలైలామా అమరావతిలో మూడు రోజులు పూజలు నిర్వహించారు. ఆయనకు అమరేశ్వర ఆలయంలో పూర్ణకుంభ స్వాగతంతో సత్కారం చేశారు. ఆ సందర్భంలో ఆయనిచ్చిన సందేశం గుర్తుంచుకోదగినది. ‘అమరావతిలో అనేక మతశాఖలు ఒకే కాలంలో ఘర్షణ లేకుండా తమ ధర్మాలను ఆచరించాయి. ప్రపంచానికి అవసరమైన మతసామరస్యాన్ని ఆనాడే అమరావతి ఆచరించి చూపింది. అది నేటికీ ఆదర్శం’ అంటూ అమరావతి సంస్కృతి లక్షణాన్ని స్పష్టంగా తెలియజెప్పారు దలైలామా. 
      అమరావతికి తూర్పు పడమర దిక్కుల్లో జైనమత అవశేషాలు లభించాయి. సమీపంలోని వడ్లమాను గ్రామం నాటి ‘వర్ధమానపురం’. పడమట ఉన్న మునగోడులో జైన శాసనం లభించింది. ఆ పల్లె అప్పట్లో ‘మునికూటువ’ కాబోలు! 
      శాతవాహన రాజులు అశ్వమేథ- రాజసూయ తదితర యజ్ఞయాగాదులు నిర్వహించి వైదిక మతాన్ని పాటించారు. అయినా ప్రజల మతమైన బౌద్ధం కోసం మహాచైత్యాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేశారు. రాణులూ బౌద్ధాన్ని అభిమానించారు. సర్వధర్మ సమభావం అనే లౌకికభావనకు అమరావతి ప్రశస్తమైన ఉదాహరణ. పాలకుల మతాభిలాషను ప్రజలపై రుద్దని శ్రేయోరాజ్య ధర్మానికి శాతవాహనులు ఆదర్శప్రాయులు.
      ఇక శైవక్షేత్రాలయంగా అమరేశ్వరాలయం ఖ్యాతి అందరూ ఎరిగిందే. అయితే... ఈ దేవాలయ చరిత్రను గురించి ఒక చారిత్రక అపోహ ఉంది. బౌద్ధ స్తూపాన్ని కూల్చి అమరేశ్వరాలయం కట్టారన్న నిందకు ఆధారం లేదు. క్రీ.శ 1230లో కోట వంశీయుడైన కేతరాజు వేయించిన పెద్దశాసనంలో, అమరేశ్వరుడితో పాటు బుద్ధదేవరకూ దీపారాధన నిమిత్తం దానం చేసిన వివరాలున్నాయి. శాసనం మీద బుద్ధుడి మూర్తినీ చెక్కి గౌరవించారు. 15వ శతాబ్దం వరకు స్తూపం ఎంతోకొంత కొనసాగింది. రెండు ఆరాధనా స్థానాలు ఏకకాలంలో కనీసం నూటయాభై ఏళ్ల పాటు కలిసి ఉన్నాయి. ధర్మసామరస్యమే అమరావతి మతం. మత సామరస్యమే అమరావతి ధర్మం.
ఎల్లలు దాటిన ఖ్యాతి
ఆచార్య నాగార్జునుడు తనకు గురువు అని దలైలామా ప్రకటించారు. ఆయనది వజ్రయాన సంప్రదాయం. బుద్ధుడు స్వయంగా ధాన్యకటకంలో కాలచక్ర తంత్రాన్ని ప్రవచించాడన్నది వజ్రయానుల విశ్వాసం. అది చారిత్రక వాస్తవం కాదు కదా అంటే... ‘భౌతిక వాస్తవం కాకపోవచ్చు’ అన్నారేగానీ, ఆ తంత్ర జన్మస్థానం ధాన్యకటకమేనన్న విశ్వాసాన్ని మాత్రం కొనసాగించారు. టిబెట్‌ రాజప్రాసాదంలోని చైత్యాన్ని అమరావతి స్తూప నమూనాలో నిర్మించారని తారానాథుడనే టిబెటన్‌ చరిత్రకారుడు రాశాడట! ఇప్పుడు ఫ్రాన్సులో శ్రీధాన్యకటక (ఎస్‌డీకే) అనే సంస్థ ఉంది. ఇంగ్లాండ్‌లోని చిల్ట్రన్‌హిల్స్‌లో 1985లో ‘అమరావతి బౌద్ధమఠం’ ప్రారంభమైంది. ఇప్పటికీ నిర్విఘ్నంగా నడుస్తోంది. ఆంగ్లేయ బౌద్ధ భిక్షువులు కనిపిస్తారు ఇందులో. ఇలా అనేక దేశాలకు ‘అమరావతి’ స్ఫూర్తినిస్తోంది. ఈ ప్రాంతానికి శ్రీధాన్య, శ్రీధాన్యకటకం అనే మరో రెండు అందమైన పేర్లూ ఉన్నాయి.
      శాతవాహన రాజుల్లో అమరావతిని రాజధానిగా చేసుకున్న ఇద్దరు చక్రవర్తులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్లలో ఒకరు గౌతమీపుత్ర శాతకర్ణి. శౌర్యపరాక్రమాలలో ఎంత అజేయుడో అంత సుందరుడు. ఎంత సుందరుడో అంత ధార్మికుడు. శత్రువులనైనా సరే, ఏమాత్రం అవకాశం ఉన్నా అపకారం చేయకుండా విడిచిపెట్టే ఉదారుడు. ప్రాచీన రాజ్యవ్యవస్థలో ఇది అసాధారణ గుణం. పూర్వ శాతవాహన రాజ్యానికి పునర్వైభవం తెచ్చి, శక రాజైన ‘నహపాణు’ణ్ని సంహరించి, ఆంధ్రుల ప్రతిష్ఠను తిరిగి నిలబెట్టిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి. శాలివాహన శకం క్రీ.శ.78 నుంచి ప్రారంభమవుతుంది. ఆ శకానికి ఇతనే కర్త అంటారు. ఈ సంవత్సరాన్నే జాతీయ పంచాంగం ప్రామాణికంగా తీసుకుంది. ఈ కీర్తికి పాదులు చేసింది అమరావతి.
      బౌద్ధ ప్రియులుగా ఉన్న ప్రజలు తరతమ భేదాలు లేకుండా మహాచైత్యాలంకరణకు తోడ్పడ్డారు. ఒక చర్మకారుడు పూర్ణకుంభ శిలాఫలకాన్ని దానం చేసినట్లు పేర్కొందో శాసనం. ఈ సన్నివేశాన్ని అందమైన కథగా ‘అమరావతి కథల్లో’ చిత్రించారు సత్యం శంకరమంచి. 
నాగార్జునుడితో అనుబంధం
మరొక మహారాజు గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆ వంశంలో చివరి గొప్పరాజు. రెండో శతాబ్ది చివరిభాగంలో పరిపాలించాడు. ఆచార్య నాగార్జునుణ్ని ఆదరించాడు. ఆయన కోసం ‘విజయపురి’(నాగార్జునకొండ)లో స్తూపాన్ని నిర్మించి ఇచ్చాడు. ఇంతటి మహారాజుకు... అంతటి మహాతత్త్వవేత్త రెండు దీర్ఘ లేఖలు రాశాడు. ‘సుహృల్లేఖ, రత్నావళి’ అన్న ఆ  లేఖలు సర్వబౌద్ధ ప్రపంచంలో సుప్రసిద్ధాలు. ఇక్కడ పుట్టిన ‘సుహృల్లేఖ’ టిబెట్టులో పాఠ్యగ్రంథమట! పరిపాలకులు ఏ దేశం వాళ్లయినా సరే, నిత్యం పఠనం చేయదగిన పరిపాలక ధర్మాలను అందులో చెప్పాడు నాగార్జునుడు. అశోకచక్రవర్తి ధర్మపాలనను, వైదికధర్మ చక్రవర్తి అయిన యజ్ఞశ్రీతో పాటింపచేయటం కోసం ఆయన ఇలా చెప్పి ఉండవచ్చు. ఆ సూక్తుల్లో కొన్నింటినైనా మనం తెలుసుకోవాలి. ఆంధ్రరాజుల వారసత్వ సంస్కృతిని అర్థం చేసుకోవడానికి అవి ఉపకరిస్తాయి. 
      ‘ఎంత నేరం చేసిన వాణ్నయినా సరే తండ్రి బిడ్డలను ప్రేమతో శిక్షించినట్లే శిక్షించాలి’, ‘మరణదండన వేయదగిన నేరం చేసినా సరే, దేశం విడిచి పొమ్మనటమే గొప్ప శిక్ష’, ‘నువ్వు చేసే ధర్మకార్యాలు పరరాజులకు అసూయ కలిగించాలి’, ‘నిర్దయగా సేకరించిన ధనంతో కోశాగారం నింపకు. ధర్మార్జిత ధనంతోనే కోశం నింపాలి’, ‘ధర్మానుగుణంగా పాలించలేకపోతే సింహాసనం విడిచిపెట్టి భిక్షు దీక్ష తీసుకో’... వీటిలో కొన్నింటినైనా సంకలనం చేసి, అన్ని స్థాయుల పరిపాలకులకూ పంచిపెడితే పునరాలోచన కలగదా వాళ్లకి!
పంచారామ ప్రఖ్యాతి
రాజకీయ ప్రాధాన్యం వెనకడుగు వేసినా బౌద్ధతత్వ కేంద్రంగా 7-8 శతాబ్దుల దాకా అమరావతి కొనసాగింది. దీనికి పురాణప్రశస్తి, పంచారామకీర్తి ఉన్నందువల్ల శైవక్షేత్రంగా వికసించింది.
      శివభక్తుడైన తారకాసురుణ్ని సంహరించటం కోసం కుమారస్వామి ఆవిర్భవించాడు. తారకుడితో చేసిన యుద్ధంలో అతని మెడలోని శివలింగాన్ని ఖండించి రాక్షస సంహారం చేశాడు. ఆ శివలింగ ఖండాలు ఐదు చోట్ల పడ్డాయి. అవే పంచారామాలు. అందులో మొదటిది అమరావతి. ఈ శివలింగ శకలాన్ని అమరేశ్వరుడు (దేవేంద్రుడు) ప్రతిష్ఠ చేసి పూజించాడు కాబట్టి ఇక్కడి శివమూర్తిని ‘అమరలింగేశ్వరుడు’ అని పిలుస్తారు. తొమ్మిదో శతాబ్దాంతంలో చాళుక్య భీముడు ఆలయం కట్టించి ఉంటాడు. పదహారో శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయానికి ఎన్నో దానాలు చేశాడు. తర్వాత చిన్న చిన్న రాజుల పరిపాలన సాగింది.
      18వ శతాబ్దం చివరలో రాజావాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు తన జమీందారీ రాజధానిని చింతపల్లి నుంచి అమరావతికి తరలించారు. ధరణికోట ప్రాంతంలోని తూర్పు భాగాన్ని ఆలయం, స్తూప ప్రాంతాలను వేరే గ్రామంగా చేసి ‘అమరావతి’ అనే అందమైన పేరు పెట్టారు. స్వర్గపురం అయిన ‘అమరావతి’కి దీటుగా ఈ అమరావతిలో నందనవనం, వైజయంతి భవనం నిర్మించారు. నవరత్నాలనే పండితమండలిని పోషించారు. దేవగురువు బృహస్పతి వంటి ములుగు పాపయారాధ్యులు అనే పండిత కవిని తన గురువును చేసుకున్నారు. ‘దేవీభాగవతం’ వంటి కావ్యాలు రాయించారు. మళ్లీ ఈ ప్రాంతం కళకళలాడింది.
      ‘అమరావతి’ అనగానే 2400 సంవత్సరాల చరిత్ర పంచవర్ణ చలనచిత్రం లాగా కళ్లముందు కదలాడుతుంది. ఆ పేరు తలచుకోగానే మనసులో తెలుగుజాతి వైభవ పతాక రెపరెపలాడుతుంది. మళ్లీ ఇప్పుడు కొత్తశకం మొదలవుతోంది.
      కరుణశ్రీ అన్నట్టు ‘అమరావతి ఒక అనుభూతి’. ఇక్కడ దాదాపు నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణమున్న కృష్ణానది, మధ్యనున్న లంకలతో పర్యాటకులకు సౌందర్య సుఖాన్నిస్తుంది. 
      రాజ్యాధికార ప్రాధాన్యంలో కొంతకాలం పాలించి వెళ్లిపోయిన రాజవంశాల కీర్తిని నిర్జీవ శిలాశాసనాలపై గుర్తు చేసేది మాత్రమే కాదు... తెలుగుజాతి ఉన్నంతకాలం సగర్వంగా చెప్పుకోదగిన సంస్కృతీ లక్షణాలకు పుట్టినిల్లు అమరావతి. తరతరాల జనజీవనానికి సామరస్యాన్ని, కళాదృష్టిని, ధార్మిక విలువలను అందించిన అమరావతి తెలుగువాళ్ల సంస్కృతీ చిహ్నం.
 


వెనక్కి ...

మీ అభిప్రాయం