కాటన్‌కు వెన్నెముక

  • 409 Views
  • 0Likes
  • Like
  • Article Share

గోదావరి మీద ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టించింది ఎవరంటే... సర్‌ ఆర్థర్‌ కాటన్‌ అని తడుముకోకుండా చెప్పేస్తాం. గోదావరి జిల్లాలను ‘అన్నపూర్ణ’లా మార్చే క్రతువులో కాటన్‌దొరకు వెన్నెముకలా నిలిచిన ఇంజినీరు ఎవరు? దురదృష్టవశాత్తూ ఎక్కువ మందికి ఆ వ్యక్తి ఎవరో తెలియదు. చరిత్ర ‘చీకట్ల’లో కలసిపోయిన ఆయన పేరు... వీణెం వీరన్న. తనది కాని ప్రాంతంలో, తన భాష కాని వాళ్లతో అంత పెద్ద నిర్మాణ పనిని తలకెత్తుకున్న కాటన్‌కు తలలో నాలుకలా నిలిచారు వీరన్న. కాటన్‌కు ఆయన సాయం రాకపోతే ధవళేశ్వరం ఆనకట్ట ఎప్పటికి పూర్తయ్యేదో! గోదావరి పుష్కరాల నేపథ్యంలో వీరన్నను స్మరించుకోవడం తెలుగువాళ్లందరి కనీసధర్మం.
వీరరాఘవమ్మ,
కొల్లయ్య దంపతులకు 1794, మార్చి 3న వీరన్న జన్మించారు. తండ్రి కొల్లయ్య మచిలీపట్టణంలో బ్రిటిష్‌ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగి. దాంతో వీరన్నను తల్లితోపాటు రాజమండ్రిలో బంధువుల ఇంట్లో విడిచివెళ్లారు. అలా వీరన్న తన ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేసుకున్నారు. ధవళేశ్వరానికి చెందిన వెంకాయమ్మతో వీరన్నకు వివాహమైంది. వెంకటరత్నం, జనార్దనస్వామి, కొల్లయ్య, సీతారామస్వామి, బాపమ్మలు వాళ్ల సంతానం. 
      మచిలీపట్టణం ఆంగ్లోఇండియన్‌ కళాశాలలో ఉన్నత విద్యను పూర్తిచేసిన వీరన్న, తండ్రి సూచన మేరకు ఇంజినీరింగ్‌ చదివేందుకు బెంగాల్‌ వెళ్లారు. అప్పుడు ఆంగ్లేయుల ప్రధాన పాలన కేంద్రం కలకత్తానే. ఇంజినీరుగా శిక్షణ మాత్రం మద్రాసులో సాగింది. 1840 నాటికి రాజమండ్రి వచ్చి నీటిపారుదల శాఖలో ఉద్యోగ జీవితం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే... 1844లో గోదావరి పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చిన ఆర్థర్‌ కాటన్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి కాటన్‌కు సహాయకుడిగా వీరన్న కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కాటన్‌ నివాస వ్యవహారాలు, నౌకర్లు, ఆరోగ్య, ఆహార విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి వీరన్నే చూసుకున్నారు. తనకంటే వయసులో పెద్దవాడైన వీరన్నను కాటన్‌ సోదర సమానుడిగా గౌరవించారు.
      ప్రయాణ సౌకర్యాలు అంతగాలేని కాలంలో... కాటన్‌తోపాటు గోదావరి తీరం వెంబడి కాలినడకన, గుర్రాల మీద వెళ్తూ ఆనకట్ట నిర్మాణ పనులను పర్యవేక్షించారు వీరన్న. రాజమండ్రి నుంచి అటు గోదావరి పుట్టే త్య్రంబకం; ఇటు సముద్రంలో కలిసే వరకు దాదాపు 1500 కిలోమీటర్ల ఎగువ దిగువ పరివాహక ప్రాంతాల్లో కాటన్‌ విస్తృతంగా పర్యటించారు. ఆ సమయంలో ఆయన వెన్నంటి ఉన్నారు వీరన్న. భోజన సదుపాయాలు లేని మార్గాల్లో నెలల తరబడి ప్రయాణించిన ఈ జంట... అరటి, మామిడి, జామపండ్లు తింటూ, గోదావరి నీళ్లు తాగుతూ ముందుకు సాగిపోయేవారు.
      ఆనకట్ట నిర్మాణం సమయానికి తూర్పు- పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు కలిసి రాజమండ్రి జిల్లాగా ఉండేవి. బ్రిటిష్‌ కాలంలో దేశాన్ని ఎన్నో కరవులు పీడించాయి. ఓ వైపు గోదావరి, కృష్ణా నదుల నీళ్లు వృథాగా సముద్రంలో కలిసేవి. మరోవైపు ప్రజలు కరవుల బారినపడి తీవ్ర ఇక్కట్ల పాలయ్యేవాళ్లు. దాంతో ఈ నదుల నీళ్లను వ్యవసాయ అవసరాలకు వినియోగించుకునేలా చేయాలని సంకల్పించింది ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం. ఈ పనికి కాటన్‌ను నియమించింది. దీనికోసం ప్రణాళిక సిద్ధం చేసుకుని కాటన్‌తో కలిసి మారుమూల ప్రాంతాల్లో సంచరిస్తూ ఆయా ప్రాంతాల రైతులను చైతన్యపరిచారు వీరన్న.
మొక్కవోని పట్టుదల
ఆనకట్ట పనులు ప్రారంభమైన తొలినాళ్లలో గోదావరి జిల్లాల నుంచి పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఒడిశా, బెంగాల్‌ల నుంచి వందలమందిని ధవళేశ్వరానికి రప్పించారు. వాళ్లకు కావాల్సిన శిక్షణ ఇస్తూ రోజువారీగా చెల్లించే కూలీ డబ్బుల్ని నిక్కచ్చిగా ఇచ్చేవారు వీరన్న. ఇది గ్రహించిన గోదావరి ప్రజలే కాకుండా కృష్ణా, గుంటూరు శ్రామికులు కూడా తమంత తాముగా ఆనకట్ట నిర్మాణానికి ముందుకువచ్చారు. తన కుటుంబానికి ఉన్న పలుకుబడి పరిచయాలతో మన్యప్రాంతం కోయవారిని కూడా ఆనకట్ట పనులకు కూడగట్టారు వీరన్న. పనికి కొత్తయిన వాళ్లకు తగిన శిక్షణ ఇప్పించారు. కూలీలను ఉత్సాహపరిచేందుకు... పనిచేయని ఆదివారం కూలి సొమ్మును కూడా శనివారం సాయంత్రమే ఇచ్చేవాళ్లు. ఇది కూలీల్లో ఆనకట్ట నిర్మాణ అధికారులంటే విశ్వాసం పెరిగేలా చేసింది. శ్రామికుల కోసం గోదావరి తీరాన నివాసాలు ఏర్పాటు చేసి వాళ్ల ఆరోగ్య రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు వీరన్న. మొత్తానికి 1851 నాటికి పదివేల మందికి పైగా శ్రామికులను సమకూర్చి ఈ మహాయజ్ఞం పూర్తయ్యేలా చేశారాయన.
      1848, 1851లలో ప్రభుత్వం నుంచి సొమ్ము రావటం ఆలస్యమైనా పనులు ఆగకుండా శ్రామికులను ఉత్తేజపరిచారు. వారికి కూలీ సొమ్ము చెల్లించి అటు అధికారులు, ఇటు శ్రామికులు ఒకరికొకరు సహకరించుకునేలా చేశారు. అప్పట్లో గోదావరి తీరపు జమీందారుల్లో కొంతమంది అభివృద్ధి వ్యతిరేకులు ఉండేవాళ్లు. దీనికితోడు ఆనకట్ట నిర్మాణానికి కంకణబద్ధులైన కాటన్, వీరన్నలపట్ల ఆంగ్లేయ అధికారులకు అసూయ ఏర్పడింది. దాంతో వాళ్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసేవాళ్లు. వీటివల్ల ఒకానొక సందర్భంలో ఆనకట్ట నిర్మాణం ఆగిపోయిందనే వదంతులు కూడా వచ్చాయి. అలాంటి సమయంలోనూ వీరన్న, కాటన్‌ల మీద ఉన్న గౌరవం, విశ్వాసం శ్రామికులతో ఏ ఆటంకాలు లేకుండా పనిచేయించింది. ఇదంతా గమనించిన ప్రభుత్వం తన అభిప్రాయాన్ని మార్చుకుని ఆనకట్ట నిర్మాణానికి కావాల్సిన డబ్బు, ముడిసరకులను ఎప్పట్లా సరఫరా చేసింది. చివరికి 1852 మార్చి 31 నాటికి పని పూర్తయింది. ఆనకట్ట పూర్తయ్యాకే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పేర్లు వాడుకలోకి వచ్చాయి.
శ్రమకు గుర్తింపు
వీరన్న సహకారం, కృషి, పట్టుదల, నిజాయతీ, అంకితభావం కారణంగానే తన కల నెరవేరిందని గ్రహించిన కాటన్‌ ఆంగ్లంలో స్వదస్తూరితో ‘శ్రీ వీణెం వీరన్న అనే హైందవ పురుషోత్తముడు నాకు లభించకుండా ఉండి ఉంటే, నేను అనుకున్నట్లుగా ఇంతవేగంగా గోదావరి ఆనకట్టను పూర్తిచేయలేక పోయేవాణ్ని’ అని రాసుకున్నారు. ఇంతేకాకుండా వీరన్న శ్రమకు ప్రతిఫలంగా... ఆయనకు ఇంకా ఏదైనా మేలు చేయాల్సిందిగా ఈస్టిండియా కంపెనీని, విక్టోరియా మహారాణిని అభ్యర్థించారు. ఫలితంగా కంపెనీ ఆనకట్టకు సమీపంలో ఉన్న మెర్నిపాడు గ్రామశిస్తును (ఆ రోజుల్లో రూ.500కు పైగా) వీరన్నకు శాశ్వతంగా దఖలుపరిచింది. అంతేకాదు ఆయనకు ‘రాయబహుదూర్‌’ బిరుదునిచ్చి సత్కరించింది.
      ఆనకట్ట నిర్మాణ సమయంలో అనేక పర్యాయాలు కాటన్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆస్ట్రేలియా, లండన్‌లకు నెలల తరబడి వెళ్లేవారు. అయినా వీరన్న కూలీలను సమన్వయపరుస్తూ నిర్మాణ పనులు సమర్థంగా నిర్వహించారు. నిర్మాణ సమయంలోనూ, అనంతరం కురిసిన వర్షాల కారణంగా గోదావరికి వరదలు వచ్చి... చిన్నాపెద్ద ప్రమాదాలు వచ్చి పడినా సకాలంలో ప్రభుత్వం ఆనకట్టకు తగిన మరమ్మతులు చేపట్టేలా చేశారాయన.
      1852లో ఆనకట్ట నిర్మాణం పూర్తయిన నాటినుంచి 1867లో మరణించేవరకు ధవళేశ్వరం హెడ్‌లాక్‌ క్వార్టర్సే వీరన్న చిరునామాగా ఉంది. ఆయన కోరిక మేరకు నేటి ధవళేశ్వరం హెడ్‌లాక్‌ ప్రాంతంలోనే ఆయన పార్థివ దేహానికి దహన సంస్కారాలు జరిపి అస్తికలను గోదావరిలో నిమజ్జనం చేశారు. అంతేకాదు ఆయనను దహనం చేసిన ప్రాంతంలో ఉన్న రాతిగోడ మీద వీరన్న పేరును ఆంగ్లంలో ‘వి.వీరన్న, రాయ్‌బహుదూర్, సబ్‌ఇంజినీర్, 1867’ అని చెక్కించారు అప్పటి ఆనకట్ట ఉద్యోగులు. ఇప్పుడు ఈ ప్రదేశం పిచ్చిమొక్కలతో నిండిపోయింది. 1940లో బులుసు సాంబమూర్తి కాటన్‌ విగ్రహం దగ్గరే వీరన్న వివరాలు తెలిపే శిలాఫలకాన్ని చెక్కించారు. 1986లో వచ్చిన వరదలో కాటన్‌ విగ్రహంతోపాటు ఈ శిలాఫలకం కూడా కొట్టుకుపోయింది. 1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రోద్బలంతో ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నిర్మించిన ‘కాటన్‌ మ్యూజియం’లో వీరన్న చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడది మసకబారిపోయింది. తనకెంతో సాయమందించిన వీరన్నను కాటన్‌ మరచిపోలేదు. కానీ మనం మర్చిపోయాం.
      తెలుగువారి ఆప్యాయతాభిమానాలకు, నీతి నిజాయతీలకు, నిస్వార్థ, త్యాగ గుణాలకు నిలువెత్తు నిదర్శనం వీరన్న. ఆయన జీవితచరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చడంతో పాటూ గోదావరి తీరంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలి. అన్నం పెట్టిన మనిషిని గౌరవించడమంటే... మనల్ని మనం గౌరవించుకోవడమే కదా.


వెనక్కి ...

మీ అభిప్రాయం