ఎవరో ఒకరు ఎపుడో అపుడు

  • 461 Views
  • 15Likes
  • Like
  • Article Share

    సాహితీ స్రవంతి

పాట మనిషి మానసిక అవసరాలను తీర్చే సాధనాల్లో ఒకటి. అయితే.. అన్ని పాటలకూ ఆనందం కలిగించే గుణానికి తోడుగా ఆలోచన కలిగించే శక్తి ఉండదు. ముఖ్యంగా తెలుగు సినీ గీతాల్లో శ్రోతలకు మనోస్థైర్యాన్ని కలిగించేవి తక్కువగానే కనిపిస్తాయి. వాణిజ్యప్రయోజనాలే కాకుండా నైతిక వర్తనకు మెరుగుపెట్టే పాటలు కొద్దిసంఖ్యలోనే వచ్చాయి. అలాంటి అరుదైన గీతాల్లో ఓ మేలిమి రత్నం.. ‘ఎవరో ఒకరు’!
కోయిల
కూసినా పాటే. సెలయేరు సడిచేసినా పాటే. ఊయల శ్రుతినాదం ఒక పాట. ఆకుల గలగల ఒక పాట. శ్రమజీవుల ఊపిరి ఊగిసలాట మరొక పాట. చినుకుచినుకులోనూ సంగీతనాద మాధుర్యం తొణికిసలాడినట్టు ప్రకృతిలో ఒక్కో అనుభూతి స్ఫూర్తిగీతం మాదిరిగా మనసుకుతాకితే అదో ధైర్యం మనిషికి. మనం ఒంటరిగా ఏం చేయగలం! మన శక్తిని ఎవరు గుర్తిస్తారూ! అని అసలు ప్రయత్నమే చేయకుండా ఉండిపోతే ఏమీ సాధించలేం. గెలుపూ ఓటముల సంగతి ఎలా ఉన్నా ప్రయత్నమంటూ ఉంటేనే కదా పురోగతి! ఎవరేమనుకున్నా సంకల్పంతో ముందడుగెయ్యి అని ఎవరో చెప్పడం కాదు ప్రకృతే ప్రేరణశక్తిగా ముందుకునెట్టడం సాహిత్యంలోనే కాదు సినిమా పాటల్లోనూ చూడొచ్చు.
      ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు... అంటూ మొదలయ్యే ఈ పాట 1992లో వచ్చిన ‘అంకురం’ చిత్రంలోది. సిరివెన్నెల సాహిత్యానికి హంసలేఖ స్వరకల్పన చేయగా బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడారు. పోలీసుల అక్రమ నిర్బంధంలో చిక్కుకున్న ఒక అనామకుడికోసం ఒంటరి పోరాటం సల్పిన మహిళ అంతరంగానికీ, ఆత్మవిశ్వాసానికీ దర్పణం పడుతుందీ పాట. తనకెవరూ సాయంగా రానప్పుడు ఎలా ముందడుగెయ్యాలో తెలియక గాంధీ చిత్తరువును చూస్తూన్న నాయికకి సాలోచనగా ఈ పాట వస్తుంది సినిమాలో. ఇప్పటికీ ఈ గీతం మనలో దాగి ఉన్న అచంచల ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలుపుతూనే ఉంటుంది. 
మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరి
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి 
వెనుకవచ్చువాళ్లకు బాట అయినది... 

      ‘పదుగురాడు మాట పాటియై ధరజెల్లు’ అన్నట్టుగానే పదుగురు నడిచినబాటలోనే లోకం నడవాలనుకుంటుంది. ఆ బాట ఒక్కరోజులో ఏర్పడిందేం కాదు. ఎవరో ఒక సాహసి తెగించి కనుగొన్నదే కదా! అదే వెనుకవచ్చేవాళ్లకు బాటయ్యింది. కాని ఆ మొదటివాడు అప్పుడు ఒంటరే. ఆ ప్రయత్నమూ ఒంటిగానే సాగింది. లోకంలో గొప్పగొప్ప ప్రయత్నాలన్నీ ఒక్కరితోనే మొదలవుతాయి. వారి కాలిగురుతులు పదిమందికీ దారిచూపుతాయి. అవి పదికాలాలూ నిలబెడతాయీ... నిలబడతాయి అనే నిగూఢ సత్యాన్ని పాట ఎత్తుగడలోనే కాదు అనుపల్లవిలో కూడా అనుసంధానించడంతో పాట చైతన్యస్థాయి ఎలాంటిదో తెలుస్తుంది.
ప్రకృతే పాఠశాల
పాట సాహిత్యప్రధానంగా ఉండాలి. అలాగని ఉపదేశం చేయకూడదు. ఎత్తిపొడుపుగా, విమర్శనాత్మకంగానూ ఉండకూడదు. చీమలని చూసి నేర్చుకో అనడం కాకుండా చీమ శ్రమని చూపించగలిగేలా పాట ఉండాలి. ఈ గీతం చేసే పని అదే! మన లోపాల్ని మనతోనే తడిమి చూపించగలిగేదీ.. మనలోని నిస్సత్తువనీ.. అలసత్వాన్ని నిందించేదీ.. ఇంకిపోతున్న శక్తియుక్తులకు ఊపిరిపోసేదీ.. ధైర్యంగా ముందుకు సాగేందుకు ప్రకృతి ప్రతీకలను ఆలంబనగా చూపేది నిస్సందేహంగా ఉత్తమ గీతమే. 
కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా
అనుకుని కోడికూత నిదరపోదుగా 
జగతికి మేలుకొల్పు మానుకోదుగా...
 
ఈ చరణాల్లో విస్మరించడానికీ తోసిపుచ్చడానికీ వీలులేని నిజాన్ని కళ్లముందుకు నెడతారు రచయిత. ఆనాడే కాదు ఈనాడు కూడా ఎన్ని కళ్లు ఉదయాన్ని చూడగలుగుతున్నాయి! 
ప్రకృతిలో ప్రతీదీ స్ఫూర్తిదాయకంగానే ఉంటుంది. దాన్ని అవగతం చేసుకోవడంలో మన లోచూపు మూసుకుపోయుంటుంది. ప్రకృతితో సమాంతరంగా సాగలేక వెనక్కివెనక్కి వెళ్లిపోయాం మనం. గోరంత ఆలోచన కొండంత సమస్యను కదిలించినట్టుగా చిన్న ప్రయత్నం చాలు సమాజాన్ని కదిలించడానికి.
చెదరకపోదుగా చిక్కని చీకటి
మిణుగురు రెక్కచాటు చిన్నికాంతికి
దానికి లెక్కలేదు కాళరాతిరీ.... 

చీకటికి చురకపెడుతుందిలే చిన్ని మిణుగురు పురుగు అన్నట్టుగా తనదైన ప్రయత్నమే ఎలాంటి సమస్యల నుంచైనా గట్టెక్కిస్తుందనే ప్రబోధం ఇందులో కనిపిస్తుంది. గెలవాలనే తపన, ఎలాంటి స్థితిలోనైనా నిలకడగా పోరాడగలననే ధీమా మనిషిలోని కార్యశీలతను నిగ్గుతేల్చు తుంది. తైల పరిమాణం మీదే దీపపుకాంతి ఆధారపడి ఉంటుంది కదా మరి. ప్రయత్న మేదైనా మందగించక ముందుగడుగేస్తేనే పురోగతి ఉంటుంది. సాగలేక చతికిలబడితే తీరమే జాలిపడి దరికి చేరదు కదా! నిస్సత్తువనూ.. నిరుత్సాహాన్ని ఛేదించి స్థైర్యంతో కదలాలి. సంకల్పబలమే వ్యక్తి చైతన్యానికి మూలమనే తాత్విక బోధ ఈ చరణంలో కనిపిస్తుంది.
యుగములు సాగినా నింగిని తాకక
ఎగసిన అలల ఆశ అలసిపోదుగా 
ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా
ఎంత వేడిఎండతో ఒళ్లు మండితే
అంత వాడి ఆవిరై వెళ్లిచేరదా
అంతగొప్ప సూర్యుడు కళ్లు మూయడా
నల్లమబ్బు కమ్మితే చల్లబారడా!

      ఒంటరిగా ప్రయత్నించే వారికి సంకల్పమే ఆత్మబంధువవుతుంది. ప్రయత్న లోపమే కాని ఎవరికీ ఓటమనే మాటే ఉండదని.. ఏదైనా నేర్చుకునే క్రమంలో పరిణతి సాధిస్తారనే స్ఫూర్తిని ఈ పాట కలిగిస్తుంది.
      ఈ గీతం మొత్తంలో ప్రకృతి ప్రతీకలే కనిపిస్తాయి. ఒక వ్యక్తి తన నడవడికను మార్చుకునే పరిస్థితి లేనప్పుడు ప్రకృతి గమనాన్ని చూసైనా నేర్చుకోవాలనే అంతరార్థం ఇందులో ధ్వనిస్తుంది. కోడికూత మేలుకొలుపు, మబ్బుచాటు వానధార, మిణుగురు రెక్కచాటు కాంతి, నింగిని తాకని అలల ఆశ, నల్లమబ్బుచాటు సూరీడు చల్లబడటం... ఇలాంటి ప్రకృతి దృశ్యాలను కళ్లముందు నిలిపి ప్రేరణ కలిగిస్తూ యుగాలకు నిలిచే పాట రాశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. సార్వజనీనంగా సార్వకాలికంగా అందరి గొంతుల్లో పల్లవిస్తూ కాల యవనికపై పచ్చని సంతకంగా నిలిచే ఈ పాటకి కాలదోషం లేదు.


వెనక్కి ...

మీ అభిప్రాయం