అన్ని చోట్లా అవే తంటాలు

  • 265 Views
  • 0Likes
  • Like
  • Article Share

పిల్లలకు భాషలు నేర్పే విషయంలో చాలా దేశాలు ఒకే తరహా తంటాలు పడుతున్నాయి. పదహారేళ్ల వయసు తర్వాత విద్యార్థుల్ని భాషను నేర్చుకునేందుకు ఆకర్షించడం సవాలుగా మారిందని ఇంగ్లాండు భాషోపాధ్యాయులు వాపోతున్నారని సీఎఫ్‌బీటీ విద్యా ట్రస్టు, బ్రిటిష్‌ కౌన్సిల్‌ నివేదిక తెలిపింది. దీనికి కారణం మాధ్యమిక పాఠశాలల్లో పరీక్షలు, ఉన్నత ప్రమాణాల కోసం ఒత్తిడి పెరగడం, గణితం, విజ్ఞానశాస్త్రాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుండటమేనని తాజా సర్వే సారాంశం. భాషా నైపుణ్యాల్లో పట్టున్నవాళ్లనే వాణిజ్యరంగం కోరుకుంటున్నప్పటికీ... గణితం, విజ్ఞానశాస్త్రాలతో పోల్చితే భాషలు అంత ముఖ్యం కాదనే నమ్మకం బలంగా ఉంది. ఇంగ్లాండులో అన్ని ప్రాథమిక పాఠశాలలూ విదేశీ భాషల్ని బోధిస్తున్నా... కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. దాంతో ఇంగ్లాండు బళ్లలో భాషా బోధన కష్టంగా మారిందని పరిశోధకులు అంటున్నారు. దీనిమీద దేశవ్యాప్తంగా 500 మాధ్యమిక, 600 ప్రాథమిక, మరో 120 ఇతర పాఠశాలల్లో ఆన్‌లైన్‌ సర్వే చేపట్టారు. దాదాపు సగం ప్రాథమిక పాఠశాలలు మొదటిదశలోనే విద్యార్థులకు భాషను పరిచయం చేస్తున్నాయి. జీసీఎస్‌ఈ, ఎ లెవెల్‌ స్థాయిలో స్పానిష్‌ నేర్చుకుంటున్న విద్యార్థుల సంఖ్య పెరిగింది. అయితే ఇది ఫ్రెంచ్, జర్మన్‌ తదితర భాషల తగ్గుదలను భర్తీచేసే స్థాయిలో లేదు. మాండరిన్‌ను అందిస్తున్న పాఠశాలల సంఖ్య ఓ మోస్తరుగా పెరిగింది. అయితే భాషల కోసం అదనంగా ట్యూషన్‌ పెట్టించుకోవడం లాంటి కారణాల వల్ల భాషల్ని నేర్చుకునే విషయంలో మినహాయింపులు పొందే ధోరణి పెరుగుతోందని ఈ అధ్యయనం గుర్తించింది. దీనికి ప్రోత్సాహమిచ్చిన బ్రిటిష్‌ కౌన్సిల్‌ ముఖ్య కార్యనిర్వాహకులు కైరాన్‌ డెవానే మాట్లాడుతూ ప్రస్తుతమున్న భాషా నైపుణ్యాల లోపం భవిష్యత్తులో తీవ్రమైన ప్రభావం చూపుతుందన్నారు. బడిలో భాష నేర్చుకోవడం మరీ విచారకర పరిస్థితిలో లేకపోయినా, భాష నేర్చుకునే ప్రక్రియకు మునుపటి గౌరవాన్ని, ప్రాధాన్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం