‘విజ్ఞానపు వేట’పాలెం

  • 1657 Views
  • 5Likes
  • Like
  • Article Share

    జి.శ్రీరాములు

  • వేటపాలెం, ప్రకాశం జిల్లా.
  • 8008574099
జి.శ్రీరాములు

1804లో వచ్చిన ‘అముద్ర గ్రంథ చింతామణి’ ప్రతి కావాలండీ...!
అక్కడ ఉంటుంది వెళ్లండి. 
1934లో ఆంధ్రపత్రిక ఉగాది సంచిక వచ్చిందండీ... అదేమైనా దొరుకుతుందా?
భలే వారే! అదిగో... అక్కడ ప్రయత్నించారా!
అక్కడ... ఆ వేటపాలెం ‘సారస్వత నికేతనం’లో లభించనిది అరుదు! ఎందుకంటే... ‘సమగ్రాంధ్ర సాహిత్యా’నికే అది మూలాధారం. తొంభై ఏడేళ్ల ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రకు ప్రత్యక్షసాక్షి ఆ గ్రంథాలయం. ఈ శతాబ్ది కాలంలో ఆ అక్షరాంబుధిని వేలాది మంది మథించారు. వెలకట్టలేని విజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నారు. తన గుండెల్లో నింపుకున్న సాహిత్యామృతాన్ని తరాల తరబడిగా తెలుగు జాతికి పంచిపెడుతున్న ఆ పొత్తపుగుడికి పోయొద్దాం పదండి!

పెద్ద నగరాలకు చాలా దూరంగా, చిన్న పల్లెటూళ్లో, అతిచిన్న గదిలో, వంద పుస్తకాలు, రెండు దినపత్రికలు, ఓ పత్రికతో ప్రారంభమైన ఓ పొత్తపుగుడి... తర్వాతి రోజుల్లో తెలుగు నేలకే విజ్ఞానదీపమైంది. దేశవిదేశాల్లోని ఎందరో అక్షరహాలికుల సాహితీసేద్యానికి తన వంతు సాయం చేసింది. చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఇందులో ఉన్న పుస్తకాలు తొంభై వేలకు పైమాటే. ఇక అలనాటి మేటి పత్రికల ప్రతులైతే కోకొల్లలు!
      ఎర్రకోటపై త్రివర్ణపతాకం ఎగరడానికి 29 ఏళ్ల కిందటి మాట... అది అక్టోబరు 15, 1918. ఆ రోజు విజయదశమి. తెనాలి-చెన్నై రైలుమార్గంలో... ఇప్పటి ప్రకాశం జిల్లా చీరాలకు సమీపంలోని వేటపాలెంలో సాహిత్యాభిమానులైన ఊటుకూరి సుబ్బరాయ శ్రేష్టి, ఆయన మిత్రబృందం సమావేశమయ్యారు. అప్పటికప్పుడే ‘హిందూ యువజన సంఘా’న్ని స్థాపించారు. ఇదే వేటపాలెం పొత్తపుగుడి తొలి రూపం. తమ దగ్గర ఉన్న కొన్ని పుస్తకాలు, దినపత్రికలను పాఠకులకు అందుబాటులో ఉంచారు. అలా ఆరేళ్లు గడిచాయి. మధ్యమధ్య ఈ మిత్ర బృందం సేకరించిన పొత్తాలు వచ్చి చేరుతుండేవి. 1924లో వారికి మరికొందరి సహకారం లభించింది. చిన్న పెంకుటిల్లు సమకూరింది. ‘సారస్వత నికేతనం’గా పేరు మార్చుకున్న గ్రంథాలయం అందులోకి చేరింది. అది 1927లో సొసైటీల చట్టం కింద నమోదైంది. అలా ఏళ్లు గడుస్తున్న కొద్దీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పుస్తకాభిమానులందరికీ చిరపరిచితమైంది. ముఖ్యంగా సాహిత్య చర్చలకు చిరునామాగా మారింది. స్థలాభావంతో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో గ్రంథాలయానికి విశాలమైన భవనం అవసరమైంది. ఆ భవన నిర్మాణ ప్రారంభమే ఓ మధురఘట్టం. 
విరిగిన జాతిపిత చేతికర్ర
గ్రంథాలయానికి నారుపోసిన వారి స్వేదానికి వితరణశీలుల సేవాభావం తోడైంది. భవన నిర్మాణానికి నిధులు సమకూరాయి. 1929లో చీరాల వచ్చిన మహాత్మాగాంధీ చేతుల మీదుగా కొత్త భవనానికి శంకుస్థాపన జరిగింది. ఆ రోజు బాపూజీని చూడటానికి జనం వెల్లువెత్తారు. పెద్ద తోపులాట...! ఆ గందరగోళంలో మహాత్ముడి చేతికర్ర విరిగిపోయింది. దాన్ని ఆయన అక్కడే వదిలి వెళ్లారు. ఆ చేతికర్ర ఇప్పటికీ వేటపాలెం గ్రంథాలయంలో భద్రంగా ఉంది. 
      పూర్తయిన కొత్త భవనాన్ని ప్రకాశం పంతులు ప్రారంభించారు. ఏడాది తర్వాత, 1930లో ఈ సారస్వత నికేతనం జిల్లా కేంద్ర గ్రంథాలయమైంది. దీన్ని విజ్ఞాన కోవెలగా అభివర్ణిస్తూ 1935లో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు బాబూ రాజేంద్రప్రసాద్‌. మరుసటేడు గాంధీజీ మళ్లీ వచ్చారు. జ్ఞానశిఖరంగా ఎదిగిన సారస్వత నికేతనాన్ని చూసి పొంగిపోయారు. అప్పటికే పుస్తకాల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తెలిసిన వాళ్లందరూ తమ పొత్తాలను తెచ్చి ఇచ్చేవాళ్లు. ఈ పొత్తపుగుడి దినదినాభివృద్ధి తెలుగునాట గ్రంథాలయోద్యమానికి స్ఫూర్తిదాయకమైంది. దానికి తార్కాణంగా 1942లో గుంటూరు జిల్లా గ్రంథాలయాల సభ ఇక్కడే జరిగింది. మరోవైపు... ఇక్కడ జరిగే సాహితీసభల గురించి ఆ తరం వాళ్లందరూ గొప్పగా చెప్పుకునేవారు. 
ఎటుచూసినా సాహిత్యమే
సారస్వత నికేతనం ఆవరణలో సాయంత్రం పూట జరిగే సమావేశాలకు ఆరోజుల్లో సాహితీ లబ్ధప్రతిష్ఠులందరూ వచ్చేవారు. అవధానాలు, ఆశు కవితా ప్రదర్శనలూ జరిగేవి. ‘తెలుగువారిలో ప్రసిద్ధులైన కవిపండితుల్లో ఒకరిద్దరిని తప్ప తక్కిన అందర్నీ అక్కడే చూశాను. విన్నాను’ అని బూదరాజు రాధాకృష్ణ జీవిత చరిత్రలో చెప్పుకున్నారు. బూదరాజు స్వస్థలం వేటపాలెమే. విద్యార్థిగా ఉన్న రోజుల్లో గ్రంథాలయానికి వెళ్లడం, పుస్తకాలను ఆపోశన పట్టడం, సాయంత్రం సమావేశాల్లో పాల్గొనడం ఆయనకు నిత్యకృత్యం. ‘వేటపాలెం గ్రంథాలయం నా మొదటి విశ్వవిద్యాలయం. ఈనాడు నాలో కనిపించే సకల ఛాయలకు ఆ గ్రంథాలయంలోనే బీజం పడింద’ని చెప్పారాయన. 
      సారస్వత నికేతనంలో జరిగే సమావేశాలకు పండిత పామరులందరూ తరలి వచ్చే వారు. అసలేమీ చదువుకోని కార్మికులు, కర్షకులూ హాజరయ్యేవారు. వాళ్లంతా గొప్ప శ్రుత పాండిత్యం ప్రదర్శించేవారు. ఒకరోజు సమావేశానికి ‘తెలుగు లెంక’ తుమ్మల సీతారామమూర్తి వచ్చారు. ఆయన ఉపన్యసించడానికి సిద్ధం అవుతున్న క్షణంలో ఓ సభికుడు లేచి... ‘అయ్యా, తిక్కన భారతంలో మీ దృష్టిలో చెత్తపద్యం అనిపించేదొకటి చదివి, మీరు రాసిన మంచి పద్యం కూడా చదివి, మీరేవిధంగా అభినవ తిక్కన బిరుదుకు తగినవారో వివరించి మాకు జ్ఞానం ప్రసాదించండి’ అని అడిగాడు. దానికి ‘తెలుగు లెంక’ సమాధానమిస్తూ... ‘ఎవరో ఇస్తే కాదనలేక తీసుకున్నాను గాని నేనంత వాణ్ని కానని ఎరుగుదును. ఒక నిండు సభలో ఇచ్చిన బిరుదాన్ని మళ్లీ ఆ సభలోనే వదులుకోబోతున్నాను. నేను గాంధీ కవిని. తెలుగు లెంకను. నాకారెండే తగిన, చాలిన బిరుదు’లని చెప్పారు. అన్నట్టుగానే తర్వాత నరసరావుపేటలో జరిగిన ఓ సభలో ‘అభినవ తిక్కన’ బిరుదును వదులుకున్నారు. సారస్వత నికేతనంలో ఆనాటి సమావేశాల స్థాయికి ఈ ఘటనే నిదర్శనం.
ఎనలేని సేవ
సారస్వత నికేతనంలోని అపూర్వ గ్రంథాల వల్ల తెలుగు సాహితీలోకానికి జరిగిన మేలెంతో. ఆరుద్ర ‘సమగ్రాంధ్ర సాహిత్యా’నికి ఇక్కడే ఓ రూపం వచ్చింది. ఆయన నెలరోజుల పాటు చీరాలలో ఉండి... రోజూ గ్రంథాలయానికి వచ్చేవారు. ఇక్కడి అరుదైన గ్రంథాలను పరిశోధించేవారు. అలానే ‘సమగ్రాంధ్ర సాహిత్య’ రచన చేశారు. తొలి తెలుగు యాత్రా రచన ‘కాశీయాత్ర చరిత్ర’ (ఏనుగుల వీరాస్వామయ్య) ప్రతులు ఇప్పుడు లభిస్తున్నాయంటే అది వేటపాలెం గ్రంథాలయం పుణ్యమే. 
      ‘కాశీయాత్ర చరిత్ర’... 1838, 1869ల్లో అచ్చయింది. 1941 నాటికి దాని ప్రతులెక్కడా దొరకడం లేదు. అపూర్వమైన ఆ గ్రంథాన్ని తిరిగి అచ్చొత్తాలని ప్రముఖ పరిశోధకుడు దిగవల్లి వేంకట శివరావు సంకల్పించారు. కొత్త పుస్తకాన్ని వేయాలంటే పాత పుస్తకం ఒకటి కావాలి కదా. దాని కోసం దిగవల్లి చాలా శ్రమ పడ్డారు. ‘కాశీయాత్ర చరిత్ర అచ్చు వేయడానికి పూర్వముద్రణపు గ్రంథం కోసం చాలారోజులు ప్రయత్నించినా దొరకలేదు. పుస్తకం దగ్గరవున్న ఇద్దరు పెద్దమనుష్యులు యిస్తామని చెప్పి యిచ్చారుకారు. ఆఖరికి వేటపాలెం గ్రంథాలయంలో ఒక ప్రతి వుందని తెలియగా దాన్ని నా మిత్రులైన శ్రీ పిశిపాటి సీతాకాంతంగారు స్వయంగా వెళ్ళి తెచ్చిపెట్టారు’ అని ‘కాశీయాత్ర చరిత్ర’ తృతీయ ముద్రణ పీఠికలో చెప్పారు దిగవల్లి. ఇలా పునర్ముద్రణలు ఎన్నింటికో సారస్వత నికేతనం చాలా దోహదపడింది. 
      గ్రంథాలయంలో ఉన్న ప్రాచీన గ్రంథాల సాయంతో అనేక మంది పీహెచ్‌డీ, ఎంఫిల్‌ పట్టాలు పొందారు. ఎక్కడా దొరకని పుస్తకాలు, పత్రికలు ఇక్కడ లభ్యమవుతుండటంతో ఎందరో పరిశోధ]కులు వస్తుంటారు. ఆ రోజుల్లో అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చే పరిశోధక విద్యార్థులు రోజుల తరబడి వేటపాలెంలోనే ఉండేవారు. వాళ్లకు గ్రంథాలయంలోనే రాత్రి బస ఏర్పాటు చేసి... స్థానిక ‘గొల్లపూడి వారి సత్రం’లో అన్నదానం చేసేవారు. తెలుగునాట మరెక్కడా ఇలాంటి సౌకర్యాలు కల్పించిన గ్రంథాలయం ఉన్న దాఖలాలు లేవు. 
      విదేశీ పరిశోధకులూ ఇక్కడికి వచ్చేవారు. అమెరికాకు చెందిన జాన్‌ లీవార్డ్, క్యారెన్‌ డాకెన్‌డార్ఫ్‌లకు తెలుగు అంటే మక్కువ. 1965లో వాళ్లు వేటపాలెంకు వచ్చి పరిశోధనలు చేశారు. అడవి బాపిరాజు, కాశీనాథుని నాగేశ్వరరావు, విశ్వనాథ సత్యనారాయణ, వావిలికొలను సుబ్బారావు, కాటూరి వెంకటేశ్వరరావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, మునిమాణిక్యం నరసింహారావు, త్రిపురనేని రామస్వామి, చిలకమర్తి లక్ష్మీనరసింహం, ఉన్నవ లక్ష్మీనారాయణ, సి.నారాయణరెడ్డి లాంటి వాళ్లందరూ ఈ సారస్వత నికేతనంలోని పొత్తాల పుటలను తడిమినవారే!  
తాత నుంచి మనవరాలి వరకూ...
ఎన్నో అమూల్యమైన గ్రంథాలకు నిలయమైన సారస్వత నికేతనానికి తొలినాళ్లలో ఊటుకూరి కోటిలింగంశ్రేష్టి రూ.1500 విరాళం ఇచ్చారు. ఆ రోజుల్లో అది పెద్దమొత్తమే. అమెరికాలో ఉంటున్న ఆయన మనవరాలు ఇటీవల గ్రంథాలయాభివృద్ధికి రూ.అయిదు లక్షలు అందించారు. ఐటీసీ పరిశ్రమ యాజమాన్యం గ్రంథాలయ భవనాన్ని ఆధునికీకరించింది. గుంటూరుకి చెందిన బొమ్మిడాల కృష్ణమూర్తి కూడా రూ.మూడు లక్షలు విరాళమిచ్చారు. ఇలాంటి దాతల సాయంతో ఇక్కడ పొత్తాలను భద్రంగా కాపాడుతున్నారు. పురాతన దినపత్రికలన్నీ బైండింగ్‌ చేసి చక్కగా ఉన్నాయి. కొన్ని పుస్తకాలను తిరుమల తిరుపతి దేవస్థానం, సుందరయ్య విజ్ఞాన కేంద్రం సౌజన్యంతో డిజిటలైజేషన్‌ చేయించారు. ఇలా అయిన పొత్తాలు, పత్రికల సీడీలు మూడొందలకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ గ్రంథాలయ అధ్యక్షులు కేవీడీ మల్లికార్జునరావు,    కార్యదర్శి ఆర్‌వీ శేషగిరిరావు. వీరితోపాటు సిబ్బందీ సేవాభావంతో పాఠకులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు.
      1935 నుంచి 1994 వరకూ ‘ఆంధ్రా హిస్టారికల్‌ రీసెర్చి సొసైటీ’ తెచ్చిన పరిశోధనాత్మక ప్రచురణలు, తెలుగు నాదస్వర డోలు కళాకారుల చరిత్ర వంటి అరుదైన పొత్తాలు, అఖిల భారత తెలుగు రచయితల ప్రథమ సమావేశ (1960ల్లో) సంచిక తదితరాలతో పాటు స్వాతంత్య్రానికి పూర్వం నాటి దిన, వార, మాస పత్రికల ప్రతులెన్నో ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. ఇక వేదభూగోళం (1870), తత్వ చింతామణి (1891), హరిత సంహిత (1894), ఆంధ్ర హాలాస్య మాహాత్మ్యం (1906) తదితర యాభై ఏడు వేల తెలుగు, సంస్కృత గ్రంథాలు ఉన్నాయి. ఇరవై తొమ్మిది వేల ఆంగ్ల పుస్తకాలు, మూడున్నర వేల హిందీ పొత్తాలు వీటికి తోడు! యాభై ప్రాచీన తాళపత్ర గ్రంథాలు, చేతిరాత పొత్తాలు పదింటినీ ఈ సారస్వత నికేతనంలో చూడవచ్చు. ఇప్పటికీ ఏటా గ్రంథాలయం తరఫున పుస్తకాల కొనుగోళ్లు సాగుతుంటాయి. 
      పుస్తకాభిమానులకు, ముఖ్యంగా పరిశోధకులకు పుణ్యస్థలం... వేటపాలెం సారస్వత నికేతనం. ఈ గ్రంథాలయ నిర్మాణంలో భాగస్వాములైన పెద్దలు, దాన్ని ఇంతగా విస్తరించిన ఎందరెందరో మహానుభావులూ... అందరూ ప్రాతఃస్మరణీయులే. ఆ కోవెలలో వాళ్లు వెలిగించిన జ్ఞానదీపం... ఎన్నో తరాలకు దారిచూపుతోంది. ఇలాంటి దీపాలకు నెలవులైన గ్రంథాలయాలు మరిన్ని రావాలి. వాటి వెలుగులో తెలుగునాడు మరింతగా ప్రకాశవంతం కావాలి. 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  గ్రంథాలయాలు