నలుగురు కుర్రాళ్లు కలిస్తే పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటారనుకుంటాం. కానీ ఆ కబుర్లనుంచే ఓ మంచి ఆలోచన స్ఫురించి... సమాజానికి ఉపయోగపడే కార్యంగా మారితే నిజంగా అబ్బురమే! మన అమ్మభాషకు సాంకేతిక తళుకులు అద్దుతున్న ‘తెలుగు టెకి’ బ్లాగు ఇలా పురుడుపోసుకున్నదే. సాంకేతిక విషయాలన్నింటినీ తెలుగులో చెప్పడమే దీని లక్ష్యం.
ఏముంటాయిందులో...
ఈ బ్లాగులో యూట్యూబ్ డౌన్లోడు చిట్కాల నుంచి కొత్తఫోన్లపై సమీక్షల వరకు... అన్నీ తెలుగులో ఉంటాయి. ఆండ్రాయిడ్‌లో గూగుల్ అకౌంట్‌ను తీసేయడమెలా? ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ జీమెయిల్ అకౌంట్లను ఉపయోగించడమెలా? నెట్వర్క్ లేకుండా సందేశాలు పంపగలిగే పరికరం, గూగుల్ డొమైన్ సర్వీసులు, ప్రమాదకరమైన సర్వీసులకు పాస్వర్డ్లు మార్చమంటూ ఇచ్చే సలహాలు, ఇంకా మొబైల్ మారుస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర సమాచారమంతా చక్కగా మన భాషలోనే కనపడుతుంది. అంతేకాదు... ఈ సెకనులో అంతర్జాలంలో ఏం జరుగుతోందో తెలుసుకునే లింకును కూడా ఇందులో చేర్చారు. దాంతో సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఇంకా ఆన్లైన్ తెలుగు రేడియోలను కూడా తీసుకొచ్చి అందుబాటులో ఉంచారిక్కడ. అలాగే ‘టెక్ట్యూబ్’ అని యూట్యూబ్ ఛానెల్‌ను పెట్టారు. రాతలో కంటే దృశ్యాల్లో అయితే విషయం సులువుగా అర్థమవుతుంది అనుకున్న అంశాలను వీడియోలు తీసి ఉంచారు. మొత్తమ్మీద ఈ బ్లాగు అంతా తెలుగుమయమే.
ఇందులోకి వెళ్లేందుకు...http://telugutechy.blogspot.com/
నిర్మాతలు ఎవరు?
నెల్లూరు జిల్లా వాసి సుబ్రహ్మణ్యం. ఓరోజు తన స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు యూట్యూబ్ వీడియో డౌన్లోడు చేసుకోవడం గురించి చర్చ వచ్చింది. కేవలం రెండే రెండు అక్షరాలతో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని మిత్రులు చెబితే సుబ్రహ్మణ్యానికి ఆశ్చర్యమేసింది. నిజానికి సాంకేతిక అంశాలపై పూర్తిస్థాయిలో పట్టు లేకపోవడం వల్లే సామాన్య తెలుగు యువత ఇతరులతో పోటీ పడలేకపోతోందని, సాంకేతిక సమాచారాన్ని అందించే వివిధ వేదికలు ప్రధానంగా ఆంగ్లంలోనే ఉండటంవల్ల మనవాళ్లకు అవి ఉపయోగపడలేకపోతున్నాయన్న అంశమూ మిత్రుల మాటల్లో దొర్లింది. ఇలాంటి సాంకేతిక అంశాలను, చిట్కాలను తెలుగువాళ్లకు ఉచితంగా చేరవేయడానికి ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచించారు. అలా వారి ఆలోచనల్లోనుంచి పుట్టుకొచ్చిందే ఈ ‘తెలుగు టెకీ’ బ్లాగు. దీన్ని ఇప్పటి వరకూ 37,715 మంది చూశారు. బ్లాగు నిర్వాహకులకూ ఎన్నో ప్రశంసలనూ అందించారు. సాంకేతిక విషయాలను అమ్మభాషలో చెప్పే ఇలాంటి బ్లాగులు మరిన్ని వస్తే తెలుగుకు ఎంతో మేలు!