అమ్మభాషకు గొడుగు గిడుగు

  • 1752 Views
  • 10Likes
  • Like
  • Article Share

    పి.స్నేహలతా మురళి

  • సంగీత దర్శకురాలు
  • హైదరాబాద్‌, 040 65096899 (గిడుగు రామమూర్తి గారి మునిమనమరాలు)
పి.స్నేహలతా మురళి

ఒక ప్రశ్న ఒక మహోద్యమానికి దారితీయొచ్చు. ఒక సందేహ నివృత్తి పక్క దారి పడుతున్న తెలుగు భాషని సహజమైన దారిలోకి మళ్లింపవచ్చు. ఒకానొక ఇంగ్లీషు దొర ఏట్స్‌ తన సందేహాన్ని తీర్చుకోవడానికి తెలుగుకి గొడుగైన మన గిడుగు వేంకట రామ్మూర్తి పంతులు వద్దకి వచ్చి అడగడం ఒక మహాప్రస్థానానికి నాంది పలికింది. తెలుగు భాషోద్యమానికి తెర తీసింది.
బ్రిటిష్‌ పాలనాకాలంలో ఆంగ్లేయుడైన ఏట్స్‌ బడులకు పర్యవేక్షకుడుగా 1906లో విశాఖపట్నం వచ్చాడు. తెలుగును ఇంట్లో నేర్చుకుని బయట అంగడిలోకెళ్లి మాట్లాడితే అందరూ ఎందుకు నవ్వుతున్నారో అర్థమయ్యేదికాదాయనకు. వాచకాల్లో తెలుగుకి మాట్లాడే తెలుగుకి అంత భేదమెలా వచ్చిందో సందేహం తీర్చుకోవాలనుకున్నాడు. పి.టి.శ్రీనివాస అయ్యంగారుని, గురజాడ అప్పారావుని అడిగినట్టే గిడుగు వారిని అడిగారు. ఏట్స్‌ దొరకి తనకీ మధ్య జరిగిన చర్చలు రామ్మూర్తి పంతులుని తెలుగు భాష మూలాలవైపు ఆలోచించేలా చేసింది. ప్రతి విషయాన్ని కూలంకషంగా మూలాల నించి వెలికితీసి ఔపోసన పట్టే తత్వం గలవారు గిడుగు దృష్టి తెలుగు భాష మీద పడటం విశేషం.
      1848లో పరవస్తు చిన్నయసూరి ఉపయుక్త గ్రంథకరణ సభకి అధ్యక్షుడైన తర్వాత వచన రచనా సంప్రదాయాన్ని దారి మళ్లించారు. 1853లో నీతిచంద్రిక అనే పుస్తకాన్ని వచన రచనకు నమూనాగానూ, 1855లో బాలవ్యాకరణ పుస్తకాన్ని పిల్లల కోసం రచించారు. విద్యాసంస్థల్లో ప్రవేశపెట్టి ఒక అసహజమైన వచన రచనకు గట్టి పునాది వేశారు. వాడుక భాషలో రచనలు చేయడం అపరాధమన్న భావంతో ఆనాటి విద్యావేత్తలు పండితులు చిన్నయసూరి సంప్రదాయాన్ని మన్నిస్తూ వచ్చారు. అలా పిల్లలు చదివే పుస్తకాలు వాడుకలోంచి తొలగించిన పదాలతోనూ కృత్రిమ కావ్యశైలిలోనూ రావడం వల్ల ప్రాచీన సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి, పనికి వస్తుందేమో కానీ, ఆధునిక, శాస్త్ర విజ్ఞానాన్ని సరళంగా చెప్పడంలో విఫలమైపోయాయి.
      నిజానికి చిన్నయసూరికి కూడా అతడి బాలవ్యాకరణం సమగ్రం కాదన్న సత్యం తెలుసు. అందులోని అంశాలు శిష్టజనులు (అంటే చదవడం, రాయడం వచ్చినవారు) ప్రయోగాల నుంచి తెలుసుకోవాలని వారే సూచించారు. కానీ వారి వీరాభిమానులు కొందరు అతిగా స్పందించి తెలుగు సాహిత్యమంతా బాలవ్యాకరణంలోనే ఇరుక్కోవాలని పట్టుబట్టారు. సంస్కృత భాషను వ్యాకరించిన వారు కూడా వాడుకలో ఉన్న భాషనే గుర్తించిన నిదర్శనాలు ఉన్నా, తెలుగు పండితులు వాటిని గమనించలేదు. ఆనాడు కొందరు ఆరోగ్యకరమైన సంప్రదాయాన్ని పాటించలేదు.  మేటి కవులు వాడిన ప్రయోగాలను గుర్తించలేదు. కవిత్రయం అనువదించిన ఆంధ్రమహాభారతమైనా సమగ్రంగా పరిశీలించలేదు. బాలవ్యాకరణాన్ని శిరోధార్యంగా భావించి ఎన్నెన్నో పద ప్రయోగాలను, సాధు రూపాలను ఈసడించేవారు. అచ్చు యంత్రాల సదుపాయంలేని రోజుల్లో తాళపత్రాల మీద రాసేవారు. ఆ ప్రతులను అచ్చువేసే దిశలో తెలిసీ తెలియని వారు చెయ్యరాని సవరణలను దిద్దుబాట్లని చేస్తూ వచ్చారు. ఉదాహరణకు పుష్పగిరి తిమ్మన రాసిన సమీరకుమార విజయంలో ఒక దండకం నిరోష్ఠ్య కవిత అన్న విషయమైన గుర్తించకుండా ‘వ’ అక్షరాన్ని ‘ప’గా దిద్దివేశారట.
      రచనలో వాడే భాష నిత్య వ్యవహారంలో వాడే జీవద్భాషకి దూరంగా జరిగిపోతూ వచ్చి అదే సరైన సంప్రదాయమన్న ఆమోదముద్ర కూడా పొందింది. ఏది సలక్షణమైన భాష అన్న విషయంలో ఏకాభిప్రాయం లేని పండితులు ఒకరి భాషని ఇంకొకరు విమర్శించుకునేవారు.
      ఆనాటి పరిస్థితులు రామమూర్తిపంతులు భావాలకి వ్యతిరేకంగా ఉన్నాయి. పండితుడు అంటే సంస్కృతం చదువుకున్న వాడే అన్న భావం నెలకొని ఉంది. కవిత్రయం భారతాన్ని తెనిగించడానికి వినియోగించిన చంపూ కావ్య శైలిలోనే గద్యం-పద్యం నడిపించాలన్నారు. సంస్కృత భాషా పాండిత్యాన్ని శబ్దగాంభీర్యాన్ని ప్రదర్శించి కావ్య నిర్మాణం చేయాలని ఆనాటి పండితులు కోరుకునేవారు. దేశ భాషల మీద చిన్నచూపు సారించేవారు. భాషలో మార్పు సహజం. ఆ మార్పు భాషని పాడుచేస్తుందనుకునేవారు. అశాస్త్రీయమైన భావంతో ఆ మార్పు తెచ్చే కొత్త ప్రయోగాలు, పలుకులు శిష్ట జనులు వాడుతూ కూడా వ్యాకరించడం నిఘంటువుల్లోకి ఎక్కించడం చేసేవారు కాదు. శిష్టజనులు (చదవడం రాయడం వచ్చిన వారు) వాడుకునే జీవభాషతోనే రచనలు సాగాలి. మాతృభాషని పిల్లలెవ్వరూ నిఘంటువులు వ్యాకరణ గ్రంథాలు దగ్గర పెట్టుకొని నేర్చుకోరు. తల్లిదండ్రులు, తోబుట్టువులు ఇరుగుపొరుగులు సాటి పిల్లలు మాట్లాడగా విని అవలీలగా నేర్చుకుంటారు. పిల్లలకి గణితం, చరిత్ర, కథలు, ఆధునిక శాస్త్ర విజ్ఞానం తెలిపే పుస్తకాలు ఆ వాడుక భాషలోనే నేర్పాలి. నన్నయ నాటి కావ్యభాషలో పుస్తకాలు రచించి పిల్లలని ఆ భాషలోనే రాయాలని పట్టుబడితే ఆధునిక విద్యావికాసానికి అవరోధం అవుతుంది. ప్రాచీన భాషాసాహిత్యాన్ని ప్రత్యేకమైన ఆసక్తితో చదువుకోదలచిన వారు నిఘంటువు, వ్యాకరణ సహాయాలతో చదువుతారు. భాషాజ్ఞానం కేవలం ప్రాచీన కావ్యాలని అధ్యయనం చేయడానికి కాదు కదా! అన్నది గిడుగు వాదన. జన సామాన్యానికి విద్య అందాలి. లిపి, రచన సాటి ప్రజల కోసం ఏర్పడ్డాయి కానీ గతించిన వాళ్ల కోసం కాదు. నోటి మాటకు చేతిరాతకు తేడా ఉంటే అది భాషా వికాసానికే అవరోధం. 
      ఉపాధ్యాయుడిగా 30 ఏళ్ల అనుభవం ఉందాయనకు. 1910లో ఒకానొక వార్షిక సభలో ఈ ప్రతిపాదన చేశారు. ప్రభుత్వం, విద్యాలయాలు దీనికి సుముఖంగా ఉన్నా పండితుల్లో ఏకాభిప్రాయం కుదరలేదు.  దీనివల్ల వ్యావహారిక భాషకి ఆమోదం తెలపడానికి సాహసించలేకపోయాయి. గిడుగు ప్రతిపాదనకి కొండంత వ్యతిరేకత వచ్చేసరికి వీరిలో పట్టుదల పెరిగి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి పూనుకున్నారు.
      ప్రతీ సభలోనూ రామ్మూర్తి పంతులు వ్యావహారిక భాష ఆవశ్యకత గురించి ఉపన్యసిస్తూ వచ్చే వ్యతిరేకతలని ఎదుర్కొంటూ ఉండేవారు. వీరి సభల వల్ల సభ్యుల్లో కలిగిన అలజడి దేశమంతా వ్యాపించింది.
      ఏట్స్‌ దొర, పి.టి.శ్రీనివాసయ్యంగారు, గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి పంతులు ఆనాటి వ్యావహారిక భాషా వాదులుగా ముద్రపడ్డారు. ఆ నలుగురూ దుష్టచతుష్టయమని హేళనచేసేవారు. ఏట్స్‌ దొర పరదేశీయుడు. పి.టి.శ్రీనివాసయ్యంగారు తమిళ ప్రాంతీయుడు. ఇక మిగిలిన ఇద్దరు గురజాడ, గిడుగులు. వీరిని తూర్పు సోదరులు అనేవారు. గురజాడ వారు విజయనగరం సంస్థాన వ్యవహారాల్లో మునిగేవారు. తర్కం రుజుమార్గంలో పండితులని ఎదిరించి ఓడించి వారిని వ్యావహారిక భాషోద్యమానికి తలొగ్గేలా చేయగల తెలుగు వాడి అవసరం తప్పనిసరి అయింది. ఇక గిడుగు వారే తనపై భారం వేసుకుని ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేశారు.
      వీరి దురదృష్టం ఏమోగానీ వీరి వాదానికి బలం ఇచ్చిన గురజాడ, వీరేశలింగం పంతులు అర్ధంతరంగా కాలం చేయడం ఆయనను కుంగదీసింది. అయినా ధైర్యం వీడక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేశారు. ప్రతిజిల్లాకి వెళ్లి సభలు నిర్వహించారు. ఎవరైతే గ్రాంథిక వాదాన్ని బలపరుస్తున్నారో వారిని సభకి రప్పించేవారు. వాళ్లతో వాదించి వారు రాసిన కావ్యాల్లో, పుస్తకాల్లో కృత్రిమమైన ప్రయోగాలను ఎన్నో తప్పులను వెలికితీసి వారే ఒప్పుకునేలా చేశారు. చాలామంది పండితులు వీరి వాదాన్ని సమర్థించడం మొదలుపెట్టారు. 
      పేరి కాశీనాథశాస్త్రి, తాతా సుబ్బరాయ శాస్త్రి, వాసా సూర్యనారాయణశాస్త్రి, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, వేలూరి శివరామశాస్త్రి వంటి విద్వాంసులు, చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి, తల్లావఝల శివశంకరశాస్త్రి వంటి కవులు, పండితులు శిష్ట వ్యావహారిక భాషావాదాన్ని బలపర్చిన తర్వాత వాడుక భాషకి స్వర్ణయుగం ప్రారంభమైంది. పాత్రికేయుల సహకారం పుష్కలంగా లభించింది.
      1924 అక్టోబరు 13న ఆంధ్ర సాహిత్య పరిషత్తు తమ వ్యావహారిక భాషా బహిష్కారాన్ని రద్దు చేశారు. భారతి పత్రిక (సాహిత్య పత్రిక) ఉభయ పక్షాల రచనలకు సమప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. 1924 గుడిపాటి వెంకటాచలం రచన ‘చిత్రాంగి’ నాటకానికి, 1925లో అప్పకవీయానికి పీఠిక రాశారు గిడుగు. 1926లో ఆంధ్రపత్రిక వ్యావహారిక భాషకు సముచిత స్థానం కల్పించింది. టేకుమళ్ల కామేశ్వరరావు తమ కథల సంపుటి ‘రోజా’ని రామ్మూర్తికి అంకితమిచ్చారు. రామ్మూర్తి పంతులు నండూరి వారు రాసిన ఎంకి పాటలు విని అభినందించారు. ఇలా ఎన్నో సభల్లో పండితుల సందేహాల్ని ప్రామాణికంగా నివృత్తి చేస్తూ ఎట్టకేలకు వేదం వేంకటరాయశాస్త్రి, విశ్వనాథ, మల్లంపల్లి సోమశేఖరశర్మ, పురిపండా అప్పలస్వామిలతో తన వాదాన్ని ఒప్పించారు.
      1910 నుంచి తాను ప్రతిపాదించిన శిష్టజన వ్యావహారిక భాష నిజానికి కొత్తదేమీ కాదని చెప్పారు గిడుగు. కవిత్రయాన్ని అనుసరించిన కొన్ని కావ్యాలను మినహాయిస్తే నిత్య వ్యవహారాలకు, శాస్త్ర చర్చలకు గతంలో వాడుక భాషనే వినియోగించారన్నారు. ఎన్నో సాక్ష్యాలు గద్యచింతామణి అనే గ్రంథం నుంచి చూపించారు. ఏ పదప్రయోగం గురించి సందేహాలు అడిగినా తడుముకోకుండా తీర్చేవారు. ఆనాటి పండితులు తీవ్రంగా ఖండించి ఉండకపోతే ఈ ఉద్యమం అవసరమే ఉండేది కాదు. 
      రాయలసీమ వారు వ్యావహారిక భాషోద్యమానికి వ్యతిరేకులు అనే అపప్రథ సాహితీవేత్తల్లో కలుగుతూ వచ్చింది. ఆ అపప్రథ లేకుండా డా।। చిలుకూరి నారాయణరావు కోరిక మీద నవ్యసాహిత్య పరిషత్తు సమావేశాలు అనంతపురంలో 1923, జూన్‌ 15నుంచి17వరకు జరిగాయి. కల్లూరి సుబ్బారావు, ఇతర రాయలసీమ ప్రముఖులు హాజరై గిడుగు వాదానికి జైకొట్టారు.
      నవ్య సాహిత్య పరిషత్తు కాకినాడలో 1936, జనవరి 24, 25, 26 తేదీల్లో సభలు జరిపి ప్రతిభ సాహిత్య పత్రికని ప్రచురించడానికి నిర్ణయించింది. ఇలా అనేక సాహితీ పత్రికలు, సాహిత్య సభలు గిడుగు వారి వాదాన్ని బలపరచి స్వాగతం పలికాయి. శ్రీశ్రీ, దేవులపల్లి, దాశరథి వంటి నవీన కవులు సరళమైన భాషలో రచనలు చేసి నవయుగానికి తెరతీశారు.
      ‘‘ప్రజల్లో విద్యావ్యాప్తి చేస్తే గానీ సంఘం వృద్ధిలోకి రాదు. అది సంఘంలోని పెద్దలు చేయాల్సిన ధర్మకార్యమని ఆలోచించకూడదు. భాగ్యవంతమైన పెద్దలు తమ ఆరోగ్యం కాపాడుకోవాలంటే ప్రజల ఆరోగ్యం కాపాడాలి’’ గిడుగు ప్రతి మాటలో ప్రపంచ చరిత్రని, ప్రజల ఉద్యమాలని చదివి జీర్ణించుకున్న విజ్ఞత తొణికిసలాడింది. ఆయన ఎవ్వరిపైనా వ్యక్తిగత ద్వేషం కలిగి ఉండేవారు కాదు. అయితే సత్యం చెప్పేటప్పుడు మొహమాట పడకూడదు అన్నది వారి నియమం.
      ఆయన జీవితం కేవలం తెలుగు జాతికే కాక ద్రావిడ భాషతో ఏమాత్రం పోలిక లేని సోర (శబర) భాషను ఆద్యంతం పరిశీలించి ఔపోసన పట్టారు. సవరభాషకి లిపి రూపొందించి వాళ్లని కూడా విద్యావంతుల్ని చేయాలని తపన పడిన మహనీయుడు, నిగర్వి. ప్రజాహితమే తప్ప ఇతర ఫలాపేక్ష లేని ఈ మహనీయునికి కళాప్రపూర్ణ, కైజర్‌-ఇ- హింద్, మహామహోపాధ్యాయ, రావుబహుద్దూరు వంటి బిరుదులు వరించి వాటికే గౌరవం ఆపాదించుకున్నాయి.
      సంప్రదాయంపైన గౌరవమున్న వారిపై సమాజం విధించిన వెలిని ఎదిరించి విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన శిష్యుని ఇంట్లో విందు చేశారు. కొండల్లో నివసించే సవరలతో స్నేహం చేసి వారి నిష్కపట జీవన శైలిని అధ్యయనం చేశారు. అస్పృశ్యత పాటించడం ఒక కళంకమని భావించారు. ఒక విశ్వప్రేమికుడిగా, సత్యశోధకుడిగా సాగిన ఆయన లోతైన పాండిత్యం సాగరమైతే విశాలమైన తన హృదయం గగనం. తుది శ్వాస వరకు తాను నిర్మించుకున్న నైతిక పరిధిలో జీవించారు.
      గిడుగు వ్యక్తిగత జీవితం, సాహిత్య శోధన రెండూ పెనవేసుకొన్న  దైనందిన జీవితంలో కూడా  సత్యశోధన ప్రస్ఫుటిస్తూ ఉండేది. పాండిత్యానికి, ప్రవర్తనకూ సమన్వయం సాధించుకున్న ఆయన ఉదాత్త వ్యక్తిత్వం మా నాయనమ్మ చెప్పిన కొన్ని కొన్ని ముచ్చట్ల ద్వారా విని ఆనందించే భాగ్యం మాకు కలిగింది. గిడుగు రామ్మూర్తి పంతులు నిరాడంబరంగా ఉండేవారట. ఆయన ప్రతీ మనిషిని ప్రేమించేవారు. మనసులో ఒకటి మాటల్లో మరొకటి లేకుండా నిష్కల్మషంగా సాగిన ఆయన జీవితంలో సత్యాన్ని చెప్పేటప్పుడు నిష్కర్షగా చెప్పేవారట.
      ప్రతి ఇంట్లో ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషని విస్మరించకుండా ఉండాలి. భాష నిత్యం ప్రవహించే స్రవంతి. జీవనదిలా ప్రవహించే గోదావరి. నన్నయ నాటి గోదావరే ఇప్పుడూ ఉన్నా అందులో నీరు నిత్యం మారుతూనే ఉంటుంది. పాతనీరు పోయి కొత్తనీరు వచ్చి చేరుతూనే ఉంటుంది. భాష కూడా మార్పులకు గురవుతూనే ఉంటుంది. రానురాను కొన్ని పదాల అర్థం మారుతూ వస్తుంది. భాష నిలువ నీటి మడుగుగా మారితే అది సజీవ భాష కాదు అనే చెప్పాలి. అటువంటి పరిస్థితి ఏ భాషకి కలుగకూడదు.
      ఇలా వారి గురించి ఎన్నో ముచ్చట్లు వారి వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. ఆయన పుట్టినరోజును (ఆగస్టు 29) ‘మాతృభాషా దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. వారి సేవని తెలుగు పదం, తెలుగు భాష ఉన్నంత వరకూ తెలుగు జాతి స్మరిస్తూనే ఉంటుంది. 

***


వెనక్కి ...

మీ అభిప్రాయం