లఘుచిత్ర లహరి

  • 946 Views
  • 7Likes
  • Like
  • Article Share

పదకొండు నిమిషాల ముప్ఫై మూడు సెకన్ల ఓ లఘుచిత్రానికి యూట్యూబ్‌లో 4.5 లక్షల ‘హిట్లు’... పైగా ‘కామెంట్ల’ కెరటాలు ఉవ్వెత్తున ఎగిశాయి. అలా అభిప్రాయాలు పంచుకున్న వారిలో నూటికి తొంభైమంది యువతే. వాళ్లకు అంతగా నచ్చిందంటే ఆ చిత్ర కథ ఏమై ఉంటుంది?
ప్రేమ? తాగి తందనాలాట? బూతు కామెడీ? అశ్లీలం? అబ్బెబ్బే... అలాంటివేమీ కాదు! మనమసలు ఊహించలేనిది... తెలుగు. అవును... తెలుగు భాషే!
      పతాక సన్నివేశాల్లో వినపడే సంభాషణ ‘తెలుగు వాళ్లం అయ్యుండి కూడా తెలుగులో మాట్లాడటానికి సిగ్గు’... ఇదే ఆ చిత్ర కథాంశం! ఆంగ్లం మీద మోజును వ్యంగ్యంగా... అదీ యువత భాషలో సూటిగా చెబుతూ తీసిన చిత్రమే ‘తరుణ్‌ ఫ్రమ్‌ తెలుగు మీడియం’. ‘ఇంగ్లీష్‌ రాకపోతే ఎంగిలాకులు ఏరుకునేవాడికన్నా దారుణంగా చూస్తోందిరా’, ‘అదే ఇంగ్లీష్‌లో మాట్లాడితే వాడేదో పెద్ద తోపు అని మీ ఫీలింగ్‌’... ఇలాంటి సంభాషణలతో సాగే ఈ చిత్రం ఆలోచింపజేస్తుంది. 
      ఆంగ్లం రాని ఓ తెలుగు అబ్బాయి... ఆంగ్లంలో మాట్లాడే తెలుగు అమ్మాయిని ప్రేమించడం... ఆ అమ్మాయిని ‘ఇంప్రెస్‌’ చేయడానికి వచ్చీరాని ఆంగ్లంలో మాట్లాడుతూ దెబ్బలు తినడం... చివరికి అతనికి పొట్టకోస్తే ఆంగ్లం ముక్కలేదని తెలుసుకుని అమ్మాయి వదిలేసిపోవడం... ఇదీ కథ. అమ్మాయి దూరమైన ఆర్నెల్లలో మనవాడు ఆంగ్లం నేర్చుకుని సాధికారికంగా మాట్లాడతాడు. తర్వాత కలిసిన అమ్మాయికి తెలుగులో తలంటుతాడు. నేర్చుకుంటే ఆంగ్లం ఎవరికైనా వస్తుంది కానీ, మనసులు ఇచ్చిపుచ్చుకోవడానికి... అభిప్రాయాలు పంచుకోవడానికి చక్కగా సాయం చేసే అమ్మభాషను వదిలేయాల్సిన అవసరమేంటని నిలదీస్తాడు. ‘తెలుగువాళ్లే తెలుగుకు తెగులు పుట్టిస్తున్నార’ంటూ ఆవేదన చెందుతాడు. 
      ఇలాంటి కథతో, సంభాషణలతో వచ్చిన చిత్రం యువతరానికి నచ్చిందంటే... భాషంటే వాళ్లకూ ప్రేమ ఉన్నట్లే కదా.  లఘుచిత్రాల ప్రత్యేకతే ఇది. యువత ఇష్టాయిష్టాలను అవి బయటకు రప్పిస్తాయి. యూట్యూబ్‌ గోడలపై కామెంట్ల రూపంలో వాళ్ల మనసులో మాటను చెప్పిస్తాయి. ఇంతకూ పైన చెప్పుకున్న ‘తెలుగు’ లఘుచిత్ర రూపకర్త ఎవరంటే... అభిరామ్‌ పిళ్లా. విశాఖపట్నం వాసి. హెచ్‌ఆర్‌ ఉద్యోగాన్ని వదిలేసుకుని మరీ సినీ పరిశ్రమకు వచ్చాడు. ఇలాంటి వాళ్లెందరో ఇప్పుడు కెమెరా ఫ్రేములకు తెలుగుదనాన్ని అద్దుతూ... అందమైన బుల్లి చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. 
పేరుకే చిన్నది...
ఇప్పుడు వందల సంఖ్యలో యువత లఘుచిత్రాలు తీస్తున్నారు. సినీ పరిశ్రమలో సహాయ దర్శకులుగా పని చేస్తూ దర్శకత్వ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్లు కొందరు. తమ ప్రతిభకు ప్రవర (రెజ్యూమె)గా వీటిని తెరకెక్కిస్తున్నారు. ఇంకొందరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా, ఇతరత్రా ఉన్నతోద్యోగాలు చేస్తూ... చిత్రాల మీద ఆసక్తితో పాటు తమ ఆవేదనలు, ఆకాంక్షలను అందరితో పంచుకునేందుకూ వీటిని తీస్తున్నారు. ఎంతమంది ఏయే లక్ష్యాలతో ఈ లఘుచిత్రాలు తీస్తున్నా... వాటి కథలు భిన్నంగా ఉంటున్నాయి. వెండితెరపై కనిపించని సున్నిత భావోద్వేగాలు, యువతరం ఆలోచనలకు పట్టం కడుతున్నాయి. 
      కావాలంటే... ‘ది వైవా’ చూడండి! ఇంజినీరింగ్‌ మౌఖిక పరీక్షలో జరిగే తంతును విరగబడి నవ్వుకునేలా చూపిన చిత్రమది. విశాఖపట్నానికి చెందిన శబరీష్‌ కాండ్రేగుల తీసిన ఈ లఘుచిత్రం 60 లక్షలకు పైగా హిట్లు సంపాదించింది. దీని నిర్మాణంలో పాలుపంచుకున్న వాళ్లందరూ పాతికేళ్ల లోపువాళ్లే. అలాగే ప్రదీప్‌ మాడుగుల తీసిన ‘అద్వైతం’ జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఏటా తెలుగునాడు నుంచి యూట్యూబ్‌లోకి వెళ్తున్న లఘుచిత్రాలు పదివేలకు పైమాటే. అంతర్జాతీయ లఘుచిత్రాల పోటీలకు వెళ్లే భారతీయ చిత్రాల్లో తెలుగువాళ్ల సృజనల వాటా 85 శాతం అంటే నమ్ముతారా! 
తెలుగుతోటలో పూసిన పూలు
పాటల్లో ఆంగ్ల పదాలు ఉంటే తప్ప యువతకు నచ్చదండీ... సంభాషణల్లో ద్వంద్వార్థాలు లేకపోతే సినిమాలు చూడటానికి కుర్రాళ్లు రారండీ... సంప్రదాయాలు, కుటుంబ కథలంటే ఇప్పుడు ఎవరు చూస్తున్నారండీ... ప్రధాన స్రవంతి చిత్రాల దర్శకనిర్మాతలను కదిలిస్తే చెప్పే మాటలివి. యువత కోరుకుంటున్నారంటూ తెలుగుదనం కనిపించని, తెలుగు వినిపించని తెలుగు సినిమాలను తీస్తున్నారు వాళ్లు. మరి నిజంగా యువత అలాగే ఆశిస్తోందా? లఘుచిత్రాలను చూస్తే కచ్చితంగా కాదనిపిస్తుంది. ఎక్కువ లఘుచిత్రాల్లో చక్కటి తెలుగు సంభాషణలు వినిపిస్తాయి. తెలుగింటి సంప్రదాయాలు, పండుగలు, కుటుంబ అనుబంధాలు... వీటి చుట్టూ కథలు తిరుగుతాయి. 
      శ్రీకాంత్‌ వంకాయల తెరకెక్కించిన ‘తీరొక్క పువ్వోలె’ చిత్రాన్ని చూస్తే బతుకమ్మ పండుగ కళ్ల ముందు నిలుస్తుంది. ‘ఇయ్యాల బాపు బట్టలు తెత్తడాయె’, ‘అప్పొ సొప్పొ సేసి ఎళ్లదీసుకుంటాం కానీ ఉత్తగ ఇడిసిపెట్టం’.... ఇలా సాగే సంభాషణలన్నీ మనసుకు హత్తుకుంటాయి. బతుకమ్మ పండుగ విశిష్టతను చాటిచెబుతూ తీసిన ఈ చిత్రం సంప్రదాయాల పట్ల యువతరం దృక్కోణానికి ఉదాహరణ. 
      ‘ఇష్టం మాటల్లో అర్థమవుతుంది. ప్రేమ చేతల్లో మాత్రమే కనిపిస్తుంది’, ‘కళ్లకు నచ్చిన అమ్మాయితో కాసేపే ఆనందంగా ఉండగలం. అదే మనసుకు నచ్చిన అమ్మాయితో కలకాలం ఆనందంగా ఉండగలం’... ఇలాంటి సంభాషణల మాలిక అయిన ‘పెళ్లిచూపులు’లో పశ్చిమగోదావరి తెలుగు తాండవమాడుతుంది. తణుకుకు చెందిన మణిరత్నం పెండ్యాల తీసిన ఈ లఘుచిత్రం... తెలుగింటి అనుబంధాల కథ. సురేష్‌ మారెడ్డి సంభాషణలు రాశారు. లక్షకు పైగా హిట్లు వచ్చాయి. ‘చిత్రం చాలా బాగుంది. అన్నిటి కన్నా... తెలుగు ఎక్కువగా వాడటం బాగా నచ్చింది’ లాంటి కామెంట్లు వెల్లువెత్తాయి. యువత పేరిట  కొన్ని ప్రధాన స్రవంతి చిత్రాల్లో కనిపించే ద్వంద్వార్థ సంభాషణలు, అసభ్య భంగిమలు వెరసి బూతు వంటివేమీ ఈ చిత్రాల్లో కనిపించవు. మన సంప్రదాయాలు, విలువల ఆధారంగా ఇవి వస్తున్నాయి. యువతరం కూడా చక్కగా ఆదరిస్తోంది. అలాంటి చిత్రాలపై అనురక్తిని వ్యాఖ్యల రూపంలో వ్యక్తీకరిస్తోంది. ‘తీరొక్కపువ్వోలే’, ‘పెళ్లిచూపులు’ తదితరాలే దీనికి నిదర్శనం. 
      ‘అమృతం కురిసిన రాత్రి’ సృష్టికర్త, మధురకవి తిలక్‌ రాసిన కథలూ ప్రఖ్యాతమే. వాటిలో ఒకటి ‘ఊరిచివర ఇల్లు’. దీన్ని 27 నిమిషాల లఘుచిత్రంగా మలిచారు కత్తి మహేశ్‌కుమార్‌. అదే ‘ఎడారివర్షం’. చాలామందిని ఆకట్టుకుంది. 
మంచిమాటల మూటలు
ప్రధాన స్రవంతి చిత్రాలకూ, లఘుచిత్రాలకూ మరో ప్రధాన తేడా ‘సందేశం’. నూటికి తొంభై లఘు చిత్రాల్లో సందేశం ఉంటుంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నిజామాబాద్‌ వాసి నరేందర్‌గౌడ్‌ నాగులూరి తెరకెక్కించిన ‘యాది’, సమాజం పట్ల చాలా మందిలో కనిపించే నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యాలను ప్రశ్నిస్తూ శ్రీను కర్ణ తీసిన ‘ఫర్‌గివ్‌మీ’, సమ్మెల పేరిట జనజీవనాన్ని స్తంభింపజేసేవారిని నిలదీస్తూ కర్రి బాలాజీ తెరకెక్కించిన ‘బంద్‌’... ఇలా ఎన్నో చిత్రాల్లోని సందేశాలు ఆలోచింపజేస్తాయి. అలా అని ఈ సందేశం... తరగతిలో పాఠం చెప్పినట్లు ఉండదు. అందంగా... యువత మెచ్చే శైలిలో ఆ పాఠ్యబోధన జరిగిపోతుంటుంది. పట్టుమని పావుగంట కూడా ఉండని చిత్రంలో సందేశాన్ని బలంగా వినిపించాలంటే... ‘అల్పార్థాల్లో అనల్పార్థ రచన’ చేయాలి. లఘుచిత్రాల దర్శక రచయితలు ఆ పనిని  ప్రభావవంతంగా చేస్తున్నారు. 
      అబద్ధాలతో అన్నీ అనర్థాలే అన్న విషయాన్ని వినోదాత్మకంగా చెబుతూ ‘ఇదేంటి గోవిందా’ తీశాడు వెంకట్‌ మాగులూరి. 1.23 లక్షల మంది చూశారు. ‘అబద్ధాలు మాట్లాడితే తాత్కాలిక ఆనందాలు పొందవచ్చు, అదే నిజాలు మాట్లాడితే శాశ్వత సంతోషాలు పొందవచ్చు’ అంటూ సాగే దర్శకుడి కథనం ఆలోచింపజేస్తూనే అలరిస్తుంది. బైక్‌ రేసుల మాయలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకునే యువతను వారిస్తూ ‘వేగం’ చిత్రాన్ని ముందుకుతెచ్చాడు సంతోష్‌రెడ్డి. ఇక సంజయ్‌ పవన్‌కుమార్‌ తెరకెక్కించిన ‘ఆత్మవేదన’ ఓ ప్రయోగం. నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుంటాడు. తర్వాత అతని ఆత్మకు జ్ఞానోదయం అవుతుంది. అప్పుడే మొదటిసారి చిత్రంలో మాట వినిపిస్తుంది. ఆ కొద్ది మాటలే పదునుగా ఉంటాయి. ‘బతికి ఉన్నన్ని రోజులు బాధలు భరించలేక నాకు చావు వస్తే బాగుండు, ఛస్తే బాగుండు అనుకునే వాణ్ని. కానీ, మరణించిన తర్వాత అర్థమైంది చచ్చి ఏమీ సాధించలేమని’... ఇలా! ఓడిపోయినవాళ్లు మళ్లీ ప్రయత్నిస్తే గెలవవచ్చు... ఆ మాత్రం దానికి ఆత్మహత్య చేసుకోవడం అవివేకమని చెబుతాడీ దర్శకుడు. 
      స్నేహం పేరిట అమ్మాయిలతో మాట కలిపి... తర్వాత ప్రేమంటూ వెంటపడే అబ్బాయిల తత్వాన్ని విమర్శిస్తూ హరిబాబు ‘ఒక్కమాటకే పడిపోయా’ తీశారు. 6 లక్షల హిట్లు వచ్చాయి.  ఆకర్షణను ప్రేమ అనుకుని ప్రాణాల మీదకు తెచ్చుకునే వాళ్లను హెచ్చరిస్తూ ‘నీ మాయలో’ తీశాడు పొత్తూరు రాజశేఖర్‌ నందు. వర్తమాన కథ కావడంతో 4 లక్షల మందికి చేరువైంది. ‘వెధవ బావురుపిల్లి మొహం నువ్వూ’... ఇలా అందమైన జంధ్యాల తెలుగు తిట్లను గుర్తుచేస్తూనే, జీవితాన్ని సీరియస్‌ తీసుకోని వాణ్ని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడరని చెప్పే చిత్రం ‘పెళ్లెప్పుడు’. విక్రమ్‌ జిమ్ముల, రిజ్వాన్‌ఖాన్‌ తెరకెక్కించిన దీనికొచ్చిన హిట్లు... 1.10 లక్షలు. 
ఓ అభాగ్యురాలి కథ
పదహారు నిమిషాల కథలో ఓ జీవితంలోని సంఘర్షణను, సంవేదనను అర్థవంతంగా ఆవిష్కరించవచ్చా? కచ్చితంగా! టీజీ సుదీప్‌కుమార్‌ (స్వస్థలం వెంకటగిరి) ఆ పనిని సమర్థంగా చేశాడు కూడా. ముక్కుపచ్చలారని వయసులో వ్యభిచార ఊబిలో కూరుకుపోయిన ఓ అమ్మాయి... తన కూతురి భవిష్యత్తు కోసం అందులోనే ఉండిపోతుంది. అలా మగ్గుతున్న ఆమెకు ఓ రోజు ఓ వ్యక్తి పరిచయమవుతాడు. అతను అందరిలాంటి వాడు కాదని తెలుసుకున్న ఆమె... తన గుండె కవాటాలను కసిగా కొడుతున్న కన్నీటి కెరటాల హోరును వినిపిస్తుంది. ఇదే సుదీప్‌ తీసిన ‘బీప్‌’ కథ. ఓ వేశ్య ప్రధానపాత్ర అయిన ఈ చిత్రంలో ఒక్క అసభ్యకర భంగిమ కానీ, అశ్లీలకరమైన దృశ్యం కానీ కనిపించవు. వ్యథార్థ జీవితాల కన్నీళ్లను మాత్రమే ఆవిష్కరిస్తుందీ ‘బీప్‌’. 
      ‘సుఖాన్ని ఇవ్వడం తప్ప పొందడం తెలియని బతుకులు మావి. రోజుకొకడికి సుఖాన్ని ఇచ్చే మాకు, ఆ అవసరం లేని రోజు వచ్చినప్పుడే సుఖం. చంద్రుడికి సూర్యుడికి మధ్య నలిగిపోయే జీవితాల్లో వెలుగు అంటే గాలివానలో గుమ్మం బయటపెట్టిన దీపం లాంటిది. ఆ వెలుగు ఎంతసేపు ఉంటుందో వెలిగించిన వాడికి కూడా తెలియదు’... ఇలా సాగే సంభాషణలు సుదీప్‌ కలం బలానికి సాక్ష్యాలు. మరోమాట... అంతసేపు ఆ అభాగ్యురాలి ఆవేదనను విన్న ఆ వ్యక్తి మనసులో ఓ ప్రశ్న ఉదయిస్తుంది. అక్కడ, ఆ పాత్రతో సుదీప్‌ అడిగించిన ప్రశ్న సమాజానికి ములుకోల దెబ్బలా తగులుతుంది. అదేంటంటే... ‘కూతురు బాగు కోసం ఆ రొంపిలోనే కొనసాగుతున్న వేశ్య ఆమె. తను చేస్తోంది తప్పో ఒప్పో నాకు తెలియదు. కానీ, సొంతలాభం కోసం దేశాన్ని అమ్ముతున్న ప్రియతమ నేత... నోటు కోసం, కులాల కోసం, మతాల కోసం ఓటును అమ్ముకుంటున్న సిగ్గులేని కామన్‌మాన్‌... చేయాల్సిన బాధ్యతను చేయడం కోసం ప్రజలను పీడించే తెలివైన పబ్లిక్‌ సర్వెంట్‌... వీళ్లలో వ్యభిచారం చేస్తోందెవరు?’ విశ్లేషణ అవసరం లేని వ్యాఖ్య ఇది! నిజజీవిత గాథ ఆధారంగా తీసిన ‘బీప్‌’కు 77 వేల హిట్లు వచ్చాయి. దాసరి, రాఘవేంద్రరావు, మోహన్‌బాబుల చేతుల మీదుగా సుదీప్‌కు పురస్కారమూ అందింది. మన లఘుచిత్ర దర్శకుల్లో ఇలాంటి ప్రతిభావంతులకు కొదవలేదు. 
ఇదే వారధి
సృజనాత్మక లఘుచిత్రాలను తెరకెక్కిస్తున్న యువతకు పెద్ద సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశాలు, పురస్కారాలూ ఎదురొస్తున్నాయి. అలాంటి వాటిని అందిపుచ్చుకున్న వాళ్లలో ఒకడు విజయవాడకు చెందిన పవన్‌ సాదినేని.  కొత్తగా అమెరికాకు వెళ్లిన నలుగురు కుర్రాళ్ల కథతో ‘తూర్పు-పడమర’ లఘుచిత్రాన్ని రూపొందించాడు. 2.75 లక్షల హిట్లు వచ్చాయి. తర్వాత మరికొన్ని తీశాడు. వాటి ద్వారా పవన్‌ ప్రతిభను అంచనా వేసిన సినీ పరిశ్రమ, అతనికో మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఫలితంగా... నితిన్‌ కథా నాయకుడిగా, పవన్‌ దర్శకత్వంలో ‘ప్రేమ్‌ ఇష్క్‌ కాదల్‌’ తెరకెక్కింది. ప్రముఖ రచయిత మేర్లపాక మురళి కుమారుడు గాంధీ ‘ఖర్మరా దేవుడా’ అనే 13 నిమిషాల చిత్రాన్ని తీశాడు. అదే అతణ్ని ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రానికి దర్శకుణ్ని చేసింది. శర్వానంద్‌ కథానాయకుడిగా ‘రన్‌ రాజా రన్‌’ తీసిన సుజిత్‌ కూడా లఘుచిత్రాల ద్వారా వచ్చినవాడే. పదిహేడేళ్లకే లఘుచిత్రాలను మొదలుపెట్టిన సుజిత్‌... 40కి పైగా బుల్లి చిత్రాలను తెరకెక్కించాడు. 24 ఏళ్లకే వెండితెరపై దర్శకుడిగా తన పేరు వేయించుకోగలిగాడు. 
      ‘మీ మాటలకంటే మౌనాన్ని అర్థం చేసుకునే మనిషిని పట్టుకోండి. అలాంటి వాళ్లు దొరికినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ చెయ్యిని విడిచిపెట్టకండి. అదే నిజమైన ప్రేమ. అదే శాశ్వతం. అదే మధురం’... ‘ఊహలు పరిమితమైన కలలు. కలలు అపరిమితమైన ఊహలు. లేచినంతసేపూ ఊహలు... పడుకున్నప్పుడు కలలు... అదే జీవితం’ ఇలాంటి సంభాషణలు రాసిన రచయిత కచ్చితంగా విషయమున్నోడే కదా! అవును... ఫణీంద్ర నర్సెట్టి కచ్చితంగా ప్రతిభావంతుడే. ఇంతకూ ఈ మాటలు ఎక్కడ వినిపిస్తాయంటే... తనే దర్శకత్వం వహించిన ‘మధురం’ లఘుచిత్రంలో! 11 లక్షల హిట్లను సంపాదించిన చిత్రమిది. ‘మంచి సినిమా డబ్బు నుంచి పుట్టదు. రగులుతున్న మెదడులోని చీకటి పొరలను చీల్చుకుని పుడుతంద’ని చెప్పే ఫణీంద్ర ఇప్పటికే... రెండు ‘మోఫిల్మ్‌’ అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఈ 27 ఏళ్ల యువకుడు ఫార్మసీ పట్టభద్రుడు.
      వినోద్‌ రాజేంద్ర... అనంతపురం జిల్లా హిందూపురం వాసి. ‘ఛేంజ్‌’ చిత్రంతో కేంద్రప్రభుత్వ లఘుచిత్ర పురస్కారం అందుకున్నాడు. ఈ చిత్రం స్క్రిప్టు ఆస్కార్‌ ఫిల్మ్స్‌ గ్రంథాలయానికి ఎంపికైంది. 
      అప్పుడప్పుడు సినీరంగ ప్రముఖులు కూడా లఘుచిత్రాల వైపు చూస్తున్నారు. తీస్తున్నారు. అల్లు అర్జున్‌తో దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించిన 3 నిమిషాల ‘ఐయాం దట్‌ ఛేంజ్‌’కు దాదాపు 3 లక్షల హిట్లు వచ్చాయి. ‘మన బాధ్యతను మనం నిర్వర్తించడం కూడా దేశభక్తే. మార్పు మనతోనే మొదలవ్వాల’నే సంభాషణలు దీనికి బలం. 2012లో ‘సిరా’ పేరిట కళాత్మక లఘుచిత్రాన్ని రూపొందించారు తనికెళ్ల భరణి. 25 వేలకు పైగా హిట్లు వచ్చాయి. హీరో సందీప్‌ కిషన్‌ సమర్పణలో ప్రశాంత్‌వర్మ తీసిన ‘సైలెంట్‌ మెలోడి’ 2 లక్షలకు పైగా హిట్లను సంపాదించుకుంది. 
      లఘుచిత్రాల శీర్షికల్లో అక్కడక్కడా ఆంగ్లం కనిపిస్తున్నా... ప్రధానస్రవంతి చిత్రాలతో పోల్చితే తక్కువే. ఆదిలాబాద్‌ నుంచి విజయవాడ వరకూ... చిత్తూరు నుంచి రాజమండ్రి వరకూ అన్ని ప్రాంతాల యువతరమూ ఈ చిత్రాలను తీస్తున్నారు. తమవైన యాసభాషల్లోనే సంభాషణలను రాసుకుంటున్నారు. తెనుగు తోటలోని మాండలిక మందారాలన్నీ ఆ చిత్రాల్లో దర్శనమిస్తాయి. అందుకే, అవి లఘుచిత్రాలు కావు... అమృతప్రాయమైన మన అజంత భాష పొంగులెత్తే లోగిళ్లు.

సహకారం పుష్పాభాస్కర్, హైదరాబాదు


వెనక్కి ...

మీ అభిప్రాయం