తెలుగు భాష చెవిలో పూలు

  • 435 Views
  • 0Likes
  • Like
  • Article Share

అందరూ ఏప్రిల్‌ఫూల్‌ డే నాడు కంగారుపడి పోతుంటారు. వాళ్లను చూసి తెలుగువాడు నవ్వుకుంటాడు! ఒక్కరోజు ఫూల్‌ అయితే ఏంటట గొప్ప! నేను రోజూ కావడంలా అనుకుంటాడు. నిండా మునిగితే చలీలేదు.. తెలుగు వాడికి గిలీ లేదు. తెలుగు వాడికి ఉన్న నిరోధక శక్తి యావత్‌ ప్రపంచంలో ఇంకెవ్వడికీ లేదు. ఏప్రిల్‌ఫూల్‌ అన్నా, చెవిలో పూలు అన్నా  తెలుగువాడు చలించడు. రోజూ చచ్చేవాడికి ఎవడు ఏడుస్తాడు అని దబాయిస్తాడు.
      తెలుగువాడి ఏప్రిల్‌ఫూల్‌కు ఉన్న ప్రత్యేకత వేరు! అదంతా ఒక ప్రత్యేక కథ! తెలుగువాడికి తెల్లవాడికి పోలికేలేదు. తెల్లవాడికి ముందే ఏప్రిల్‌ఫూల్‌ యవ్వారం తెలుగువాడికి తెలుసు. మన వాడెప్పుడో అవ్వను పట్టుకుని వసంతమాడాడు. ఆరు నెలలు కర్రసాము నేర్చుకుని మూలనున్న మూడుకాళ్ల ముసలమ్మతో యుద్ధం చేయగలిగినవాడు తెలుగువాడొక్కడే. మునగచెట్టు ఎక్కించినా తెలుగువాడికి ఏమీ కాదు. దీని సంగతి అలా ఉంచినా, ఎలా ఉంచినా తెల్లవాణ్ని చూస్తే జాలి కలుగుతుంది! ఎవడోవచ్చి ఫూల్‌ చేస్తే తెల్లవాడు మేలుకొని పొరపాటయింది గురూ అనుకుంటాడు. కానీ తెలుగువాణ్ని ఫూల్‌ చేయడం ఎవరితరమూ కాదు. తననుతానే ఫూల్‌ చేసుకుని తన కాలర్‌ తానే ఎగరేసుకుంటాడు. తెలుగువాడు తననుతాను ముంచుకోవలసిందే తప్ప అతణ్ని ముంచగలిగినవాడు కృతయుగంలో పుట్టలేదు. త్రేతాయుగంలో పుట్టలేదు. ద్వాపరయుగంలో పుట్టలేదు. కలియుగంలోనూ ఇప్పటివరకూ పుట్టలేదు. ఇకముందూ పుట్టడు. తెలుగువాడు స్వయంభువు. తెలుగువాడు తనను తాను ముంచుకోలేడా! ఇంతోటిదానికి ఇతరుల మీద ఆధారపడాలా? తెలుగువాడికి తెలుగువాడే శత్రువు. మనవాడు ‘నాలుకలుక’లు సృష్టిస్తాడు. అయితేనేం తెలుగువాడు ప్రపంచానికి అజాతశత్రువు. ఎవరినీ ఏమీ అనడు. ఎవరికీ హాని చేయడు. ‘హాని’మూన్‌ అస్సలుపడదు.
      కొత్త సంవత్సర ప్రారంభంలో తగిన సమాచారం లేక తెల్లవాళ్లు కొందరు ఫూల్‌ అయ్యారు. సమాచారం అంతా ఉన్నా చెవిలో‘ఫూలు’ పెట్టుకోగలిగినవాళ్లు తెలుగువాళ్లే! సర్కారీ పద్దులన్నీ అమలు ఏప్రిల్‌ 1న ప్రారంభమవుతాయి. ఫూల్స్‌ చేయడానికి అంతకుమించిన మంచిరోజు ఏముంది!
      తెలుగు భాషకు, సంస్కృతికి, సంప్రదాయానికి ప్రతిరోజూ ఏప్రిల్‌ఫూల్‌ డేనే. పంచెకట్టుటలో ప్రపంచాన మొనగాడు అని పాడుకోవడం వరకు బాగానే ఉంటుందిగానీ నగరాల్లో పంచెకట్టుకుని తిరుగుతూ ఉంటే అప్పటివరకు నవ్వనివాడు కూడా నవ్వుతుంటాడు. పంచెలో నవ్వించే లక్షణం ఏముందయ్యా అంటే వెర్రిమొహం వేసుకుని చూస్తారు. తెలుగుకు సహజ సిద్ధమైన అయ్య, అన్న, అమ్మ, అక్క అనే మాటలతో పిల్లలకు పేర్లు పెట్టడం కరవైపోయింది. ఆ పేర్లు ఉంటే నామోషీ అనుకుంటారు. తెలుగువాడి పేరు వింటే వీడు తెలుగువాడు అని గుర్తు పట్టకూడదు. అదే మనవాళ్ల కోరిక. తెలుగు ప్రాంతాల్లో పుట్టినా తెలుగురాదు అని చెబుతుంటారు. తెలుగురాదన్నవాడు తనను తాను ఫూల్‌ చేసుకున్నా, ఇతరులను ఫూల్‌ చేసినా పెద్ద వింతేమీ కాదు. తెలుగువాడనుకోవడంలో ఓ స్థాయి, ఓ దర్జా కనిపిస్తున్నాయి. వీడేమిటి? తెలుగురాదంటాడేమిటి అని తెలుగుతల్లి తనను ఫూల్‌ చేసినట్టు బాధపడుతుంది.
      రాబట్టుకోవడం చేతకాకపోయినా, పోగొట్టుకోవడంలో తెలుగువాడిది అందెవేసిన చెయ్యి. అక్షరాలకు అంటకత్తెర వేయడంలో అపరిమితమైన సాంకేతిక పరిజ్ఞానం సంపాదించుకున్నాడు. తెలుగు నెట్టుకు రావడానికి తెలుగులో ఇంటర్‌నెట్టు తప్ప మార్గం లేదా? అక్షరాలు ఎక్కువైపోయాయి. వీటిని తగ్గిస్తే తప్ప వేరేమార్గం లేదంటున్నారు. పోనీ తెలుగు అక్షరాలను పదికి కుదిద్దామే అనుకుందాం. అప్పుడందరూ కొక్కొరొకో అన్నప్పటి నుంచి తెలుగు పారాయణం చేస్తారా? అంటే ఛాదస్తం అనడం రివాజు అయిపోయింది. 
      అమ్మమ్మ బామ్మల బంగారు ఆభరణాలు పాతబడిపోయినవనో, డిజైన్లు కొత్తవాటిలా లేవనో పారేస్తున్నామా! లేదే! మరి మన భాష మాత్రం బంగారం కాదేమిటి? తెలుగు అక్షరాల్లో ( -----   )          కనబడటం లేదు. వాటికి సంతాప సభలూ లేవు, స్మారక సభలూ లేవు. అం, అః అని విడిగా వాడేవారూ లేరు. ‘ర’ దెబ్బకు ‘ఱ’ ఏ బండెక్కి పోయిందో తెలీదు. అరసున్నాల చిరునామాయే లేదు. పొట్టకోసినా పొట్టలో చుక్కలు కనబడడం లేదు. ఋ, ౠలు అంతరిస్తున్న అక్షరాల జాతిలో ముందు ఉన్నాయి. అక్షరాలు ఎక్కువ కావడమే మన భాష అభివృద్ధికి ఆటంకం అయితే ప్రపంచంలో అంతకన్నా ఎక్కువ అక్షరాలున్న భాషలు మట్టిగొట్టుకుపోయాయా? క, ఖ అనే అక్షరాల్లో క ఉంచి ఖ తీసెయ్యరాదా అంటున్నారు. సరే కరం అంటే చెయ్యి. ఖరం అంటే గాడిద. కరవాలం అంటే కత్తి, ఖరవాలం అంటే గాడిద తోక. ఈ రెండు అక్షరాల్లో ఒకదాన్ని తీసేస్తే గుర్రాన్నీ గాడిదనూ ఏకం చేసినట్టే కాదూ అన్నా మాకన్నీ సమానమే అనగల మొనగాడు.. ఇంకెవరయ్యా తెలుగువాడు!
      ఇంగ్లీషు భాష అక్షరాలు నాలుగు రకాలుగా ఉంటాయి. అన్నీ కలిపితే ఇంచుమించు వంద. ఒకరకం ఉంచి మిగిలిన వాటన్నిటినీ ఏ థేమ్స్‌లోనో, అమెజాన్‌లోనో చివరికి ఏ గంగలోనో తుంగలోనో ఎందుకు తొక్కడం లేదు? తమిళం అక్షరాలు తగ్గించమంటే తమిళుడు ఏమంటాడు? తమిళంలో తిడతాడు. మనకు అర్థం కాదు కాబట్టి ఏమీ అనం. అర్థమై అతడి దగ్గర అరవచాకిరీ చేసినా క్షమించడు. కన్నడ అక్షరాలు తగ్గించమని సూచనప్రాయంగా చెప్పినా చెప్పినవాడి బుర్ర రామకీర్తనపాడుతుంది. శ్రీనాథుడిలాగా కన్నడ రాజ్యలక్ష్మీ అని పాడినా వినిపించుకోడు! ఉర్దూ అక్షరాలు తగ్గించమంటే ఊరుకుంటారా? కానీ తెలుగు భాష లోకువ. తెలుగువాడు లోకువ. మనల్ని మనం తగ్గించుకోవడానికి ఎల్లవేళలా సిద్ధం. ఎవరూ మనకు ఈ విషయం చెప్పనవసరం లేదు.
పదాల పంచాయతీ
తెలుగు భాషలో సంస్కృతపదాలు తీసెయ్యమని కొంతమందీ, ఇంగ్లీషు పదాలు తీసెయ్యమని కొంతమందీ, ఇతర భాషా పదాలే తీసెయ్యమని ఇంకొంత మందీ అంటారు. అవన్నీ తీసేస్తే మనకు భారతమయినా మిగులుతుందా! మిగిలినవైనా అర్థమవుతాయా! అర్థంకాకపోయినా నష్టమేమిటంటే అది వేరేసంగతి! తెలుగు భాషలో ఇతర భాషా పదాలన్నీ కట్టకట్టుకొని తీసేస్తే మనం అనుకున్నట్టు మాట్లాడగలమా! పట్టుమని పదివాక్యాలయినా రాయగలమా? నిఘంటువుల పరిమాణమూ ఎంతో తగ్గిపోతుంది. ప్రపంచంలో వాడుకలో ఇంగ్లీషు భాషకన్నా గొప్ప భాష లేదు. అందులో అన్ని భాషల పదాలూ ఉన్నాయి. ఇంగ్లీషుకు అస్పృశ్యత లేదు. ఇందులో ఆంగ్లేతర పదాలన్నీ తీసేస్తే బ్యాండీకూట్‌గా మారిన మన పందికొక్కులాంటివి తిరిగి రావడం తప్ప ప్రయోజనం లేదు. ఆ ఇంగ్లీషు అందరికీ అర్థంకాదు. ఎంగిలిపీసు శబ్దాలు జిందాబాద్‌ అనాలనిపిస్తుంది.
      వంచన రెండు రకాలు. ఆత్మవంచన! పరవంచన! ఏప్రిల్‌ ఫూల్‌ అంటే పరవంచన! పరవంచన నుంచి కాపాడుకోవచ్చు! ఆత్మవంచన నుంచి కాపాడుకోవడం కష్టం! అప్పుడనిపిస్తుంది ఎంత ఫూలయ్యామోనని! అనేక ఇతర భాషా పదాల్ని అచ్చతెలుగు పదాలని భ్రమ పడుతున్నాం. మనం అమాయకులం. తెలుగు విలువ మనకు తెలీదు. తుళు మాతృభాష అయిన శ్రీకృష్ణదేవరాయలు ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అన్నా మనకు అర్థంకాదు. తమిళుడయిన అప్పయ్యదీక్షితులు తెలుగువాడిగా పుట్టడం, తెలుగు భాష రావడం తపస్సు చేస్తేగానీ దక్కని ఫలం అని చెప్పినా ఏదోలే అనుకుంటాం. అంతెందుకు? ఇంగ్లీషు మాతృభాష అయిన బ్రౌన్‌ తెలుగు నేర్చుకుని, ఓ నిఘంటువు ఇచ్చి, మన కావ్యాలను పరిష్కరించి అచ్చేస్తే వాటిని చదవడానికి ఇష్టపడం. అది ఛాదస్తం అనుకుంటాం. కాళోజీలాంటి  తెలుగు కవి ‘‘అన్య భాషలు నేర్చి/ ఆంధ్రమ్ము రాదంచు/ సకిలించు ఆంధ్రుడా/ చావవెందుకురా!’’ అని తిట్టినా మొట్టినా మనకు ఎక్కదు. సాటి తెలుగువాడు చెబితే మనం ఎందుకు వినాలి?
      తెలుగు భాష నేర్చుకుంటేనో, తెలుగు మాధ్యమంలో చదువుకుంటేనో ఏమాత్రం పైకిరామని మనకు అఖండ విశ్వాసం! ఎన్ని విషయాల్లో విడిపోయినా తెలుగువాళ్లు ఈ విషయంలో మాత్రం ఒక్కటైపోతారు. మరి తమిళ మాధ్యమంలో చదువుకున్న కుర్రాళ్లు చెన్నైదాటి పోవడం లేదా! కన్నడ మాధ్యమంలో చదువుకున్నా బెంగుళూరుదాటి పైకి రాలేదా! మన తెలుగు పి.వి.నరసింహారావు తెలుగు రాకుండానే పద్నాలుగు భాషలు నేర్చుకోగలిగారా? దేశాన్ని శాసించే ప్రధానమంత్రి కాగలిగారా? ఇతర భాషల వారికిలేని సమస్యలు మన తెలుగువారికే మాతృభాష విషయంలో ఉన్నాయంటే ఎవరిని ఫూల్‌ చేసినట్టు? తెలుగు అక్షరాలు ఛాదస్తం.. తెలుగు మాటలు ఛాదస్తం.. తెలుగు భాష ఛాదస్తం.. తెలుగుజాతి ఛాదస్తం అనుకుంటూ ఉంటే ఎవరు ఎవరిని ఫూల్‌ చేసినట్టు! తెలుగువాడా! మజాకానా!

* * *


వెనక్కి ...

మీ అభిప్రాయం