కాకి కథ

  • 2086 Views
  • 19Likes
  • Like
  • Article Share

    ఎ.ఎ.విజయకుమార్

  • రైల్వే ఉద్యోగి
  • కాకినాడ
  • 9959336595
ఎ.ఎ.విజయకుమార్

ఎన్నో రోజుల తర్వాత విశ్రాంతి దొరికింది. ముందురోజంతా ఏవో గొడవలు. రాత్రి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు నిద్రపట్టిందో కాని పొద్దున ఏడు గంటల వరకూ మెలకువ రాలేదు.
      బయట గోడ మీద కాకి ‘కావ్‌ కావ్‌...’మని గట్టిగా అరుస్తోంది. ఆ ‘కాకిగోల’కి మెలకువొచ్చింది. నేను జంతు ప్రేమికుడిని. కాకి అంటే నాకెంతో ఇష్టం.
      పళ్లు తోముకొని, టీ తాగి, దినపత్రిక తీశాను. కేంద్రబడ్జెట్‌ గురించి వార్తలు. పేదవాడి కోసం ఎన్నో పథకాలు ప్రకటించారు. దిల్లీలో బయల్దేరిన కోట్ల రూపాయలు పేదవాడి చేతికొచ్చేసరికి అర్ధో, పావలానో అవుతాయి... అన్నీ ‘కాకిలెక్కలు’.
      ఎదురింటి మస్తానయ్య బండి మొరాయిస్తోంది. అతను ‘నల్లగా.. కాకిలాగ’ ఉంటాడు. పక్కన వాళ్లావిడ అసహనంగా నిల్చుంది. ఎక్కడికి బయల్దేరారో మరి. ఆవిడ తెల్లగా చక్కగా ఉంటుంది. అనకూడదుగానీ ‘కాకి ముక్కుకి దొండపండు’. 
      రోడ్డు మీద వెళ్తుంటే ఒక్కసారి గుండె ఝల్లుమంది. ఎవరో అచ్చు మా బావలా ఉన్నాడు. అదే ఎత్తు, అదే నలుపు. ‘కాకిలాగ ఎండలో తిరిగి తిరిగి’ నల్లబడిన చర్మం. బావ పోయి సంవత్సరమైంది. పొగాకు, మద్యం, మత్తు పదార్థాలకు అలవాటుపడి చివరికి అదేదో హోద్గ్కిన్స్‌ వ్యాధితో ఏకాకిలా ‘కాకి చావు చచ్చాడు’.
      నా మిత్రుడొకడు ‘ఏకాకే’. తోబుట్టువులతో ఆస్తి గొడవలు. అమ్మ బంగారం వాళ్లు తీసుకొని ‘కాకి బంగారం’ వీడికిచ్చారు. వాళ్లు చేసిన దుష్ప్రచారానికి వీణ్ని ‘లోకులు కాకుల్లా పొడిచారు’. మరి ‘ఎద్దుపుండు కాకికి ముద్దు’ కదా!
      చంటి పిల్లాడి ఏడుపు వినిపించి ఆలోచనల్లోంచి బయటికి వచ్చాను. మా పనిమనిషి కోడలు తన కొడుకుని ఆడిస్తోంది. ‘కాకిపిల్ల కాకికి ముద్దు’ అదిగో మళ్లీ కాకి. ఆలోచిస్తుంటే ‘కాకినాడ’ గుర్తుకొచ్చింది. శ్రీకాకుళంలో ‘కాకివీధి’ ఉంది. ఆ వీధిలో చాలా మంది ఇంట ¨పేరు ‘కాకి’. బాబోయ్‌ ఈ వేళ ఈ ‘కాకి గోల’ ఏంటో? మా ఎదురింటి వాళ్లకీ పక్కింటి వాళ్లకీ పడదు. ‘ఈ ఇంటి మీది కాకి ఆ ఇంటి మీది వాలదు’. చివరింటి ఆవిడది ‘కాకిబుద్ధి’. ‘ఏది కనిపించినా కాకెత్తుకుపోయినట్టు’ ఎత్తుకుపోతుంది.
      ఇంతలో మా ఆవిడ గుర్తుచేసింది మావయ్యగారి తద్దినం ఉందని. పంతులుగారిని కలిస్తే, ఆయ్యో, మీరు రావడం ఎందుకు, ‘కాకితో కబురంపితే’ నేనే వచ్చే వాణ్నిగా అన్నారు. తద్దినం రోజు ‘కాకి ముద్ద’ పెట్టి నాన్నగారికి మనసులో నమస్కరించాను. ఎక్కడినుంచో వచ్చిన కాకి ఆ ముద్ద తింటోంది. పోయిన పెద్దలు కాకి రూపంలో వచ్చి ఆ ముద్ద తింటారని నమ్మకం.
      మధ్యాహ్నం మా అమ్మాయి జామకాయ తింటూ ‘కాకి ఎంగిలి’ చేసి నాకో ముక్క ఇచ్చింది. కాకి పేరుతో ఎన్ని మొక్కలో. కాకిదొండ, కాకిపెసర, కాకినాసిక, కాకి కలువ.
      ‘కాకతాళీయమో ఏమో’ పొద్దున కాకి అరిచింది కదా మా బావమరిది వచ్చాడు. కాకి అరిస్తే బంధువులు వస్తారంటగా!
      కాకులు దూరని కారడవులు ఇప్పుడు లేవు. ఎందుకంటే మనుషులది ‘కాకాక్షి న్యాయం’. మన అవసరాల కోసం అన్నీ వాడేసుకుంటాం. అది తప్పు కాదంటాం. ‘పిల్ల కాకికేమి తెలుసు ఉండేలు దెబ్బ’, వన్యప్రాణులకేం తెలుసు మనిషి క్రూరత్వం! జంతువులు ఆవాసం కోల్పోయి అంతరించిపోతున్నాయి. కొన్ని ఊళ్లలో వాయసాలకే ఆవాసం లేదు. 
      బయట ఎక్కడో కాకి గూట్లో కోయిల పిల్ల అరుస్తోంది. కాకి చాలా మంచిది.  కోకిల గుడ్లని కూడా పొదుగుతుంది. 
      ఒక కాకి దెబ్బ తగిలి కింద పడితే అన్ని కాకులూ చేరి గోల చేస్తాయి. కాకుల్లో ఉన్న ఐకమత్యం మనుషుల్లో ఉండదు. కొందరు పిసినారులు ఎంగిలి చేత్తో కాకిని తోలరు.. ‘‘రాత్రవుతోంది ‘కాకమ్మ కథలు’ ఆపి పడుకోండి’’ అంది మా ఆవిడ.
      ప్రపంచంలో ఎన్నో కథలు వాటిలో ఇదొకటి. సముద్రంలో ‘కాకి రెట్ట లాగ’. మనం భయపడే శని దేవుడు కాకినే వాహనంగా చేసుకున్నాడు. ఈ కాకి రామాయణంలో కాకాసురుడిగా పేరుగాంచింది. మా చిన్నతనంలో ఆడుకునేటప్పుడు పాడిన పాటలో కూడా కాకి ఉంది. ‘పిచ్చుక తెచ్చిన పిడికెడు బియ్యం దంచండమ్మా దంచండి... కాకి తెచ్చిన కడవెడు బియ్యం దంచండమ్మా దంచండి’....
      అన్నట్టు.. ‘కాకిలా కలకాలం బతికే బదులు హంసలా ఆరుమాసాలు బతికితే చాలు’ అనేది నానుడట.. ఎవరు చెప్పారబ్బా అది.. ఏమో.. తెల్లని హంస కంటే ఈ నల్లని కాకే తెలుగు భాషకి ఎంతో అందాన్నిచ్చినట్లు అనిపించట్లేదూ..? 

* * *


వెనక్కి ...

మీ అభిప్రాయం