ఎండల్లో చల్లగా!

  • 130 Views
  • 5Likes
  • Like
  • Article Share

    డాక్టర్‌ జి.వి.పూర్ణచందు

  • విజయవాడ
  • 9440172642
డాక్టర్‌ జి.వి.పూర్ణచందు

‘ఎండాకాలంలో తరవాణీ కుండలోంచి చద్దన్నం దేవుకు తింటే కడుపులో ఎంతచల్లగానో వుంటుంది’... అంటారు తనికెళ్ల భరణి. నిజంగానే ‘చద్దన్నం మూట’ లాంటి మాట ఇది. ‘చల్లకొచ్చి ముంత దాచడమెందుకు’ గానీ నేరుగా విషయంలోకి వెళ్లిపోదాం! వేసవిలో వెర్రెత్తినట్టు భగభగలాడే భానుడి నుంచి మనల్ని మనం కాచుకోవాలంటే మజ్జిగ కవ్వానికి పని చెప్పాల్సిందే. చల్దన్నాన్ని ఆరగించాల్సిందే.
శివరాత్రికి
శివ శివా అని చలి వెళ్లిపోతుంది. ఉగాది నాటికి భుగభుగ మండుతూ ఎండలొచ్చేస్తాయి. అసలే తెలుగు వాళ్లకు వేడి శరీరతత్త్వం ఎక్కువ. అంతలోనే వేడెక్కే ఆరంభ శూరత్వం ఇందుకే మరి! పైగా మనది వేడి వాతావరణం! అది చాలదన్నట్టు, వేసవి ఎండల్లో కొత్తావకాయ పెట్టుకుని ప్రతిరోజూ రుచి చూసుకోవటంతోనే సరిపోతుంది. ఇన్ని రకాలుగా వేడి దాడిచేస్తున్నప్పుడు... ఆ దెబ్బకు తట్టుకోలేనంటూ శరీరం చేసే ‘వేడికోలే’ ‘వడదెబ్బ’ అంటే! ఆ వడని లేదా వేడిని తగ్గించే బ్రహ్మాస్త్రమే ‘చల్ల’ (మజ్జిగ)! అమ్మకడుపు చల్లగా, అయ్య కడుపు చల్లగా, అందరి కడుపూ చల్లగా చేసేది ‘చల్ల’. వేసవిలో చల్లగా జీవించాలంటే ‘చల్ల’ తాగాల్సిందే.
      తెలుగులో ‘చల్ల’ అనేది అత్యంత ప్రాచీన పదం. మూలద్రావిడ పదం ‘సల్‌’ లోంచి ‘చల్ల’ (మజ్జిగ), ‘చల్‌’ లోంచి ‘చల్ల’ (‘చల్ల’నైన) వచ్చాయి. ‘చల్ల’ని ఇతరులకన్నా తెలుగువాళ్లే ఎక్కువగా తాగుతారు. తెలుగు కృష్ణుడు ‘చల్ల’లమ్మటానికి వెళ్లే భామల్నే అడ్డగించాడని కవులు రాశారు. ఈ రోజుల్లో అతిథులకు కాఫీ, టీలు ఇస్తున్నాంగానీ, పూర్వం గ్లాసు ‘చల్ల’ తెచ్చి ఇచ్చేవాళ్లు. ఇక చలివేంద్రాలంటే ‘చల్ల’ నింపిన కుండలు ఉండేవి! చలిపందిరి, చలివందిరి, చలివంద్రి, చలివెందర, చలివేందల, చలివేంద్రం... ఈ పదాలన్నింటికీ ‘చల్ల’ అందించే పందిరి అనే అర్థం. ‘చల్ల’ ఇచ్చి, ‘కాస్త దాహం పుచ్చుకోండి’ అనేవాళ్లు. అలా ‘చల్ల’కు పర్యాయపదమైంది ‘దాహం’! 
చలవనిచ్చేది ‘చల్ల’
‘‘మంచుకొండల్లో పాలు తోడుకోవు. అందుకని, అక్కడ పెరుగు లేదా చల్ల దొరికే అవకాశాల్లేక కైలాసవాసి శివుడికి, ‘చల్ల’ తాగే అలవాటు లేకుండా పోయింది. అందుకని ఆయన నీలకంఠుడయ్యాడు. పాలసముద్రం మీద పవళించే విష్ణుమూర్తికి ‘చల్ల’ దుర్లభం. కాబట్టి, ఆయన నల్లని వాడయ్యాడు. స్వర్గంలో ‘సుర’ తప్ప ‘చల్ల’ దొరక్కపోవటంతో ఇంద్రుడు బలహీనుడయ్యాడు. చల్ల పుచ్చుకునే అలవాటే ఉంటే, చంద్రుడికి క్షయవ్యాధి, వినాయకుడికి స్థూలకాయం, కుబేరుడికి కుష్ఠురోగం, అగ్నికి కాల్చే గుణం వచ్చేవే కాదు’’ అని ‘యోగరత్నాకరం’ వైద్యగ్రంథంలో చమత్కారంగా చెప్పారు. దీని భావం ఏంటంటే... మజ్జిగ తాగేవాడికి ఏ జబ్బులూ రావు. అరుదుగా వచ్చినా త్వరగా తగ్గుతాయి. తిరిగిరాకుండా ఉంటాయి. విషదోషాలు, దుర్బలత్వం, చర్మరోగాలు, క్షయ, స్థూలకాయం, అమిత వేడి తగ్గిపోతాయి. శరీరానికి మంచి రంగు కలుగుతుంది. మరి మజ్జిగా మజాకా! 
      ‘తక్రం త్రిదోష శమనం రుచి దీపనీయం’ అని ఆయుర్వేద సూత్రం. వ్యాధులకు కారణమయ్యే దోషాలను ఉపశమింప చేసే గుణం ‘చల్ల’కుంది. అన్న హితవు కలిగిస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. తీసుకున్న ఆహారం చక్కగా అరిగేలా చేస్తుంది. శరీరానికి సుఖాన్నీ, మనసుకు సంతృప్తినీ కలిగిస్తుంది. కానీ, రానురానూ ‘చల్ల’ తాగే అలవాటు తగ్గిపోతోంది. పెరుగుని చాలామంది చిలకటం మానేశారు. చల్లకవ్వం, చల్లబుడ్డి (చల్లగిన్నె), చల్లపులుసు, చల్లచారు (మజ్జిగచారు), పెరుగు పచ్చడిలాంటివి ఈ తరానికి తెలియకుండా పోతున్నాయి. అంతేకాదు, ఫ్రిజ్జులో పెట్టిన అతి చల్లని ‘పెరుగు’ తింటే చక్కెర వ్యాధి పెరుగుతుందని ఆయుర్వేద శాస్త్రం హెచ్చరించింది. 
      కొద్దిగా ‘చల్ల’ కలిపితే, పాలు తోడుకుని పెరుగు అవుతుంది. పాలలో ఉన్న పోషకాలన్నీ పెరుగులోనూ ఉంటాయి. అదనంగా మన శరీరానికి ఉపయోగపడే ‘లాక్టోబాసిల్లై’ అనే బాక్టీరియా కూడా ఉంటుంది. పెరుగుని చిలికితే దానికి తేలిగ్గా అరిగే స్వభావం (లఘుత్వం) కలుగుతుంది. అందుకని, పాలకన్నా పెరుగు, పెరుగుకన్నా ‘చల్ల’ ఉత్తమోత్తమంగా ఉంటాయి. ఫ్రిజ్జులో పెడితే, అందులో ఉండే ‘ఉపయోగపడే బాక్టీరియా’ నిస్తేజం అవుతుంది. బయటే ఉంచి, ఏ పూటది ఆ పూటగా వాడుకుంటే పెరుగు, మజ్జిగ ఎక్కువ మేలు చేస్తాయి. మజ్జిగ తాగితే కడుపులో ఆమ్లాలు పలచబడతాయి. గ్యాసు, ఉబ్బరం, పేగుపూత, అమీబియాసిస్, టైఫాయిడ్, మొలలు, మలబద్ధత, పేగుల్లో వచ్చే వ్యాధులు త్వరగా తగ్గుతాయి. శస్త్రచికిత్సలు అయినవారూ, మానని వ్రణాలతో బాధపడేవారూ మజ్జిగ జోలికి పోతే చీము పోస్తుందనుకోవడం ఒట్టి అపోహ. పుండు తొందరగా మానుపడాలంటే ‘చల్ల’ తాగాలి!
పొద్దున్నే చల్దన్నం
‘చల్ల’ కలిపిన అన్నాన్ని చల్ది అన్నం, చల్దన్నం, చద్దన్నం అంటారు. పొద్దున్నే చద్దన్నం తినేవారికి భోగం ఎక్కువ. టిఫిన్లు చేసేవారికి రోగం ఎక్కువ. పిల్లలకు చద్ది పెట్టటం మానేసి టిఫిన్లు అలవాటు చేస్తే బలంగా ఎదగలేరు! చల్లన్నం రోజూ తింటే ఎంతటి శ్రమనైనా తట్టుకునే శక్తి వస్తుంది. వడదెబ్బ తగలకుండా అది నివారిస్తుంది. 
చద్దన్నం అంటే, కూలీనాలీ చేసుకొనేవాళ్లు తింటారనే చిన్నచూపు ఉంది చాలామందిలో! దానికి తగ్గట్టు... చద్దన్నానికి తెలుగు నిఘంటువులు ‘పర్యుషితాన్నం’ (పాచిన అన్నం) అనే అర్థం ఇచ్చాయి. ఇది అన్యాయం. గోపబాలురు బాలగోపాలుడి చుట్టూ పద్మంలో రేకుల్లా కూర్చుని చద్దన్నం తిన్నారని పోతన వర్ణించాడు. ‘మీఁగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్దడాపలి చేత మొనయ నునిచి/చెలరేగి కొసరి తెచ్చిన యూరుఁగాయలు వ్రేళ్ల సందులను దా వెలయ నిఱికి’ - నానా అల్లరీ చేసి తెచ్చుకున్న ఊరగాయ ముక్కల్ని వేళ్లతో పట్టుకొని మీగడ పెరుగు మేళవించిన చల్దిముద్దలో నంజుకు తిన్నారట! చద్దన్నం అంటే ఇది! పోతన మహాకవి చెప్పిన ఈ పద్ధతిలో చల్దన్నం/ పెరుగన్నం పెట్టి పెంచితే... దేశానికి ఉపయోగపడేవాళ్లుగా ఎదుగుతారు చిన్నారులు.
      గ్రామ దేవతలకూ, దసరా నవరాత్రులలో అమ్మవారికీ, ఇతర ఉగ్ర దేవతలకు ‘చద్ది నివేదన’ అంటే వేడి అన్నంలో చిక్కని చల్ల కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఉగ్రత్వం శాంతించటానికే ఈ చద్ది నివేదన పెడతారు. అందుకే ఇది చల్లన్నం. వైష్ణవాలయాల్లో దధ్యోదనం అంటే పెరుగన్నంలో మిరియాలు, అల్లం, మిర్చి వగైరా కలిపి తాలింపు పెట్టి తయారు చేసిన పెరుగు అన్నాన్ని నైవేద్యం పెడతారు. చద్దన్నంలో ఈ తాలింపులుండవు. ఇదీ ఈ రెండింటికీ తేడా!
      ‘అయ్యా! మీరు చల్దివణ్ణం తింటారా...?’ అనడుగుతుంది ‘కన్యాశుల్కం’లో బుచ్చమ్మ. చల్దివణ్ణం అంటే, చల్ల కలిపిన అన్నం. ఇంట్లో పెద్దవాళ్లు కూడా అనుష్ఠానాలయ్యాక ఉదయం ఉపాహారంగా చల్ది తినేవారు. దాంతో కడుపులో చల్లగా,  దండిగా ఉంటుంది. వడదెబ్బ కొట్టకుండా కాపాడుతుంది. రక్తపుష్టినిస్తుంది. కామెర్లు, వాతవ్యాధుల్ని తగ్గిస్తుంది. జీర్ణశక్తినీ పెంచుతుంది! బియ్యాన్ని వేయించి వండితే, జ్వరం సహా అన్ని వ్యాధుల్లోనూ పెట్టదగిందిగా ఉంటుంది! చక్కెర రోగులూ, స్థూలకాయులూ బియ్యానికి బదులుగా రాగి, జొన్న, సజ్జల్ని చల్లన్నంలా తీసుకోవచ్చు!
ఇలా తినేద్దాం!
వేడి అన్నంలో ‘చల్ల’ పోసుకుని తినవచ్చు. రాత్రి వండిన అన్నాన్ని తెల్లవార్లూ మజ్జిగలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవచ్చు. లేదా రాత్రి వండిన అన్నాన్ని ఓ చిన్న గిన్నెలోకి తీసుకుని... అది మునిగే వరకూ పాలు పోసి, నాలుగు ‘చల్ల’ చుక్కలు వేసి, తోడు పెట్టి ఉదయాన్నే ఎంగిలి పడవచ్చు. తాలింపు పెట్టి, ఉల్లి ముక్కలు, టొమాటో, కేరట్‌లాంటివి కూడా కలుపుకుని ఆరగించవచ్చు.
‘చల్ల’లో నానబెట్టిన అన్నం అన్నింటికన్నా తేలికగా అరుగుతుంది. అన్నంలో ‘చల్ల’ కలిపిన దానికన్నా రాత్రంతా ‘చల్ల’లో నానిన అన్నంలో సుగుణాలెక్కువ! బక్కచిక్కిపోతున్న వారికి తోడన్నాన్నీ, స్థూలకాయులకు ‘చల్ల’లో నానిన అన్నాన్ని పెట్టడం మంచిది. జీలకర్ర, ధనియాలు, శొంఠి సమానంగా తీసుకొని మెత్తగా దంచి, తగినంత ఉప్పు కలిపిన పొడిని ఈ తోడన్నం లేదా ‘చల్ల’న్నంలో నంజుకొని తింటే, దోషాలు లేకుండా ఉంటాయి. తెలివితేటలు, జ్ఞాపకశక్తీ పెరుగుతాయి.
నోరూరించే ‘రసాల’
శ్రీరాముడు తన ఆశ్రమానికి వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి ఇచ్చిన విందు పట్టికలో ‘రసాల’ అనే పానీయం ఉంది. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడోసారి శ్రీకృష్ణుడు వచ్చాడు. ఎండన పడి వచ్చాడని భీముడు స్వయంగా ఈ ‘రసాల’ను తయారు చేసి ఇచ్చాడట! ఇది దప్పికని పోగొట్టి, వడ దెబ్బ తగలకుండా చేస్తుంది. ఈ పానీయం తయారీని ‘భావ ప్రకాశ’ వైద్య గ్రంథం వివరిస్తుందిలా... 
      ముందు బాగా కడిగిన ఓ చిన్న ముంత తీసుకోవాలి. పలుచని వస్త్రాన్ని రెండు మూడు పొరలు వేసి, ఆ ముంత మూతికి వాసెన కట్టాలి. పలుచని పెరుగులో సగభాగం పంచదార కలిపి, ఈ మిశ్రమాన్ని ‘చల్ల’కవ్వంతో బాగా చిలికి, ఆ వాసెన మీద పోయాలి. దాంతో పెరుగునీరంతా కుండలోకి దిగుతుంది. ఈ పెరుగు నీటిని ‘ద్రప్యం’ అంటారు. దీన్నిండా లాక్టోబాసిల్లస్‌ అనే ఉపకారక సూక్ష్మజీవులు ఉంటాయి. అవి పేగుల్ని సంరక్షించి జీర్ణాశయాన్ని బలసంపన్నం చేస్తాయి. ఈ ‘ద్రప్యా’నికి రెట్టింపు కొలతలో కాచిన పాలు కలిపి, ‘చల్ల’కవ్వంతో మళ్లీ చిలకాలి. మిరియాల పొడి, ఏలకుల పొడి, లవంగాల పొడి తగుపాళ్లలో కలపాలి. కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేయవచ్చు. 
      ఈ రసాల పానీయం శరీరంలో వేడిని తగ్గిస్తుంది. తక్షణ శక్తినిస్తుంది. కామెర్లలో తీసుకోదగిన పానీయమిది. అమీబియాసిస్, పేగుపూత, రక్త విరేచనాలు, కలరా వ్యాధులున్న వారిక్కూడా ఇవ్వదగినదే. అన్నట్టు, వాసెన మీద మిగిలిన పెరుగు ముద్దని విడిగా అన్నంలో పెరుగులా వాడుకోవచ్చు! చిలికి మజ్జిగ చేసుకోవచ్చు. పెరుగు మీద తేరిన తేటకు వినికిడి శక్తి పెంచే గుణం ఉంది. చెవిలో హోరు (టినిటస్‌), తలతిరుగుడు (వెర్టిగో) లాంటి వ్యాధులకు ఇది గొప్ప ఔషధం.
‘కూర్చిక’ తెలుసా?
గ్లాసు పాలను కాచి చల్లార్చాలి. వాటిలో రెండు గ్లాసుల పుల్లని పెరుగు కలిపి బాగా చిలికితే... అదే ‘కూర్చిక’. గ్లాసు ‘కూర్చిక’లో చెంచా ‘ధనియాలు, జీలకర్ర, శొంఠిపొడి’ని కలిపి తాగితే వడదెబ్బ కొట్టదు. పైగా పేగులకు బలాన్నిస్తుంది. జీర్ణకోశ వ్యాధులన్నింటికీ మేలు చేస్తుంది. వేసవిలో కలిగే జలుబుని నివారిస్తుంది.
అటు తీపి... ఇటు కారం
‘తేమనం’ అనేది శ్రీనాథుడి కాలం వరకూ ప్రసిద్ధి చెందిన ఓ తెలుగు వంటకం. దీన్ని రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు. 
తీపి తేమనం: చిక్కని మజ్జిగలో సమానంగా పాలు, తగినంత బెల్లం కలపాలి. దాంట్లో కొద్దిగా మిరియాలపొడి వేసి బాగా పొంగు వచ్చేవరకూ కాయాలి. కలియబెడుతూ విరక్కుండా చూసుకోవాలి. చిటికెడంత తినే సోడాఉప్పు కలపవచ్చు. ఇదే తీపి తేమనం. ఇది వేసవి పానీయాలలో మేలైంది. వడదెబ్బ వల్ల కలిగే శోషని నివారిస్తుంది. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. దీన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. నిలవుంచకూడదు. 
కారం తేమనం: ఇది ఓ రకమైన ‘చల్ల’పులుసు. ముందు చిక్కని ‘చల్ల’ తీసుకోవాలి. వెన్న తీసిన ‘చల్ల’ అయితే మరింత రుచికరంగా ఉంటుంది. అల్లం, మిర్చి, కొత్తిమీర, ఇతర సంబారాలు ఇందులో వేసి కాయాలి. ఈ ‘చల్ల’పులుసు బాగా చలవ చేస్తుంది. 
      బియ్యప్పిండి, అల్లం తదితర సంబారాలు చేర్చి ఉండలు కట్టి ఈ ‘చల్ల’ పులుసు(మోరు/మోరు కొళాంబు)లో వేసి ఉడికించే అలవాటు కొన్ని కుటుంబాల్లో ఉంది. ఉత్తర రామచరితంలో ‘గారెలు బూరెలు చారులు మోరెలు’ ప్రయోగాన్ని చూస్తే... ఈ ఉండల్ని ‘మోరులు’/ ‘మోరుండలు’ అని పిలిచేవాళ్లు కాబోలు! ఈ మోరుండల్ని ఆవడల్లాగా ఓ కప్పులో పెట్టుకుని తినవచ్చు. 
మెంతిచల్లతో మేలెంతో
మెంతుల్ని దోరగా వేయించి, పైపైన నూరి, చిక్కని పులవని ‘చల్ల’లో కలిపి తాలింపు పెడితే, అదే ‘మెంతిచల్ల’! కొన్ని ప్రాంతాల్లో ‘చల్లచారు’ అని కూడా పిలుస్తారు. దీన్ని అన్నంలో ఆదరవుగా తినవచ్చు. విడిగా తాగవచ్చు కూడా! చల్లకు బదులుగా ‘చల్ల’చారుని అన్నంలో కలుపుకుని తింటే మంచి చలవనిస్తుంది. వడదెబ్బ తగలదు. ముఖ్యంగా చక్కెర వ్యాధి ఉన్నవారికీ, అది వచ్చే అవకాశాలు ఉన్నవారికీ ‘మెంతిచల్ల’ మంచి చేస్తుంది.
సిగరి అంటే లస్సీ
‘చల్ల’లో పంచదార లేదా తేనె కలిపిన పానీయమే లస్సీ! నిమ్మరసం, జీలకర్ర పొడి, ఉప్పు, పంచదార కలిపి పుదీనా ఆకులు వేసిన లస్సీ వడదెబ్బ తగలకుండా చేస్తుంది. తెలుగులో దీన్ని ‘సిగరి’ అంటారు. శిఖరిణి అనే సంస్కృత పదానికి ఇది తెలుగు రూపమేమో! చిక్కని ‘చల్ల’ను లస్సీ అంటారు. వెన్న తీసేసి, నీళ్లు ఎక్కువ కలిపి, వాము, జీలకర్ర, కరివేపాకు, అల్లం వగైరా కలిసిన మజ్జిగని ‘దాస్‌’ అంటారు.
తేరిన తేటతో...
‘చల్ల’ మీద తేరిన తేటకు కొన్ని ప్రత్యేమైన గుణాలున్నాయి. చిలికిన మజ్జిగని ఒక గిన్నెలో సగానికి పోయాలి. దానికి మూడొంతుల వరకూ నీళ్లు కలిపి రెండు గంటలు కదల్చకుండా ఉంచాలి. ‘చల్ల’ మీద ఆ నీరు తేరుకుంటుంది. ఆ తేటని మంచినీళ్లకు బదులుగా తాగుతూ ఉంటే వడదెబ్బ కొట్టదుగాక కొట్టదు.
      ఎండలోకి వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ముందు చక్కగా చిలికిన ‘చల్ల’లో ఓ నిమ్మకాయ పిండాలి. దానికి తగినంత ఉప్పు, చక్కెర, చిటికెడంత తినే సోడా ఉప్పు కలపాలి. దీన్ని తాగి మిట్టమధ్యాహ్నం పూట బయటకు వెళ్లినా వడదెబ్బ కొట్టదు. మరీ ఎక్కువ ఎండ తగిలిందనుకొంటే తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ ఒకసారి తాగాలి. ఎండలో ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు... ఓ సీసానిండా దీన్ని తయారు చేసుకుని వెంట తీసుకెళ్లడం ఉత్తమం. 
      నడి వేసవిలో గుమ్మం దాటేముందు... ‘కాస్త మజ్జిగ తాగి పోరా’ అని బామ్మో, తాతయ్యో అంటే - ‘వాళ్లదో చాదస్తం’ అనుకోవడం మానెయ్యాలి. అది చాదస్తం కాదు... అనుభవం నేర్పిన ఆరోగ్య సూత్రం.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  తెలుగు రుచులు