అందరి గొడవ కాళోజీ గొడవ!

  • 2374 Views
  • 15Likes
  • Like
  • Article Share

    ఎ.సుబ్రహ్మణ్యం

  • హైదరాబాదు
  • 9394743591
ఎ.సుబ్రహ్మణ్యం

జనమంటే ఇష్టం... జనం బాధలంటే సానుభూతి. ఆ బాధలకు కారణమయ్యే వారంటే కోపం. అలాగే, అమ్మభాషన్నా ఆయనకు అలవిమాలిన అభిమానం. దాన్ని అవమానించే వారంటే అసహ్యం. సామాజిక అవ్యవస్థపై ఆయన ధర్మాగ్రహం అక్షరాలుగా మారి ప్రవహిస్తుంది. నరనరాల్లో కాక పుట్టిస్తుంది. 
మనసులోని
 మాట దాచుకోవడం కాళోజీకి కానిపని. ప్రేమ, ద్వేషం, కోపం, ఆవేశం, అభిమానం, ఆత్మీయం, ఉద్యమం, పోరాటం, ఘర్షణ, సంఘర్షణ భావం ఏదైనా సరే అందరికీ తెలియాల్సిందే. అక్షరరూపం దాల్చాల్సిందే. అందుకే ‘‘అక్షర రూపం దాల్చిన ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’’ అనగలగడం. కులమత వర్గాలకతీతంగా ప్రజల గోడు, గొడవ తనదిగా చేసుకుని కవిత్వమంతా ‘నా గొడవ’ గానే వెలువరించిన ప్రజాకవి కాళోజీ ‘కాళన్న’గా అందరికీ ఆత్మీయుడు.
      కాళోజీ కవి, రచయిత, అనువాదకుడు, ఉద్యమకారుడు, చరిత్రనెరిగిన శాస్త్రజ్ఞుడు. అందుకే ఆయన రచనలు చదవడమంటే ఆయన జీవించిన, పోరాడిన, ఉద్యమించిన తెలంగాణా సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ చరిత్రను క్షుణ్నంగా, కూలంకషంగా అవగతం చేసుకోవడమే.
      తుది విజయం, మనది నిజం, పార్థివ వ్యయం, నా గొడవ, ఆత్మకథ వంటి సృజనలు, నా భారతదేశయాత్ర, భారతీయ సంస్కృతి, అంజలి, జీవనగీతం లాంటి అనువాదాలు చేశారు. అయినా కాళోజీ అంటే ‘నా గొడవ’, ‘నా గొడవ’ అంటే కాళోజీగా స్థిరపడిపోయారు.
      12.01.53లో అలంపూర్‌లో ఒక సభలో ‘నా గొడవ’ ప్రథమ ముద్రణను ఆవిష్కరించిన శ్రీశ్రీ... ‘‘కాళోజీ నిఖిలాంధ్రకవి అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు తెలంగాణా అంచులు గోడలుగా అడ్డు నిలబడవు. ఆయన తన ఖండకావ్య సంపుటికి ‘నా గొడవ’ అని పేరు పెట్టారు... ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ...
      యుద్ధంలో ఫ్రాన్స్‌ కవులంతా చెల్లాచెదురుగా పారిపోతే ‘లూయి ఆరగాన్‌’ ఒక్కడే దేశంలో నిలబడి ప్రజావిశ్వాసాన్ని వెల్లడించే గీతాలు రాశాడు. కాళోజీ లూయి ఆరగాన్‌ వంటివారు.. ఇది మనం మననం చేసుకోవాల్సిన పుస్తకం....’’ అన్నాడు.
      కాళోజీ ఆనందమో, ఆవేదనో కలిగినపుడు వచ్చిన భావాలకి అక్షర రూపం ఇచ్చాడు. ముందు అది తనకి నచ్చాలి. నచ్చితేనే ప్రజలకి అందుతుంది.
      కాళోజీ అంటే కల్లలకూ, కపటాలకూ లాలూచీపడని జీవితం అని అర్థం. అతని గేయాలకు గానీ, అతనికి గానీ అర్థం చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు అవి అర్థం గాని ఈ సమాజపు మహోద్గ్రంథానికి విపులమైనట్టి తృణి వంటివి. ఆడంబరం లేని, అలంకారాల ఆరభటి లేని నిసర్గమైన కృతి కాళోజీ ‘నా గొడవ’ కావ్యసంపుటి, అని దాశరథి ప్రథమ ముద్రణ పీఠికలో (06.01.53) రాశారు.
      కాళోజీది ప్రధానంగా ఆర్ద్ర హృదయం. తన చుట్టూ ఉన్న వ్యక్తులు వ్యవస్థలో తేడా వస్తే చలించిపోయే సున్నిత మనస్కుడు. అన్యాయ, అక్రమాల్ని నిలబెట్టి నిలదీసే ధీశాలి. నాజీలైనా, రాజులైనా కలం ఝళిపించడానికి, గొంతెత్తి నినదించడానికి వెనుదీయని సాహసి కాళోజీ. విద్యార్థి దశ నుంచే నమ్మిన దానిని ప్రభుత్వానికి వ్యతిరేకమైనా సరే కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవాడు. కాళోజీ గేయాలన్నీ ప్రజాహృదయాన్ని ప్రతిబింబించేవే.
     సమసమాజ భావనతో సమాజంలోని ‘వ్యత్యాసాలు’ ఎత్తిచూపిన
      ‘‘అన్నపురాసులు ఒకచోట/ ఆకలి మంటలు ఒకచోట
      సంపదలన్ని ఒకచోట/ గంపెడు బలగం ఒకచోట’’ (1942)
      హిందీ, ఉర్దూ, మరాఠీ, ఇంగ్లిష్, తదితర భాషల్లో ప్రవీణుడైన కాళోజీ జీవితమంతా తెలుగు ప్రజలతోనే మమేకమైంది. అందుకే ఆయనకి ఆ భాషమీద మక్కువ ఎక్కువ. భాషేతరులకి భిన్నంగా తెలుగువాళ్లు మాతృభాషను దూరం చేసుకొని, పరభాషా వ్యామోహితులవడం పట్ల కోపం, అధిక్షేపం, బాధ ఎక్కువ. ప్రతి తెలుగింటా ఇవాళ ఫ్రేము కట్టించి పెట్టుకోవాల్సిన గేయమిది.
ఏ భాష నీది యేమి వేషమురా?
ఈ భాష ఈ వేషమెవరికోసమురా?
ఆంగ్లమందున మాటలాడగల్గగనే!
ఇంతగా గుల్కెదవు ఎందు కోసమురా?
నీ వేష భాషలందు తెల్గులెస్సయటంచు
తెలుగు బిడ్డా యెప్డు తెలుసుకొందువురా!
తెలుగు బిడ్డవురోరి తెల్గుమాట్లాడుటకు
సంకోచవడియెదు సంగతేమిటిరా?
తెలుగు బిడ్డవయ్యు తెల్గురాదంచును
సిగ్గులేకను ఇంకజెప్పుడెందుకురా?
అన్య భాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు
సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా?

      (1976కు ముందే రాసిన కవిత)
‘‘ప్రతి చాదస్తం దేవుడే/ ఏదో ఒక రూపంలో గోకుడే...
      నామరూపాలు అనంతం! ఎవనిది వానికే వసంతం’’ అని మూఢాచారాల ‘చాదస్తాన్ని’ ఎండగట్టారు.
      ‘నరుడ నేను’ ఖండికలో ‘‘ఇచ్ఛమే నా ఈశ్వరుడని/ఖచ్చితముగా నమ్ముతాను’’ అని మనోభావాన్ని స్పష్టపరిచాడు.
‘ఏడు మారినా యీడు ముదిరినా
ఏమి మారినది యీ లోకంలో?
పోయి చెప్పినా, ఫోను చేసినా
తలచినదేదో తెలుపుటకే కద
రాయి రువ్వినా రాకెట్టు విసిరినా!
గిట్టని వానిని కొట్టుటకే కద (ఏటేట)
మతము మారిననేమి/ మఠము మారిన నేమి
రంగు మారిన నేమి/ హంగు మారిననేమి
దేశాలు తిరిగితేనేమి/ వేషాలు వేసితేనేమి
ఏరికోరి కొత్తపేరు పెట్టినయంత
వేరు మారునే/గుణములు వేరౌట శక్యమే....’’

(మంచిచెడ్డల అండ)
సంఘాలు నియమాలు, సాంప్రదాయాలు
లంచాలు మంచాలు లాంచనాలు కంచాలు....
మనిషిలోని కుళ్లు మారు రూపాలు

(మారు రూపాలు)
      ఇలాంటి అనేక విమర్శాత్మక, వంగ్యాత్మక కవితలు రాశాడు.
‘‘కలము కుంచె కదలాడెను/ గళము తోడుగా పాడెను’’ - సమ్యక్‌ దృష్టిని అలవర్చుకునే ఐక్య ఆవశ్యకతను తగ్గింపగా ఉడుత రాల్చినట్టి ఇసుక మాదిరిగా...’’ అని నిస్వార్థ సేవ, కృషీవలత్వాలు ప్రబోధించాడు.
ఇజాల నిజాల పొరలు విప్పే పయత్నంలో...
నాది నిత్యనూత్న వికసిత జ్ఞానం
మీది-బుద్ధి జాడ్య జనితోన్మాదం’
నా కందినది నాది - నాకందనిది మనది
నాకోపం స్వభావసిద్ధ - మీ కైనను ఓర్పుండొద్దా?
నాకున్నవి అన్నియు హాబీలు - మీకున్నవి వ్యసనాలు తగవు...
నానా ‘ఇజాల’ కడుగున చూడు - నా ‘యిజం’దే అగుపడును జాడ

అని చురుక్కుమనే చురకలు వేశాడు.
వెర్రి తలల విజ్ఞానుల దీక్ష - ప్రకృతి మాతస్తన శల్యపరీక్ష....
ఆద్యంతములందు సముడు - ఆదిత్యునివోలె ఘనుడు’’ అంటూ ‘ముక్తకాలు’’
వెలయించాడు.
కాళోజీకి అధిక్షేపం అలవోకగా పలుకుతుంది.
అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఏ పాటి వాడో చూడు
ఎన్నుకుంటే వెలగ బెట్టడం కాదు
ఇందాక ఏం చేశాడో చూడు...
పెట్టుకున్న టోపీకాదు - పెట్టిన టీపీ చూడు
ఎగరేసిన జెండా కాదు- చాటున ఆర్జించిన చందా చూడు
(తస్మాత్‌ జాగ్రత్త)
      రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన ద్రవ్యోల్బణాన్ని గురించి చెబుతూ ‘‘యుద్ధం మూలమున చలామణులకు ఉబ్బసరోగం వచ్చింది’’ అన్నారు. రోజురోజుకీ పడిపోతున్న ఈనాటి రూపాయి విలువ, మితిమీరిన ద్రవ్యోల్బణం చూసి ఏమనేవారో! ఇపుడుంటే.
      నైజాం నవాబు దమననీతి, ఇనుప పిడికిలి దౌర్జన్యం కశ్ళారా చూసిన కాళోజీ నవ్యరీతిలో విప్లవించాడు. తెలంగాణ సాహిత్య విప్లవానికి మూలమనదగ్గ ‘తీర్పు’నిచ్చాడు. ఆ గేయంలో...
నిక్కుచు నీల్గే నిరంకుశత్వము- నిల్వలేక నేలన గూలున్‌
ఎట్టకేలకు గట్టిగోడలును- తట్టుకొనక భూమట్టమగున్‌
ప్రజాశక్తి పై పందెము వేసిన - ప్రభుత్వ మేపాటిగనిల్చున్‌

      ‘అయ్యా బానిస’ను అనిన పౌరుడే-అయ్యగొంతుక నటట అదుమున్‌
      కానున్నది కాళోజీ కవి కైత లోపల ఘాటుగ చెప్పున్‌’’ (1946)
      కాంగ్రెస్‌ ఉద్యమం, ఆంధ్ర మహాసభ ఉద్యమం, ఆర్య సమాజం ఈ మూడింటి త్రివేణి సంగమంగా ఆనాడు నిలిచాడు సమాజంలో. దుండగులు ఎదురైనా సరే ఎదురొడ్డి నిలిచేవాడు.
      వరంగల్‌ ‘మొగలయ్య’ను చంపినపుడు ముస్లింల చర్యను ప్రతిఘటించినందుకు మూడు నెలల నగర బహిష్కరణ విధించింది. అప్పుడు వరంగల్‌ వదిలి హైదరాబాద్‌ వచ్చాడు.
      ఆ హత్య తర్వాత ముఖ్యమంత్రి వరంగల్‌ పట్టణానికి సంఘటన తెలుసుకునేందుకువెళ్లాడు. అప్పటి హైదరాబాద్‌ ముఖ్యమంత్రి సర్‌ మీర్జా ఇస్మాయిల్‌.
      కాళోజీ ఆయనకు బహిరంగ లేఖరాశాడు. అది ‘గోలకొండ’ పత్రికలో అచ్చయింది. లేఖాసాహిత్యంలో ఎన్నదగినదిగా చెప్పుకునే ఆ లేఖలోని కవితాత్మక అధిక్షేపం చిత్తగించండి
ఎన్నాళ్ళనుండియో, ఇదిగో ఇదిగోయనుచు - ఇన్నాళ్ళకైనను వెళ్ళి వచ్చితివా? కోటగోడల మధ్య ఖూనీ జరిగిన చోట - గుండాల గుర్తులు గోచరించినవా? బజార్లో చాలనుకుని బల్లెంబుతో బొడుచు- బద్మాషునేమైన పసిగట్టితివా? మొగలయ్య భార్యతో, మొగలయ్య మాతతో, మొగమాటమునులేక ముచ్చటించితివా?
      ఇలా ప్రశ్నల పరంపరతో సాగిందా లేఖ. కవికి ప్రధానంగా ఉండాల్సిన లక్షణం
      నిర్భీతి. అది కాళోజీకి పుష్కలం. అందుకే విలక్షణమైన గొంతుతో కవితలు వినిపించి ప్రజాకవి అయ్యారు. భాషాభిమానిగా ‘‘ముఖే ముఖే సరస్వతి’’ని ‘నోట నోట మాటమ్మ’ అన్నారు. అక్షర శ్రీ విభూషవాణీ - నా వర్ణమాలినీ వాణీ... 
అని స్తుతిస్తూ
చనుబాలతో అబ్బి, మనము చనిపోయేదాకామనది
ప్రతి నోటికి పట్టుబడియు - ఏ నోటను పడియుండక
రకరకాల మాటలతో బైటవడే వైనాలది...

అని ప్రస్తుతించారు.
      కాళోజీ మానవతావాది. కరుణ రసార్ద్రహృదయుడు. సున్నిత మనస్కుడు. కించిత్‌ కష్టం కళ్లపడితే చాలు.
చెమ్మగిలని కనులు బ్రతుకు కమ్మదనము చాటలేవు
చెమ్మగిలని కనులు బ్రతుకు కమ్మదనము చూడలేవు
అంటూ కన్నీటిలో ఎన్నెన్నో కలవు - కన్నీటిని గగన కన్నులు కలవు

అని కంట తడిపెడతాడు. ‘‘చెమ్మగిల్లిన కన్నులలో - కమ్మలెన్నో చదివిన’’వాడు. కన్నీటిని కవిత్వమయం చేశాడు.
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు
అవనిపై జరిగేటి అవకతవకలు జూచిపరుల కష్టము జూచి కరిగిపోవును గుండె
పతిత మానవుని జూచి చితికి పోవును మనసు
అని ఆవేదన పడతాడు.
అన్యాయాన్నెదిరిస్తే- నా గొడవకు సంతృప్తి
అన్యాయం అంతరిస్తే - నా గొడవకు ముక్తిప్రాప్తి
అన్యాయం అంతరిస్తే - నా గొడవకు ముక్తిప్రాప్తి
అన్యాయాన్నెదిరించినోడు - నాకు ఆరాధ్యుడు’
అంటూ జీవితాన్ని ఉద్యమానికి, ప్రజలకు అంకితం చేసిన ఒక ధిక్కార స్వరం కాళోజీ.
      నిరంతరం ప్రజాచింతనే. భాగవత పద్యాలు అనుకరిస్తూ ప్రజాస్వామ్య డోలాయమాన స్థితిపై రాసిన పేరడీ ఇప్పటికీ తాజాగా నవ్విస్తూ ఉండటం అతని కలం బలాన్ని తెలియజేస్తుంది
‘‘కలదందురు లోకసభను- కలదందురు
ప్రభుత్వంలో పంచాయితీలో
కలదందురు రాజ్యాంగమున -
కలదు ప్రజాస్వామ్యమనే వింత కలదో ? లేదో?

అలాగే
‘లా’వొక్కింతయు లేదు - ఆర్డరు విలోలాంబాయె
క్రమముల్‌ దప్పెన్‌ - మూర్ఛిల్లె రాజ్యాంగమున్‌
రావే ధీ క్రోధ శ్రీ - సంరక్షించు పౌరాత్మకా

      ఉపాధ్యాయ ప్రతినిధిగా శాసనమండలిలో ఉన్నా సమాజం కోసం, సామాజిక సమస్యల కోసం కవిత్వాన్నే ఆయుధంగా చేసుకున్నారు.
‘‘నేను ప్రస్తుతాన్ని - గతానికి శిఖరాన్ని
వర్తమానాన్ని - భావికి అధారాన్ని
నేను కథనాన్ని - నేను అక్షరాన్ని - నేను సాగే దాన్ని
నిన్నటి స్వప్నాన్ని - రేపటి జ్ఞాపకాన్ని’’
అని స్వీయ నిర్వచనాలిచ్చుకున్న కాళోజీ అక్షరాలా అలాగే జీవించారు.
      కవిగా కాళోజీ కవిత్వానికి ఉద్యమాలు, మానవతావాదం, తాత్విక దృక్పథం, సాహిత్య విమర్శ, కవితాశక్తి, భాషాప్రయోగం, ఇలా ఎన్నో పార్శ్వాలున్నాయి. కాళోజీ జీవితమంతా కవితామయం.
      కాళోజీ కథలు చదివినప్పుడు కాకతాళీయంగానో, సరదా కోసమో, ఆయన కథలు రాసినట్లు అనిపించదు. కొన్ని తీవ్రమైన ఆలోచనలకు అక్షర రూపాలే కాళోజీ కథలు. అనువాదాలకి ఎన్నుకున్న కథల్లో కూడా ఆ తీవ్రమైన ఆలోచన కనిపిస్తుంది.
ఆ కథలేంటంటే...
భూతదయ:
మానవత్వం, మతమౌఢ్యం, ఈ రెండింటి వ్యత్యాసం చెప్పడమే ప్రధానాంశం.
మనమేనయం: పౌరాణిక వాతావరణంలో నడిచిన ఈ కథ వర్ణ వ్యవస్థ మీద వ్యంగ్య రచన.
లంకా పునరుద్ధరణ: సమకాలీన రాజకీయ సంఘటనల్ని రాముడు, విభీషణుడు మొదలైన పాత్రల ద్వారా వ్యంగ్యాత్మకంగా చిత్రించిన కథ.
ఆగస్ట్‌ పదిహేను: గాంధీ రద్దు చేయమన్న కాంగ్రెస్‌ ఆ తర్వాత ఎలా కొనసాగిందో బలంగా చెప్పారీ కథలో
      ఇంకా రెండు గింజలు, జాజితీగ, అనుభవం లేని ఆందోళన, అపోహ, విభూతి లేక ఫేస్‌ ఫౌడర్‌ మొదలుగునవి.
      కాళోజీ కథలో సామాజిక చైతన్యం, విశ్లేషణ, రాజకీయాలపై విమర్శ. ప్రజాకీయాలు (ఈ పదప్రయోగం ఆయనదే) గురించి అక్కర వుంటుంది. భాష నిరాడంబరంగా, సరళంగా వుండి కథనం చాలా సహజంగా సాగిపోతుంది.
      కాళోజీని కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణుడిని చేసింది. వివిధ యూనివర్సిటీలు డాక్టరేట్‌లతో సత్కరించాయి. ఇవిగాక సన్మానాలు, సత్కారాల ప్రజాదరణ కాళోజీ స్వంతం.
      ‘‘ప్రజాకీయాలీనాటికి - ప్రయోగదశకు రాలేదు... రాజకీయాలే కొరివి దయ్యాలై కులుకుతున్నాయి’’ అంటూనే
      అతిథివోలే వుండి వుండి
      అవని విడిచి వెళ్ళుతాను
      పల్లె పట్టణంబులనక
      పల్లేరై తిరిగాను
      అని చివరిదాకా తన గొడవని వినిపించిన ఈ మహా మనిషి 2002 నవంబర్‌ 13న అతిథి పాత్రను ముగించి కీర్తిని శేషంగా మిగుల్చుకున్నారు.

* * *


వెనక్కి ...

మీ అభిప్రాయం