పుష్కరానికి ఎంత ‘కథో’!

  • 749 Views
  • 3Likes
  • Like
  • Article Share

    డా।। యల్లాప్రగడ మల్లికార్జునరావు

  • తెలుగు శాఖాధిపతి, హిందూ కళాశాల
  • గుంటూరు,
  • 9848543520
డా।। యల్లాప్రగడ మల్లికార్జునరావు

శర్మ కృష్ణవేణి నర్మద గౌతమి/ గంగ పెన్న యలక తుంగభద్ర/ సహ్యతనయ యమున సప్తగోదావరీ/ తీరముల మునింగితిని వెలంది!... అంటూ రాసుకొచ్చాడు ‘సత్యభామాపరిణయము’ కృతికర్త. ఆయనొక్కడనేముంది కానీ, తెలుగువాళ్లందరూ తరతరాలుగా నదీస్నానం ఆచరిస్తున్న వాళ్లే. పుణ్యం కోసమని కొందరు... ఆరోగ్యం కోసమని మరికొందరు నదీజలాల్లో జలకమాడుతుంటారు! అలా అలా అదో ఆచారంగా స్థిరపడిపోయింది. ఇక పుష్కరాల సమయంలోనైతే నదీతీరాలన్నీ జనసంద్రాలవుతాయి. తీర ప్రాంత క్షేత్రాలన్నీ భగవన్నామస్మరణతో మార్మోగుతాయి. అన్నట్టు... ఈ పుష్కరాలెప్పుడు పుట్టాయి? ఎందుకు ప్రఖ్యాతమయ్యాయి? ఈ ప్రశ్నలకు మన పురాణ సాహిత్యం తనదైన శైలిలో సమాధానాలిస్తుంది. గోదావరి పుష్కరాల ఆతిథ్యానికి తెలుగునేల వేదిక కాబోతున్న తరుణంలో వాటిని తెలుసుకోవడం సముచితం, అవసరమూనూ!
నదీతీరాలు
నాగరికతలకు పట్టుగొమ్మలు. ధరణీతలంలో ధగద్ధగాయమానంగా విలసిల్లిన నాగరికతలకు నడకలు నేర్పింది నదీమతల్లులే. నీటిధారలనే చనుబాలు పట్టించి జాతి వికాసానికి జవసత్వాలద్దిన ఆ అమ్మలంటే మానవులకెప్పుడూ ఆపేక్షే. అందుకే, ప్రపంచవ్యాప్తంగా ఒక్కో ప్రాంతం ఒక్కోలా ఆ పయస్వినులకు పట్టంకట్టింది. ముఖ్యంగా మన దేశం...  ఆధ్యాత్మిక మార్గంలో వాటిని సేవించుకుంటోంది. పుణ్యతీర్థాల పేరిట నదులకు పూజలు చేస్తోంది. కాలగమనంలో నదికి దూరంగా జరిగిపోయిన మానవ జీవితం... ఎప్పుడోసారైనా దాన్ని స్మరించుకోవాలన్న ఉద్దేశంతోనే పెద్దలు ఈ ఏర్పాటు చేశారు. పైగా సుదీర్ఘ పయనం చేసే నదీజలాల్లో ఔషధగుణాలెక్కువ. వాటిలో స్నానం చేస్తే ఒంటికి మంచిది. ఈ విషయాన్ని మామూలుగా చెబితే పట్టించుకోరేమో అన్న భావనతో... ఏడాదికి ఒక నదికి పుష్కరమని చెప్పి, ఆ పుష్కరానికి దైవత్వమాపాదించి ఆచారంగా మార్చారు. అలా గోదావరి నదీ జననం నుంచి దాని పుష్కర సంబరం వరకూ అన్నింటినీ వివరించే స్కందపురాణాది గాథలు ఆసక్తికరంగా ఉంటాయి.   
      శ్రీమహావిష్ణువు వామనావతారం ఎత్తాడు. బలి చక్రవర్తి దగ్గర మూడు అడుగుల నేలను దానమడిగాడు. బలి ఇచ్చేశాడు. వామనుడు ఒక అడుగుతో ఆకాశమంతా ఆక్రమించాడు. ఆ సమయంలో ఆ పాదం బ్రహ్మలోకం వరకు వెళ్లింది. దాన్ని గుర్తించిన బ్రహ్మ, తన కమండలంలోని జలంతో స్వామి పాదాన్ని కడిగాడు. అలా ‘బ్రహ్మకడిగినపాదం’ నుంచి నాలుగు జలధారలు వెలువడ్డాయి. తూర్పు దిక్కుగా వచ్చిన ధారను ‘గంగ’ అన్నారు దేవతలు. దాంట్లో వాళ్లతో పాటు ఋషులూ స్నానాలు చేసి పునీతులయ్యారు. ఇక దక్షిణ దిక్కుకు తరలిన ప్రవాహాన్ని తన శిరస్సున ధరించాడు శివుడు. మిగిలిన రెండు ధారలను బ్రహ్మ, విష్ణువులు గ్రహించారు. అలా కాలం గడుస్తోంది. కానీ, పరమేశ్వరుడి సిగలో ‘గంగమ్మ’ ఉండటాన్ని పార్వతి సహించలేకపోయింది. ఎలాగైనా సరే, ఆమెను వెళ్లగొట్టమని తన కుమారుడైన వినాయకుణ్ని అడిగింది. అమ్మ కోరిక తీర్చడానికి, అవకాశం కోసం ఎదురుచూడసాగాడు గణనాథుడు. 
గౌతముడు ఉన్నాడిక్కడ 
అంతలో... తీవ్ర కరవుకాటకాలతో వసుధ కళతప్పింది. ఆకలి దప్పికలతో జీవజాలమంతా విలవిల్లాడిపోయింది. ఆ దుర్భర పరిస్థితులలో గౌతమ మహర్షి తపశ్శక్తితో... తన ఆశ్రమ ప్రాంతాన్నంతా సస్యశ్యామలం చేశాడు. పాడిపంటలతో  కళకళలాడుతున్న ఆ ఆశ్రమానికి ఎక్కడెక్కడి మునులూ వచ్చి సేదతీరేవారు. అలా పన్నెండేళ్లు గడిచాయి. ఆ తరువాత  వర్షాలు కురవడంతో నేలంతా సుభిక్షంగా మారింది. గౌతముడి ఆశ్రమానికి వచ్చిన ఋషులు తిరిగి తమతమ నెలవులకు  వెళ్దామనుకున్నారు. కానీ, మరికొన్నాళ్లు ఉండమంటూ చాలాకాలంపాటు వారిని తన దగ్గరే ఉంచేసుకున్నాడు గౌతముడు. దాంతో ఆ మునులందరూ ఎలాగైనా సరే స్వస్థలాలకు వెళ్లాలని పథకరచనలు చేస్తూ కూర్చున్నారు. 
      ఇదే అవకాశంగా భావించిన పార్వతీసుతుడు... వెంటనే ఋషి వేషం వేసుకున్నాడు. నేరుగా గౌతముడి ఆశ్రమానికి వచ్చి అక్కడి ఋషుల్లో కలిసిపోయాడు. తరువాత బాగా ఏపుగా పెరిగిన ఆశ్రమం సమీపంలోని పంటచేనులో ఓ మాయాగోవును వదిలాడు. చేనులో మేస్తున్న ఆ ఆవును గౌతముడు చూశాడు. పక్కనే ఉన్న గడ్డిపరకతో చాలా సున్నితంగా అదిలించాడు. కానీ, వినాయకుడి మాయతో ఆ గోవు మరణించింది. ‘‘నువ్వు గోహత్య చేశావు. నీ ముఖం చూడకూడదు’’ అంటూ మునుల్లో అత్యధికులు ఆశ్రమాన్ని విడిచి వెళ్లిపోయారు. మిగిలిన కొందరిలో పెద్దలు... శివుడి శిరస్సు నుంచి గంగను నేలకు తెచ్చి, అందులో స్నానం చేసి, చనిపోయిన గోవును కూడా పునీతం చేయాలని గౌతముడికి సలహా ఇచ్చారు. అదే లక్ష్యంతో తపస్సుకు కూర్చున్నాడు గౌతముడు. చివరికి అది ఫలించి... నేలకు దిగింది శివగంగ! గౌతముడి ప్రార్థన మేరకు వచ్చింది కాబట్టి ఆ ధార ‘గౌతమి’ అయ్యింది. గోవు మీదగా ప్రవహించింది కాబట్టి ‘గోదావరి’గా స్థిరపడింది.  
నదులు దేవతలే
భారతావనిలో ప్రవహించే నదీనదాలన్నీ దేవతలే. అలా అని ఓ గాథ కూడా ఉంది. చాక్షుష మన్వంతరంలో సహ్యగిరి శిఖరం మీద ఓ యజ్ఞం చేయాలనుకున్నాడు సృష్టికర్త. దానికి కావాల్సిన సంబారాలను సమకూర్చుకున్నాడు. బ్రాహ్మణులను, మహర్షులను ఆహ్వానించాడు. ఇంతలో యజ్ఞదీక్షాకాల సుముహూర్తం సమీపించింది. అయినా... పెద్దభార్య ‘స్వర’ ఇంకా రాలేదు. చేసేది లేక, చిన్న భార్య ‘గాయత్రి’తో యజ్ఞదీక్షను తీసుకున్నాడు బ్రహ్మ. అంతలో అక్కడికి వచ్చిన ‘స్వర’ అగ్గి మీద గుగ్గిలమైంది. ఆ ప్రదేశమంతా దుర్భిక్షంతో నశించాలని, యజ్ఞానికి వచ్చిన దేవతలందరూ నదులుగా మారిపోవాలని శపించింది. గాయత్రి ఎదురుతిరిగింది. ‘‘ఆయనకు నువ్వెంతో నేనూ అంతే. అనవసరంగా కోపం తెచ్చుకున్నావు. మంచివాళ్లను అకారణంగా శపించావు. కాబట్టి నువ్వు కూడా నదిగా మారిపో’’ అంటూ స్వరకు ప్రతిశాపమిచ్చింది. 
      ఈ గొడవతో దేవతలందరూ మాన్పడిపోయారు. ఆ తర్వాత తేరుకుని... ‘‘దేవతలంతా నదులుగా మారితే లోకాలన్నీ తల్లడిల్లిపోతాయి. లోకసృష్టి, లోకపాలన సాగవు. శాపాన్ని ఉపసంహరించుకోమ్మా’’ అంటూ స్వరను వేడుకున్నారు. ఆమె శాంతించింది. దేవతలందరూ తమ అంశలను నదీరూపాలుగా మార్చితే సరిపోతుందని చెప్పింది.  ఆ మేరకు విష్ణువు తన అంశతో కృష్ణానదిగా అవతరించాడు. రుద్రుడు వేణీనదిగా మారాడు. ఆ రెండూ కలిసి కృష్ణవేణి నది అయ్యాయి. బ్రహ్మదేవుడు కకుద్మతీ నదిగా అవతరించాడు. అలా అందరి దేవతల అంశలతో నదులు పుట్టాయి. అందుకే జలాన్ని దైవసమంగా, ఎంతో పవిత్రంగా భావించమంటాయి మన పురాణాలు. 
పుష్కరం పుట్టిందిలా...
నదులకు పుష్కరాలొచ్చాయంటారు. పన్నెండు రోజులపాటు మహోత్సవాలు జరుపుతుంటారు. అయితే పుష్కరమంటే   ఏంటి? ఓ తీర్థరాజం. పుష్కరతీర్థంలో మూడున్నర కోట్ల నదులు, వసువులు, సిద్ధులు, సాధ్యులు, వసురుద్రాది ఆదిత్యులు, ఇంద్రాది దిక్పాలకులు, సతుల సమేతంగా త్రిమూర్తులు, మహర్షులు, ముక్కోటి దేవతలు నివసిస్తుంటారు. ‘పుష్కరం’ అనే శబ్దానికి ‘నీరు, ఆకాశం, నక్షత్రం, మృదంగం, ముఖం, మదం, కత్తివాటు, ఒక ద్వీపం, ఒక రకమైన ఓషధి, కమలం, తీర్థ విశేషం, సర్పం, ఏనుగు తొండపు కొన’ లాంటి అర్థాలు చెబుతాయి నిఘంటువులు. ఈ సందర్భానికి అనువైంది మాత్రం ‘తీర్థరాజం’ మాత్రమే! 
      దేవతలలో విష్ణుమూర్తి ఎంతటి ముఖ్యుడో, తీర్థాలలో పుష్కరతీర్థం కూడా అలాంటిదే. దీన్ని స్మరిస్తే చాలు సమస్త పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇక ఆ పుష్కరతీర్థానికి వెళ్లి... అక్కడ అభిషేకాదులు, పితృదేవతాపూజలు చేసిన వారికి నూరు అశ్వమేథ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. పుష్కరాలప్పుడు మాత్రమే కాదు నిత్యం ఉదయ, సాయం సంధ్య వేళల్లో పుష్కరతీర్థాన్ని స్మరించుకున్నా... అన్ని తీర్థాలలోనూ స్నానం చేసినంతటి పుణ్యం దక్కుతుంది. అలాంటి పుష్కరతీర్థం ఎలా ఆవిర్భవించిందో చెప్పే కథల్లో ఒకటి...
      మేరుపర్వతం మీద శ్రీనిధానం అనే ఓ శిఖరం ఉంది. దాని మీదే బ్రహ్మదేవుడి ఇల్లు. పేరు ‘వైరాజం’. అందులో ధ్యానం చేసుకుంటున్న బ్రహ్మకు... భారీయజ్ఞం చేయాలన్న తలంపు కలిగింది. అన్నట్టు, బ్రహ్మ పుట్టింది పద్మంలో. పద్మాన్నే పుష్కరం అనీ అంటారు. ఆ పద్మం విష్ణునాభి నుంచి వచ్చింది. కాబట్టి తన జన్మకు ఆధారమైన పుష్కరం పేరిట ఓ దివ్య తీర్థాన్ని ఏర్పాటు చేసి, ఆ తీర్థక్షేత్రంలో తాను యజ్ఞం చేయాలని అనుకున్నాడు బ్రహ్మ. యజ్ఞాన్ని ఎక్కడచేస్తే బాగుంటుందా అని వెతకడం ప్రారంభించాడు. ప్రకృతి సౌందర్యంతో అలరారుతున్న ఓ ప్రాంతం కనిపించింది. ఆ ప్రదేశానికి అందాలద్దుతున్న వృక్షాలను చూసి ముచ్చటపడ్డాడు. వాటికి వరాలివ్వాలనుకున్నాడు. ఏం కావాలో కోరమని చెట్లను అడిగాడు. ‘‘మాకేమీ వద్దు. మీరిక్కడే కొంతకాలం పాటు ఉంటే చాలు’’ అన్నాయి తరులు. బ్రహ్మ అంగీకరించాడు. వెయ్యేళ్ల పాటు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. 
      ఇంతలో ఆ ప్రాంతానికి ఓ కష్టం వచ్చింది. వజ్రనాభుడు అనే ఓ రాక్షసుడు ఆ ప్రాంతంలోని వాళ్లను హింసిస్తున్నాడు. దాంతో అసుర సంహారం చేయాలను కున్నాడు బ్రహ్మ. వెంటనే తన చేతిలో ఉన్న పుష్కరాన్ని అంటే పద్మాన్ని నేల మీదకు విసిరికొట్టాడు. అది నేలను తాకగానే, భయంకరమైన శబ్దం వచ్చింది. ఆ ధ్వనికే చచ్చిపోయాడు వజ్రనాభుడు! లోకసంక్షేమం కోసం బ్రహ్మ విసిరిన పద్మం పడిన ప్రాంతం చక్కటి సరస్సుగా మారింది. అదే పుష్కరతీర్థం అయ్యింది. అందులో స్నానం చేయడం, పితృకార్యాలను నిర్వహించడం, యజ్ఞయాగాలను చేయడం తదితరాలన్నీ పుణ్యప్రదాలు అవుతాయన్నాడు బ్రహ్మ. 
నదులు... పుష్కరాలు 
ప్రధానమైన పన్నెండు నదుల్లో... ఒక్కో ఏడాది ఒక్కో నదికి పుష్కరాలు వస్తుంటాయి. ఇలా రావటం వెనుక కూడా ఓ కథ ఉంది. దేవగురువైన బృహస్పతి తాను ఇంకా ఇంకా పవిత్రుడై, ఉన్న గ్రహాలు అన్నింటిలోకి విశిష్టమైన గ్రహంగా పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. వెంటనే బ్రహ్మను గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ‘‘జలతత్వం పొందిన పుష్కరుడు ఎప్పటికీ నాతోనే ఉండాలి’’ అన్నాడు బృహస్పతి. బ్రహ్మ ఒప్పుకున్నాడు. కానీ, పుష్కరుడు అంగీకరించలేదు. మధ్యేమార్గంగా ఓ ఉపాయాన్ని చెప్పాడు బ్రహ్మ. ‘‘బృహస్పతి మేషాదిరాశులలో సంచరించే కాలంలో ఆద్యంతాలలో పన్నెండేసి రోజుల చొప్పున పన్నెండు ప్రధాన నదులలో పుష్కరుడు ఉంటాడు’’ అన్న బ్రహ్మ మాటలు అందరికీ నచ్చాయి. అలా పుష్కరుడు బృహస్పతితో పాటు నదులలో కలిసి ఉండే రోజులను పుష్కరోత్సవాలుగా జరుపుకోవడం ఆచారమైంది. పుష్కరం ప్రారంభంలో పన్నెండు రోజులు, చివరి పన్నెండు రోజులు ఇలా దేవగురువు, పుష్కరుడు, మూడున్నర కోట్ల తీర్థాలు, సర్వదేవతలు కలిసి ఆయా నదులను పవిత్రం చేస్తుంటారు. అందుకే పుష్కరాల సమయంలో స్నానం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని పెద్దలు అంటుంటారు. బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరికి పుష్కరాలు వస్తాయి. ఈ ఏడాది జులై 14 నుంచి 25 వరకూ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏడు జిల్లాల్లో ఆ సంబరం జరగబోతోంది. 
      పురాణగాథల సృష్టిలో పెద్దల ఊహాశక్తి ఆశ్చర్యపరుస్తుంది. వాస్తవావాస్తవాలతో సంబంధం లేకుండా ఆధ్యాత్మిక సాహిత్యమెప్పుడూ మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది. తరతరాలుగా భరతభూమిలో ఇంకిన ఆ సాహిత్య సారమే... భారతీయుల జీవితాలను ప్రశాంత మార్గంలో నడిపిస్తోంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం