సామెతల సేద్యం

  • 2249 Views
  • 835Likes
  • Like
  • Article Share

    డొక్కా మణిచంద్రిక

  • అమలాపురం.
  • 9951596921
డొక్కా మణిచంద్రిక

తెలుగునేల వ్యవసాయ ప్రధానమైంది.  భాషలో, సాహిత్యంలో ఆ వ్యవసాయ విజ్ఞానం ఎంతో ఉంటుంది. వీటిలో స్థానిక పరిస్థితులు, సమస్యలు- పరిష్కారాలు వంటి అంశాలు నిబిడీకృతమై ఉంటాయి. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి శ్రమించే రైతులు, పశు పోషకులు తరతరాలుగా ఆర్జించిన వాతావరణ, పంటల విజ్ఞానాన్ని  సామెతల్లోనూ నిక్షిప్తం చేశారు. కావాలంటే మచ్చుకు కొన్నింటిని చూద్దాం
దుక్కి ఉంటేనే దిక్కు
సాగు ప్రారంభానికి ముందే వ్యవసాయ క్షేత్రాన్ని బాగా దున్నాలి. మానవ సమాజం ఆదిమదశలో సేద్యం విత్తనాలను నేరుగా నాటడం, వెదజల్లడంతో జరిగేది. అటవీ ప్రాంతాల్లో అయితే చెట్లను కొట్టి చేసే పోడు వ్యవసాయం ప్రధానంగా సాగేది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇలాగే సాగుతోంది. నాగరికత పెరిగి, ఇనుము అందుబాటులోకి రాగానే నాగలి, పార, గడ్డపారలాంటి పరికరాలను తయారుచేసి మానవుడు ఆహారంలో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేశాడు.   భూమిని దున్ని చక్కగా తీర్చిదిద్దిన చాళ్లలో విత్తనాలు వేసి పంటను ఇబ్బడి ముబ్బడిగా పండించగలిగాడు. దున్నకపోతే భూసారం విత్తనాల పెరుగుదలకు అంతగా ఉపయోగపడదు. అందుకే ‘దుక్కి ఉంటేనే దిక్కు’ సామెత వ్యాప్తిలోకి వచ్చింది. మనిషి జీవితాన్ని వ్యవసాయంతో పోల్చడమూ కద్దు. ‘దుక్కి కొద్ది పంట- బుద్ధి కొద్ది సుఖం’ అనే సామెత బాగా దున్నితే పంట బాగా పండినట్లే, మంచి బుద్ధి కలిగి ఉంటేనే జీవితం సుఖంగా సాగుతుందనే వాస్తవాన్ని చెబుతుంది. ‘దుక్కి చాలని చేనుకు ఎంత ఎరువు వేసినా ఒట్టిదే’ అనే సామెత పునాది బలంగా ఉండాలని సూచిస్తుంది. ‘అరక అరిగితే గరిస విరుగుతుంది, నాగలి ఉన్న ఊరు ఆకలి చేరదు, జానెడు దుక్కి మూరెడు ఎరువుకి సమానం’ తదితరాలు దున్నడం ప్రాధాన్యతను తెలియజేస్తాయి. 
ఇక దున్నడంలో చూపించాల్సిన శ్రద్ధను వ్యంగ్యంగా తెలిపే ఆణిముత్యం... ‘దున్నాల్సిన నాడు దూరదేశం పోయి కోతలకాలంలో కొడవలి పట్టి వచ్చాడట’!  
పల్లానికి ఏడు- మెరకకు నాలుగు దుక్కులు
పల్లపు ప్రాంతంలో పండించే వరి లాంటి పంటలకు, మెరక ప్రాంతంలోని కొబ్బరి పంటకు దున్నడంలో తేడాను ఈ సామెత తెలియజేస్తుంది. ‘నువ్వులకు ఏడు దుక్కులు, ఉలవకు ఒక దుక్కి; పత్తికి పదిచాళ్లు - ఆముదాలకు ఆరుచాళ్లు - జొన్నకు ఏడుచాళ్లు’ తదితర సామెతలు దున్నడం వల్ల మెత్తబడే భూమి లోతునుబట్టి ఆయా పంట వేళ్లు అల్లుకొనే వైశాల్యాన్ని తెలియజేస్తాయి. అన్నం వండాలంటే తగినన్ని నీళ్లుండాలి. అలాగే పంట బాగా పండాలన్నా సమయానికి తగినంత వర్షం కురవాలి. ఈ విషయాన్ని వెల్లడించే సామెత.... ‘అన్నానికి పదును తప్పినా - భూమికి అదను తప్పినా పనికిరావు’. 
నారు... నీరు
తరతరాలుగా నేల దున్ని నింగి చూస్తూ, చినుకుపడితే పొంగిపోతూ, పడకపోతే కుంగిపోతూ జీవనం సాగించే రైతు అనుభవసారమంతా సామెతలలో ఉంది. దుక్కి దున్నిన తరువాత పొలానికి కావలసింది నీటి వసతి. చాలా ప్రాంతాల్లో వ్యవసాయం వర్షాధారం. రైతులు నిరంతరం వాతావరణాన్ని పరిశీలించేవారు. ఆకాశంలో మబ్బులను బట్టి వర్షపురాకను అంచనా వేసేవారు. వర్షాలు సకాలంలో కురిస్తేనే పంటలు బాగా పండుతాయి. అలాంటిది తొలకరిలోనే మంచి వర్షాలు కురిసి చెరువునిండితే ఇంక చెప్పేదేముంటుంది. కొడుకు ఎదిగి వ్యవసాయ పనుల్లో సహాయపడతాడని భావించో లేక మనది పితృస్వామ్య సమాజం కాబట్టో తొలిచూలు కొడుకు లాభం అని భావించి ‘తొలకరిన చెరువునిండినా తొలిచూలిని కొడుకు పుట్టినా లాభం’ అంటారు. ‘నల్ల చీమ గుడ్డు మోస్తే వాన తప్పదు’... ఇది పరిసరాల పరిశీలన ద్వారా పుట్టిన సామెత. వాన రాకను చీమలు పసిగట్టి తమ గుడ్లను సురక్షిత ప్రాంతాలకు తీసుకొని వెళతాయి. దాన్ని చూసిన రైతులు ఈ సామెతను అల్లుకున్నారు. ఇక ‘పెద్దింటి బొట్టె అయినా కావాలి, పెద్ద చెరువు నీరయిన కావాలి’ అనే సామెత లోకానుభవంతో చెప్పింది. వ్యవసాయ కూలీలను ఆదరించే పెద్దింటి ఇంట్లో పెరిగిన ఆడపిల్ల పెళ్లయ్యాక కూడా ఒద్దికగా ఉంటూ కుటుంబానికి పేరు తెస్తుందని వారి నమ్మకం. అలాగే పెద్ద చెరువు ఉంటే నీటి కరవు ఉండదు. అందువల్లనే ఈ రెండింటికి పోలిక. 
      కాలువల ద్వారా సాగు సాధ్యం కాని చోట బావులు, చెరువులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. బావినుంచి నీళ్లు తోడాలంటే కొంత కష్టంతో కూడుకున్నది. అదే చెరువు అయితే తూము నుంచి కాలువ తీసి పొలానికి మళ్లించుకోవచ్చు. ఈ సూక్ష్మాన్ని తెలిపేదే ‘బావికింద దున్ని బాగుపడినవాడు, చెరువు కింద దున్ని చెడినవాడు లేడు’. 
      నీరు- వర్షాల ప్రాధాన్యత తెలిపే మరికొన్ని సామెతలు- ఉత్తరాన మబ్బు పడితే ఊరకనే పోదు, పడమర పిసరంత మబ్బుపడితే పాతాళం దాకా వాన, వట్టి నేలలో కప్ప అరిస్తే వర్షం తప్పదు, గొర్రెలు గుంపు గూడితే గొప్ప వర్షం.
క్షేత్ర మెరిగి విత్తనం పాత్ర మెరిగి దానం 
ఇది పొలానికి విత్తనానికి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. దుక్కి దున్ని నేలను సిద్ధం చేశాక నేలరకం, నీటి వసతినిబట్టి మేలురకం విత్తనాలను పొలం మొత్తం సమంగా వ్యాపించేటట్లు గొర్రు, నాగలి, యంత్రాల సాయంతో నాటుతారు. మట్టి స్వభావాన్ని బట్టి విత్తనాలను ఎన్నుకోవాలి. వ్యక్తి అవసరానికి తగినంత మాత్రమే దానం చేయాలి. ‘వరికి పాల చవిటి నేల పొగాకుకు పొడినేల’, ‘నల్ల నేలలో నువ్వులు ఎర్ర నేలలో కందులు’ మొదలైనవి ఈ కోవలోవే.
      మేలురకం గింజలను విత్తనాల కోసం దాచుకుంటారు. ఎవరి దగ్గరైనా మేలురకం గింజలు అయిపోతే, విత్తనాల కోసం ఉన్నవారి దగ్గరికి వెళితే వారు పెత్తనం చెలాయించేవారు. దీనినుంచి పుట్టిందే ‘విత్తనాలు ఉంటేనే పెత్తనాలు’. విత్తనంలోనే జీవశక్తి ఉంటుంది. దీన్ని రుజువు చేసేది ‘విత్తనాలలో లేనిది విశ్వంలో లేదు’. విత్తనాలు కల్తీవి అయితే గాదెలు వెలితిగా ఉంటాయని తెలిపేది ‘కల్తీ విత్తనం వెల్తిగాదెలు’. ఊరకే దున్నడంకాదు విత్తనాలు సరిగా చల్లితేనే అనుకున్నట్లుగా పంటచేతికి వస్తుందని చెప్పేది ‘నీ దున్నడంలో ఏముంది? అంతా నా చల్లడంలోనే’.
ఎరువు పెట్టిన చేను ఏలుబడి అయిన కోడలు
పంట పెరిగే దశలో ఎరువు చల్లితేనే ఉత్పత్తి తగినంత వస్తుంది. మెట్టినింట్లో చేదోడువాదోడుగా ఉండే కోడలు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. అలాగే సమయానికి తగినంత ఎరువు అందిస్తేనే చేను ఇబ్బడి ముబ్బడిగా పండుతుందనేది ఇందులో దాగున్న సత్యం. రసాయన ఎరువులు లేనికాలంలో సహజంగా లభ్యమయ్యే సేంద్రియ ఎరువులు వాడి దిగుబడి పెంచేవారు. పేడతో తొక్కి రొచ్చు చేసిన స్థలం పంటలకు ఎంతో అనుకూలం. దీనిని తెలియజేసేదే ‘పశువుల రొచ్చుగుంత, పంటకాపు గచ్చు పాతర’ (పూర్వం నాణేలు బిందెల్లో నింపి పాతిపెట్టేవారు. పాతిపెట్టిన ధనమే పాతర). తంగేడు, కానుగాకు వరిపంటకు మంచి పచ్చిరొట్ట ఎరువు. పూసిన తరువాత తంగేడు ఆకులు, కాచిన తరువాత కానుగాకుల్లో నత్రజని శాతం తగ్గుతుంది. కనుక పూతకు, కాయడానికి ముందే ఆకును పచ్చిరొట్టగా పొలంలో వేయాలని చెప్పే సామెత ‘పూచిన తంగేడు వేస్తిరా, కాచిన కానుగ వేస్తిరా నేను పండేందుకు అందట చేను’. రసాయన ఎరువుల విషప్రభావం నుంచి బయటపడాలనుకునే వీటిలోని పరమార్థాన్ని గ్రహించాలి.
కలుపు తీయని వారికి కసవే...
చేనులో పంటతోపాటు పెరుగుతున్న కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. లేకపోతే చల్లిన ఎరువును గ్రహించి కలుపు ఏపుగా పెరుగుతుంది. దిగుబడి తగ్గుతుంది. ‘కలుపుతీయని వారికి కసువే(గడ్డి) మిగులుతుంద’నే సామెత ఈ విషయాన్నే వెల్లడిస్తుంది. ‘చేలో కలుపు వైద్యుని చేతి తళుకు’... కలుపు ఎప్పటికప్పుడు తీయకపోతే సారవంతమైన పంట చేతికందదు, నిస్సారమైన పంటను ఆహారంగా తీసుకుంటే అది వైద్యునికి లాభం అంటూ హెచ్చరిస్తుంది. 
పాడి పంట
పాడి పంట అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. వ్యవసాయానికి పశుసంపద ప్రాణాధారం. రైతులు పశువులను కన్నబిడ్డలా చూసుకుంటారు. వాటిని పూజిస్తూ, అభిమానిస్తూ వ్యవసాయం కొనసాగిస్తారు. వాటికి నలత కలిగితే బాధపడతాడు. ‘ఎక్కువ వెలపెట్టి గుడ్డను, తక్కువ వెలపెట్టి గొడ్డును కొనరాదు’, ‘ఎద్దులేని సేద్యం, చద్దిలేని పయనం’, ‘ఆవు పొదుగులోనే అరవై ఆరు పిండి వంటలు’ సామెతలు వ్యవసాయంలో పశువుల ప్రాముఖ్యత తెలియచేస్తాయి.
తరతరాల పరిశీలన కార్తెల పరిజ్ఞానం
ఉపగ్రహ సమాచారం అందుబాటులో లేని కాలంలోనే నిత్యపరిశీలనతో వాతావరణాన్ని అంచనావేస్తూ వ్యవసాయం చేశారు రైతులు. ఏడాది 27 నక్షత్రాలను 27 కార్తెలుగా (ఒక కార్తె సుమారు 14రోజులు ఉంటుంది) విభజించి ఆయా కార్తెల్లో వాతావరణం తీరు, దానికనుగుణంగా చేయాల్సిన పనులు, చేయకూడనివి సామెతలుగా చెప్పారు. ఈ కార్తెలలోని వర్షపాతాన్ని బట్టి ఆ ఏడు అతివృష్టా, అనావృష్టా లేక సామాన్యమా చెప్పగలిగేవారు. తొలకరి వానలు ఆషాఢంలో మృగశిరకార్తె (సుమారు జూన్‌ 8- 21)లో ప్రవేశిస్తాయి. ‘మృగశిర కురిస్తే ముంగిళ్లు చల్లబడతాయి, మృగశిర చిందిస్తే మిగిలిన కార్తులు కురుస్తాయి, మృగశిర వర్షిస్తే మఖ గర్జిస్తుంది, మృగశిరలో తొలకరి వర్షిస్తేనే మఖలో వర్షాలు పడతాయి, మృగశిర చిందిస్తే ముసలెద్దు రంకె వేస్తుంది, మృగశిరలో వేసిన పైరు మేలు చేస్తుంది’ తదితర సామెతలు సేద్యంలో మృగశిర  ప్రాధాన్యాన్ని చెబుతాయి. 
      ఆరుద్ర (జూన్‌ 22- జూలై 5) కార్తెలో వర్షాలు ఎక్కువ పడడం పంటకు చాలా అవసరం. ఆ అవసరాన్ని తెలిపేవే ‘ఆరుద్ర వాన అదను వాన, ఆరుద్ర కురిస్తే దారిద్య్రం ఉండదు, ఆరుద్రకార్తె విత్తనానికి- అన్నం పెట్టిన ఇంటికి చెరుపు లేదు, ఆరుద్రలో అడ్డెడు చల్లితే సులువుగా పుట్టెడు పండుతాయి’ లాంటి సామెతలు. 
      తరువాత కార్తెలు పునర్వసు (జూలై 6- 19) పుష్యమి (జూలై 20- ఆగష్టు 02). ‘పునర్వసు, పుష్యములు వర్షిస్తే పూరెడుపిట్ట అడుగైనా తడవదు’ సామెత ఆ రోజుల్లో వానలు తక్కువ అనే అంశాన్ని తెలుపుతుంది. ఆపై వచ్చే ఆశ్లేష కార్తె(ఆగష్టు 3- 16)లో నాన్పుడు వర్షం కురుస్తుంది. నాట్లు కూడా త్వరగా సాగుతాయి. అధిక వర్షం సాగు పనులకు ఆటంకం కలిగిస్తుంది. అరికాలు తడి అయ్యేంత వర్షం నాట్లకు అనుకూలం. అందుకే ‘ఆశ్లేషలో ఊడిస్తే అడిగినంత పంట, ఆశ్లేషలో అడుగునకొక చినుకు అయినా అడిగినన్ని పండలేను అందట వరి, ఆశ్లేషలో అడ్డెడు చల్లడం మేలు’ మొదలైనవి ఆశ్లేష కార్తెకు సంబంధించిన సామెతలు. మఖ (ఆగష్టు 17- 30) శ్రావణంలో వస్తుంది. వానలు ఎక్కువ. ‘మఖలో మానెడు చల్లడం కన్నా ఆశ్లేషలో అడ్డెడు చల్లడం మేలు, మఖలో చల్లిన విత్తనాలు మచ్చలు కనబడతాయి, మఖ ఉరిమితే వెదురు మీద కర్రయినా పండుతుంది’ లాంటివి ఈ కార్తెలో చేయాల్సిన వ్యవసాయ పనుల గురించి తెలియచేస్తాయి. 
      ముందు వచ్చే కార్తెలలో వర్షాలు అంతగా కురవకపోయినా వర్ష రుతువులో వచ్చే మఖ, పుబ్బ (ఆగష్టు 31- సెప్టెంబరు 13) కార్తెలలో తప్పక కురవాలి. లేకపోతే క్షామం తప్పదు. ‘మఖ పుబ్బలు వరుపయితే మహా ఎత్తయిన క్షామం, మఖలో పుట్టి పుబ్బలో మాడినట్లు’ (పుట్టగొడుగులు మఖలో పుట్టి పుబ్బలో మాడిపోతాయి. ఏదైనా స్వల్పకాలంలోనే అణగిపోతే దీనిని వాడతారు) సామెతలు దీన్ని సూచిస్తాయి. ‘పుబ్బలో చల్లడం దిబ్బ మీద చల్లినట్లే’ అనేది పుబ్బలో విత్తడం మంచిది కాదని చెబుతుంది. 
ఉత్తర చూసి ఎత్తరగంప
ఉత్తర కార్తె సెప్టెంబరు మధ్యలో వస్తుంది. ఖరీఫ్‌ పంట ఒకదశకు చేరుతుంది. ఈ కార్తె ప్రవేశించే నాటికి వానలు సరిగా పడకపోతే సాగు కష్టం అని చెప్పడమే ఈ సామెత ఉద్దేశం. దీన్ని సూచించేందుకే గంపను ఎత్తి పక్కన పెట్టమని చెప్పారు జానపదులు. ఉత్తరలో వరినాటడానికి ఆలస్యం అవుతుంది. వేరుశనగ, సజ్జ, పప్పు ధాన్యాలు కూడా ఈ కార్తెలో విత్తకూడదు. జొన్న మాత్రం కొన్ని ప్రాంతాలకు అనుకూలం. ఉలవ అన్ని ప్రాంతాలలో చల్లడానికి మంచి అదును. అందుకే ‘ఉత్తర పదును ఉలవకే అదును’ అనే సామెత పుట్టింది. ‘ఉత్తర ఉరుము తప్పినా, రాజుపాడి తప్పినా, చెదపురుగుకి రెక్కలొచ్చినా కష్టం, విశాఖ చూసి విడవర కొంప, ఉత్తర హస్తలు వృష్టికి ప్రమాణం’లాంటి సామెతలూ ఇలాంటివే. 
      ఉత్తర తరువాత వచ్చేది హస్త (సెప్టెంబరు 27- అక్టోబర్‌ 11). ఆశ్లేషలో నాటిన వరిపంట హస్తకార్తె వచ్చే సరికి అనాకుపొట్ట దశకు వస్తుంది. చిత్తకార్తెలో (అక్టోబరు 11- 23) చిరుపొట్ట వస్తుంది. వెన్ను చిరుపొట్టతో ఉంటుంది. ఈ సమయంలో నీరు చాలా అవసరం. అప్పుడు వర్షం లేకపోతే పంట చేతికి రావడం కష్టం. ‘హస్త కురవక పోతే విత్తినవాడూ, విత్తని వాడూ ఒక్కటే, హస్తకు అనాకుపొట్ట, చిత్తకు చిరాకు పొట్ట, హస్త చిత్తలు ఒక్కటైతే అందరి సేద్యం ఒక్కటే, చిత్త కురిస్తే చింతలు కాస్తాయి, చిత్త స్వాతులు కురవకపోతే చిగురుటాకులు మాడిపోతాయి...’ లాంటి సామెతలు చాలా ఉన్నాయి.
యథా చిత్త తథా స్వాతి
చిత్తలో వర్షం ఎలా ఉంటుందో, స్వాతిలో కూడా అలాగే ఉంటుంది. ఈ కార్తెలో సాధారణంగా గాలివానలు వస్తాయి. ‘స్వాతివాన చేనుకు హర్షం (మెట్ట ప్రాంతం), చిత్త చిత్తగించి, స్వాతి చల్లచేసి, విశాఖ విసరకుంటే వీసానికి పుట్టెడు పండుతానంటుంది జొన్న’ లాంటి సామెతలు తెలుగులో ఎన్నో ఉన్నాయి. విశాఖ కార్తె వచ్చేప్పటికి వరి కోతకు సిద్ధంగా ఉంటుంది. వర్షం అవసరం ఉండదు. ఈ అనుభవంతో వచ్చిన సామెత ‘విశాఖ కురిస్తే పంటకు విషమే’. అయితే.. మఖ, పుబ్బల్లో చల్లిన ఆముదాలు విశాఖలో పొట్టమీద ఉంటాయి. అప్పుడు వాటికి వర్షం అవసరం. అందుకే ‘విశాఖ వర్షం ఆముదాలకు హర్షం’! ఇక భరణి (ఏప్రిల్‌ 27- మే 10), కృత్తిక (మే 11- 24), రోహిణి (మే 25- జూన్‌ 7)లపై ‘భరణి కురిస్తే ధరణి పండును, కృత్తికలో విత్తితే కుత్తుకలు నిండవు, రోహిణిలో విత్తితే రోటిలో విత్తినట్లే’ లాంటివి రైతుల ప్రకృతి పరిశీలనా దృష్టికి నిదర్శనాలు.
ఊరిముందరి చేను... ఊళ్లో వియ్యం అందిరావు
ఊరికి సమీపంలో చేను ఉంటే ఊళ్లో ఉండేవారు, వచ్చిపోయే వారు, పశువుల బెడద... ఇంత కష్టం ఉంటుంది. ఇక ఊళ్లో వియ్యం సంగతి... భార్యా భర్తలిద్దరిది ఒకే ఊరయితే ఆ ఇంట్లో విషయం ఈ ఇంట్లో, ఈ ఇంట్లో విషయాలు ఆ ఇంట్లో తెలిసి సంసారం ఇబ్బందికరంగా సాగుతుంది. ఈ సామెత పుట్టుకకు కారణం ఇదే. ‘కర్ణునితో భారతం సరి కార్తీకంతో వానలు సరి, ఫాల్గుణమాసపు వాన పది పనులకు చెరుపు’ ఇలా ఎన్నో సామెతలు జీవితానుభవం నుంచి పుట్టాయి. 
      వందల ఏళ్లుగా ఈ విజ్ఞానం రైతులకు దారిదీపంగా నిలిచింది. ఇప్పుడు ఈ విజ్ఞానం రూపుమాసిపోతోంది. ఇప్పటి వారికి చాలా సామెతలు, ముఖ్యంగా వ్యవసాయ పనులకు సంబంధించినవి తెలియవు. వీటిని పాఠ్యప్రణాళికలో భాగం చేయాలి. అప్పుడే మనదైన విజ్ఞానం ముందుతరాలకు భద్రంగా అందుతుంది. 


వెనక్కి ...

మీ అభిప్రాయం