డాక్టర్‌ గణపయ్య!!

  • 1110 Views
  • 2Likes
  • Like
  • Article Share

    డా।। సమ్మెట గోవర్ధన్

  • వరంగల్లు
  • 9949038471
డా।। సమ్మెట గోవర్ధన్

ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతాహృదయానురాగ సం
పాదికి దోషభేదికిఁ బ్రసన్న వినోదికి విఘ్నవల్లికా 
చ్ఛేదికి మంజువాదికి నశేషజగజ్జన నందవేదికిన్‌ 
మోదక ఖాదికిన్‌ సమదమూషికసాదికి సుప్రసాదికిన్‌
నమ్ముకున్న
వారి దోషాలను హరించేవాడు, శరణు కోరిన వారిని సంతోషపెట్టేవాడు, విఘ్నాలను తొలగించేవాడు, అశేష ప్రజావాహినికి ఆనందం కలిగించేవాడైన ఆ పార్వతీ తనయుడు, ఆ మోదక ప్రియుడు, ఆ మూషిక వాహనుడికి మొక్కుతున్నాను అన్నాడు పోతన. ఆయన ఒక్కడేనా... మన కవులందరూ ఆ వినాయకుడికి చేతులు జోడించిన వారే. అది అలా ఉంచితే, విఘ్నేశ్వర పూజలో పత్రికి ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. ఏనుగు ఆకారంలో ఉండే గణనాథుడిని 21 రకాల మొక్కల ఆకులతో పూజించాలన్నది పెద్దల మాట. ఈ పూజలో అంతరార్థం ఆరోగ్య సంరక్షణే. 
      ‘జాజికాయ పోస్తే జోకొట్టినట్టు నిద్రపోతారు- మాచికాయ పోస్తే మతిపోయినట్టు నిద్రపోతారు’... గుక్కపెట్టి ఏడుస్తూ సరిగా నిద్రపోని పసివాళ్లకు కాస్త ఉపశమనం కలిగించడానికి పెద్దలు సూచించిన మార్గమిది. వినాయక పూజాపత్రిలో ఈ మాచి కూడా ఒకటి. చేమంతి జాతికి చెందిన ఈ మొక్క సుగంధభరితంగా ఉంటుంది. ఇక దాని ఆకులు కళ్లకు చలువ చేస్తాయి. తలనొప్పిని తగ్గిస్తాయి. ‘ఉత్తమం ఉత్తరేణి- మధ్యమం మారేడు’... దంతధావనానికి మేలైన మొక్కలేంటో చెప్పే సామెత ఇది. ఈ రెండు మొక్కలూ గణపతికి ప్రీతిపాత్రమైనవే. పంటి జబ్బులకు మంచి మందు అయిన ఉత్తరేణి ఆకులు విషాన్నీ విరిచేస్తాయి. మారేడు ఆకు (బిల్వపత్రం) త్రిశూలంలా ఉంటుంది. నీటిలోని మలినాలను తొలగిస్తుంది. ఆకులు, ఫలాలు రక్తశుద్ధికి ఉపయోగపడతాయి. బొజ్జ గణపయ్య తండ్రి శివయ్యకూ మారేడు అంటే మహా ఇష్టం. బిల్వవృక్షం పరమేశ్వర రూపమన్నది శివపురాణం గాథ.  
ములక మంచిదే
‘ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి’ అంటూ ఆ ఏకదంతుడికి సమర్పించేదొకటి ఉంది. చూడటానికి వంగ ఆకులా ఉంటుంది. తెల్లని చారలు దాని ప్రత్యేకత. అదే ములక. గుండెకు మేలు చేస్తుంది. శ్వాసకోశ వ్యాధులను తగ్గిస్తుంది. 
      ఉమ్మెత్త అంటే వినాయకుడితోపాటు శివుడికీ ఇష్టమే. ఉమ్మెత్త పూలతో పరమేశ్వరుణ్ని పూజిస్తే సంతానం కలుగుతుందన్నది నమ్మకం. ఇక ‘ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి’ అంటూ గణపతి పూజలోనూ ఉమ్మెత్త ఆకులను వినియోగిస్తారు. ఇవి జ్వరాన్ని తగ్గిస్తాయి. కుష్ఠు నివారణకూ వాడతారు. తేలు, జెర్రి, కుక్కకాటులోని విషాన్ని హరించే గుణం ఈ ఆకులకు ఉంది. అయితే, ఇవీ కాస్త విషపూరితాలే. కాబట్టి వినియోగించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. 
      కాదేదీ కవితకనర్హం అన్నట్టు గజాననుడి పూజకు గడ్డి కూడా అర్హురాలే. పైగా ఈ గరిక (దుర్వాయుగ్మం) అంటే ఆయనకు మహా ఇష్టం. ఇది మూత్ర సంబంధ వ్యాధులను దూరం చేస్తుంది. చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది. ఇక కాస్త పుల్లపుల్లగా తియ్యతియ్యగా ఉండే రేగుపళ్లు అంటే అందరికీ ఇష్టమే కదా. లంబోదరుడు మనకన్నా ఒక ఆకు ఎక్కువే చదివాడు. అందుకే ఆయన ఆ ఆకుల (బదరీపత్రం) మీదా ప్రేమ పెంచుకున్నాడు. భోజనం అనంతరం రేగు ఆకులను తింటే, ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. పొట్ట పెరగదు.  
గన్నేరు గొప్ప
‘కోటలో తులసమ్మ కొలువైన తీరు... కోరి కొలిచే వారి కొంగుబంగారు’ అంటూ తులసిని కళ్లకద్దుకుంటాం కదా. ఔషధాలగని అయిన తులసితో గజకర్ణుణ్ని అర్చించడమంటే మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోవడమే. తులసి నీటినీ, గాలినీ శుద్ధి చేస్తుంది. కీటకాలను ఇంట్లోకి చేరనివ్వదు. అందుకే గుమ్మంలో దీన్ని పెడతారు. జ్వరం, దగ్గు, దురదలాంటి వ్యాధులకు దివ్య ఔషధం. ఇక మామిడి గురించి తెలిసిందే. పళ్ల్లలో రారాజు. మామిడాకులు కడితేనే ఏ శుభకార్యానికైనా నిండుదనం. ఈ ఆకులు ఆకుపచ్చగా ఉన్నంతవరకూ కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి. ఆక్సిజన్‌ను వెలువరిస్తాయి. అంతేకాదు మామిడాకులు మూత్ర సంబంధ వ్యాధులనూ తొలగిస్తాయి. 
      పచ్చగన్నేరు పువ్వుల ప్రత్యేకతే వేరు. అందుకే ‘ఇంతిరావె గొజ్జంగి బంతిరావె’ అంటూ పాడుకునే పాటలో ‘పచ్చగన్నేరు సన్నదినుసులు’ వచ్చిచేరాయి. చెంగావి గన్నేరు మొగ్గలైతే సినీకవులకు ఉపమానాలయ్యాయి. బతుకమ్మల అలంకరణలోనూ గన్నేరులు ఉండాల్సిందే. అలాంటి గన్నేరు ఆకులను ‘ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి’ అంటూ విఘేశ్వరుడికి అందివ్వడం ఆనవాయితి. ఈ ఆకులు జుట్టును పెంచుతాయి. విషాన్ని హరిస్తాయి. కానీ, ఎక్కువైతే విషతుల్యమే.
      నీలం, తెలుపు రంగుల్లో మెరిసే శంఖుపుష్పాలు అందరికీ తెలిసినవే. ఈ మొక్క (విష్ణుకాంత) ఆకులు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. అందుకే భిన్నదంతుడికీ ఇవి నచ్చాయి. ఇక దాడిమీపత్రం అంటే ఏంటో అని దడుసుకునేరు!! అందరికీ ఇష్టమైన దానిమ్మ మొక్క ఆకే అది. ఆకలి కలిగిస్తుంది. అజీర్ణాన్ని పోగొడుతుంది. గుండె జబ్బులున్న వాళ్లకి మేలు చేస్తుంది. దానిమ్మ పండు తింటే వాంతులు, విరేచనాలు తగ్గుతాయి. దేవదారు విషయానికొచ్చేసరికి ‘ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి’ అని సరిపెట్టుకోవాలేమో! ఎందుకంటే ఈ చెట్లు ఎక్కువగా హిమాలయ ప్రాంతాల్లో ఉంటాయి. మనకు దొరకడం కష్టం. దొరకబుచ్చుకున్న వాళ్లు అదృష్టవంతులే. ఎందుకంటే అది దోమలు, కీటకాలను పరిసరాలలోనికి రానివ్వదు. 
మరువం... మరువం
మరువం మీద మనసు పారేసుకోని మహిళలు అరుదు. సుగంధ భరితమైన ఈ ఆకులు పూలదండల్లో విరివిగా కనిపిస్తాయి. ఇది జుట్టు రాలనివ్వదు. గుండె జబ్బులున్న వాళ్లకి మంచిది. ఫాలచంద్రుణ్ని మరువకపత్రాలతో పూజించడం ఆచారం. ఇంతకూ మీరెప్పుడన్నా వావిలిగౌరి నోము నోచారా? ఏమీలేదు వావిలిచెట్టును గౌరీదేవిగా భావించి ఏడాది పాటు అర్చించాలి. ఆ తర్వాత ఉద్యాపనం చేయాలి. పేరు ఏదైనా ఏడాది పాటు ఓ చెట్టును పూజించమన్నారంటే దాంట్లో అర్థమేంటి? ఆ చెట్టు అత్యంత ఔషధగుణ సంపన్నమైందనే కదా. అవును.. వావిలి ఆరోగ్య వరాలను అనుగ్రహిస్తుంది. వాతరోగ నివారణకు ఉపయోగపడుతుంది. విషానికి విరుగుడవుతుంది. జ్వరం మీదవచ్చే నొప్పులకు పనిచేస్తుంది. సింధువార పత్రం పేరిట ఇది కూడా వినాయకచవితి పత్రిపూజలో దర్శనమిస్తుంది. 
      సన్నజాజిని ఇష్టపడని కోమలాంగులెవరు చెప్పండి? అందంతో పాటు ఇది ఆరోగ్యానికీ అక్కరకొస్తుంది. అజీర్ణం తొలగిస్తుంది. తలకు సంబంధించిన రోగాలను దరిచేరనీయదు. శూర్పకర్ణుడికి జాజిపత్రం సమర్పించడం అన్నివిధాలా శ్రేయస్కరమే. తీగలాగ పాకే లతా దుర్వా (గండకీపత్రం) అధిక దప్పికను తీరుస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. ఇక జమ్మికి విజయదశమి నాడే కాదు వినాయకచవితి రోజూ ప్రాధాన్యముంది. ఈ జమ్మి ఆకులు వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులను తొలగిస్తాయి. 
      వృక్షాల్లో అశ్వత్థవృక్షం (రావి చెట్టు) తన విభూతి అని శ్రీకృష్ణపరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. ‘ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి’ అంటూ దాంతో గణేశుణ్నీ పూజిస్తాం. రావి ఆకులు మూత్ర సంబంధ, శ్వాసకోశ, చర్మవ్యాధులను తగ్గిస్తాయి. అర్జున పత్రాలుగా పిలుచుకునే మద్ది ఆకులను రక్తదోషం, క్షయ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఎక్కువ సంవత్సరాలు కలిగిన జిల్లేడు చెట్టు వేరు వినాయకుడి రూపంలో ఉంటుందని చెబుతారు. దాన్ని శ్వేతార్కమూల గణపతి అని పిలుస్తారు. దీని పాలు విషానికి విరుగుడుగా వాడతారు.  
      వినాయకచవితి నాడు తెలుగింటి పాలవెల్లి కింద గణపయ్యకు అలంకారంగా భాసించే ప్రతి ఆకులోనూ బోలెడు ఔషధగుణాలున్నాయి. ఆయుర్వేదంలో విరివిగా వాడే ఆ పత్రాల ప్రాముఖ్యం మన పెద్దలకు తెలుసు. అందుకే వాటికి తగిన ప్రాధాన్యం ఇచ్చారు. అనేక రోగాలను హరించే శక్తి ఉన్న ఆ పత్రాలకు ఏడాదికోసారైనా సన్నిహితంగా ఉండే ఏర్పాటు చేశారు. మూడు నుంచి పదకొండు రోజులపాటు ఆ ఆకులతో వినాయకుడికి నిర్వహించే పూజ వల్ల నిజంగా ఒనగూరే ఫలం చక్కటి ఆరోగ్యమే.


వెనక్కి ...

మీ అభిప్రాయం